Previous Page Next Page 
రెండోమనసు పేజి 26

 

    ఇప్పుడు, ఇవన్నీ చూశాక ఏ పతివ్రత చలపతితోనే ఉంటుంది? బుద్దన్న అడకూతురేవరూ ఉండదు! ఆనాటి సుమతి , సీతలు కూడా బహుశా ఈనాడు ఉండలేరు! మరి సావిత్రి మాత్రం ఎలా వుంటుంది? ఉండదు! అందుకని లేదు!
    మళ్ళీ నవ్వులు వినిపించనయ్ వంటింటిలోంచి.
    అంతే! వారిద్దరూ ఇక నవ్వులే! తను జీవితాంతం ఆ నవ్వులు వింటుండాల్సిందే? చలపతి శరీరంలో రక్తం వేగంగా ప్రవహిస్తున్నట్లనిపించింది.
    "ఏమిట్రా! అలా చూస్తున్నావ్?" అడిగాడు శ్రీకాంత్ చలపతి మంచం పక్కనే కుర్చీలో కూర్చుంటూ.
    "ఏమిటా మీకంత నవ్వు కలిగిస్తోన్న విషయం అని" కావాలనే అన్నాడు చలపతి.
    "కాలేజీ రోజుల్లో నువ్ చేసిన గొడవలు చెప్తున్నాను. సావిత్రికి చాలా బాగున్నాయట! పగలబడి నవ్వేస్తోంది......."
    చలపతి నమ్మలేదు. ఇద్దరూ కలసి నవ్వుకోవాల్సిన బఫూన్ పనులు తనేం చేయలేదు.
    
    
                                                             * * *

    సావిత్రి కూడా వచ్చి మంచం మీద ఓ మూలగా కూర్చుంది. వంటింటిలో సరసాలు తన ఎదురుగ్గా కూడా కాబోలు!
    "నాకు నిద్ర వస్తోంది!" దుప్పటి ముసుగు పెట్టుకొంటూ అన్నాడు చలపతి.
    "సరే! పడుకో! ఇప్పటికే పొద్దుపోయింది "లేచి తనగదిలోకి వెళ్ళిపోతూ అన్నాడు శ్రీకాంత్. లైటార్పి వేసి సావిత్రి కూడా పడుకుంది.
    ఉదయం చలపతికి మెలకువ వచ్చేసరికి బాగా తెల్లారిపోయింది. లేచి సావిత్రి కోసం చూశాడతను. ఇంట్లో ఎక్కడా కనిపించలేదు.
    శ్రీకాంత్ గదిలో ఆమె నవ్వు వినబడుతోంది. కోపం కట్టలు తెంచుకొంది. ఆవేశంగా శ్రీకాంత్ గదిలోకి నడిచాడు. అక్కడ సావిత్రి కనిపించలేదు. శ్రీకాంత్ అద్దం ముందు నిలబడి ఎలక్ట్రిక్  రేజర్ షేవింగ్ చేసుకొంటున్నాడు. అతని పక్కనే ఉన్న రేడియోలో స్త్రీ గొంతు నవ్వు అది! ఏదో నాటకం లాగుంది.
    "నిద్ర అయిపోయిందా?" అడిగాడు శ్రీకాంత్.
    "ఆ! సావిత్రీ.....?"
    "ఏమో! ఇంట్లో లేదూ?"
    "లేదు!"
    "గార్డెన్ లో ఉందేమో!"
    చలపతి సిగ్గుతో అక్కడి నుంచి బయటకు నడిచాడు. తను ఎంత వివేకవంతుడో తెలుస్తూనే ఉంది! ఆవేశం మనిషికి విచక్షణ జ్ఞానం లేకుండా చేస్తుందన్నమాట కూడా నిజమే! తన అనుమానమే తన నావిధంగా ఫూల్ ని చేస్తుంది.
    గార్డెన్ ;లో కొచ్చాడు చలపతి.సావిత్రి పూలు కోస్తోంది. తిరిగి గదిలోకి నడిచి మంచం మీద కూలబడ్డాడు. తను సావిత్రికీ, శ్రీకాంత్ కీ మధ్య నిజంగానే సంబంధం ఏర్పడిందా? లేక అంతా తన అనుమానమేనా? ఎలా తెలుసుకోగలడు తను?
    "కాఫీ తెచ్చేదా?" అడిగింది సావిత్రి లోపలి కోస్తూ.
    "ఇంకా మొహం కడగలేదు!:"
    "త్వరగా కానియండి మరి!"
    లేచి బాత్ రూమ్ వేపు నడిచాడతాను.
    తిరిగి వచ్చేసరికి సావిత్రీ కాఫీ ఫలహారం సిద్దంగా వుంచింది.
    "శ్రీకాంత్ తాగాడా?"
    "ఇప్పుడేమిటి? తెల్లారు జామునే ఇచ్చేశాను......"
    "ఎందుకు?"
    "ఇక నుంచీ అలాగే చేయమని చెప్పాను! లేకపోతే పదిగంటల కల్లా భోజనం చేయాలంటే కష్టం కదూ! ఎనిమిదింటికి కాఫీ ఫలహారాలు చేస్తే ఇక పదింటికేం ఆకలవుతుంది?"
    "ఓహో ఇదంతా మీ సంస్కరణ అన్నమాట!" నవ్వు నటిస్తూ అన్నాడు.
    "అవును మరి! మనకు ఇంత సహాయం చేస్తున్నా అతన్ని కనిపెట్టి వుండటం మన బాధ్యత కాదూ?"
    "ఓహో! రుణం తీర్చేస్తున్నావన్నమాట! బాగానే వుంది! కానీ తనకు మాలిన ధర్మం అనే సామెత గుర్తుంది కదా! అది మనసులో ఉంచుకో......."
    "నాకేం అర్ధం కాలేదు........" అక్కడే నిలబదిపోతూ అందామె.
    "ఊరికే అన్నాలే......" నవ్వేస్తూ అన్నాడు చలపతి.
    శ్రీకాంత్ కు భోజనం వడ్డించింది సావిత్రి. అతను భోజనం చేస్తున్నంత సేపూ చలపతి దగ్గరేకే రాలేదు. వాళ్ళిద్దరూ ఏవేవో కబుర్లు చెప్పుకోవడం వినిపిస్తూనే వుంది. మరికొద్ది సేపటికి తర్వాత శ్రీకాంత్ వెళ్ళిపోయాడు.
    తరువాత చలపతి దగ్గర కొచ్చిందామె.
    "అయిపోయినయ్యానీ పనులన్నీ!" కొంచెం కటువుగానే అడిగాడు చలపతి.
    "ఆ!సాయంత్రం వరకూ ఖాళీగా కూర్చోడమే ఇక!" నవ్వుతూ అంది సావిత్రి.
    "శ్రీకాంత్ కి సేవలు చేయడంలోనే గడిచిపోతున్నట్లు ది నీ సమయమంతా!" చాలా మాములుగా మాట్లాడ్డానికి ప్రయత్నిస్తూ అన్నాడు చలపతి.
    సావిత్రి ఓసారి తలెత్తి చలపతి వంక చూసింది. అతని ముఖంలో ఎలాంటి భావమూ కనిపించలేదామెకి.
    "టయింకి భోజనం వండి పెట్టడం తప్ప ఇంకేం చేస్తున్నామనీ పాపం!" నెమ్మదిగా అంది.
    "అన్నట్లు నీకీ మధ్య జాలి ఎక్కువయి పోయినట్లుందే అందరి మీదా?" నవ్వుతూ అన్నాడు చలపతి .
    "జాలా?"
    "అవును!"
ఎందుకు?"
    "అదే - రోజూ ఇంటికొచ్చే ముష్టి వాళ్ళందరికీ దానధర్మా లేక్కువ చేసేస్తున్నావ్! అవునా, కాదా?"
    "ఎక్కువేం చెయ్యటం లేదు! లేదనకుండా పంపిస్తూను అంతే!"
    కొద్దిసేపటి తర్వాత బట్టలు వేసుకోసాగాడు చలపతి.
    "ఎక్కడికి తయారువుతున్నారు."
    "మా ఆఫీసుకి"
    "ఎందుకు?"
    "నా ఉద్యోగం విషయం కనుక్కుందామని."
    "ఫోన్ చేయచ్చుగా!"
    "శ్రీకాంత్ మనకి సహాయం చేస్తున్న మాట వాస్తవమే సావిత్రీ! అలా అని చెప్పి జీవితాంతం అతని మీదే ఆదారపడతామా? ఎక్కడో చోట రెక్కలు సంపాదించుకొని ఎగిరి పోవాల్సిన బాధ్యత మన మీద లేదూ? అలాగే అతను మనమంటే అభిమానం చూపుతున్నాడుగదాని మన హద్దుల్ని దాటితే ఎలా?"
    "నేనడిగిందేమిటి, మీరు చెప్పుతుందేమిటి, రెండింటికీ ఏమయినా సంబంధం ఉందా?" తెల్లబోతూ అడిగింది సావిత్రి.
    "ఓహో ఫోన్ చేయమని అన్నావ్ కదూ! అవునూ ! నిరుద్యోగి ఎవడయినా అన్నీ ఆఫీసులకి ఫోన్ చేసినాకేదయినా ఉద్యోగం ఉందా అని అడుగుతాడా? అలా అడిగితే ఇస్తారా?" నవ్వుతూ అన్నాడతను.

 Previous Page Next Page