Previous Page Next Page 
డా|| వాసిరెడ్డి సీతాదేవి సాహిత్యం పేజి 3


    అతను తనను ఇక్కడికే రమ్మన్నాడా? తను పొరపాటుగా వినలేదుగదా! అక్కడనుంచి ఒక్కసారి బయటకు పరుగెత్తాలనుకుంది. కాని పరుగెత్తలేకపోయింది. ధైర్యాన్ని కూడదీసుకుంటూ ముందుకు లాంతరు వెలుగుదగ్గరకు వస్తూ ఒక్కసారిగా ఆగిపోయింది. గుంజకు చేరబడి ఓ మానవాకారం చలనరహితంగా కనిపించింది. కళ్ళని పెద్దవి చేసుకుంటూ చూసింది. ఉలిక్కిపడింది. మళ్ళీ చూసింది. ఆ మూగవెలుగులో రెండు కళ్ళు కణకణలాడుతూ తనవంకే చూస్తున్నాయి. రెప్పలు కూడా పడకుండా వున్నాయి. తెల్లగా రేగిన జుట్టు. ముఖం పీక్కుపోయివుంది. ఈ మనిషి ఆ మనిషేనా? కదలడేం? ఆ కళ్ళు ఎంత భయంకరంగా వున్నాయో? తను చూస్తూంది నిజమేనా? ఓ క్షణం కళ్ళు మూసుకొని, కళ్ళు నలుపుకొని మళ్ళీ చూసింది. సందేహం లేదు. ఆ కళ్ళు తనవైపే చూస్తున్నట్టున్నాయి. కాని మనిషిలో ఎక్కడా చలనంలేదు ఏమయింది? ఇంట్లో ఎవరూ వున్నట్లు లేదు. ఈ మనిషిలో ప్రాణం వున్నట్లు లేదు. ఏమిటిది? మాధవి ఎక్కడ? అత్తగారు ఎక్కడ? ఈ మనిషి బ్రతికివున్నాడా?

 

    రయ్యిన గాలి వీచింది. ప్రహరీ వాకిలి విరిగిపోయిన తలుపు బోలుగా కొట్టుకుంది. ఎండిపోయిన చెట్టు, గాలికి తమాషా శబ్దం చేస్తూంది. ఆ చెట్టూ, ఆ గాలీ, ఆ విరిగిపోయిన తలుపూ, ఆ పొగచూరిన లాంతరూ, ఆ ఇంటి ప్రతి ఇటుకా-ఆమె సందేహాలకు సమాధానాలు నేను చెబుతానంటే నేను చెబుతానంటూ పోటీ పడుతున్నట్లున్నాయి....


                                         2


    వీరభద్రయ్య చనిపోయేనాటికి భార్య శాంతమ్మకు ఐదో నెల. పెళ్ళయి సంవత్సరం తిరక్కుండానే వాములదొడ్లో పాము కాటుకు గురై ఆకస్మికంగా మరణించాడు. పదహారేళ్ళు నిండకుండానే నొసటి కుంకుమ రాలిపోయిన శాంతమ్మను చూసి లోకం "అయ్యో పాపం పసిదీ!" అంటూ జాలిపడింది. అదే నోటితో కోడలు కాలు మంచిది కాదనికూడా అంది.

 

    మామగారు ఏనాడో పోయారు. అత్తగారు కొడుకు చావుకు కోడలే కారణమన్నట్లు బతికున్నంతవరకూ కోడల్ని సాధించింది. శాంతమ్మకు కొడుకు గలిగాడు. పిల్లవాణ్ణి గురించిన కలల్లో తన జీవితంలోని బరువును తేలికపరచుకునేది. ఆమె జీవిత ఆశలూ, ఆకాంక్షలూ అన్నీ ఆ పిల్లవాడి చుట్టూనే అల్లుకుని పోయాయి. అత్తగారు ఎన్ని మాటలన్నా శాంతమ్మ పెదవి కదిలేదికాదు. భర్తపోయాక వీధి ముఖం చూడలేదు ఎంతోకాలం. "ఎంత మంచిదయితే వీరభద్రయ్య భార్య అవుతుంది" అనేవారు అందరూ.

 

    ఆ ఇంటి వ్యవహారం అంతా శాంతమ్మ అత్తగారే చూసుకొనేది. శాంతమ్మ అత్త చాలా మాటకారి. వ్యవహర్తకూడా. వెంకన్న ఆ ఇంటిపాలేరు. నమ్మినబంటు. అతనే పొలం పనులు అన్నీ నమ్మకంగా చేయించేవాడు. అయినా శాంతమ్మ అత్తగారు నాట్లరోజుల్లో, కుప్పనూర్పుళ్ళలో, కోతలరోజుల్లో స్వయంగా పొలంలో నిలబడి అన్ని పనులూ చూసుకొనేది.

 

    శాంతమ్మ కొడుకు సీతాపతి పన్నెండేళ్ళవాడుగా వున్నప్పుడు నాయనమ్మ చనిపోయింది. తల్లి పిల్లవాణ్ణి ఆదర్శప్రాయంగా, సంప్రదాయబద్ధంగా పెంచటానికి ప్రయత్నించింది. సీతాపతికి ఆడవాళ్ళను ఎలా గౌరవించాలో చిన్నప్పటినుంచే తల్లి నేర్పించింది. దాంతోపాటు ఆ పల్లెటూరి వాతావరణంలో స్త్రీ వుండవలసిన హద్దుల్ని గురించికూడా తెలుసుకున్నాడు. సీతాపతి స్వభావంలో మొండితనం వుందనీ, అతని నమ్మకాలను సడలించటం ఎవరితరమూ కాదని తల్లి గ్రహించింది. ఒకరోజు సీతాపతి స్కూలు నుంచి వచ్చేటప్పటికి తల్లి ఇంట్లో లేదు. జీతగాడి ద్వారా తల్లి పొలం వెళ్ళిందని తెలిసింది. నాయనమ్మ పొలం వెళ్ళటం ఊహ తెలిసినప్పటినుంచీ చూస్తున్నాడు కనక, అది తప్పుగా అతనికి తోచలేదు. తల్లి ఏనాడూ వీధి వాకిట్లో కూడా నిల్చోవడం చూడని సీతాపతికి తల్లి పొలం వెళ్ళిందంటే ఏదో తప్పుగా తోచింది. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తల్లిని చూస్తూ నిల్చున్నాడు.

 

    "ఏరా నాయనా అలా చూస్తున్నావు? మధ్యాహ్నం అన్నం తిన్నావా?" పలకరించింది తల్లి.

 

    "నువ్వెందుకు పొలం వెళ్ళావమ్మా?"

 

    శాంతమ్మ ఓ క్షణం కొడుకు ముఖంలోకి చూసింది. పదమూడేళ్ళు నిండాలేని కొడుకు అలా అడగటం కొంచెం ఆశ్చర్యాన్నే కలిగించింది.

 

    "ఏం చెయ్యమంటావు? నాయనమ్మ వుంటే ఆమె చూసుకొనేది. పూర్తి బాధ్యత పనివాళ్ళమీద వెయ్యడానికి మనసొప్పక వెళ్ళానురా. కుప్పకొడుతుంటేను" అంది తల్లి. శాంతమ్మకూ అలా వెళ్ళటం ఇష్టం లేదు. మొదటిసారిగా పొలం వెళుతుంటే ఆమెకు, తను స్థానభ్రష్టురాలయి నట్టనిపించింది. మళ్ళీ తప్పేముందిలే అలవాటులేక అలా అనిపిస్తుంది అని సరిపెట్టుకొంది.

 

    "వెంకన్నతాత వున్నాడుగా, రేపటినుంచి నేనే వెళతాను" అన్నాడు సీతాపతి.

 

    శాంతమ్మకు కొడుకుమాటలు సంతోషాన్ని కలిగించాయి. కాని వాడి చదువు?

 

    "మరి బడికి వెళ్ళవూ?"

 

    "నాలుగు రోజులు వెళ్ళకపోతేనేం?"

 

    ఆ రోజునుంచి కుప్పనూర్పిళ్ళు అయేంతవరకూ సీతాపతే పొలం వెళ్ళాడు. తల్లి సంతోషానికి అంతులేదు.

 

    ఊవాళ్ళోవున్న స్కూల్లో థర్డ్ ఫారం వరకూ చదివాడు. తల్లికి ఆపైన బస్తీలకు పంపించి కొడుకుని చదివించాలని లేదు. కొడుకు ఇంటిపట్టున వుండి పొలం పుట్రా చూసుకుంటూ వుండాలని ఆమె కోరిక. సీతాపతికి కూడా అదే ఇష్టం. చదువుకు స్వస్తి చెప్పాడు. సుక్షేత్రంలాంటి పదెకరాల మాగాణి వుంది. వాడికేం? చదివేం చేస్తాడు? అనుకుంది శాంతమ్మ.

 

    సీతాపతికి తల్లి అంటే ఎంతో గౌరవం. కొందరు సీతాపతి బుద్ధిమంతుడంటే, కొందరు తల్లిచాటు కుర్రాడు అనేవారు. శాంతమ్మకు ఓ చిన్న కోరిక వుంది. కొడుక్కి అందమైన పిల్లను తెచ్చి పెళ్ళిచెయ్యాలని వుండేది. ఆ ఊళ్ళో శాంతమ్మ కోడలికంటే అందమైన ఆడపిల్ల మరొకరు లేరని చెప్పుకోవాలని ఆమె కోరిక. కట్న కానుకలమీద ఆమెకు ఆశలేదు. సంప్రదాయంగల కుటుంబంలో పిల్లను చేసుకోవాలని ఆమె అభిలాష. సీతాపతికి గూడా అదే ఇష్టం.

 

    వెంకటసుబ్బయ్యగారు ఆ ఊళ్ళో చాలా పలుకుబడిగల వ్యక్తి. పదిమంది కష్టసుఖాలూ కనుక్కుంటూ వుంటాడు. అప్పుడప్పుడు బస్తీకి వెళ్ళి వస్తూంటాడు. ఆయనకు బస్తీ స్నేహితులు చాలామంది వున్నారని చెప్పుకుంటారు. ఒకరోజు ఉదయం వెంకటసుబ్బయ్య శాంతమ్మ ఇంటికొచ్చాడు.

 

    "అమ్మాయ్ శాంతమ్మా! ఎలా వున్నావమ్మా?" పరామర్శించాడు.

 

    "బాగానే వున్నాను బాబాయ్! ఎక్కడైనా మనవాడికి పిల్లని చూడు" అంది శాంతమ్మ.

 

    "ఎంత ఆశ ఉందేమిటి?"

 

    "కట్నం ఆశ ఏమీలేదు బాబాయ్! మా వాడికి కూడా అలాంటి ఆశలు లేవు. అందమైన పిల్ల. బీదకుటుంబం పిల్లయినా ఫరవాలేదు. కుటుంబం మాత్రం మంచిదిగా వుండాలి."

 

    వెంకటసుబ్బయ్యకు వెంటనే ఓ ఆలోచన వచ్చింది. కాని వెంటనే బయటపెట్టలేదు. "చూస్తాలే" అంటూ లేచి వెళ్ళాడు.

 

    వారం తిరక్కుండానే ఓ సంబంధం తెచ్చాడు.

 

    "కుటుంబం మంచిదేనా?" అనడిగింది శాంతమ్మ.

 

    "మచ్చలేని వంశం, మాణిక్యంలాంటి పిల్ల" అన్నాడు వెంకటసుబ్బయ్య, శాంతమ్మ ఇచ్చిన మజ్జిగ గ్లాసు అందుకుంటూ.

 

    "పిల్లను తల్లి లేదన్నారుగదూ!"

 

    "అవునమ్మా! ఆ సవితితల్లి ఓ రాక్షసి, కాల్చుకు తినేస్తుందట!"

 

    "పాపం" అంది శాంతమ్మ ఆర్ద్రంగా.

 

    "ఆ పిల్ల తల్లి నాకు దూరం బంధువు. చాలా గుణవంతురాలు. నాకు చెల్లెలు వరస. చాలా అందంగా వుండేది. పిల్లకూడా అచ్చం తల్లిపోలికే."

 

    "పిల్ల పేరేమిటన్నారూ?"

 

    "అరుంధతి!"

 

    శాంతమ్మ కళ్ళు సంతోషంతో మెరిసిపోయాయి.

 

    అరుంధతి అడుగు పెట్టడంతో తమ వంశగౌరవం వెయ్యి రెట్లు పెరిగిపోవాలి! తనబిడ్డ అదృష్టవంతుడు. సాక్షాత్తు అరుంధతే తమ ఇంటికి వస్తున్నట్లు మురిసిపోయింది.

 

    "ఏమ్మా! మరీ బీదవాళ్ళని ఆలోచిస్తున్నావా?"

 

    "లేదు బాబాయ్! మా అదృష్టాన్ని గురించి ఆలోచిస్తున్నాను" అంది శాంతమ్మ ఆనందంతో.


                                                                   3


    పెళ్ళి ఖర్చులన్నీ శాంతమ్మే భరించింది. పిల్ల తల్లిదండ్రులకూ, అన్నదమ్ములకూ అక్కచెల్లెళ్ళకూ అన్ని లాంఛనాలు జరిగిపించింది. సీతాపతిగానీ, శాంతమ్మగానీ వియ్యాలవారినుంచి ఏమీ ఆశించలేదు. కోరలేదు. పుత్తడి బొమ్మలా, పాలరాతి విగ్రహంలావున్న కోడల్ని చూచుకొని పరవశించిపోయింది శాంతమ్మ.

 

    పెళ్ళయి అత్తవారింటికి వచ్చిన అరుంధతి మళ్ళీ పుట్టింటికి వెళ్ళలేదు. పుట్టింటి పేరయినా తలవని కోడలి మనస్తత్వానికి ఆశ్చర్యపడకపోలేదు. కాపరానికి వచ్చిన కొద్ది రోజుల్లోనే కోడలికి వినయ విధేయతలు తక్కువనీ, తొందరపాటూ, మొండితనం కొంచెం ఎక్కువ పాళ్ళలోనే వున్నాయని గ్రహించింది శాంతమ్మ. చిన్నతనం, బస్తీలో పెరిగిన పిల్ల అని మళ్ళీ తనకు తానే సర్ది చెప్పుకుంది. కోడల్ని చిన్న పనికూడా చెయ్యనిచ్చేది కాదు. ఇంటిపనంతా తానే చూచుకొనేది. ఏమీతోచని అరుంధతి తనతో తెచ్చుకున్న నవలలూ, పత్రికలూ మళ్ళీ మళ్ళీ చదువుతూ కూచునేది.

 

    ఊళ్ళో అందరూ "శాంతమ్మ అదృష్టవంతురాలు. చక్కని కోడల్ని సంపాదించుకుంది" అన్నారు. "కొడుకు తల్లిమాటను జవదాటడు. అంతకంటే ఇంకేంకావాలి?" అన్నారు మరికొందరు. సీతాపతికి భార్యంటే ప్రాణం. తల్లిమీద గౌరవం.

 

    దీపావళి దగ్గిరకొచ్చింది. శాంతమ్మ పండుగ పనుల్లో మునిగి తేలుతుంది. ఏలూరునుంచి బట్టల మూటలు వచ్చాయి. శాంతమ్మ కోడలికి పెద్దజరీ పట్టుచీర కొన్నది. అరుంధతికి మాత్రం వందరూపాయల పట్టుచీరకంటే పాతిక రూపాయల జార్జెట్ చీరమీదనే మోజు కలిగింది. కాని ఆమె తన కోరికను మనస్సులో దాచుకుంది.

 

    పండుగ నాలుగు రోజులుందనగా అరుంధతి తమ్ముడు వచ్చాడు, అరుంధతిని పండక్కి తీసుకెళ్ళడానికి.

 

    "వాడు రావటం పడదనుకుంటాను. నువ్వెళ్ళిరా!" అంది అత్తగారు కోడల్ని వుద్దేశించి.

 

    "నేను వెళ్ళను." ఖచ్చితంగా అంది అరుంధతి.

 

    "వెళ్ళకపోతే అమ్మా నాన్నా బాధపడతారు. అబ్బాయికి కూడా నేను చెప్పి చూస్తాను" అంది శాంతమ్మ.

 

    "అక్కర్లేదు. నాకు అమ్మలేదు. ఏనాడో చచ్చిపోయింది. నాన్న ఉన్నా చచ్చిందాంట్లోనే జమ! నేను వెళ్ళకపోతే బాధపడే వాళ్ళెవరూలేరు అక్కడ."

 

    శాంతమ్మ ఓ క్షణం విస్మయంగా కోడలి ముఖంలోకి చూసింది.

 

    "అలా అనకు తల్లీ! నాన్నగారు నిన్ను చూడాలంటున్నారట. ఒంట్లోకూడా బాగుండటంలేదట" అంది శాంతమ్మ నింపాదిగా.

 

    "అలా చెప్పండి! నాతోపాటు కాస్తోకూస్తో డబ్బు పట్టుకెళతానని నాకోసం కబురుచేసి వుంటారు. నేను వెళ్ళను" అంటూ రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళిపోతున్న కోడల్ని కళ్ళప్పగించి చూస్తూ నిల్చుండిపోయింది శాంతమ్మ.

 

    అరుంధతి తమ్ముడికి చాటుగా ఓ యాభయ్ రూపాయలిచ్చి పంపించివేసింది శాంతమ్మ.

 

    ఆ రాత్రి సీతాపతి భార్యను చేతుల్తో చుట్టివేస్తూ అడిగాడు:

 

    "నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతావేమోనని భయపడ్డాను. నేను రాలేదనే వెళ్ళలేదు గదూ?"

 

    "ఇలా అనుకుంటారనితెలిస్తే వెళ్ళిపోయేదాన్నే!" అంది అరుంధతి తమాషాగా భర్త ముఖంలోకి చూస్తూ.

 

    "నీ వెనకే నేను వచ్చేవాణ్ణి!"

 

    "మీ అమ్మగారు వద్దంటే?"

 

    "మా అమ్మ అలా అనదు, మా అమ్మ చాలా మంచిది."

 

    అరుంధతి మాట మారుస్తూ అంది "మీరు ఏలూరు ఎప్పుడు వెళుతున్నారు?"

 

    "ఏం? ఏమయినా కావాలా రేపు వెళుతున్నాను. దీపావళికి మందుసామాను కూడా కొనుక్కొస్తాను" అన్నాడు సీతాపతి భార్యను దగ్గరకు తీసుకుంటూ.

 

    "నేనూ వస్తాను" అంది అరుంధతి.

 

    సీతాపతి అర్ధంకానట్లు చూశాడు.

 

    "ఏమిటి అలా చూస్తారు? నేను మాట్లాడింది తెలుగేగా?" అంది అరుంధతి చురుగ్గా చూస్తూ.

 

    "నాతో ఏలూరు వస్తావా? అమ్మబాబోయ్! అమ్మ ఏమనుకుంటుందీ? ఊళ్ళోవాళ్ళు పెళ్ళయి ఆర్నెల్లన్నా కాలేదు పెళ్ళాన్ని బస్తీలవెంట తిప్పుతున్నాడనరూ?" అన్నాడు సీతాపతి.

 

    "ఎవరో అనుకుంటే మనకేం! ఎవర్నో తిప్పటంలేదుగా?"

 

    "ఇది పల్లెటూరండీ అమ్మాయిగారు! ఈ ఊళ్ళో వుండాలంటే ఊరి సంప్రదాయాలకూ, కట్టుబాట్లకూ కట్టుబడే వుండాలి. అప్పుడే పదిమందిలో గౌరవం వుంటుంది" అన్నాడు సీతాపతి.

 

    ఈ తల్లీ కొడుకులకి ఒకే పిచ్చిలాగుంది. ఎంతసేపూ ఈ వూళ్ళో వాళ్ళ దృష్టిలో గౌరవాన్ని పెంచుకోవాలనే తాపత్రయమేగాని మరోటిలేదు.

 

    "ఏమిటంత ఆలోచిస్తున్నావు?" గోముగా ప్రశ్నించాడు సీతాపతి. అరుంధతి పలకలేదు. మూతి సున్నా చుట్టింది.

 

    "కోపం వచ్చిందా? పోనియ్. ఈసారి వెళ్ళేటప్పుడు తీసుకెళతాలే!"

 

    "నిజంగా?!" పెద్ద పెద్ద రెప్పల్ని టపటపలాడిస్తూ అడిగింది ఆత్రంగా.

 

    ఆమె ఆత్రంచూసి, సీతాపతికి నవ్వొచ్చింది కాని నవ్వలేదు.

 

    "మీ అమ్మగారు వద్దంటే?"

 

    "మానేస్తాను"- ఠకీమని జవాబిచ్చాడు సీతాపతి.

 

    అరుంధతికి నిజంగానే కోపం వచ్చింది. ముఖం కందిపోయింది.

 

    "కోపం వచ్చిందా? అమ్మ అలా ఎప్పుడూ నా ఇష్టానికి అడ్డుచెప్పదు. నేను నిన్ను తప్పక తీసుకెళతాగా!" అన్నాడు సీతాపతి.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS