Previous Page Next Page 
చీకట్లో నల్లపులి పేజి 3

 
    సరిగ్గా ఎనిమిదేళ్ళ క్రిందట ఉద్యోగం సద్యోగం లేకుండా విజయవాడలో తల్లిదండ్రులు పోషిస్తూ ఉంటే తింటూ కూర్చున్న తనకు ముఫ్ఫయి రెండేళ్లు. అప్పట్లో విజయవాడలో ఏ గోడ మీద చూసినా, "ఆంధ్రాటైమ్స్, దినపత్రిక త్వరలో దూసుకు వచ్చేస్తోంది __అంటూ పోస్టర్లు కనిపించాయి.

    'ఆంధ్రా టైమ్స్' అన్న పేరు విని తను మొదట్లో నవ్వుకున్నాడు. దినపత్రికకి ఇదేం పేరని....చులకన కూడా చేశాడు.....ఆ పత్రికలో తను పని చేయ్యాల్సి వస్తుందని అప్పుడు తను కలలో కూడా వూహించలేదు.

    అయితేనేం__ఇప్పుడది తెలుగునాట ప్రతి ఇంటా వాడుక పేరయి పోయింది.  విజయవాడనుంచి, హైదరాబాద్ నుంచి, మద్రాసు నుంచి మూడు ఎడిషన్లు వస్తున్నాయి. త్వరలో మరో రెండు ఎడిషన్లు తేవాలని అనుకుంటున్నారు కూడా.

    అంతలో రాజారామ్ కి నిన్నరాత్రి రమణి అన్న మాటలు గుర్తువచ్చాయి.


                        o    o    o    o


   
    "డేడీ....డేడీ...నీతో ఒకావిడేమో మాట్లాడాలి.

    "ఎవరమ్మా అదీ?"

    "ఏమో...ఎవరో...తెల్లగా పొడుగ్గా అందంగా ఉంది. మెడలోనేమో ముత్యాలహారం వేసుకుంది. ఎర్రని పట్టుచీర కట్టుకుంది. డేడీ"

    "నాతోనే ఎందుకు మాట్లాడాలిట?"

    "మరేమో నువ్వు న్యూస్ పేపర్లో పని చేస్తావుగా అందుకని!"

    "ఎక్కడ కన్పించిందావిడ?"

    "ఫాన్సీ కార్నర్ దగ్గర డేడీ"

    "ఉహుఁ ఇంకేం చెప్పింది?"

    "నీకేదో న్యూస్ చెప్తానంది. నువ్వెప్పుడు ఇంట్లో ఉంటావో అడిగింది."

    "ఇంకా...."

    "నువ్వు రోజూ ఆఫీసుకు వెళ్ళేటప్పుడు ఫ్యాన్సీ కార్నర్ కి వెళ్ళి మేగజైన్లు పుస్తకాలూ సిగరెట్లూ తీసుకుంటావని చెప్పానావిడకి."

    "కొత్తవాళ్ళతో అలా మాట్లాడవద్దని చెప్పానా లేదా?"

    "అవుననుకో, ఆవిడ చాలా మంచిదాన్లా ఉంది డేడీ"

    "సరే ఆవిడ పేరేమిటి?"

    "ఏదో చెప్పింది డేడీ, సారీ మర్చిపోయాను,"

    "ఫర్వాలేదులే!"

    "అన్నట్లు వాళ్ళ ఇల్లు మనింటి దగ్గరే డేడీ..."

    "ఓకే"


                           o    o    o

   
    ఆలోచనల్లో మునుగుతూనే సిగరెట్ పాకెట్ అందుకున్నాడు. 'సిగరెట్లు ఎక్కువ తగలేస్తున్నాను.' అనుకుంటూనే మరో సిగరెట్ అంటించాడు.

    అంతలో టెలిఫోన్ మోగింది.

    రిసీవర్ అందుకుని "హల్లో" అన్నాడు.

    "హల్లో రాజా! గుడ్ మార్నింగ్!"

    డైరెక్టర్ విరించి గొంతు అది   

    "గుడ్ మార్నింగ్ సార్!"

    "మరేం లేదు మద్రాస్ నుంచి చైర్మన్ గారు వచ్చారు. నీతో మాట్లాడాలంటున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఆఫీసుకివచ్చెయ్యి. లంచ్ కూడా ఇక్కడే ఎరేంజ్ చేశాను."

    "అలాగే?"

    "ఉంటాను మరి!"

    "......."

    క్రేడిల్ మీద రిసీవర్ ఉంచేశాడు.

    చైర్మన్ వస్తున్నాడంటే....

    ఏదో పెద్దమార్పు జరుగుతుందన్న మాట! పెద్ద తల కాయల్ని పీకెయ్యడం, చిన్న తలకాయల్ని పెద్దపీట ఎక్కించడం.....ఈ తతంగం మామూలే...

    ఈసారి గొడ్డలి ఎవరి నెత్తి మీద పడ్తుందో! కేవలం ఉల్లిపాయల వ్యాపారంతో కోటీశ్వరుడైన రాజభూషణరావు ఒకప్పుడు రాజయ్యగాడు. కోట్లతో పాటు దాన్ని నిలుపుకోవాలన్న దుగ్ధ ప్రారంభమైంది. రాజకీయంగా పలుకుబడి సంపాదించాలన్న కోరికా బలపడింది. వాటి ఫలితమే" ఆంధ్రా టైమ్స్". ఎక్కడో మూలాన పడిఉన్న ఓబొక్క రోటరీమిషన్ కొని విజయవాడలో 'ఆంధ్రా టైమ్స్' ప్రారంభించాడు. పదివేలతో ప్రారంభమైన సర్క్యులేషన్ ఏడాది తిరక్కుండానే ఏభై వేలు కావడంతో సక్సెస్ కి తనే ఆశ్చర్యపోయి హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభించాడు. మరో ఏడాదికే మద్రాస్.....అన్ని ఊళ్లలోనూ పత్రికకి అధునాతనమైన భవంతులు... కార్లు...

    రాజ్యయ్యగాడు కాస్తా రాజభూషణరావు గారుగా రూపాంతరం చెందాడు. అయినా పేరుపెట్టి పిలవరు. భయం భయంగా 'చైర్మన్ గారు' అని వ్యవహరిస్తారు.

    చైర్మన్ 'చలమయ్య' గొడ్డలి ఎవరి మీద పడ్తుందో పాపం !__అనుకున్నాడు రాజారామ్ మరోసారి.

    ఎడిటర్ విష్ణుమూర్తి మనస్సులో మెదిలాడు.

    వెంటనే రిసీవరెత్తి ఆయన నెంబరు డయల్ చేశాడు.

    "హలో!" అప్పుడే నిద్ర లేచినట్టుంది విష్ణుమూర్తి గొంతు.

    "నమస్కారం సార్. నేను రాజారామ్ ని"

    "హల్లో రాజా, హౌ ఆర్యూ"

    "ఫైన్. థాంక్యూ సర్"

    "ఊఁ . ఏమిటి విశేషం?"

    "మరేంలేదు. చైర్మన్ గారు వచ్చారట."

    "అవును. తెలుసు."

    "ఏవో పెద్ద మార్పులు జరుగుతాయని రూమర్లు విన్పిస్తున్నాయి."

    "అది మామూలే."

    "నాకయితే అక్కడ వాతావరణం చాలా ఇరుగ్గా తోస్తోంది...."

    తనతో చైర్మన్ మాట్లాడాలని కబురుపెట్టిన విషయం విష్ణుమూర్తికి చెప్దామా అనుకున్నాడు రాజారామ్.

    "చూడు రాజా.....హఠాత్తుగా నన్ను రాజీనామా చెయ్యమన్నా నేను ఆశ్చర్యపోను. నేను అన్నిటికీ సిద్దపడినవాడిని. ఈ వెధవ రంగంలో తల పండిన ముసలాణ్ణి. ఏమంటావు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS