Previous Page Next Page 
ది బ్లడ్ పేజి 3


 అది...ప్రభాత సమయం. ప్రజ్వలన జ్వాలాసమయం.

    అప్పుడే లేచిన పక్షుల రెక్కల చప్పుడుగా గుడారాలనుంచి వెలుపలకు వచ్చిన సైనిక కవాతుల శబ్దం. మిత్తువ మరణ మృదంగం.

    వేటకు సమాయత్తమమే మృగరాజు గర్జన పర్జన్యంగా యావత్తు సరిహద్దు ప్రాంతం యుద్ధ భేరిలతో దద్దరిల్లుతున్న వేళ. మృత్యువు శివమెత్తిన వేళ.

    ఘోర యుద్ధానికి ఉభయ పక్ష సైనికులు, సేనానులు సర్వసన్నద్దులయ్యారు.

    లేండ్ వార్ - పదఘట్టనల పదాతి దళం.

    ఎయిర్ వార్ - నింగినంటనున్న వాయుసేవ.

    సీ వార్ - నౌకా యుద్ధానికి సమాహారం.

    ఇరువైపులా త్రివిధ దళాధిపతులు తమ తమ వ్యూహ రచనలతో, కదన పాండితితో కుతూహలంగా తలమున్కలవుతున్నారు. 'చంపు లేదా చావు!' ఉత్తర్వులు.

    అయితే, అందరి హృదంతరాళాలలో నిర్లిప్తత, నిస్పృహ, నైరాశ్యం. అది బొమ్మ.

    అదే సమయంలో కక్ష ,కార్పణ్యం ,నరహంతక వీరోచిత విజయ విహారానికి పథక రచనలు. ఇది బొరుసు.

    పదినెనిమిది రోజుల కురుక్షేత్ర మహాసంగ్రామంలో నిహతులయింది అన్నదమ్ములు,దాయాదులు, వారి వందిమాగధులు, మందీ మార్బలమే కాదు __అమాయక జనం కూడాను. పద్దెనిమిది అక్షౌహిణులు...

    మనిషిలోని ఈర్ష్యాసూయలకు మచ్చుతునకగ, మానవ జన్మకు మాయని మచ్చగా ఇతిహాసపు చరిత్ర పుటలలో చీకటి కోణపు రక్తాక్షరాలుగా మిగిలింది ఆ యుద్ధం.

    కళింగ భూభాగాన నాగటి చాలలో నరరక్తపు ఊట. అది సామాజ్య విస్తరణా కాంక్ష. క్రీస్తుకు పూర్వం మూడవ శతాబ్దినాటి మాట.

    తరువాత తరువాత ఎన్నో ఎన్నెన్నో యుద్ధాలు. ఒక ఘజనీ, ఒక ఘోరీ దండయాత్రలు. మరొక ఛంగిజ్ ఖాన్. వేరొక తామర్లేన్, ఇంకొక నాదిర్షా రక్తదాహం.

    మొదటి ప్రపంచ యుద్ధం. ద్వితీయ ప్రపంచ మహాసంగ్రామం...

    కదన రంగాన విజయం ఎవరిని వరించిందనేది కాదు సమస్య__ యుద్ధ నష్టాల మాటేమిటి? యుద్ధానంతరం మానవాళికి ఏ మేరకు మేలు జరిగింది? సామాన్య జనంపై యుద్ధ ప్రభావం ఏమిటి?

    'ఏ దేశ చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం
    నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహి సిక్తం'

    జవాబులు లేని ప్రశ్నలు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ జవాబు లేదు...

    ఇప్పుడు జరుగుతున్నది మరొక విచిత్ర యుద్ధం. ఆధునిక యుగంలో అధునాతన యుద్ధం. అనవసర యుద్ధం !

    గగనతలాన ఎయిర్ మిసైల్స్ కాలనాగులై బుసలుకొడుతున్నాయి. దిక్కులు పిక్కటిల్లే ప్రళయ ఘోష. పూరివిప్పిన హతబాంబుల నటవిన్యాసం. మానవ మారణ హోమం మొదలు...

    ఆర్.డి. ఎక్స్. ప్రేలుళ్ళు భూ ప్రకంపనలు...

    బాంబర్లు, రాకెట్ లాంచర్లు మన్నూ మిన్నూ దుమ్ముధూసరిత ప్రహాళకేళి...

    ఎ.కె. 47 ఎ.కె. 56, ఎ.కె. 74 మారణాయుధాలు అక్కడ కేవలం టపాసులు...

    హింసనచన! ధ్వంసరచన! విధ్వంసకాండ...

    ఆకాశ హర్మ్యాలు పేకమేడలు. జనావళి హాహాకారాలు...

    మృత్యురవళి మర్మర ధ్వని. కంకాళ కాలనర్తనం...

    రక్తపుటేరులు ఎగసిన ఉప్పెన...

    గుట్టలు గుట్టలుగా మానవ కళేబరాలు. శవాలపై పగతుర శిరస్సులు...

    దుర్గంధభూయిష్ట కలుషిత ప్రకృతి. భయోద్విగ్న పృథ్వి. ప్రళయ సమయ వికృతి...

    రానున్న మరికొన్ని శతాబ్దాల వరకు చిన్న గరికపోచ సయితం మొలకెత్త వీలులేని రసాయనిక వర్షం. పునరుజ్జీవం ఎడారి ఎండమావి.

    అది మానవ రక్తదాహానికి పరాకాష్ట. నాగరికతా విధ్వంసానికి నిలువుటద్దం. మానవ అహంకారాపు హుంకరింపుకు చిహ్నం. సృష్టికి ధిక్కరింపు...

    కారుమబ్బులను తాకిన అగ్నిజ్వాలలు నలనల్లని పొగ అటు దినకరునికి, ఇటు భూమికి మధ్యనగల అనుసంధానాన్ని మూసివేస్తున్నది...

    దశ దిశలా కమ్ముకున్న కారుచీకటులు, రాబందుల రెక్కల చప్పుడు. నక్కల ఊళలు.

    ఘూకం కేకా, భేకం బాకా ఫేరవ భైరవ భీకర ఘోషలు...

    క్రూర ఘోర కర్కోటకుల దారుణ మారణ దానవ భాషలు...

    కాలకేతు మృత్యుకాహళి, తీరని రక్తదాహం...

    జరుగుతున్న నరమేధానికి శత్రువుల కనుసిగల కసిగా పెల్లుబుకుతున్న తృప్తి...నరాధముల రాక్షస తృప్తి... కాల భైరవ సంతృప్తి... 


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS