Previous Page Next Page 
పసుపు కుంకుమ పేజి 3


    ఆ జోక్ కి భానుమతి విరగబడి నవ్వింది. "అమ్మాయిలైనా " అంది. అప్పుడే నువ్వు అని సంభోదిస్తూ. "సహజత్వం నూటికి నూరుపాళ్ళూ వున్న అమ్మయివిలా కనిపిస్తున్నావు. అందుకని నీతో ఫర్వాలేదు."

    ఇద్దరూ కలసి గట్టిగా ప్రయత్నించే సరికి వారం రోజుల్లోపే గది దొరికింది.

    ఇప్పుడు మూడునెలల పరిచయమే అనుకోరు చూసిన వారెవరూ.

    ఆ ఆఫీసులో వాళ్ళిద్దరే అమ్మాయిలు.

    మధ్యాహ్నం - లీజరు టైములో కాఫీ త్రాగటానికని అంతా బయటికెళ్ళి పోతున్నారు. వాళ్ళిద్దరూ సీట్లదగ్గరే కూర్చుండిపోయారు.

    రామ్మోహనరావు అనే ఓ క్లర్కు వాళ్ళ దగ్గరగా వచ్చి "మీరు కాఫీకీ రారా?" అని అడిగాడు.

    "ఈ పూట ఇక్కడికే తెప్పించుకుందాం. మీరు  వెళ్ళి రండి" అంది భానుమతి.

    "అయితే నేనూ ఇక్కడికే తెప్పించుకుంకుంటాను. మీతోబాటు కబుర్లు చెబుతూ కూర్చుంటాను" అని నిజంగానే కూర్చోబోయాడు రామ్మోహన్.

    "దానివల్ల కొన్ని నష్టాలున్నాయి" అంది భానుమతి వాడిగా.

    "ఏమిటండోయ్ అవి?" అని అన్నాడతను దెబ్బతిని నవ్వడానికి ప్రయత్నిస్తూ.

    "మాగురించి గుసగుసలు ఎక్కువవటం, మీరు  మీ తోటివారిమధ్య అనవసరంగా షైన్ అవటం. కాబట్టి మీరు బుద్ధిమంతుడిలాగా వాళ్లతోబాటు వెళ్ళి రండి."

    "అలాగే మీఇష్టం " అని మొహం మాడ్చుకుని  అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.

    మాలతికి కొంచెం కష్టంవేసింది. "అంత నిష్కర్షగా ఎలా మాట్లాడగలవు భానూ?" అనడిగింది ఓ క్షణమాగి.

    "ఉన్నది ఉన్నట్లు చెబితే అంత ఆశ్చర్యమెందుకు మాలీ! ఇవేళ బయటకు వెళ్ళాలనిపించటం లేదు. మనమధ్య అతనుండటం ఇష్టంలేదు. అదే చెప్పాను. మరో మూడ్ లో హాయి అనిపిస్తే అతన్తో షికార్లు కొట్టటానికే నే నొప్పుకోవచ్చు. ఆ మాత్రం వ్యక్తి స్వతంత్ర్యం అక్కర్లేదా?"

    ప్యూన్ దస్తగిరిని కాఫీ తీసుకురమ్మని  పంపించారు  ఫ్లాస్క్ ఇచ్చి.

    "నువ్వు ఉద్యోగంలో చేరి మూడు నెలలయింది కదా! ఈ మూడు నెలల్లో ప్రపంచాన్ని గురించి నువ్వేం గమనించావు?"అని అడిగింది భానుమతి.

    "అంటే?" అన్నది మాలతి అర్ధంగాక.

    "రోజూ ప్రొద్దుటే లేస్తున్నాం. బస్సుల్లో ప్రయాణిస్తున్నాం. షాపింగులకు వెడుతున్నాం. సినిమాలు చూస్తున్నాం. బజార్లో నడుస్తున్నాం. వీటన్నిటిలో నువ్వు గమనించేదేమిటి?"

    "నువ్వనేది నాకు బోధపడటంలేదు" అని నొచ్చుకుంది మాలతి.

    "ఎవరి బారిన వాళ్ళు బ్రతుకుదామని ఎంత నిజాయితీగా ప్రయత్నించినా వాళ్ళను ఎదుటివాళ్ళ పరిధుల్లోకి బలవంతంగా లాక్కోవటానికి చేసే ప్రయత్నం కనబడటం లేదూ?"

    మాలతి ఆమె చెప్పిన వ్యాఖ్యానానికి  రూపకల్ఫన చేసుకునేందుకు  ప్రయత్నిస్తోంది.

    "అయిదు నిముషాల వ్యవధి చిక్కినా నిన్ను నిన్నుగా బ్రతకనిచ్చే అవకాశం ఇస్తుందా లోకం ? నువ్వు బయటికొస్తే నీ శరీరం చిల్చేసేటట్లు  లక్షలాది చూపులు, నువ్వు మామూలుగా మాట్లాడబోతే దానికి డొంకతిరుడుడు సమాధానాలు, అవసరం వున్నా లేకపోయినా నవ్వటాలు, లీడ్ యివ్వటం, ఏదో వాతావరణం సృష్టించటానికి ప్రయత్నించటం. అందుకే మొగాడికి అనుభవానికి వచ్చిన సంఘటనలు కొద్దిగా వుంటాయి. ఆడదానికి దూరంగా నెట్టేసిన అనుభవాలనేకం  వుంటాయి."

    "ఇప్పుడు నువ్విదంతా దేనికి చెబుతున్నావు?" అనడిగింది మాలతి నిజంగానే భోదపడక.

    "మన చూట్టు జరిగేది గమనిస్తున్నాను కాబట్టి ఏమీ జరగనట్లుగా గుప్తంగా వుంటుంది కానీ కనిపించని విద్యుత్ తరంగాలవంటివి  మన చుట్టూ అనుక్షణం పరిభ్రమిస్తున్నట్లుగా అనిపిస్తూ వుంటుంది. ఈ ఆఫీసులో నేను నీకన్నా చాలా నెలల సీనియర్ ని. ఈ ఊరిలో నాకు నీకన్నా ఎక్కువ పరిచయం వుంది. మామూలుగా మాట్లాడుతున్నప్పుడు నా మనసులో ఏముందో? ఆ సంగతలా వుంచు. అవతలివాళ్ళు  ఇచ్చే లీడ్- అంటే ఆ లీడ్ మనం అందుకోవాలని చేసే ప్రయత్నాలు చూశావా? ఈ పరిస్థితుల్లో ఆడది పాతివ్రత్యమంటారే దాన్ని ఎలా కాపాడుకోగలదో నాకర్ధంకాదు. ఈగలు చూశావా వాలినచోటే ఎంత తోలినా తిరిగివచ్చి  వాలుతూ వుంటాయి. అలాగే వాలుతూంటాయి ఈ ఉపద్ర్రవాలు."

    "మన మేనేజరుగారు ఆ కోవలోకి చెందిన మనిషి కాదనుకుంటాను" అనేసింది మాలతి చప్పున. తర్వాత నాలిక కొరుక్కుంది

    "కాకపోవచ్చు. నవ్వున్నది నిజమే కావచ్చు" అన్నది భానుమతి సాలోచనగా.

    దస్తగిరి కాఫీ తీసుకువచ్చాడు. రెండు గాజుగ్లాసులు కడిగి ఫ్లాస్క్ లోని కాఫీని వాటిల్లో సర్డ్డాడు.

    మేనేజరు గదిలోంచి కాలింగ్ బెల్ వినిపించింది."సార్!" అంటూ దస్తగిరి పరిగెత్తాడు.

    "తన పనేమిటో, తానేమిటో తప్ప మరో గొడవలేదు మహానుభావుడికి. కానీ ఇలాంటివాళ్ళ పెళ్ళాలు సుఖపడతారు" అంది భానుమతి.
    "అయితే ఆయన పెళ్ళాం సుఖపడుతుందన్నమాట!" అనేసింది మాలతి వెంటనే.

    "చేసుకుంటే సుఖపడేదేమో! కానీ అతనికింకా పెళ్ళి కాలేదు."

    మాలతేం మాట్లాడలేదు.

    ఇద్దరూ కాఫీ త్రాగటం పూర్తిచేశారు.

    దస్తగిరి ఓ  కవరు పట్టుకుని లోపల్నుంచి వచ్చాడు.

    "అమ్మగారూ! ఈ ఉత్తరం  మీకండీ. సార్ ఇమ్మన్నారు" అంటూ భానుమతి ముందు పెట్టాడు.

    ఫారిన్ నుంచి వచ్చిన కవర్ ని దానిమీద రంగులు చూస్తేనే తెలుస్తోంది. భానుమతి ఆ కవరువంక చూసి ఊరుకుందిగానీ గబగబ చించి చదివెయ్యటం లాంటి పనులేమీ  చెయ్యలేదు.

    "ఆ ఉత్తరం చడువుకోవేం?" అనడిగింది మాలతి. ఆమె ఈ ఆఫీసులో చేరాక స్నేహితురాలికి ఉత్తరం రాగా చూడటం ఇదే ప్రథమం. తన సంగతి సరేసరి. తనకు రాసేవాళ్ళెరూ ఉండరు.                                                                     


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS