Next Page 
420 మెగా సిటీ పేజి 1


                                                     420 మెగాసిటీ

                                                                   యర్రంశెట్టి శాయి

 

                                                 


    ఒకదాని తర్వాత ఒకటి చీమల బారుల్లా పరుగెత్తుకొస్తాయి సిటీ బస్సులు. బస్టాప్ కి అరవై అడుగుల దూరంలో ఒకటి, ఇరవై గజాల వెనక మరోటి ఆగుతాయి.
    ఒక మధ్యతరగతి జీవి జీవితాంతం కష్టపడి ఒక ప్లాట్ కొంటే మరుసటిరోజు దాంట్లో ప్రత్యక్షమవుతాయి పదో, ఇరవయ్యో గుడిసెలు.
    తెల్లారుఝాము రెండింటికి బుర్ర్ బుర్ర్ మనే శబ్దాలతో సుప్రభాతం పాడుతుంది మునిసిపల్ టాప్.    
    ఒక మాదిరి వర్షం కురిసిన తర్వాత మెయిన్ రోడ్ పైన ప్రవహించిన వరదనీట్లో పడి ఇద్దరో ముగ్గురో సిటిజన్స్ గల్లంతు!
    ఇవన్నీ జరిగేదెక్కడో కాదు - ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ లో.
    ఇక్కడ జనం రోజూ ఎన్ని కష్టాలు అనుభవిస్తారనేది నిజంగా హైదరాబాధీయులకే తెలుస్తుంది తప్ప వేరేవాళ్ళెవరికీ ఛస్తే తెలీదు.
    ఈ హైదరాబాద్ లకి బోలెడంత కామెడీ కలిపేసి, మాంఛి టేస్టీగా వండేసి వడ్డించారు రచయిత యర్రంశెట్టి శాయి.
    మీరు కూడా ఇంక నవ్వేసుకునేందుకు రడీ అయితే చదువుకోండి ఈ నవల.
                                                                                -యర్రంశెట్టి శాయి.    

    మన రాజధాని నగరం మెగాసిటీ అవబోతుందన్న వార్త వినగానే మా కాలనీలో చాలామందికి భయం పట్టుకుంది.
    ఎందుకంటే గవర్నమెంట్ ఏం చేసినా ప్రజల చెడుకోసమే చేస్తుందని మా కాలనీ వాళ్ళందరికీ అనుభవ పూర్వకంగా తెలుసు.
    కానీ గోపాల్రావ్ మాత్రం మెగాసిటీ అవటం వల్ల రాజధాని ప్రజలకు ఎన్నో సౌకర్యాలు కలుగుతాయని చెప్పడం మొదలుపెట్టాడు.
    పత్రికలవాళ్ళు ఏ వార్త అయినా మొదట్లో గవర్నమెంట్ వాళ్ళు చెప్పినట్లుగానే రాస్తారు గనక అతను ఆ వార్తలను నమ్మేస్తుంటాడు.
    "మీరూరికే భయపడిపోతున్నారుగానీ మెగాసిటీ మన రాజధానికి వరప్రసాదం అవుతుంది! చూస్తూండండి! మెగాసిటీగా డిక్లేర్ అవ్వగానే మనకి ఎన్నో సౌకర్యాలు కలుగుతాయ్" అన్నాడతను.
    అతని మాటలతో మాకందరికి భయం ఇంకా పెరిగిపోయింది గానీ తగ్గలేదు. ఎన్నో సంవత్సరాలుగా అష్టకష్టాలు పడుతున్నవాడికి హఠాత్తుగా సుఖాలు అందిస్తే వాడేమైపోతాడు? హార్ట్ ఎటాక్ వచ్చి ఎగిపోతాడు కదా! లేదా పిచ్చి అయినా ఎక్కుతుంది.
    మా కాలనీలో చాలామందికి ఆ లక్షణాలు రోజురోజుకి కొంచెం ఎక్కువవుతుండడంతో గత్యంతరం లేక మెగాసిటీ మీద ఓ అవగాహన సభ ఏర్పాటు చేశాడు గోపాల్రావ్! సాధారణంగా మా కాలనీ ఏ సభ ఏర్పాటు చేసినా ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, మంత్రులు అందరూ పిలవగానే వచ్చేస్తుంటారు. అందుకు కారణాలున్నాయ్.
    మొదటి కారణం ఏమిటంటే మా కాలనీ ప్రజలంతా మంచి శిక్షణ పొందిన ప్రేక్షకులు. ఎవరేం మాట్లాడినా, ఎంత దరిద్రంగా, నికృష్టంగా మాట్లాడినా, వాళ్ళ నిజ జీవితంలో ఎంత అవినీతి పరులయినా, ఎన్ని దారుణాలు చేసినా పెద్ద ఎత్తున అడుగడుక్కీ తప్పెట్లు, హర్షధ్వానాలు, వారిని ఆకాశానికెత్తే నినాదాలు చేస్తుంటారు మావాళ్ళు.
    అలా ట్రైనింగిచ్చాం మేమందరం వాళ్ళకు.
    ఇక రెండో కారణం ఏమిటంటే సభ ముగిశాక మా కోరిక మీద వేదికనలంకరించిన ప్రముఖులందరికీ మేమిచ్చే విస్కీ పార్టీ.
    అంచేత ఆ సభకు కూడా అన్ని డిపార్టుమెంటు అధికారులనూ, రాజకీయ నాయకులనూ ఆహ్వానించాం.
    మెగాసిటీ మీద ఉన్న భయాందోళన వల్ల కాలనీ జనమంతా ఆ సభలో కిక్కిరిసిపోయారు. మామూలుగానే పార్వతీదేవి మైక్ ముందుకొచ్చి అందరికీ ఆహ్వానము పలికింది.
    ఆమె దూరదర్శన్ లో ప్రత్యేక కార్యక్రమాలకు చేసే వ్యాఖ్యానాలు చూసి చూసి ఈ మధ్య తను కూడా అలా మాట్లాడాలని ప్రయత్నించి చాలావరకు విజయం సాధించింది.
    "నందన సమాజిత అరనోక్తిత ప్రాయేజిత సుందర గంధర్వుల కిన్నెర కింపురుషులకు స్వాగతం" అందామె. అంత గొప్ప బాష మాట్లాడినందుకు తనలోతానే పొంగిపోతూ, మా అందరివైపూ గర్వంగా చూస్తూనూ!
    దాని అర్థమేమిటో మాకెవరికీ అర్థంకాలేదు గానీ సభకు విచ్చేసిన అతిథులు మాత్రం గుసగుసలాడుకోవటం మాకు వినిపించింది.
    "ఆవిడెవరండి! చాలా హై స్టాండర్డ్ భాష మాట్లాడుతోంది?"
    "శాం స్కీట్ స్కాలర్ అయుంటుంది! ఆర్డనరీ వాళ్ళు అలా మాట్లాడలేరు."
    "నేను దూరదర్శన్ లో ఉగాది సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నాను. అప్పుడు వాళ్ళు ఎనౌన్సరుగా ఇలాగే హై స్టాండర్డ్ మాట్లాడించారు"
    "దూరదర్శన్ స్టాండర్డ్ వేరులెండి! టాప్ లాంగ్వేజ్" మా కాలనీవాళ్ళు తప్పట్లు కొట్టడం ముగిశాక పార్వతీదేవి మళ్ళీ అందుకుంది.
    "మన రాజధాని నగరం అందం, అర్రుల, అంకిత, అకుంఠిత, అంత్య, అమర, ఆశ్రయం, అవనితుల స్వర్గం! ఈ అచంచల అమృత, వెన్నెల విందుల విరాజిత వక్రచక్ర, విశ్వమోహన నగరం అనిర్వచనీయ, అశేష, ఆశయ మెగాసిటీగా రూపుదిద్దుకుని విస్ఫలిత రూపంలో అవతరించటం మనందరికీ దైవదివ్య, పవిత్ర వరం."
    మా కాలనీ వాళ్ళు మళ్ళీ చప్పట్లు కొట్టారు. ముందే చెప్పాను కదా! ఎప్పుడెప్పుడు తప్పట్లు కొట్టాలో వాళ్ళకు ఖచ్చితంగా తెలుసు.
    పార్వతీదేవి ఆ తప్పట్లు నిజమనుకుని రెచ్చిపోతుందని అనుమానమొచ్చి యాదగిరి పరుగుతో వేదిక మీదకు వెళ్ళి ఆమె చెవిలో చెప్పేశాడు!
    "ఇంక చాలంటున్నారు౧ దిగిపోండి"
    "పార్వతీదేవి మరో ఎనిమిది లైన్ ల వాక్యం మాట్లాడి నమస్కరించి వేదిక దిగింది.
    "దూరదర్శన్ రత్న పార్వతీదేవి జిందాబాద్! దూర సామ్రాట్ పార్వతీదేవి జిందాబాద్" అంటూ నినాదాలు చేశారు మావాళ్ళు. రంగారెడ్డి మైక్ దగ్గరకొచ్చి నిలబడ్డాడు.
    "ఈ సభకు విచ్చేసిన ప్రముఖులందరికీ సుస్వాగతం! హైదరాబాద్ సిటీ అకస్మాత్ గా మెగాసిటీ అవటం వలన ప్రజలకు ఎన్నో సౌకర్యాలు నలువేపులనుంచీ ఎదురవుతున్నాయనీ, వాటిని గుండె నిబ్బరంగా ఎదుర్కోవాలనీ ఎంతోమంది అంటున్నారు.
    ఇదివరలో హైదరాబాద్ జిల్లాని రెండు జిల్లాలు చేసినప్పుడూ, నగరం చుట్టూ మున్సిపాలిటీలు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇలాగే ఎంతోమంది ఈ సౌకర్యాల వాతబడి ప్రాణాలు కోల్పోవటం జరిగింది! కనుక ఈ విషయంలో ఈ సభకు విచ్చేసిన అతిథులందరూ తమ తమ విలువయిన అభిప్రాయాలు తెలిపి మా భయాందోళనలు ఎంతవరకూ సమంజసమైనవో చెప్పాల్సిందిగా కోరుతున్నాను" అన్నాడు వినయంగా.
    ముందు టెలిఫోన్ డిపార్టుమెంట్ జనరల్ మేనేజరు లేచి నిలబడ్డాడు.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS