అశ్వమేధ యాగం
"అమ్మకి ప్రాణంమీద కొచ్చింది. వెంటనే బయల్దేరు
రామం."
తమ్ముడిచ్చిన టెలిగ్రాం చదువుకున్నాడు వెంకటేశ్వర్లు.
ఒక్కక్షణం మట్టుకు మనసులోని ఊహలన్నీ స్తంభించి
మెదడు శూన్యమయింది. కత్తివేటుకి చర్మం తెగితే వెంటనే
రక్తం రాదు. రక్తం రావడం ప్రారంభించడంతో వరదగా
ప్రవహిస్తుంది.
ఊహలు వరదలుగా ప్రవహిస్తున్నాయి. "......అమ్మ చచ్చి
పోతుంది కాబోలు సాయంత్రం మెయిలులో బయల్దేరాలి.
వెళ్ళేదాకా ఉంటుందో ఉండదో రేపు వెళ్ళితే? ముసలి
ప్రాణం రేపటిదాకా నిలుస్తుందా? అయినా ఇవాళ
బయల్దేరడానికి వీలు లేదు. రేపు వెళ్ళవచ్చు. చచ్చిపోదు.
ఫరవాలేదు. రేపే వెళతాను. మరి డబ్బు?"
తలకాయలో పందెపు గుర్రాలు పరుగెత్తుతున్నాయి.
డబ్బు సంగతి తలలో మెరిసిన వెంటనే "ఈ టెలిగ్రాముతోనే డబ్బు పోగుచెయ్యవచ్చు" ననే ఊహ పుట్టింది. ఒక చోట కాదు. పదిచోట్ల సొమ్ము చెయ్యవచ్చు. తల్లీ చచ్చిపోతోందంటే డబ్బు బదులివ్వని కఠిన హృదయములుండరు. నలుగురైదుగురు బిర్రబిగిసినా, ఐదారుగురైనా ఇచ్చి తీరుతారు. సుమారు నూరు రూపాయలు పడతాయనడానికి సందేహం లేదు.
వెంటనే బట్టలు వేసుకున్నాడు. దమ్మిడీ అయినా లేదు. దగ్గరలో ఉన్నవాడూ. అడగ్గానే అప్పు యిచ్చేవాడూ ఎవరని ఆలోచించాడు. మరెవరు? సత్యనారాయణ ఉన్నాడు. నాలుగు వీధుల అవతల. నడుచుకుపోవచ్చును. ఈ కష్టసమయంలో పెళ్ళాం మెళ్ళో నగ తాకట్టుపెట్టి అయినా ఖర్చు తెమ్మని అడగదగినంత చనువూ అవకాశం ఉన్నాయి.
"సత్యనారాయణ గారూ!"
"ఇంట్లో లేరండి!"
ఏం అపశకునం! ఇంత పెందరాళే ఎక్కడికి వెళ్ళిపోయాడో? అన్నట్లు టెలిగ్రాము గదిలో వదిలిపెట్టలేదు కదా జేబు తడుముకున్నాడు. ఉంది జేబులోనే ఉంది.
మరి ఈ సత్యనారాయణ ఎక్కడ దొరుకుతాడు? కాఫీ క్లబ్బుల్లోనా? తన జేబులో రెండణాలయినా ఉంటే బాగుండును అబ్బే కాఫీ క్లబ్బుకి వెళ్ళడు. "ఇంట్లో కనుక్కుందాం. చెప్పి వెళతాడా? ఏమో......అడిగి చూదాం."
"సెంట్రలుస్టేషను కెళ్ళారండి. వచ్చాక మీ రొచ్చినట్టు చెబుతాను." ఇంట్లో నుండి జవాబు వీధికొసని తనకి తెలిసిన సోడా దుకాణం నాయర్ దగ్గర ఒకపావలా తీసుకున్నాడు వెంకటేశ్వర్లు బస్సులో పడ్డాడు. నిలబడే ప్రయాణం చేశాడు. గుర్రాలు మరీ జోరుగా పరిగెడుతున్నాయి మనస్సులో.
ఫ్లాటు ఫారం మీద సత్యనారయణని కలుసుకున్నాడు. ఇంకా మెయిలు రాలేదు. "మా బావమరిది వొస్తున్నా"డని సత్యనారాయణ ప్రకటించాడు. ఎలా ప్రారంభిస్తే బాగుంటుంది? "మీ ఇంటికి వెళ్ళితే నువ్వులేవు. అర్జంటు పని మీద వొచ్చాను" అంటే? బడి కుర్రాడు పెన్సలుగీతలు రబ్బరు పెట్టి తుడిచివేసినట్లు మనస్సులోంచి ఈ మాటలను తుడిచివేశాడు. ఏమీ అనకుండా జేబులోంచి వైరుతీసి సత్యనారాయణ కిచ్చాడు.
"అరే, పాపం! మీ అమ్మకి జబ్బుగా ఉన్నట్లు కూడా వినలేదే!"
"వృద్ధాప్యమే జబ్బు బతకదు లాభం లేదు. సాయంత్రం మెయిలుకి పోదామను కుంటున్నాను." సత్యనారాయణ చూపులు శూన్యాన్ని చిన్న చిన్న పీలికలుగా తుంచుతున్నాయి. "వెడదామంటే డబ్బులేదు......." ఎవ్వరో నూతిలో పడిపోయినట్టు ఈ మాటలన్నాడు వెంకటేశ్వర్లు తొందరగా.
సత్యనారాయణ కుడిచేతి బొటనవ్రేలినీ, చూపుడు వ్రేలినీ చాచి నుదుటిని పట్టుకొని "పాతిక రూపాయలేనా ఉండాలనుకుంటాను" అన్నాడు.
"ముఫ్ఫై రూపాయలు కావాలి నువ్వే ఇవ్వాలి. ఎంత ముంచుకొచ్చినా ఎవరినీ నోరు విడిచి అడగలేను."
సత్యనారాయణది త్వరగా కరిగిపోయే గుండె నగ తాకట్టుపెట్టి ఇస్తాననిపించడానికి వెంకటేశ్వర్లుకి ఐదు నిమిషాలకంటే ఎక్కువ పట్టలేదు. మధ్యాహ్నం రెండు గంటలకి మీ ఆఫీసులో కలుసుకుని సొమ్ము తీసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు వెంకటేశ్వర్లు.
* * *
నరహరి సెట్టి దగ్గర పది రూపాయలు సంపాదించేసరికి తలప్రాణం తోకకు వచ్చింది.
* * *
టాక్సీ చేయించుకొని మైలావూరు బ్యాంకుకి వెళ్ళాడు వెంకటేశ్వర్లు. బ్యాంకు గుమాస్తా కామేశం స్నేహితుడు కాడుగాని పరిచయస్థుడు. ఇలాంటి సన్నివేశాలలో స్నేహంకన్నా పరిచయమే డబ్బు పరికిస్తుంది.
బ్యాంకులో అరగంట వ్యర్ధమైపోయింది. దమ్మిడీ కూడా పెగలలేదు. టాక్సీని పంపించివేశాడు. అనవసరంగా డబ్బు వేటకి ఎక్కువ పెట్టుబడి పెట్టకూడదని నిశ్చయించాడు.
ఇద్దరు ముగ్గురు వకీలు స్నేహితుల ఇండ్లకు నడుచుకుంటూ వెళ్ళాడు. టెలిగ్రాం చూపించి ఒకచోట ఇరవై, ఇంకొకచోట ఇరవై ఐదు పిండుకున్నాడు.
మధ్యాహ్నం పండ్రెండు గంటలకి జేబులో డెబ్బయిఅయిదు రూపాయల జమ.
గుర్రాలు జోరుజోరుగా పరుగెత్తుతున్నాయి. సత్యనారాయణ ఇచ్చే ముప్పయి రూపాయలూ కలుపుకొని నూటఐదు రూపాయలవుతాయి. ఇవాళ గిండికీ వెళ్ళిపోతాను. గుర్రపు పందాల ఆఖరిరోజు చీకటితోనే ఎక్సుప్రెస్ ఎక్కేస్తాను.
"రెండు మూడు వందలేనా గెలవకపోతానా" అనుకున్నాడు వెంకటేశ్వర్లు నిన్న సాయంత్రం కొన్న "రేసింగ్ గైడు" కోటు లోపల జేబులోంచి పైకి తీశాడు. సైంటిఫిక్ గా ఆలోచించి గుర్తులు పెట్టుకున్న గుర్రాలపేర్లు మరోమారు మననం చేసుకున్నాడు. ఇవాళ నువ్వు గెలిచి తీరుతావని ఎవరో రక్తంలోంచి సందేశాలు పంపుతున్నట్లనిపించింది.
"మరి ఇంటికి వెళ్ళను. భోంచెయ్యాలని లేదు. టిఫిన్ తీసుకొని సత్యనారాయణ ఆఫీసుకి. అక్కన్నుంచే పార్కు స్టేషనుకీ."
ఎలక్ట్రిక్ ట్రెయిన్ లో కూర్చున్నాడు. ట్రెబిల్ ఈవెంట్ లో ఏడెనిమిది వందలొస్తే ఇవాళ చేసిన అప్పులన్నీ ఈ సాయంత్రమే తీర్చేస్తాను. కిందటి రేస్ లో ఈ నెల జీతమంతా తగలేశాను. అనుకున్న గుర్రాలని ఆడకుండా ఎవరో చెప్పిన మాట వింటే ఏమవుతుంది మరి?
"ఇవాళ ఫరవాలేదు. కళ్ళు మూసుకుని ఆడేస్తాను. పుట్టమీద పెట్టినట్టు డబ్బొచ్చేస్తుంది. ఫూల్ ఫ్రూఫ్ గా ఆలోచించాను. సైంటిఫిక్ గా అంచనా వేశాను. ఇవాళ నేను ఓడిపోవడానికి వీలు లేదు."
* * *
వెంకటేశ్వర్లు సాయంత్రం గిండీనించి మరలి వస్తున్నప్పుడు అతని జేబులో తొమ్మిదణాల చిల్లర డబ్బులు రెండు సిగరెట్లున్న విల్సు పాకెట్టు ఉదయం అందిన టెలిగ్రామూ మాత్రం మిగిలాయి. అతనెంత సైంటిఫిక్ గా ఆలోచించ గలిగినవాడైనా గుర్రాలకి ఆ సబబు లేవీ తెలియకపోవడమే అతని పరాజయానికి కారణం.
--౦౦౦౦--