Previous Page Next Page 
పసుపు కుంకుమ పేజి 4

   
    "అంత తొందరేముంది? ఇంతకీ- అదేలే, గదికి వెళ్ళాక చదువుకుంటాను" అంది భానుమతి అనాసక్తంగా.

    సభ్యత కాదేమో అనుకుంటూ కూడా "ఎవరు రాశారు?" అని అడగకుండా వుండలేకపోయింది  మాలతి.

    "మా వారు"

    మాలతి అదిరిపడింది.

    "అంత ఆశ్చర్యపడతావేం? మా శ్రీవారు రాశారు. ఆయన మొహమెలా వుంటుందో మరిచిపోయానేమోగానీ, ఆయన దస్తూరీ మరచిపోలేదు."

    మాలతి ఆశ్చర్యంలోంచి ఇంకా తేరుకోలేదు. "ఎందుకిలా వేళాకోళం చేస్తున్నావు భానూ?" అడిగింది గొంతుపూడినట్లయి.

    "వేళాకోళమా? ఎందుకలా అనుకుంటున్నావు  నువ్వు? నేనబద్ధం చెప్పగా ఎప్పుడైనా విన్నావా?"చాలా మామూలుగా అంది భానుమతి.

    ఆమె ముఖ భంగిమల్లోగానీ కంఠస్వరంలోగాని కించిత్ కూడా మార్పు రాలేదు.

    "మరెప్పుడూ చెప్పలేదేం?"

    "చెప్పవలసిన సందర్భం రాలేదని అనుకుని వుంటాను."

    ఇంతలో బయటకెళ్ళిన క్లర్కులందరూ బిలబిలమంటూ వచ్చేయసాగారు.సద్దు పూర్తిగా అణగకముందే బయట ద్వారంనుంచి లోపలకి అడుగుపెడుతున్న అగంతకుకుడ్ని చూసి అందరూ గబగబ లేచి నిలబడసాగారు. మాలతి, భానుమతి కూడా అటుతిరిగి చూసేసరికి సేఠ్ మోహన్ లాల్ సంచీ, సిల్కు లాల్చీ, మెఖమల్ టోపీతో తన భారీ విగ్రహంతో ఆడంబరంగా కనిపించారు. స్నేహితురాళ్ళిద్దరూ కూడా చప్పునలేచి నిలబడ్డారు.

    మోహన్ లాల్ యధాలాపంగా ఆగినట్లు వాళ్ళదగ్గర ఆగాడు.

    "మీ స్నేహితురాలికి ఆఫీసుపని అలవాటయిందా?" అనడిగాడు హిందీలో భానుమతివంక చూసి నవ్వుతూ. అతనీమధ్య హైదరాబాదులో లేడు. వ్యాపార రీత్యాను, సొంతపనులమీదా ఎక్కువభాగం బొంబాయిలో వుంటూ వచ్చాడు. తాను ఉద్యోగంలో చేరాక ఇది రెండవసారే అతన్ని చూడటం మాలతి.

    భానుమతి తల ఊపింది.

    "నువ్వు కొంచెం చిక్కినట్లు కనబడుతున్నావే?" అన్నాడు మళ్లీ.

    లేదే. బాగానే వున్నాను."

    "ఆల్ రైట్! పని చూసుకోండి" అంటూ అక్కడ్నుంచి కదిలి మేనేజరు గదిలోకి వెళ్ళిపోయాడు.

    మోహన్ లాల్ ఆ కంపెనీ ప్రొప్రైటర్సులో ముఖ్యుడు.అతనికి ఈ కంపెనీ ఒకటే కాకుండా ఫార్మాస్యూటికల్స్, ప్లాస్టిక్ సామాన్లు తయారుచేసే ఫ్యాక్టరీ వంటి సంస్థలలో భాగస్తుడిగా వున్నాడు. ఈ కంపెనీకి ఎప్పుడో ఒకసారిగానీ రాడు. భాద్యతంతా మేనేజరుకే ఒప్పచెప్పేస్తాడు.

    మాలతి మూడ్ ని మార్చడానికన్నదో, మరి దేనికో తిరిగి కూర్చున్నాక భానుమతి అంది. "ఇంటర్వ్యూ టైమ్ లో ఏం  జరిగిందో తెలుసా?"

    టైప్ మిషన్ మీద మాలతి వ్రేళ్లు కదిలిస్తూ కూర్చుంది జవాబివ్వకుండా.

    "నా సొంత విషయాలడిగాడు. పెళ్ళయింది కదా భర్తతో ఫారిన్ ఎందుకెళ్ళ లేదన్నారు. అతనక్కడ సంపాదిస్తున్నాడని చెప్పావు కదా.అతను డబ్బు పంపించడం లేదా, ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం ఏమొచ్చిందన్నాడు.  నా పర్సనల్ విషయాలు నికనవసరమని చెప్పాను. మన దేశమంతటా అనేక బ్రాంచీలున్నాయి.  అవసరమొచ్చిన చోటికి....."అవసరమొచ్చిన చోటుకు" అన్నమాట ఒత్తిపలుకుతూ వంకరగా నవ్వుతూ ట్రాన్స్ ఫర్లకి రెడీగావుండాలి. అన్నాడు. అది ఇష్టా ఇష్టాలమీద ఆధారపడి వుంటుందన్నాను. నీ ఇష్టంకాదు, కంపెనీలో చేరాక మా ఇష్టం  అన్నారు.  నా ఇష్టంలేనిదే మీ ఇష్టాలు పని చెయ్యవని చెప్పాను. ప్రక్కన వీడి పార్ట్ నర్స్  కూర్చునివున్నారు. వాళ్ళతో గుజరాతీలో ముందు దేనికి ఉద్యోగమిద్దాం, తర్వాత అవకాశం చూసుకుని దీని భరతం పడదాం అన్నాడు. అందరూ సరే అంటే సరే అనుకున్నారు. నాకు గుజరాతీ వచ్చినా అర్ధంకానట్లు మెదలకుండా వుండిపోయాను. ఇంకా మా ఇద్దరిమధ్యా భరతాలు పట్టటంవరకూ రాలేదు" భానుమతి ముగించి ఫైల్సు ముందుకు లాక్కుంది.

    ఆమెకు చెబుతూన్న మాటలు చెవులకు వినబడుతున్నాయి. అర్ధమూ, బోధపడుతుంది కానీ మనసే ఎక్కడో వుంది.

    మూడు నెలలనుంచి తాను ఆమెతో కలసి వుంది. ఈ కాస్త పరిమితిలోనే సంవత్సరాలు తరబడి కలసిపోయి ఒకళ్లకోసం ఒకళ్ళు పుట్టినట్లు- అయి పోయారు. భానుమతిని తేనెన్నటికి అర్ధం చేసుకోలేననుకుంది. కానీ ఆమెకి ఇంతదూరంగా  వున్నట్లు ఇప్పుడే బోధపడింది. తనకన్నా వయసులో రెండు మూడేళ్ళ పెద్దయివుంటుందని ఊహించింది గానీ ఇంత అనుభవం తన లోపల దాచుకుని వుండగలదని భావించలేదు. అసలు ఇంత రహస్యం ఎలా దాచగలిగింది.? ఎందుకు దాచింది?

    మాలతి చాలా సెన్సిటివ్, ఆమె మనస్సు కలచివేసినట్లయింది. ఆమె సున్నితమైన వ్రేళ్ళు టైప్ రైటర్ మీద యాంత్రికంగా పనిచేస్తున్నాయి గానీ ధ్యాస మాత్రం కుదురుగా లేదు.

                                          2
    సాయంత్రం అయిదయేసరికి ఎవరి పనులు వారు కట్టేసి ఇళ్ళకెళ్ళి పోవటానికి సిద్ధపడుతున్నారు. భానుమతికూడా అలసిపోయినట్లు కనిపించింది. పనిలో వున్నప్పుడు ఆమె అమిత ఏకాగ్రత ప్రదర్శిస్తుంది. ఆమె ఆఫీసు కార్యకలాపాల్లో ఎవరూ వేలెత్తి చూపించటానికి వీల్లేదు. "ఇహ వెడదామా?" అన్నట్లు చూసింది ఫైళ్ళు డ్రాయరు సొరుగులో త్రోసేస్తూ.

    మాలతికూడా లేవడానికి సిద్ధపదుతోంది.

    దస్తగిరి "అమ్మగారూ!" అంటూ వచ్చాడు ఆదరాబాదరాగా.

    "మీరు వెళ్ళిపోయారేమోనని కంగారుపడ్డారమ్మా- సార్ మిమ్మల్ని అర్జంటుగా రమ్మంటున్నారు" అన్నాడు మాలతితో.

    మాలతి "ఎలా?" అన్నట్లు చూసింది స్నేహితురాలివంక. భానుమతి వెళ్ళిరా అన్నట్లు సంజ్ఞచేసింది.

    ఆమె వెళ్ళేసరికి మేనేజరు చంద్రశేఖరం ఆతృతగా కనిపిస్తున్నాడు. "వచ్చారా! మీరు వెళ్ళిపోయారేమోనని భయపడ్డాను. బాంబేనుంచి ఇప్పుడే ట్రంకాల్ వచ్చింది. అర్జంటుగా నాలుగయిదు లెటర్స్ పూర్తిచేసి పోస్టు చెయ్యాలి.మీకు పాపం .... ఓ గంట లేటవుతుంది" అన్నాడు.

    "ఫర్వాలేదులెండి ..... ఉండండి ఇప్పుడే వస్తాను" అని మాలతి మళ్లీ బయటకు వచ్చింది.      


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS