Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 3


    
    "నాతో పోటీ పడగలవా?" ఉద్విగ్నంగా నిలదీసింది. "నువ్వేకాదు, ఈ రాష్ట్రంలో నీలాంటి వాళ్ళెవరయినా నాతో పోటీగా నిలబడగలరా? చెప్పు?"

    "ప్రబంధా!" ఎక్కడో ఓ మూల స్నేహితులతో నిలబడ్డ ఆమె అన్న శౌరి మధ్యలోకి వచ్చాడు "వాట్స్ దిస్?"
    
    "ఇట్స్ ఛాలెంజ్" సవాల్ విసురుతున్నట్టు చేతిని పైకెత్తింది. మాట్లాడవేం?"
    
    "ప్రబంధా!" చెల్లెలు మొండితనం తెలిసిన శౌరి వారించాలన్న ప్రయత్నం ఫలించడంలేదు "కూల్ డౌన్."
    
    అతని జోక్యాన్ని హర్షించలేకపోయింది ప్రబంధ. "అన్నయ్యా! వెనక్కి తగ్గాల్సింది నేను కాదు. ఇంతసేపూ నా ఉనికిని ప్రశ్నించిన నీ ఫ్రెండు మిస్టర్ సూరి చేవుంటే ముందు నిలబడమను. లేదూ అంటే ఫ్రీగా వచ్చింది ఇంతసేపూ తాగిన నీ ఫ్రెండుని ఇక్కడనుంచి కదలమను."
    
    చురుక్కుమంది తొలిసారిగా అయినా నిభాయించుకున్నాడు సూరి. "శౌరీ! నీ చెల్లెలు మానసికంగా మెచ్యూరిటీ రాని అమ్మాయి అని అర్ధమైంది."
    
    "చేతకానితనమంటే యిదే" మరో అస్త్రాన్ని సంధించింది. "ఎస్ మిస్టర్ సూరీ! చేవుంటే ఛాలెంజ్ కి సిద్దంకా."
    
    "నేను అంత సమర్దుడిని కాను...." తలపంకిస్తూ అన్నాడు సూరి.
    
    "నువ్వేకాదు, ఈ రాష్ట్రంలో మరెవరూ నాకు పోటీ కాదు."
    
    "మిస్ ప్రబంధా! నిన్ను నువ్వు ఎక్కువగా అంచనావేసుకో" తనూ ఏకవచనంలోకి దిగాడు సూరి. "కానీ అందర్నీ తక్కువ అంచనావేయకు."
    
    "అసమర్ధులు తమ నిస్సహాయతనిలాగే సమర్ధించుకుంటారు."
    
    "ప్రబంధా!"
    
    "గావుకేకలు పెట్టడంకాదు నా ఛాలెంజ్ కి జవాబు చెప్పు."
    
    రెండుక్షణాల నిశ్శబ్దం తరువాత అన్నాడు...." పుస్తక పరిజ్ఞానం ఉన్న ప్రతివాడూ ప్రపంచజ్ఞానం కలవాడు అని నేను అనడంలేదు మిస్ ప్రబంధా! నువ్వు సరేనంటే నేను కాదు.... నీకు పోటీగా నేను నా కాండిడేట్ ని రంగంలోకి దింపుతాను."
    
    "నేను సిద్దంగా వున్నాను" ఖండితంగా అంది.
    
    "పందెంలో నువ్వు ఓడితే?"
    
    "ఓడే ప్రసక్తి లేదు నీ కేండిడేట్ ఓడితే నువ్వు దేనికి సిద్దపడతావో అది చెప్పు."
    
    "నువ్వే నిర్ణయించు."
    
    "నీ జీవితాంతం నా కారు డ్రైవర్ గా నా దగ్గర పడుండాలి."
    
    "ప్రబంధా!" శౌరి ఆమె చేయి పట్టుకున్నాడు. "నీకేమన్నా పిచ్చి పట్టిందా?"
    
    "ఇప్పుడు నీ స్నేహితుడికి పిచ్చి పడుతూన్నట్టుగా వుంది" అవహేళనగా అంది ప్రబంధ.
    
    "నీ శరతుని నేను అంగీకరిస్తున్నాను..." క్షణం ఆగాడు సూరి. "ఒకవేళ నువ్వు ఓడితే...ఆ సమస్యే ఉండదనుకో....ఒకవేళ ఓడితే..."
    
    "చెప్పు నువ్వే..." స్థిరంగా అందామె.
    
    శౌరి నుదుట స్వేదం పేరుకుంటూంది.
    
    "విత్ డ్యూ అప్పాలజీస్ టు మై ఫ్రెండ్ శౌరి" కర్చీఫ్ తో మొహం తుడుచుకున్నాడు సూరి. "నువ్వు పోటీలో ఓడిన మరుక్షణం నువ్వు నా కేండిడేట్ ని.... ఆ వేదికపైనే..."
    
    "చెప్పు..." సర్కాస్టిక్ గా అంది ప్రబంధ. ఆ వేదికపైనే..."
    
    "...ముద్దు పెట్టుకోవాలి."
    
    "సూరీ! శౌరి ఆవేశంగా రెండడుగులు ముందుకేయబోతుంటే అప్పుడు ప్రబంధ వారించింది. "అప్ సెట్ కావాల్సిన అగత్యం లేదన్నయ్యా! అసలు అలాంటి స్థితి అంటూ ఒకటి ఏర్పడితేగా..." రెచ్చగొడుతున్నట్టుగా అంది... "ఇట్స్ నైస్ టు హేవ్ ఏ కార్ డ్రయివర్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్."
    
    "మిస్ ప్రబంధా!" ఉద్విగ్నతని కప్పిపుచ్చుకుంటూ అన్నాడు సూరి. "ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఛాలెంజ్ ని వెనక్కి తీసుకో నా కోసం కాదు.... మీ పార్టీలో మీ ఇంటి ఉప్పు తిన్నాను. మీ అన్నయ్య ఫ్రీగా ఇచ్చిన మందు తాగాను. ఆ కృతజ్ఞతతో అడుగుతున్నాను."
    
    "డ్రయివర్ గా నీ భవిష్యత్తుని ఊహించుకోలేక పోతున్నావనుకుంటా."
    
    "ప్రబంధా!"
    
    అది కేక కాదు. గాయపరుస్తున్న అహాన్ని అదుపుచేసుకునే ప్రయత్నం. శ్వాస గొంతుని నులిమేస్తున్న ఆరాటం. నమ్మకాల మాత్రాఛందస్సులు జీవితంపై చేసిన గాయాలతో తాగుడుకు అలవాటుపడి అలా జీవించడాన్ని వ్యాకరణంలా భావిస్తున్న సూరి, తొలిసారి మళ్ళీ చాలా రోజుల తరువాత గాయపడ్డాడు.
    
    నిషా విరిగిపోయింది. ఇద్దరి మధ్య ఎదురైన అవమానం స్వాభిమానాన్ని దారుణంగా దెబ్బతీస్తూంది. ఉక్రోషం సప్తజిహ్వలుగా చీలిపోతూ వాస్తవాన్ని జ్వాలా స్వప్నంగా మార్చుతుంటే మగతగా అన్నాడు- "మై డియర్ యంగ్ గాళ్... ఇట్స్ ఫైన్ థింగ్ టు రైజ్ అబౌవ్ ప్రైడ్ బట్ యూ మస్ట్ హావ్ ఫ్రైడ్ ఇన్ ఆర్డర్ టు డూ సో."
    
    "ఐ హావ్ నథింగ్ టు డిక్లేర్ ఎక్సెప్ట్ మై జీనియస్" ప్రబంధ గొంతులో ఒక మగాడిని నేలమట్టం చేయగలుగుతున్న సంతృప్తి...."వెళ్ళు....వెళ్ళి నిన్నిప్పుడు కాపాడగలిగే ఆ శక్తి కోసం దేవులాట ప్రారంభించు."
    
    "దేవులాడాల్సిన పనిలేదు. సిద్దంగా వున్నాడు."
    
    "ఐ సీ!" ప్రబంధ అవహేళనగా చూసింది... నేను సిద్దం."
    
    "ఎప్పుడు?"
    
    "కావాలీ అంటే ఈ క్షణంలో..."
    
    "వీళ్ళ సమక్షంలోనా?" ఈ సన్నివేశాన్ని వినోదంగా చూస్తున్న వ్యక్తుల నుద్దేశించి అన్నాడు..... "ఇక్కడున్నది మేధను అంచనావేయగల మనుషులు కాదు. నీలాంటివాళ్ళ అహానికి నీరుపోసే కుహనా ఆదర్శవాదులు."
    
    "స్టేట్ మెంట్స్ ఆపేయ్ మిష్టర్ సూరీ!" ఇప్పుడు శౌరి జోక్యం చేసుకున్నాడు. "పోటీ ఎప్పుడు ఎక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నావో చెప్పు."
    
    చెల్లి స్వాతిశయానికి బాసటగా నిలబడ్డ శౌరిని రెండు క్షణాలపాటు ఏకాగ్రతగా చూశాడు సూరి.... "రేపు సాయంకాలం యూనివర్శిటీ ఓపెన్ ధియేటర్ లో, అనుభవజ్ఞులయిన అయిదుగురు ప్రొఫెసర్స్ ముందు టెస్ట్ కండక్ట్ చేద్దాం. ఓ.కే?"


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS