Next Page 
నల్లంచు-తెల్లచీర పేజి 1

                     

                      నల్లంచు-తెల్లచీర
   
                                            --యండమూరి వీరేంద్రనాథ్
   
   
                        

 


ప్రొలోగ్ : 1971.
   
    మే నెల, విజయవాడ.
   
    మధ్యాహ్నం 12-45.
   
    సత్యనారాయణపురం.
   
    "చీరలు....చీరలు....పిఠాపురం, ధర్మవరం చేనేత చీరలు".

   
    ఓ కుర్రవాడు గొంతు పగిలేలా అరుస్తున్నాడు. అతడికి పధ్నాలుగు నుండి పదహారు మధ్య వయసుంటుంది. వాడి నెత్తి మీద మూట వుంది. తెల్లగా సన్నగా వున్నాడు. ఇంకా మీసాలు (కూడా) సరిగ్గా రాలేదు.
   
    "చీరలమ్మా చీరలు.... నారాయణపేట నేత చీరలు...." అతడితోపాటే నడుస్తూన్న మధ్యవయస్కుడు మధ్య మధ్యలో తనూ గొంతు కలుపుతున్నాడు. అతడు వయసుకన్నా ముస్లైగా కనపడుతున్నాడు. బలహీనంగా వున్నాడు. అతడి తలమీద కూడా చిన్న మూట వుంది.
   
    బరువుతో చాలాసేపట్నుంచీ నడుస్తూ వుండటంవల్ల ఇద్దరి తలల మీదనుంచీ చెమట ధారాపాతంగా కారుతూంది. బరువు కృంగతీస్తున్నా గుండెల్లో శక్తినంతా గొంతులోకి తీసుకుని అరుస్తున్నారు ఇద్దరూ.
   
    "అమ్మా చీరలు కావాలా?" ఓ ఇంటిముందు నిలబడి అడిగారు.
   
    "చెయ్యి ఖాళీ లేదు వెళ్ళు" లోపల్నుంచి వినబడింది.
       
    "చీరలమ్మా శుద్దమైన నేత చీరలు....." బిచ్చగాళ్ళం కాదు అన్న బాధ ధ్వనించేటట్టు అన్నాడు ముసలివాడు.

    ఆవిడ బయటకొచ్చి "నెలాఖర్లో చీరలేమిటి? ఇప్పుడుకాదు" అని తలుపు వేసేసింది.
   
    మళ్ళీ నడక.
   
    పైన ఎండ మాడ్చేస్తూంది. చెప్పుల్లోంచి ఆవిర్లు పైకి తంతున్నాయి. ఎండకి భయపడి రోడ్డుమీద మనుషులు కూడా ఎవరూ లేరు. దూరంగా రైల్వే ట్రాక్ మీద ట్రైన్ పెద్ద శబ్దం చేసుకుంటూ వెళుతూంది. "లాభం లేదురా అబ్బీ, ఈ పట్నంలో ఎవరూ మన చీరలు కొనరు. సాయంత్రం పూట అద్దాల మధ్య కొనటానికి షాపుల కెళతారుగానీ, మన దగ్గర ఎవరు కొంటార్రా?"
   
    కుర్రవాడు మాట్లాడలేదు.
   
    "ఇక నేను నడవలేనురా గొంతు ఆర్చుకుపోతోంది."
   
    వీధి పంపులో ఒక్కో చుక్కనీరు పడుతూంది. వాటితో నోరు తడుపుకుని చిన్న ఇంటిముందు అరుగుమీద కూర్చున్నారు.
   
    "పల్లెటూర్లోనే బావుండేదిరా. రోజుకో చీరన్నా అమ్ముడుపోయేది" నిస్త్రాణగా అన్నాడు. కుర్రవాడు దీనిక్కూడా సమాధానం చెప్పలేదు.
   
    బయట అరుగుమీద మాటలు వినిపించి 'ఎవరదీ' అని ఒకావిడ వచ్చి వీళ్ళని తొంగిచూసి లోపలి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం వేళే కాబట్టి ఇరుగమ్మలు-పొరుగమ్మలు ఆ ఇంట్లోనే చేరినట్టున్నారు. నలుగురూ కలిసి, అక్కడలేని అయిదో ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నారు.
   
    "ఎవరో బట్టలవాళ్ళమ్మా" చూసి వెళ్ళినావిడ చెపుతోంది. లోపల సంభాషణ దానిమీదకు మళ్ళింది.
   
    "వీధిలోకి వచ్చేవాళ్ళ దగ్గర చీరలు అసలు కొనకూడదట. మొన్న మా ఆడపడుచు చెప్పింది. ఒకే రకం చీరలు వాళ్ళ దగ్గర రెండేసి వుంటాయట. మొదటి చీర చూపించేటప్పుడు బాగానే అయిదు మీటర్లుంటుంది. చూపించింది నలిగిందంటూ మడత విప్పని మరో చీర అదే డిజైన్ ది తీసుకుని, అతడు వెళ్ళిపోయాక విప్పి కట్టుకుందామనుకుంటే ఆ చీర రెండున్నర మీటర్లు, మూడు మీటర్లు మినహా ఎక్కువ వుండలేదట-"
   
    "అప్పటికి వాడి అడ్రస్ కూడా వుండదు."ఇంకో ఆవిడ అందించింది. ఇద్దరు ముగ్గురు నవ్వినా ధ్వని- "అసలు వీళ్ళందర్నీ పోలీసులకి పట్టించాలండీ."
   
    అరుగుమీద కూర్చున్న కుర్రవాడి మొహం ఎర్రగా మారింది. అసలే ఎండవల్ల కంది వున్నదేమో- మరింత స్పష్టంగా అది కనపడుతోంది. తల పక్కకి తిప్పి మేనమామవైపు చూశాడు. ఆ ముసలతను అప్పటికే కళ్ళు మూసుకున్నాడు. ఈ మాటలకి కళ్ళు తెరిచాడు. ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయి.
   
    "ఒరేయ్! మన ఊరు వెళ్ళిపోదాంరా పదిరూపాయలొచ్చేట్టు ఒక చీర అమ్మినా చాలు. ఇక్కడ అదీలేదు."
   
    కుర్రవాడు ఓడిపోయినట్టు తలొంచుకున్నాడు. మేనమామ వద్దంటున్నా బలవంతంగా బయల్దేరతీసింది అతడే. దాదాపు పది సంవత్సరాల్నుంచీ ఆ పల్లెటూల్లో ప్రతీ సందూ తిరిగారు. అన్నేళ్లనుంచీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు వుండిపోయింది. ఏదో ఒకటి చెయ్యాలి. ఫలితమే ఈ ప్రయాణం!
   
    కేవలం తనమాట తీసెయ్యలేక తనతోపాటూ పట్నంవచ్చిన మావని ఆ కుర్రవాడు జాలిగా చూశాడు. పెద్దాయన చెప్పిన మాటలు కూడా నిజమే అనిపించాయి. అద్దాల గదుల్లో కల్తీ చీరలు కొనటానికి అలవాటుపడిన వాళ్ళు ఈ నాణ్యతని ఎలా గుర్తిస్తారు?
   
    "మావయ్యా! నువ్విక్కడే పడుకో ఎండ ఎక్కువగా వుంది. నేనో రెండు వీధులు తిరిగొస్తాను."
   
    మగతగా కళ్ళు విప్పాడు ముసలాడు. "ఒరేయ్ ఇక్కడ నొప్పిగా వుందిరా" అంటూ కడుపుపైన రొమ్ము దగ్గిర చూపించాడు. ఆ కుర్రవాడు అతడి ఒంటిమీద చెయ్యివేస్తూ, "ఒళ్ళు కూడా వేడిగా వుంది మావయ్యా! వడదెబ్బ తగిలినట్టుంది. నీడనే పడుకో- నేను ఓ గంటలో వస్తాను. నీ మూట జాగ్రత్త" అన్నాడు. ముసలాడు తిరిగి కళ్ళు మూసుకుంటూ, 'వెళ్ళిరా' అన్నట్టు తలూపాడు.
       
    కుర్రవాడు తలమీద తన మూట పెట్టుకుని సాగిపోయాడు.
   

                         *    *    *
   
    "చీరలూ - చీరలూ - నారాయణపేట చీరలు - స్వంత మగ్గాల మీద నేసిన చీరలమ్మా..."
   
    అరగంట నుంచీ అరుస్తూ తిరుగుతున్నాడు. ఒకళ్ళిద్దరు పిలిచి చూశారు. ఏదో ఉబుసుపోక చూసినట్టు ఓ పది నిముషాలు చూసి పంపించారు తప్ప కొనే ఉద్దేశ్యం వారిలో కనబడలేదు.
   
    ఆ కుర్రవడిలో కూడా శక్తీ ఓపికా నశించాయి. బాగా ఆకలేస్తూంది. తెచ్చిన డబ్బులు కూడా క్రితంరోజే అయిపోయాయి. పళ్ళబిగువున నిస్సత్తువ. అదిమిపెట్టి అరవసాగాడు. కొంచంసేపటికి అరవటానికి కూడా శక్తి మిగల్లేదు.
       
    కొమ్మూరి వేణుగోపాల్రావు క్లినిక్ పక్కనుంచి సందులోకి తిరిగి, మూలమీదున్న కిళ్ళీషాపులో ఓ సోడా తాగాడు. కాస్త సత్తువ వచ్చినట్టుంది. దూరంగా ఎవరింట్లోంచో సుమన్ కళ్యాణ్ ఫూర్ గజల్ వస్తూంది. చాలా నెమ్మదిగా- మంద్రస్థాయిలో....
   
    "షరాబీ.... షరాబీ....
    ఏ సావన్ కి మోసమ్-
    గులాబీ.... గులాబీ... ఏ పూలోంకె చెహరే-
    కుచ్ ఐసీ బహారాగయీ హై చమన్ మే
    ఏమెహకీ నషిలీ హవవోంకి పరిచయ్
    ఖూబ్ సూరత్ నహోతా-అగర్ ఇస్ మె
    రంగే మొహబ్బత్ నహోతా"
   
    (మత్తుగొలిపే వర్షాకాలపు సాయంత్రం....అందమైన గులాబీ పూలతోట మీదనుంచి వచ్చే పిల్లగాలి పరిమళం....ఏదీ అందంగా వుండదు. వీటిలో ప్రేమ తాలూకు కొసమెరుపు లేకపోతే!)
   
    ఆ కుర్రవాడు తన చీరల అమ్మకం గురించి కూడా మర్చిపోయి ఆ పాట తాలూకు అందాన్నీ  అర్ధాన్నీ ఆస్వాదిస్తూ అలాగే పాత పూర్తయ్యేవరకూ వుండిపోయాడు. తెలంగాణలో పెరగటం వల్ల అతడికి హిందీ బాగా తెలుసు. అది కూడా పూర్తి కారణం కాదు. చీరలకీ భావుకతకీ దగ్గిర సంబంధం వుంది.
   
    .....అతడు నేసిన చీరలకి అంచులు కత్తిరించేవాడు. ఒకోసారి చీరలకి ప్రింటింగు కూడా చేయవలసి వచ్చేది. నేతమీద అతడి వేళ్ళు అపురూపంగా జారేవి. నూలుని ముట్టుకోకుమ్డనే కౌమ్టు చెప్పగలిగేవాడు. నారాయణపేటలో వృద్దులు కూడా ఆ కుర్రవాడి పనితనానికి అబ్బురపడేవారు. పదో తరగతి తెలుగు మాస్టారంటే అతడికి చాలా అభిమానం - క్లాసులో ఒకసారి ఆయన రాజస్థాన్ గురించి చెప్పాడు.
   
    "రాజస్థాన్ లో 'మల్హోరీ' అనే ప్రాంతం పెళ్ళి చీరలకు ప్రసిద్ది! అక్కడ ఒక్కొక్క చీరని ఒక్కరే పూర్తిగా నేస్తారుట. ఒక పెళ్ళి చీరెను నేస్తూ ఆ చీరె ఏ పెళ్ళికూతురి ఒంటిని అలరిస్తుందో ఊహించుకుంటూ, తన పెళ్ళి గురించి కలలుకంటూ, ఒక్కో కన్నెపిల్లా కూనిరాగాలు తీస్తూ చీరను పూర్తిచేసింది. ఆ పాటలని 'లోరీ' లంటారు. పూర్తిగా ఒక కన్నెపిల్ల చేతిమీద తయారయిన ఆ రాజస్థాన్ చీరెలు దేశంలో ఎంతో ప్రసిద్ది...."
   
    పదో తరగతి ప్రధమ శ్రేణిలో పాసయినప్పుడు- తను స్వయంగా నేసిన చీరనే మాస్టారింటికి తీసుకువెళ్ళి ఇచ్చాడు. మబ్బు రంగుమీద మల్లె అంచు ఎవరి హృదయాన్నైనా యిట్టే ఆకట్టుకుంటుంది. దాన్ని చూసి మాస్టారు గారి భార్య ఎంతో మురిసిపోయింది. "ఇప్పుడెందుకురా ఇవన్నీ-" అన్నారు మాస్టారు మందలిస్తున్నట్టు. "నేనూ నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఈ చీరె నేసాను మాస్టారూ" పైకి అనలేదు, అతడు - మనసులో అనుకున్నాడు.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS