Previous Page Next Page 
చీకట్లో నల్లపులి పేజి 2


    "అయామ్ రెడీ డేడీ!"

    వెనక్కి తిరిగి చూస్తే రమణి కన్పించింది.

    చేజారిన బాల్యం తిరిగి రాదన్పించింది.

    "అప్పుడప్పుడూ.....నన్ను 'నాన్నా' అని పిలువ్ తల్లీ" అంటూ అంత పెద్ద పిల్లనీ రెండు చేతుల్తోనూ ఎత్తుకున్నాడు రాజారామ్. తండ్రి మేడ చుట్టూ చేతులు వేసి అతని బుగ్గ మీద ముద్దు పెట్టింది రమణి. వంటింట్లోకి వెళ్ళాక డైనింగ్ టేబుల్ దగ్గరున్న కుర్చీలో ఆమెను కూర్చోబెట్టాడు. ప్లేట్లో ఉప్మా. గ్లాసుతో మంచి నీళ్ళూ తెచ్చి ఆమె ముందుపెట్టాడు.

    స్పూన చేత్తో అందుకుని "మరి నువ్వో నాన్నా?" అనడిగింది.

    "తరువాత తింటాలే..."

    "సరే..." అంటూ ఉప్మా తినడానికి ఉపక్రమించింది.

    "నాన్నా....మరీ.....నువ్వు ఆఫీసుకి ఎప్పుడు వెళ్తావు?

    "మధ్యాహ్నం ఒంటి గంటకి..."

    "మళ్ళీ ఎప్పుడోస్తావ్?"

    "రాత్రి పదవుతుందమ్మా!"

    "డేడీ ఈ ఉద్యోగం మానేసి మరో ఉద్యోగం చెయ్యి.....డేడీ!"

    రమణి అలా ఎందుకన్నదో అతనికి తెలుసు. మధ్యాహ్నం మూడు గంటలకల్లా రమణి ఇంటికి వచ్చేస్తుంది. వంటామె లక్ష్మీకాంతంగారు పెట్టిన టిఫిన్ తినేసి, సాయంకాలం వరకూ సైకిల్తో మొత్తం విజయనగర్ కాలనీ అంతా చుట్టివస్తుంది. కాలనీ చివర ఉన్న 'ఫాన్సీ కార్నర్'లో ఏదన్నా కూల్ డ్రింక్ తాగుతుంది. చీకటి పడక ముందే ఇంటికి వచ్చి కాసేపు హోంవర్క్ చేస్తుంది. తరువాత భోజనం. అదయ్యాక గంట గంటకీ ఆఫీసులో ఉన్న తండ్రికి ఫోన్ చేసి 'ఇంకా ఎంతసేపు?' అని నిగ్గ దీస్తుంది. చివరికి విసుగొచ్చి "సరే నేను కిందవాళ్ళింట్లో పడుకుంటా!" అని చెప్పేస్తుంది. వంటామె ఎనిమిది కాగానే వంటపని పూర్తిచేసి వెళ్ళిపోతుంది. తలుపులకి తాళాలు వేసి రమణికి ఇస్తుంది. ఆ తాళాలు భద్రంగా జేబులో దాచుకొని, చేత్తో ఒక కామిక్స్ పుస్తకం పట్టుకొని కింద వాటాలో అద్దెకి ఉంటున్న సుబ్బారావు గారింటికి వెళ్తుంది. వాళ్ళింట్లో రమణికోసమని ప్రత్యేకంగా ఓ మంచం కూడా ఉంది. సుబ్బారావు ఏదో బ్యాంక్ లో కేషియర్ గా పనిచేస్తాడు. నలభయ్యేళ్ళు అతని భార్య కూడా అదే బ్యాంక్ లో గుమస్తా ఇద్దరికీ రమణి అంటే ముద్దు వాళ్ళకి సంతానం లేదు. వాళ్ళకి ఆ కబురూ ఈ కబురూ చెప్తూ ఏ రాత్రికో నిద్రపోతుంది రమణి. అర్దరాత్రి దాటాక ఏ ఒంటి గంటకో ఇంటికి వచ్చే తను.....ఆ పిల్లకి తల్లి లేని లోటు తీర్చగాలడా? స్కూటర్ చప్పుడు విని పాపం సుబ్బారావు తలుపుతీస్తాడు. అంతరాత్రిలోనూ అమాయకంగా నిద్రపోయే రమణిని ఎత్తుకొని తమ ఇంటికి తీసుకువెళ్తాడు తను...

    "మాట్లాడు డాడీ....మరో ఉద్యోగం చెయ్యి...ఈ ఉద్యోగం ఒద్దు డేడి....

    "తప్పదమ్మా....కొన్నాళ్ళు చేసి మానేస్తాలే!"

    "అలా అంటావు కాని.....నేను చెప్పిన మాట వినవు" అంటూ బుంగమూతి పెట్టింది.

    "నాతల్లివి కదూ.....నీ మాట ఎందుకు వినను!"

    "పోనీ రోజూ సాయంత్రం ఫైవోక్లాక్ కో వచ్చెయి డేడీ!"

    "అప్పుడప్పుడూ వచ్చేస్తున్నాగా"

    "రోజూ రావాలి....."

    "చూద్దాం...."

    "చూద్దాం చూద్దాం అంటావుగానీ ఏం చెయ్యవు!" అంటూ గడగడా మంచి నీళ్ళు తాగింది.

    ఎనిమిదన్నరకల్లా...

    స్కూలు యూనిఫారంలోకి మారింది రమణి. బాక్స్ లో పుస్తకాలు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో మరోసారి చూసుకుంది. ఓ సారి మెడ విదిలించి "ఏంటి నాన్నా రిబ్బను ఇంత గట్టిగా కట్టావూ?" అని విసుక్కుంది.

    "ఇలా రా మళ్ళీ వేస్తాను."

    "వొద్దు టైం అయిపోయింది....నే వెళ్తా."

    "నీ ఇష్టం"

    "టాటా.....డేడీ!"

    "టాటా!"

    చక చక మెట్లు దిగి వీధిలోకి నడిచింది.

    అమ్మాయి కనుమరుగయ్యే వరకూ అటే చూస్తూ నిల్చున్నాడు రాజారామ్.

    రమణి అన్నమాటలే అతని చెవుల్లో పదే పదే మారు మోగాయి.

    "ఈ ఉద్యోగం మానెయ్యి నాన్నా"

    తనెన్నో ఉద్యోగాలు చేశాడు, బంగారం కొట్లో సేల్స్ మన్, రైల్వేలో కళాసీ, ట్రాన్స్ పోర్ట్, ఆఫీస్ లో టైపిస్టు, బ్యాంక్ లో కేషియర్, సినిమా ఫీల్డులో అసిస్టెంట్ డైరెక్టరీ, ఏదీ అచ్చి రాలేదు. రాణించడానికి అవకాశాలు వొస్తున్నాయనే సరిచేస్తున్న పనిమీద అతనికే విసుగుపుట్టేది, మరోవేపు మనసు పోయేది.

    బాల్యం అంతా దారిద్ర్యంలో గడిచింది, యవ్వనంలో దరిద్రం తీరకపోయినా దేనికి లోటులేకపోయింది, ఎంతో అభిమానించే మేనత్త విజయనగర్ కాలనీలోని తన ఇల్లు అతని పేర రాసిపోయింది. రాజ్యం ఇల్లాలవుతూనే లక్ష రూపాయల ఆస్థి పట్టుకొచ్చింది, దాన్ని ఆమే మరో లక్ష చేసి ప్లాజాటవర్స్ లో ఒకప్లాట్ కొనిపించింది. దానిమీద ఇప్పుడు వెయ్యిరూపాయల అద్దె వస్తుంది. కాలనీలో ఉన్న ఇంటికి అయిదు వందల అద్దె ఇస్తారు. ఇప్పుడు తను ఉద్యోగం చెయ్యకపోయినా ఫర్వాలేదు. కాని నెలకి పదిహేను వందలు ఏ మూలకి? పోనీ ఉన్న రెండిళ్ళలోక ఒకదాన్ని అమ్మేసి ఏదయినా వ్యాపారంలోకి దిగితే....ఆ ధైర్యమే లేదు అతనికి నష్టం వొస్తే.....ఆ ఆలోచననీ అతను భరించలేకపోతున్నాడు.

    'ఆంధ్రాటైమ్స్' దినపత్రికలో రాజారామ్ అసిస్టెంటు ఎడిటర్ . ఎడిటోరియల్స్ నుంచి అడ్డమయిన చెత్తా అతనిచేత రాయిస్తారు. నిర్ణీతమైన పని అంటూ ఏదీలేదు. పనివేళలు సరేసరి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS