Previous Page Next Page 
హ్యూమరాలజీ -2 పేజి 2


    ఠక్కున ఫోన్ డిస్కనెక్ట్ చేసేశాను.

 

    "ఏం జరిగింది? ఇంక మన దగ్గర అర్ధరూపాయ్ కాయిన్స్ కూడా లేవు" అన్నాడు శాయిరామ్ ఆందోళనగా.

 

    "ఫోన్ అవుటాఫ్ ఆర్డరట."

 

    "ఎవరిది?"

 

    "ఏమో? అది తెలీదు-"

 

    "బహుశా మనదే అయుంటుంది. అందుకే ఎనిమిది అర్ధరూపాయలు మింగింది" కోపంగా అన్నాడు జనార్ధన్.

 

    "ఇప్పుడేం చేద్దాం మరి?"

 

    "మనమే వెళ్దాం - కంట్రోల్ రూమ్ కి" అన్నాడు యాదగిరి.

 

    అందరం ఆటోలో కంట్రోల్ రూమ్ కి బయలుదేరాం.

 

    టీ.వీ. టవర్ దగ్గర కొచ్చేసరికి హఠాత్తుగా పెద్ద విజిల్స్ తో ఇద్దరు పోలీసులు ఆటోకి అడ్డంగా వచ్చేశారు.

 

    "రోకో- రోకో" అని అరచాడొక కానిస్టేబుల్.

 

    ఆటోవాడు సడన్ బ్రేకులతో ఆటో ఆపేప్పటికి, మా ఆటో వెనుకనే వేగంగా వస్తోన్న జనార్ధన్ వాళ్ళ ఆటో మా ఆటోని డాష్ ఇచ్చేసింది.     

 

    జనార్ధన్ మొఖం మీటర్ బోర్డ్ కి కొట్టుకుని అప్పటికప్పుడే మొఖం వాచిపోయింది. అందరం కోపంగా ఆటో దిగాము.

 

    "ఏమిటి? ఎందుకాపారు?" శాయిరామ్ కోపంగా అడిగాడు కానిస్టేబుల్స్ ని.

 

    "హమారే సాబ్ కే పాస్ జావ్" అన్నాడు కానిస్టేబుల్- లాఠీతో దూరంగా రోడ్ ప్రక్కకు లైటు స్తంభం కింద దొంగలారా నక్కి నిలబడ్డ వాళ్ళ ఇన్ స్పెక్టర్ ని చూపుతూ.

 

    అందరం ఇన్ స్పెక్టర్ దగ్గరకు నడిచాము.

 

    "మమ్మల్ని ఎందుకండీ ఆపారు" అడిగాడు శాయిరామ్.

 

    ఇన్ స్పెక్టర్ చిరాగ్గా చూసాడు మావేపు.

 

    "ఎవరు మీరంతా."

 

    "నిర్భయ్ నగర్ కాలనీ వాళ్ళం!"

 

    "ఎక్కడుందా కాలనీ?"

 

    "అభాగ్యనగర్ కాలనీకి ఎదురుగ్గా"

 

    "అభాగ్యనగర్ కాలనీ ఎక్కడుంది?"

 

    "వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కనే"

 

    "వెంకటేశ్వర స్వామి గుడి ఎక్కడుంది?"

 

    "మోహన్ పబ్లిక్ స్కూలు పక్కనేనండి- మోహన్ పబ్లిక్ స్కూల్ మీకు తెలిసే వుంటుంది. చాలామంచి స్టాండర్డ్స్ తో రిజల్ట్స్ తో స్టేట్ ఫస్ట్ వస్తుంటుంది-"

 

    "నేనెప్పుడూ వినలేదా పేరు- ఇంతకూ ఆ స్కూలెక్కడుంది?"

 

    అతనికెలా చెప్పాలో మాకు అర్థం కాలేదు. యాదగిరి ముందుకొచ్చాడు.

 

    "గదేసార్! నర్శింలు గుడంబ దుకాణం పక్కనే ఉన్నది సార్ మా కాలనీ-"

 

    "మారా సంగతి ముందు చెప్పరేం? గుడిపేర్లూ, స్కూలు పేర్లూ చెప్తే ఎవడికి తెలుస్తుంది."

 

    అందరం తప్పయిపోయిందని వప్పుకున్నాం. మనదేశంలో ఎక్కడయినా సరే లాండ్ మార్క్స్ చెప్పాలంటే బార్లు, కల్లు కాంపౌండ్లు, వైన్ షాపుల్ని మించిన లాండ్ మార్క్ లు ఉండవు.

 

    "అయితే ఇప్పుడెక్కడికెళ్తున్నారు?"

 

    "పోలీస్ కంట్రోల్ రూమ్ కండీ"

 

    "ఎందుకు?"

 

    "మా కాలనీ తాలూకూ ఓ అమ్మాయి శవం దొరికిందేమో కనుక్కోటానికండీ-" ఇన్ స్పెక్టర్ ఉలిక్కిపడ్డాడు.

 

    "శవమా?"

 

    "అవునండీ!"

 

    "సూసైడ్ కేసా?"

 

    "కాదండీ! రేప్ అండ్ మర్డర్ అయుంటుందని మా నమ్మకమండీ"

 

    "ఎవరు చంపారు?"

 

    "అది మాకెలా తెలుస్తుందండీ! రాత్రుళ్ళు రోడ్ మీద తిరిగేది పోలీసులూ, దొంగలూ, గూండాలే కదండీ"

 

    "రాత్రుళ్ళూ, శవం, మర్డర్- ఏమిటయ్యా మీరు మాట్లాడేది? ఇంతకూ ఆ అమ్మాయి ఎవరు?"

 

    "మా కాలనీ అమ్మాయండీ!"

 

    "ఆ అమ్మాయికీ మీకూ ఏమిటి సంబంధం?"

 

    "ఏమీ లేదండీ! జస్ట్ మా కాలనీ అమ్మాయ్ అంతే-"

 

    ఇన్ స్పెక్టర్ ఓ క్షణం ఆలోచించాడు.

 

    "ఏయ్ ఫోర్ నాట్ ఫోర్"

 

    "యస్సార్-"

 

    "వీళ్ళందరినీ వాన్ ఎక్కించు"

 

    మేము అదిరిపడ్డాము.

 

    "ఎందుకండీ-"

 

    "ఆ పిల్లను మీరే మర్డర్ చేసి శవాన్ని ఎక్కడో పడేసి ఉంటారు. మళ్ళీ ఏమీ తెలీనట్లు వెతకటానికి బయల్దేరారు-"

 

    కానిస్టేబుల్స్ - నాలుగురొచ్చి మమ్మల్ని వాన్ వేపు తోయసాగారు.

 

    "మీకేం దమాకున్నాది వయ్యా! నీయవ్వ- మేము ఆ పోరి తల్లిదండ్రులకు మదద్ చేద్దామని పోతూంటే మమ్మల్నే లోపట జేస్తారు?"

 

    యాదగిరి కోపంగా అడిగాడు.

 

    "ఏయ నకరాలు చేయకుబే- ఆవాజ్ బంద్ కర్ కే వాన్ ఛడో!"

 

    అంటూ లాఠీతో యాదగిరిని ఒక్కతోపు తోసాడు కానిస్టేబుల్.

 

    లాఠీ చూసేప్పటికి మా అందరికి కూడా భయం కలిగింది. నిశ్శబ్దంగా వాన్ ఎక్కేశాం అందరం.

 

    పోలీస్ స్టేషన్లో ఇంటరాగేషన్ మొదలయింది.

 

    "ఆ సంధ్యారాణి అనే అమ్మాయిని నువ్ లవ్ చేసినావు! కదూ?" శాయిరామ్ నడిగాడు ఇన్ స్పెక్టర్.

 

    "లవ్వేమిటండీ నా తలకాయ! నాకు పెళ్ళయింది ఇద్దరు పిల్లలు-

 

    "అయినాగానీ ఇంకో అమ్మాయిని - అంటే ఈ సంధ్యారాణిని ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకున్నావ్! ఆ అమ్మాయితో ఈ విషయం చెప్పావ్! కానీ ఆ అమ్మాయి వప్పుకోలేదు. అందుకని ఆమె మీద కసితో ఏదో సాకుతో ఆమెను ఒంటరి స్థలానికి తీసుకెళ్ళి రేప్ చేసి చంపేసావ్-అవునా?" మొత్తం రహస్యం కనుక్కున్నట్లు విజయగర్వంతో అడిగాడు సబిన్ స్పెక్టర్.

 

    "అబద్ధం! ఇదంతా మీ కట్టుకథ! ఉన్న ఒక్క భార్యను కూడా ఎందుకు చేసుకున్నానా, అని పెళ్ళయిన మర్నాటి నుంచీ పశ్చాత్తాపపడుతూంటే నా మొఖానికి ఇంకో పెళ్ళామా?"

 

    "నిజం చెప్పు! దీనికంతటికీ ఏ సినిమా ఇన్ స్పిరేషన్?"

 

    శాయిరామ్ అయోమయంగా చూసాడు.

 

    "సినిమానా?"

 

    "అవునోయ్! సినిమా! ఏం సినిమా చూశాక రెండో పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన కలిగింది నీకు-"

 

    "నాకేం అర్థం కావటం లేదండీ-"

 

    "ప్రతి నేరానికీ ఈ రోజుల్లో ఏదొక సినిమా ఇన్ స్పిరేషన్ ఉంటుందని మా అసిస్టెంట్ కమీషనర్ గారి నమ్మకం. అందుకే ప్రతి నేరస్తుడినీ ఏదొక సినిమా పేరు చెప్పమంటున్నాం! అది కంపల్సరీ! తప్పించుకోడానికి వీల్లేదు, లేకపోతే మాకు మాటొస్తుంది. త్వరగా చెప్పు-"


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS