Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 7


                                                      అసమాప్తం
                     
                 (అధివాస్తవిక కథ)
    
    ఆమె పేరు సౌదర్యం. తెల్లవారు జామున గులాబీ
    పువ్వులు వికసిస్తున్నప్పుడు మీరామెను చూసే ఉంటారు.
    మీ రక్తనాళాల్లో సంగీతం ప్రవహిస్తున్నప్పుడు ఆమె పేరే
    మీకు జ్ఞాపకం వస్తుంది. ఆమె వయస్సు ఎప్పుడూ ఇప్పుడే.
    సముద్రతీరంలోను, సంధ్యారాగంలోను కనబడ్డట్టే. సిగరెట్ల
    కొట్లలోను సినిమా పోస్టర్లమీదనూ కూడా ఆమె కనబడు
    తుంది. ఆమె లేనిచోటు లేదు.
    
    నేనూ అంతే నేనూ సర్వాంతర్యామినే. రైలుపట్టాలకీ, రైలుబండికీ మధ్య, నాగుపాము కోరల్లో, చర్చిల్ కోపంలో, హిట్లర్ ఉన్మాదంలో, మంగలికత్తి వాదరలో (ముఖ్యంగా ఉద్భ్రాంత మహాకవుల తేనె గొంతుకలను సమీపిస్తున్నప్పుడు) వాతావరణం మార్పులలో వైద్యశాస్త్ర గ్రంథాలలో నేను లేనిచోటంటూ లేనే లేదు, నా పేరు మృత్యువు.
    ఒకేచోట ఉండి కూడా మే మెప్పుడూ కలుసుకోలేదు. ఎప్పుడూ కలుసుకొని ఉండక కూడా మేము పరస్పరం ప్రేమించుకున్నాం (ఇంతవరకు వ్రాసి "మిగిలింది నువ్వు సాగించు" అని అడుగుతూ "ఆరుద్ర" కి ఈ అసమాప్త రచన పంపించాను తరువాయి కథ నాకూ తెలియదు.)
    "ఆరుద్ర" పేరూ ఉంటూన్న ఊరూ మిలిటరీ రహస్యాలు అతని చేతిలో ఈ కథ చాలా విచిత్ర పరిణామాలు పొందగలదని ఆశిస్తున్నాను. అధివాస్తవికతలోని ఆకర్షణ అక్కడే ఉంది.
    అతివాస్తవికత అని ఇటీవలిదాకా వ్యవహరిస్తున్న పేరును అధివాస్తవికత అని మార్చవలసి వచ్చింది. ఇందుకు బలీయమైన కారణాలున్నాయి. అధివాస్తవికతకు "స్వజేళజమ్" అనేది ఇంకోపేరు ఇది, ఒక్కొక్క అక్షరం ఒక్కొక్కడు చొప్పున అయిదుగురం కలిసి చేసిన కూర్పు.
    అధివాస్తవికత గురించి ఇప్పటిమట్టుకు ఇంతకంటే ఎక్కువ చెప్పడం అనవసరం. ఈలోపున గాలిలో ఎన్ని దురభిప్రాయాలు తేలుతున్నా పత్రికలలో ఎన్ని దుమారాలు రేగుతున్నా అధివాస్తవికులు తమ రచనలు తాము సాగిస్తూనే ఉంటారు.
    
                                      --౦౦౦౦--

 Previous Page Next Page