Next Page 
శృంగారపురం ఒక కిలోమీటరు పేజి 1


      

                                శృంగారపురం ఒక కిలో మీటరు
      
                                                     -మేర్లపాక మురళి

                 

                             

 

    వర్షకి మెలకువ వచ్చింది.

 

    పడక  మీదనుంచి లేచి కూర్చుని చుట్టూ చూసింది. చీకటి  గోడకి దిగ్గొట్టిన మేకులా యెర్రటి బెడ్ లైట్ వెలుగుతోంది.

 

    రెండు చేతుల్నీ బాగా రాపాడించి కళ్ళను తుడుచుకుంది. ఆ కాస్త వేడిమికే నిద్ర కరిగిపోయినట్లు ఫ్రెష్ గా ఫీలయింది.

 

    పక్కకు తిరిగి చూస్తే టైమ్ పీస్  అయిదు గంటలను చూపిస్తోంది. కిటికీలోంచి కనిపిస్తున్న బోగన్ విల్లా, పచ్చల రాయికి పగడాలను పొదిగినట్లుంది. దూరంగా వున్నా తురాయి చెట్టు పండక్కి పుట్టింటికి వచ్చిన పదిమంది ఆడపిల్లల కుటుంబంలా ఆకులన్నీ రాల్చేసి పూలనే మిగల్చుకుని కనిపిస్తోంది. గాలి అప్పుడే నదీస్నానం చేసివచ్చినట్లు చల్లగా తగులుతోంది.

 

    "అబ్బ! ఎంత బావుందో వాతావరణం" తనలో తనే అనుకుంటూ పడకమీద నుంచి కిందకి దిగింది వర్ష.

 

    బాత్రూమ్ లో ముఖం కడుక్కుని అద్దంలో చూసుకుంది. పాతికేళ్ళ పరువాన్ని ఆరోగ్యంతో రంగరించినట్లు మెరిసిపోతోంది శరీరం.

 

    ఆమె పెద్ద  అందగత్తేమీ కాదు. కానీ ఏదో  తెలియని ఆకర్షణ చూపరులను ఇట్టే లాగేస్తుంది. వ్యక్తిత్వపు గుభాళింపువల్ల ఎక్స్ట్రా ఆకర్షణ అది.

 

    సాధారణంగా చాలామంది ఆడపిల్లలకు దేనిమీదా ఒక దృక్పథం వుండదు. వాళ్ళు తల్లిదండ్రులకు కార్బన్ కాపీల్లా వుంటారు. అందుకే పోతపోసిన విగ్రహాల్లా కనిపిస్తారే తప్ప ప్రాణం వున్న మనుషుల్లా అనిపించరు. ఏ చిన్న సమస్య ఎదురైనా తల్లివైపో, తండ్రివైపో చూస్తుంటారు.

 

    పెళ్ళి అయ్యాక కూడా అంతే. మొగుడు ప్రతిరాత్రీ పడకటింట్లో వదలకుంటే, పుట్టింటికి పరుగెత్తి తనకేదో పెద్ద కష్టం వచ్చినట్లు నానా హైరానా చేస్తారు. 'కొత్తలో అంతేననీ, ఆ వేడి కాస్త తగ్గాక నువ్వు రమ్మన్నా అతడు రాడ'న్న సత్యాన్ని తల్లో, యింకో ముసలావిడో చెప్పాల్సి వస్తుంది.

 

    కానీ వర్ష అలా కాదు. ఆమెకు ప్రతి చిన్న విషయంపై కూడా ఒక అవగాహన వుంది. అదంతా ప్రపంచ పరిశీలనవల్ల, అధ్యయనం వల్ల వచ్చింది. తనకేదయినా సందేహంవస్తే ఎంతో కష్టపడి సమాధానం తెలుసుకునేది. అంతే తప్ప  ముసుగుదన్ని పడుకునేది కాదు.

 

    ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో వున్నప్పుడు  ఓరోజు సాయంకాలం త్వరగా ఇంటికొచ్చింది. వంటింటిలో తండ్రి తల్లితో సరసాలాడుతున్నాడు. ఈ విషయం తెలియక వంటింటిలోకి అడుగుపెట్టిన ఆమెకు వాళ్ళ రొమాన్స్ కళ్ళపడింది. తండ్రి తప్పు చేసినవాడిలాగా కంగారుపడ్డాడు. తల్లి దోషిలాగా తలదించుకుంది. ఆమెకు పాపం ఏడుపు ఒకటే తక్కువ.

 

    అప్పుడు వర్ష చాలా క్యాజువల్ గా తండ్రి దగ్గరికి వెళ్ళి "ఎందుకు నాన్నా! అలా తప్పు చేసిన వాడిలాగా నిలబడిపోయావ్? ఇదంతా క్వయిట్ నేచురల్. మీ శృంగారాన్ని చూసి నేనేదో అనుకుంటానని ఫీల్ కాకు- ఏమిటే  అమ్మా! ఎందుకా ఏడుపూ.....? ఇప్పుడేమైందనీ? ఇలాంటి సీన్స్ చూసి నేనేదో వికారానికి లోనవుతానని నీ బెంగ కాబోలు. అంతటి బలహీనురాలిని కానులే" అని అక్కడి నుంచి వచ్చేసింది.

 

    కూతుర్ని అలా గుడ్లప్పగించి చూస్తూండిపోయారు వాళ్ళిద్దరూ నిర్మొహమాటంగా వున్నది వున్నట్లు నిర్భయంగా చెప్పిన ఆమె తమ కూతురేనా అన్న సందేహం వాళ్ళిద్దర్నీ కాసేపటివరకూ బొమ్మల్లా నిలబెట్టేసింది. తమ  కంటి ముందు పెరిగిన అమ్మాయి నిస్సంకోచంగా ఎలాంటి ;ఇన్హిబిషన్స్' లేకుండా మాట్లాడడం  అబ్బురంగా  అనిపించింది.

 

    తన కూతురు వయసుతోపాటు అభిప్రాయాలనూ మార్చుకుంటూ తనకంటే ఎత్తు ఎదగడం ఆమె తండ్రికి ఆశ్చరాన్ని కలుగజేసింది. ఎప్పుడో హనకు ఊహ తెలిసినప్పుడు ఏర్పరచుకున్న అభిప్రాయాలను ఆయన ఎప్పుడూ మార్చుకోలేదు. కానీ  తన కూతురు ఎప్పటికప్పుడు కొత్త దృక్పథాన్ని అలవరచుకోవడం ఆయనకు మింగుడుపడలేదు.

 

    వయసొచ్చే కొద్దీ ఆమె వ్యక్తిత్వం కూడా పరిపూర్ణత సాధించుకుంది.

 

    ఎం.ఏ. అయిపోయాక బి.ఇడి. చదవాలన్న కోరికను తండ్రితో చెప్పింది. "నాకోసం ఫిలాసఫీ చదువుకున్నాను నాన్నా! ఆ సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ నాకున్నా ఉద్యోగం రాదు. ఈ దేశంలో చదువు పరమార్థం రాజకీయనాయకులకి తెలియక పోవడం వల్ల ఆ సబ్జెక్టుకి ఎలాంటి విలువా లేదు. లేకుంటే ప్రతి ఒక్కరూ కంపల్సరీగా చదవాల్సిన సబ్జెక్టు అది. కానీ ప్రస్తుతం ఏ సబ్జెక్టులోనూ సీటు పంచలో తలదాచుకునే కాందిశీకుల గుడారంలాంటిదన్న మాట. దానివల్ల లెక్చరర్ పోస్టు కాదుకదా అటెండర్ ఉద్యోగం కూడా రాదు. అందుకే ఉద్యోగం కోసం బి.ఇడి. చదవాలనుకుంటున్నాను."

 

    ఇదంతా వంటింటిలో వుండి విన్న తల్లి పరుగులాంటి  నడకతో అక్కడికి వచ్చి "మేం చెప్పినా వినకుండా ఇంతకాలం చదివావు. ఇక చదివింది చాలు. ఆ మూడుముళ్లూ వేసుకుని కాపురానికి వెళ్లు. అది నీకూ మంచిది మాకూ మంచిది" అంది.

 

    "చూడే అమ్మా! నేను మీ మాటలు వినని తెలిసి ఎందుకు ప్రయాస పడతావ్? 'ఈ  లోకంలో పశుపక్ష్యాదులు సైతం తమ తిండి తామే సంపాదించుకుంటున్నాయి. ఒక్క స్త్రీ తప్ప' అని ఎక్కడో చదివాను. అదిగో! ఆ క్షణమే నిర్ణయించుకున్నాను ఉద్యోగం చేయాలని."

 

    "మరి పెళ్ళి?"

 

    "పెళ్ళి చేసుకోనని అనడం లేదు. అయితే పెళ్ళిచూపుల పేరిట మూడు నిముషాల తంతు ముగించి, ముహూర్తం నిర్ణయించేసి సిగ్గూ ఎగ్గూ లేకుండా ఫస్ట్ నైట్ కోసం ఎగబడటం నాకిష్టం లేదు. అలాంటి వ్యక్తి తారసపడప్పుడు పెళ్ళి చేసుకుంటాను."


Next Page 

  • WRITERS
    PUBLICATIONS