Previous Page Next Page 
మరీచిక పేజి 3


    "చూడు బేరీ ఇది ఎలా వుంది? నీకు తీసుకుంటాను."

 

    "నీ ఇష్టం మమ్మీ!" అనేసింది శబరి.

 

    రుక్మిణి కూతురి ముఖంలోకి చూసింది.

 

    దీని వాలకం రోజురోజుకూ అంతుపట్టకుండా పోతూ వుంది! దీని ఈడుపిల్లలు చూసిన ప్రతి వస్తువూ కావాలని కోరుకుంటారు. రుక్మిణి ఆలోచిస్తూనే షాపింగు ముగించి బయటికి నడిచింది.

 

    పద్దెనిమిది వందల బిల్లు చెల్లించి రంగారావు భార్య వెనకే కారుదగ్గిరకు నడిచాడు. అప్పటికే రుక్మిణి రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తూ ఉంది.

 

    "ఎక్కడికి?" రంగారావు ప్రశ్నించాడు.

 

    "ఛగన్ లాల్ కు."

 

    "ఎందుకూ?"

 

    "నగల దుకాణాని కెందుకెళతారు?"

 

    "అదికాదు. మరి నేనెంత డబ్బు తేలేదే?"

 

    "ఫర్వాలేదు. క్రెడిట్ బిల్లు మీద తీసుకుందాం. రేపు వాళ్ళ గుమాస్తా వచ్చి డబ్బు తీసుకుంటాడు!" అంటూనే రోడ్డు దాటింది రుక్మిణి.

 

    తండ్రీ కూతుళ్లు యాంత్రికంగా ఆమెను అనుసరించారు.

 

    "చూడు బేరీ! ఈకోరల్ సెట్ బాగుంది కదూ?"

 

    "ఎవరికి మమ్మీ?"

 

    "ఇంకెవరికే నీకే!"

 

    "ఉన్న నగలే పెట్టుకోవడం లేదు. ఇప్పుడివన్నీ ఎందుకు మమ్మీ?"

 

    "నిన్నడగటం నాదే బుద్ధి తక్కువలే! ఎలా వున్నాయండీ?"

 

    "బాగానే వున్నాయ్!" అన్నాడు రుక్మిణి భర్త రంగారావు.

 

    శబరి తండ్రి ముఖంలోకి జాలిగా చూసింది.

 

    డాడీకి అవి కొనడం ఇష్టం లేదు. ఆ మాటే ఎందుకు అనలేడూ? ఎప్పుడూ మనసులో ఒకటి పైకి మరొకటి! ఎందుకొచ్చిన బాధ! ఆ హరేరాం హరేకృష్ణ భక్తులు ఎంత నిశ్చింతగా వున్నారు! డాడీ కూడా అలా వాళ్ళలో కలిసిపోకూడదూ! హాయిగా వుంటుంది.

 

    శబరి కళ్ళముందు తండ్రి రూపం ఆ వేషంలో కన్పించింది. నల్లగా లావుగా వుండే డాడీ ఆ వేషంలో బలేగా వుంటాడు. గుండుకొట్టి పిలక పెట్టుకుని...శబరికి నవ్వాగలేదు. కిలకిల నవ్వసాగింది.

 

    "ఎందుకే అలా పత్తికాయలాగ పగలబడి పోతున్నావ్!" అన్నది.

 

    "మమ్మీ... డాడీ... గుండు... పిలక" మాటలు మింగేస్తూ పొట్ట పట్టుకుని నవ్వసాగింది.

 

    "ఏమిటా నవ్వు! పద" పగడాల సెట్టు తీసుకొని బయలుదేరింది రుక్మిణి.

 

    "అమ్మా! పది పైసలు-"

 

    శబరి తల తిప్పి చూసింది.

 

    బిచ్చగత్తె... చేతిలో పసిబిడ్డతో... దీనంగా చిరిగి పీలికలు వేలాడుతున్న బట్టల్లో- అర్థిస్తూ వుంది.

 

    "ఫో! ఫో! గుర్రంలా వున్నావ్ పనిచేసుకోరాదూ!" అడ్డం వస్తున్న బిచ్చగత్తెను కసిరికొట్టి కారులో కూర్చుంది రుక్మిణి.

 

    "డాడీ!"

 

    కూతురి భావం అర్థం చేసుకున్న రంగారావు రూపాయి నోటు తీసి ఇచ్చాడు.

 

    శబరి రూపాయి బిచ్చగత్తె కిచ్చి, ఆమె ఆశీర్వదిస్తూ వుండగా, వచ్చి కారులో కూర్చుంది.

 

    "రూపాయి ఇచ్చావా! నీకు బొత్తిగా డబ్బు విలువ తెలియడం లేదే బేరీ!" అన్నది రుక్మిణి.

 

    "పోనిద్దూ! నువ్వు ఇప్పటికిప్పుడే నాలుగువేలు ఖర్చుపెట్టేశావ్! అన్నాడు రంగారావు.

 

    "అసలు మీరే దాన్ని నెత్తికెక్కించుకొని చెడగొడ్తున్నారు."

 

    "అబ్బబ్బా! బోర్! యమబోర్! మళ్ళీ అదే అరిగిపోయిన రికార్డు!"

 

    "నువ్వు బోరు మూస్తావా? లేదా!" రుక్మిణి ముఖం కోపంతో ఎర్రబడింది.

 

    "డాడీ! వాళ్ళు... అదే ఆ భజన చేస్తూ వెళ్ళిన వాళ్ళు తమ దేశం వదిలి యెందుకొచ్చారు?"

 

    "పనీ పాటా లేకా... తిండి ఎక్కువై!" కోపంగా అన్నది రుక్మిణి.

 

    "మమ్మీ! నీకూ నాకూ పనిలేదుగా - మరి మనం కూడా ఆ హరే రామ మఠంలో చేర్దామా?"

 

    "నోరుముయ్! నోటికెంతొస్తే అంతా కూస్తున్నావ్!" కఁయ్ మన్నది రుక్మిణి.

 

    రంగారావుకు నవ్వు వచ్చింది. ముసి ముసిగా నవ్వుకున్నాడు.

 

    డ్రైవరు సుబ్బయ్యకు కూడా నవ్వు వచ్చింది. పెదవులు బిగించి నవ్వును దిగమింగుకున్నాడు.

 

    "వాళ్ళు దేశం వదిలి ఇక్కడికొచ్చి ఏం చేస్తారు డాడీ?" అనడిగింది శబరి.

 

    "ఏం చేస్తారా? సోమరిపోతుల్లా భజనలు చేస్తూ వీధుల వెంట తిరుగుతారు" అన్నది రుక్మిణి.

 

    "మరి వాళ్ళకు డబ్బూ!"

 

    "ఇంటినుంచి తెప్పించుకుంటారు కొందరు. కొందరి ఖర్చు మఠం భరిస్తుంది" అన్నాడు రంగారావు.

 

    "మిసెస్ సక్సేనా ఆదిత్య చుట్టూ వల పన్నుతుందండీ!" మాట మారుస్తూ అన్నది రుక్మిణి.

 

    "ఎందుకు?" అడిగాడు రంగారావు భార్యను.

 

    "ఎందుకూ? అయ్యేరాత! మీకు బొత్తిగా బుర్ర లేదండీ!"

 

    "బోర్! బోర్! మళ్ళీ అదే డైలాగ్!"

 

    "నువ్వు నోరుమూస్తావా లేదా?"

 

    "ఎందుకూ యేమిటి? ఆదిత్య, మల్టీ మిలియనియర్ కు ఏకైక పుత్రుడు. అల్లుణ్ణి చేసుకోవాలని తాపత్రయం."

 

    "కులం వేరు-పైగా భాషలు కూడా వేరు."

 

    "అవన్నీ ఇప్పుడెవరు చూస్తున్నారండీ!"

 

    "అది సరే! ఆ సంగతి నీకెలా తెలుసు?"

 

    "అయ్యో రామ! ఆ మాత్రం తెలుసుకోలేమా? ఈ పార్టీ ఎందుకు ఏర్పాటు చేసిందనుకున్నారు? ఆదిత్య కోసమే. కాని అతను ఆ పిల్లను చూస్తే చేసుకోడు."

 

    "నీకెలా తెలుసు?"

 

    "ఆ పిల్ల బొత్తిగా బాగుండదు. మన అమ్మాయి అందం ముందు ఆ పిల్ల దిగదుడుపే!"

 

    రంగారావు సమాధానం ఇవ్వలేదు.

 

    శబరి అద్దంలోంచి రోడ్డు మీద వచ్చేపోయే వాళ్ళను చూస్తున్నది.

 

    "నా తాపత్రయం అంతా దీన్ని గురించే! మీకు అదేం పట్టదు. ఇది కాస్త తెలివిగలదైతే ఆదిత్యను అల్లుణ్ణి చేసుకోవచ్చు!"

 

    "వాళ్ళ అంతస్థు ఎక్కడా మన అంతస్థు ఎక్కడా! సక్సేనా - వాళ్ళు వాళ్ళు- సమాన ఉజ్జీలు-"

 

    "మీ తెలివి తెల్లారినట్టే వుంది. ఆదిత్యకు డబ్బెందుకు! ఇప్పటికే తరగని ఆస్తి వుంది. అందమైన పిల్ల కావాలని ఉంటుంది. ఆ అందం మన అమ్మాయికి ఉంది."

 

    "మన అమ్మాయి అందం అతనికి నచ్చొద్దూ?"

 

    "ఎందుకు నచ్చదూ? మనమ్మాయి కంటే అందమైన పిల్ల దొరుకుతుందా ఏమిటి?"

 

    "అబ్బబ్బ! మమ్మీ స్టాపిట్ బోరింగ్!"

 

    "ఏమిటే నీ వాగుడూ నువ్వూనూ!"

 

    "ఎప్పుడూ పెళ్ళి గొడవే నీకు!"

 

    కారు మిస్టర్ సక్సేనా ఇంటిముందు ఆగింది.


                                      2


    మిసెస్ సక్సేనా నవ్వుతూ యెదురొచ్చి ఆహ్వానించింది.

 

    "హాయ్ శబరి!" అంటూ సక్సేనా కూతురు మీనా శబరి చెయ్యి పట్టుకుని ఊపింది. మీనా ప్యాంటూ షర్టూ వేసుకొని వున్నది. మీనాకు ఆ డ్రెస్ బొత్తిగా బాగుండదు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS