భానూ కి గుర్తుగా
రాములు తిట్ల వర్షం కురిపించాడు. త్యాగరాజు మాట్లాడలేదు. తలవంచుకుని నిలబడ్డాడు. మనస్సు వికలమయింది. రాములు తిట్టిన తిట్లు మామూలివి కావు. వాళ్ళ వంశాన్నే తూర్పార పట్టాడు. త్యాగరాజు కి ఏడుపు వచ్చింది. అతి కష్టంతో అణుచుకున్నాడు. నోరు విప్పలేదు.
దండక మంతా చదివి ఆ తరవాత రాములు వెళ్ళిపోయాడు. పోతూ పోతూ "ఇక మీద కనక గ్రామం వైపు వచ్చావో కాళ్ళు విరగ్గోడతాను" అన్నాడు. ఆ మాటలు త్యాగరాజు మనస్సు లో నాటుకున్నాయి.
నిజానికి రాములు అంతపని చేసినా చెయ్యవచ్చు. అతను అంత కోపిష్టి. అతనితో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి.
అయితే భానుమతి నెలా చూడకుండా ఉండడం? ఆమెను కనక ఒక్క రోజు చూడకపోతే పిచ్చెక్కినట్టు గా ఉంటుంది. మనస్సు అదోలా అయిపోతుంది. గ్రామం వైపు వెళ్ళక పొతే భానుని ఎలా కలుసుకోవడం ?
ఆ గ్రామం పట్టణానికి మూడు మైళ్ళ దూరంలో ఉంది. భానుమతి అక్కడే ఉంటుంది. ఆమె అతనికి దూరపు బంధువు. వాళ్ళు ధనవంతులు . త్యాగరాజు వాళ్ళది పేద కుటుంబం. ఈ సంగతి అతనికి తెలుసు. పట్టణం లోని హైస్కూలు లో చదువుకునే రోజుల్లో వాళ్ళిద్దరూ కలుసుకోడం జరిగింది. బంధుత్వం విషయం కూడా తెలుసు కున్నారు. అందువల్ల వాళ్ళ స్నేహం బాగా పెరిగింది. ఈ స్నేహాన్ని భానుమతి తలిదండ్రులు హర్షించరని త్యాగరాజుకు తెలుసు. అయినా ఆమె స్నేహాన్ని వదులు కునేందుకు కష్టపడలేదు. ఆమెను కలుసుకుంటూనే ఉండేవాడు.
హైస్కూలు చదువు పూర్టి కాగానే భాను పట్టణం రావడం మానేసింది. అందువల్ల ఆమెను కలుసుకునేందుకు త్యాగరాజు ఒక దోవ కనుగొన్నాడు.
తమ పాత ఇంటిని చూచే మిషతో త్యాగరాజు ఆ గ్రామానికి తరుచు వెడుతూ ఉండేవాడు. అతని రాకని ఆమె ఎలా పసి కట్టేదో మరి! అతను వచ్చిన అరగంట కల్లా ఆమె దొడ్డి దోవన వచ్చి అతన్ని కలుసుకునేది. ఇద్దరూ పదిహేను నిమిషాలు మాట్లాడుకునే వారు. ఆ తరవాత విడిపోయే వారు.
ఇలా రెండేళ్ళు గడిచాయి. కాని ఆరునెలల క్రితం వరకూ ఈ సంగతి ఎవ్వరికీ తెలియదు. ఆ తరువాతనే బయట పడింది. వాళ్ళిద్దరూ కలుసుకోవడం ఒక రోజు గ్రామ కరణం చూశాడు. అయన ద్వారా ఈ విషయం గ్రామంలో పాకింది.
భాను తలిదండ్రులు మండి పడ్డారు. పట్టణం లోని త్యాగరాజు ఇంటికి వెళ్ళారు. నోటికి వచ్చినట్లు తిట్టి పోశారు. ఇక మీద త్యాగరాజు గ్రామం వైపు రాకూడదని హెచ్చరించి మరీ వెళ్ళారు.
అయినా త్యాగరాజు జంకలేదు. గ్రామానికి రహాస్యంగా వస్తూ పోతూ ఉండేవాడు. ఎవ్వరికీ తెలియకుండానే ఆమెను కలుసు కునేవాడు. అలా వాళ్ళ స్నేహం పెరుగుతూ వచ్చింది.
ఆ గ్రామంలోనే నివసిస్తున్న రెడ్డి అనే ఒకతను వాళ్ళ స్నేహానికి దోహద మిచ్చాడు. అతను త్యాగరాజు కి ఆప్తుడు. ఎన్నో విధాల సహాయం చేసేవాడు. అతని ప్రోత్సాహంతోనే త్యాగరాజు, భాను రహస్యంగా రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. కాని చిత్రమేమి టంటే , పెళ్ళయిన తరవాత కూడా భాను త్యాగరాజు ఇంటికి వెళ్ళలేదు. పుట్టింట్లోనే ఉండేది. తగిన తరుణం చూసి తమ పెళ్లి విషయం బయట పెట్టాలను కుంది. కాని ఆ తగిన తరుణం దగ్గర పడేటట్లు తోచలేదు. రిజిస్టర్ వివాహం జరిగి కూడా నాలుగు నెలలయింది.
ఈలోగా ఈ సంగతి సనసన్నగా బయటికి పొక్కింది. భాను తలిదండ్రులు ఆశ్చర్య పోయారు. ఆమెను నిజం చెప్పామని బెదిరించారు. నిజం కాస్తా బయట పడింది. వాళ్లకు అంతులేని కోపం వచ్చింది.
భానుమతి అన్నయ్య రాములు కి వచ్చిన కోపం అంతా ఇంతా కాదు. "ఆ దరిద్రుడ్నా భాను పెళ్లి చేసుకుంది!" అని మండి పడ్డాడు. "ఈ పెళ్లిని రద్దు చెయ్యకపోతే నేను రాముల్ని కాదు. అసలీ పెళ్లి చెల్లదు. వాళ్ళిద్దరూ కలిసి జీవించ కూడదు. " అన్నాడు. మాటిమాటికి పట్టణానికి వెళ్లి త్యాగరాజు ని బెదిరించసాగాడు.
"తలిదండ్రులు అంగీకారం లేకుండా మైనర్ దాటని ఒక పిల్లని నువ్వు పెళ్లి చేసుకున్నావు. నిన్ను పోలీసులకు ఒప్పగిస్తాను." అని చివరిసారిగా ఈ వేళ బెదిరించి వెళ్ళిపోయాడు రాములు.
అతను వెళ్లినప్పటి నుంచీ త్యాగరాజు భయపడ సాగాడు. ఏమీ పాలు పోలేదు. పిచ్చి వానిలా కూర్చున్నాడు. సంఘం మీద అతనికి కోపం వచ్చింది. ఇలా పేద, ధనిక భేదాలుండడం వల్లనే నేను బాహాటంగా భానుని పెళ్లి చేసుకో లేకపోయినాను గదా అనుకున్నాడు. తానూ ధనవంతు డైతే , ఈపాటికి భాను తండ్రి ఇందుకు సహర్షంగా సమ్మతించి వుండేవాడు. పైగా తమ రెండు కుటుంబాలకు దూరపు చుట్టరికం ఉంది.
ఇలా మధన పడసాగాడు త్యాగరాజు.
మరునాడు తెల్లవారుజమున తలుపు తట్టిన చప్పుడయింది. తలుపు తెరిచాడు త్యాగరాజు. ఆశ్చర్యపోయాడు. భాను నిలబడి ఉంది. ఒకరి నొకరు చూసుకుంటూ అలా మౌనంగా నిలబడి పోయారు.
"రా, భానూ!"
భాను లోపలికి వెళ్లి నిలబడింది. త్యాగరాజు ఆమె వైపు అడుర్ద్ఘాగా చూసాడు.
"చివరికి మీరేం నిశ్చయించు కున్నారు?"
"ఈ ఊరు విడిచి పెట్టి పోవాలను కుంటున్నాను."
"నిజంగానా?"
"అవును మీ అన్నయ్య నన్ను మరీ బెదిరిస్తున్నాడు. పోలీసులకు ఒప్పకేపుతా నంటున్నాడు. అతని కున్న పలుకుబడి అలా చేసినా చెయ్యవచ్చు. అందువల్ల.....నేనీ ఊరు విడిచి పోవడానికే నిశ్చయించు కున్నాను.
"మీ నిశ్చయానికి తిరుగు లేదా?"
"లేదు. నువ్వు నాతో వచ్చేస్తావా?"
భాను అలొచనలొ పడింది. బదులు చెప్పలేదు.
"ఏమి టాలోచిస్తున్నావు?"
"అదెలా వీలవుతుంది? ఎక్కడికని వెళ్ళడం? ఏం చేస్తాం? ఇది కనక మా నాన్నకు తెలిస్తే , అయన నన్ను ముక్కలు ముక్కలు చేస్తాడు."
ఇద్దరూ మౌనం వహించారు.
"మరి నువ్వు రాలేవా?"
"రాలేననే అనిపిస్తోంది."
"అయితే నా కనుజ్ఞ ఇవ్వు, భానూ! నేను వెడతాను. ఎక్కడికైనా వెడతాను. కష్టపడి సంపాదిస్తాను. మీ నాన్న మనస్సు మారినప్పుడే మళ్లీ తిరిగి వస్తాను. లేకపోతె .....మనస్సులోనే పెళ్లి చేసుకున్నట్టుగా మనం మసులు కుందాం."
అతనికి ఏడుపు వచ్చింది. భాను చేతులు పుచ్చుకున్నాడు.
"వెడితే ఎప్పుడు వెడతారు?"
"ఇవాళ్టి కి మూడో రోజు."
"సరే" తల వంచుకునే బదులు చెప్పింది భాను. తరవాత వెళ్ళిపోయింది.
త్యాగరాజు చెప్పిన మూడో రోజు తెల్లవారలేదు. ఇంకా చీకటిగానే ఉంది. త్యాగరాజు పెట్టె బేడా సర్దుకుంటున్నాడు. కళ్ళ వెంబడి నీళ్ళు కారుతూ ఉన్నాయి.
వీధి తలుపు కొట్టిన చప్పుడయింది. తలుపు తెరిచాడు. ఎదురుగా భాను నిలబడి ఉంది. త్యాగరాజు ఉలికి పడ్డాడు.
ఇద్దరూ మౌనంగా లోపలికి వెళ్ళారు. ఏం మాట్లాడాలో తెలీలేదు. త్యాగరాజు నీరసంగా ఒక కుర్చీలో కూర్చున్నాడు. పొంగి వస్తున్నా దుఃఖం తో అతని ముందు నిలబడింది భాను.
"ఎందుకు వచ్చావు, భానూ?' అని మెల్లగా అడిగాడు.
"రాకూడదా?"
"నిన్ను చూస్తె ఈ ఊరు విడిచి పెళ్లి వెళ్ళాలనే ఉద్దేశ్యం రావడం లేదు...."
"నేనూ మీతో పాటు వచ్చేస్తే......"
అతను తల పైకెత్తాడు. ఆమె తన మెడలోని నగలను తీసి అతనికి చూపించింది.
"ఈ నగలతో వచ్చేశాను! తొందరగా బయలుదేరండి. మన మెక్కడి కైనా వేడదాము. ఈ నగలమ్మి ఏదయినా వ్యాపారం చేసుకుని బతుకుదాం."
త్యాగరాజు లేచాడు. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూనే ఉన్నాయి.
"ఇది నిజమేనా, భానూ?"
"నమ్మకం లేదా? ఇక మీద నాకు మీతోనే జీవితం" అంటూ అతని చేతులు పుచ్చుకుంది.