Previous Page Next Page 
వసుంధర కధలు -9 పేజి 6

 

    "నేను రాసిన కధలు చాలా తిరిగోచ్చేశాయి. వాటిలో లోపాలు చెప్పాలి. ఎలా రాస్తే ప్రచురించుకోబడుతాయో చెప్పాలి. నన్ను రచయిత్రిగా తీర్చిదిద్దాలి."
    "కానీ నేను రచయితను కానే"
    "అదేంటండీ , ఇప్పుడేగా ఇంతటి కధను నా కళ్ళ ముందే అల్లారు!"
    "ఓహో." అన్నాను. "మీరు రచయిత్రిగా, నటిగా బాగా రాణిస్తారు. ఇప్పటి మీ ముఖం చూస్తుంటే తెలిసిన వారని నాకే అనిపించడం లేదు."
    ఆమె ముఖం అదోల్లాగై పోయింది. నా వంక చూసి "నిజంగా మీకు నేను తెలుసా?' అంది.
    "అది మీ మనస్సు నడిగి తెలుసుకోండి."
    "లేదు. దానికి మీరు తెలియదు."
    "ఎక్కడో మనిషి పోలిన మనుషులుంటే తప్ప మీరు చెప్పేది నిజం కాదు కానేరదు" అని ఉలిక్కి పడ్డాను. ఇప్పుడు నేనేమన్నాను, బహుశా ఈమె చిత్రలాగే ఉన్న మరో మనిషేమో, ఆరోజు సుందర్రావు పేట వెడుతుంటే దార్లో ఈమె నాకు ఎదురయ్యింది? సుందర్రావు పేట యింట్లో చిత్ర నాకు దర్శనమిచ్చింది. ఈమె చీర కట్టుకుని ఉంది. అప్పుడు చిత్ర బెల్ బోటమ్ లో ఉంది.
    ఆమె నావంక ఆశ్చర్యంగా చూసి , "మీరు నిజమేనా చెబుతుండాలి, లేదా నేనూహించిన దానికంటే అద్భుతమైన రచయితలైనా అయుండాలి. ఈ రెండూ కాకపోతే కాస్త వెర్రి వుండే వుండాలి" అంది.
    "నేను నిజమే చెబుతున్నాను. కానీ మీరు కూడా నిజం చెప్పండి మీకింకా అక్కలూ చెల్లెళ్ళూ ఉన్నారా? వాళ్ళలో ఎవరైనా అచ్చు మీలాగే ఉంటారా?' అనడిగాను.
    "ముందు మా ఇంటికి రండి. అన్నీ మాట్లాడుకుందాం" అందామె.
    ఆమెను అనుసరించాను. గోపాల్ పూర్లో సిటి బస్సెక్కితే ఇంచుమించు వాళ్ళింటి ముందే దిగవచ్చు. వాళ్ళ ఇల్లు చాలా సామాన్యమైనది. ఈమె తలిదండ్రుల కోక్కర్తే కూతురు. తండ్రి ఏదో ఆఫీసులో గుమస్తాగా పని చేస్తున్నాడు. ఉన్న ఊళ్ళో రెండెకరాల భూమి ఉంది. ఆమె తల్లి చాలా మంచిది. నన్ను బాగా ఆదరించింది.
    నేను చిత్ర అనుకుంటున్నాను పేరు చిత్ర కాదు రాజేశ్వరి. ఆమె పెద్ద ఎక్కువగా చదువుకోలేదు. సంప్రదాయంలో పెరిగిన పిల్ల. పెళ్ళి సంబంధాల కోసం చూస్తున్నారు. తల్లిదండ్రులు. నేను వివరాలు కనుక్కోగా, రాజేశ్వరి తనకు పుట్టిన కవలల్లో ఒకామె అనీ, చిన్నతనంలో రెండో అమ్మాయిని దొంగలేత్తుకు పోయారని రాజేశ్వరి తల్లి చెప్పింది.
    "మీరు చెప్పేది నిజమైతే , మీ రెండో అమ్మాయి ఈ ఊళ్ళో నే ఉంది. ఆమె పేరు చిత్ర. ఆమె నా స్నేహితురాలు కూడా" అన్నాను.
    "నేను నమ్మలేకుండా ఉన్నాను బాబు" అంది రాజేశ్వరి తల్లి.
    "ఒక పర్యాయం మీకు నేను చిత్రను చూపిస్తాను" అన్నాను.
    "మళ్ళీ లేనిపోని ఆశలు చిగురుస్తున్నావు బాబూ నువ్వు!" అందామె.
    'ఆశ చిగురించడం గాదు, ఇది నిజం!' అన్నాను.
    వాళ్ళింట్లో కాఫీ తీసుకుని బయటకు వచ్చాను.

                                      7

    సిటీ బస్సు దిగి, నా గదికి వెళ్ళాను. గది తలుపులు తెరిచే సరికి, "యస్ కమిన్!" అన్న మాటలు వినపడ్డాయి.
    ఆ స్వరం నాకు పరిచితమైనదే. తలుపులు వేసి ముందుకు నడిచి, "నీకోసం ఊరంతా గాలిస్తుంటే నువ్విక్కడున్నావా చిత్రా !" అనడిగాను.
    "నాకోసం గాలించడ మెందుకు? నన్ను కలుసుకోవడం అవసరమనించినపుడు నేనే నీముందు ప్రత్యక్ష మవుతాను కదా!"
    "అవుననుకో, కానీ మరీ ఇలా దేవతలా ప్రవర్తించడం బాగోలేదు. కాస్త నీ అడ్రస్ ఇచ్చి పుణ్యం కట్టుకోరాదూ" అన్నాను చిరాగ్గా.
    "నీకా? అడ్రసివ్వడమా? ఒక్క క్షణంలో ఊరంతా టాంటాం అయిపోదూ?" అంది చిత్ర నిరసనగా.
    "అదేమిటి?' అన్నానాశ్చర్యంగా.
    "తెలియనట్లు మాట్లాడకు. బొత్తిగా రహస్యమున్నది తెలీదు నీకు. లేకపోతే కలిసిన వాళ్ళందరి తోనూ అన్ని సంగతులు చెబుతావా?' అంది చిత్ర.
    "ఎవరితో చెప్పాను. ఏం చెప్పాను?' అడిగాను.
    "సుందర్రావు పేట వెళ్ళావు. అక్కడ కనిపించిన ముసలాయనకు నా పేరు చెప్పావ్. నన్నా ఇంట్లో ఫలానా రోజున కలుసుకున్నాననీ చెప్పావు. అవునా?"
    'అవును. కానీ కలుసుకుని ఏం మాట్లాడుకున్నామో చెప్పలేదు. కలుసుకున్నాక ఏం జరిగిందో చెప్పలేదు."
    "ఆ ముసలాయన కొడుకు పోలీసాఫీసరు. ఆ మాత్రం క్లూ ఉంటె నువ్వు చెప్పకపోయినా మిగతా విషయాలు కనుక్కోగలుగుతాడు."
    'అటువంటప్పుడు నన్ను నువ్వు బాగా హెచ్చరించాల్సింది. అయినా అది పోలీసాఫీసరిల్లని నాకేం తెలుసు."
    "మరెన్నడూ ఆ ఇంటికి వెళ్ళవద్దని చెప్పాను. నా హెచ్చరిక పాటించావా?"
    నా బుర్రలో ఏదో మెరిసినట్లయింది. 'అవునూ, ఒక్క సందేహం. నేను పోలీసాఫీసరింటికి వెళ్ళడం నీకు తెలిసింది. అక్కడేం మాట్లాడెనో నీకు తెలిసింది. నేను వెతికేది నీకోసమే అసలు, అటువంటప్పుడు నన్నాపడానికెందుకు ప్రయాత్నించలేదు?' అన్నాను.
    చిత్ర సమాధాన మివ్వలేదు. "ఆ తర్వాత రాజేశ్వరిని కలుసుకుని ఆమె దగ్గరా అలాగే మాట్లాడేవు!" అంది మళ్ళీ నిష్టూరంగా.
    "ఇవన్నీ నీకెలా తెలుస్తున్నాయి చిత్రా!"
    చిత్ర నవ్వింది. 'అది నీ కర్ధం కాదు. నిన్నరాత్రి నీ గదికి పోలీసు లోచ్చారు. గది గాలించారు. వాళ్ళకేమీ దొరకలేదు. అయితే ఇక్కడుండవలసిన వజ్రాలేమయ్యాయని నీ కంగారు. నీ బంగారం పోయిందేమోనని బెంగ. అయినా మళ్ళీ మొద్దు నిద్ర పోయావు. నువ్వు నిద్రపోతున్న సమయంలో గుండూ రావు వొచ్చి తను తీసుకుపోయిన వజ్రాలనూ, బంగారాన్నీ తిరిగి సూట్ కేసు లలో పెట్టేశాడు. ఉదయం లేచి నువ్వు సూట్ కేస్ తెరిచి వుంటే నాకోసం వెతుక్కుంటూ పోలీసాఫీసర్ ఇంటికెళ్ళాల్సి న అవసరం తప్పేది! ఆతర్వాత రాజేశ్వరి ని కలుసుకోవాల్సిన అవసరమూ తప్పేది!"
    "రాజేశ్వరి నీకు తెలుసా?' అన్నానాశ్చర్యంగా.
    'అందరూ నాకు తెలుసు. ఇక మీదట ఎన్నడూ రాజేశ్వరిని చూసి నేననుకుని పోరపడకు. నీకొక చిన్న ఆనవాలు చెబుతున్నాను. నా కుడి చెవి క్రిందుగా పరీక్షగా చూస్తె ఒక పుట్టుమచ్చ కనబడుతుంది. రాజేశ్వరి కా మచ్చలేదు. రెండవది నేను కట్టుకున్న బట్టల కనుగుణం గా బొట్టు రంగు మారుస్తుంటాను. రాజేశ్వరి ఎప్పుడూ ఎర్ర బొట్టే పెడుతుంటుంది. ఈ రెండు విషయాలూ తప్పక గుర్తుంచుకోవాలి" అంది చిత్ర.
    సరేనని వెళ్ళి సూట్ కేసులు తెరిచి చూశాను. వజ్రాలు, బంగారం అలాగే వున్నాయి. మళ్ళీ సూట్ కేసులు మూసేశాను. అందులో తలుపు చప్పుడయింది.
    "ఎవరై వుంటారు?" అంది చిత్ర.
    "తెలియదు"అంటూ వెళ్ళి తలుపులు తీశాను.
    రాత్రి వచ్చినవాళ్ళే. పోలీసులు! ఈసారి మాట మాత్రం అనకుండా వాళ్ళు సూట్ కేసుల దగ్గరకు పరుగెత్తారు. చిత్ర వాళ్ళ వంక తీక్షణంగా చూసి "ఆగండి" అంది.
    ఆగారు పోలీసులు.
    "ఏమిటి మీరు వెతక దల్చుకున్నది?" అంది చిత్ర.
    "ఈ గదిలో కోట్లు విలువ చేసే వజ్రాలున్నాయి అని వార్త వచ్చింది."
    "నిన్న రాత్రి కూడా ఈ వార్తా మీకు వచ్చింది. అప్పుడు మీకేం కనబడింది?"
    "ఖాళీ సూట్ కేసు."
    "తెరవండి, ఇప్పుడూ అదే కనపడుతుంది" అంది చిత్ర, ఆమె వాటి వంక చూసే చూపులు చాలా చిత్రంగా వున్నాయి. పోలీసులు పెట్టె తెరిచి మళ్ళా మూసేశారు. గదంతా సోదా చేసి సారీ చెప్పి వెళ్ళిపోయారు.
    నా ఆశ్చర్యాని కంతులేదు. తలుపులు వేసి ఒక్క ఉదుటున వెళ్ళి సూట్ కేస్ తెరిచి చూశాను. మిలమిల మెరిసే ధగధగ లాడే వజ్రాలు!
    "ఏమిటి చిత్రా?' అన్నా నాశ్చర్యంగా.
    "హిప్నాటిజం" అంది చిత్ర నవ్వుతూ.
    "బాప్ రే. నమ్మడం చాలా కష్టం!" అన్నాను.
    "కళ్ళారా చూశావు" అంటూ చిత్ర లేచింది. "ఇక పొరపాటున కూడా నీ గదికి పోలీసులు రారు. వస్తాను మరి!"
    ఆమె వెళ్ళిపోతానంటే భయం వేసింది. కానీ ఆమె ఉంటుందన్నా భయంగానే ఉంది. చిత్ర చర్యలు చూస్తుంటే ఆమె మనిషేనా అని ఒకోసారి భయం కలుగుతోంది నాకు.

                                    8
    నా దగ్గరున్న కొంత బంగారాన్ని క్యాషు చేశాను. సిటీలో ఒక ఫ్యాన్సీ దుకాణం ఓపెన్ చేశాను. ఈ రెండు పనులూ చేయడానికి వారం రోజుల కంటే పట్టలేదు. అయితే నాలుగు రోజులని చిత్ర చెప్పింది కానీ పదిహేను రోజులైనా ఆ వజ్రాలు సూట్ కేస్ కి నా దగ్గర్నుంచి విముక్తి లభించలేదు.
    చిత్రను అడిగితె సమయం రావాలని చెప్పింది.
    మరోవారం గడిచింది. ఇంకా సమయం రాలేదంది చిత్ర.
    దాని గురించి ఆలోచించడాని క్కూడా నాకాట్టే వ్యవధి కనిపించడం లేదు. ఇప్పుడు నాకు కాలక్షేపం బాగానేఉంది. ఫ్యాన్సీ దుకాణం తో గంటలు క్షణాల్లా గడిచి పోతున్నాయి.
    ఒకరోజు సాయంత్రం అయిదు గంటల ప్రాంతంలో నా షాపుకు రాజేశ్వరి వచ్చింది. ఆమె పెట్టుకున్న ఎర్రటి బొట్టూ, కుడి చెవి కింద లేని మచ్చా ఆమెను నాకు పట్టించాయి. "హలో రాజేశ్వరి గారూ!" అంటూ పలకరించాను.
    ఆనాడు వాళ్ళింటి కెళ్ళేక రాజేశ్వరి ని చూడడం మళ్ళీ ఇదే!
    "బాగానే గుర్తు పట్టారే, ఈ షాపు మీదా?' అందాశ్చర్యంగా రాజేశ్వరి.
    "నాదే" అన్నాను సగర్వంగా.
    "ఎన్నాళ్ళయింది ప్రారంభించి?' అనడిగింది.
    "చెప్పాను. నవ్వి "వ్యాపారంలో పడ్డాక చిత్ర వ్యాపకం తగ్గిందనుకుంటాను. లేకపోతే నన్ను మీరు చిత్రా అని పిలవ్వలసింది" అంది.
    "అదెం కాదు , చిత్రకూ, మీకూ ముఖ్యమైన రెండు తేడాలున్నాయి. ఆ విషయం నాకు చిత్రే చెప్పింది. అందువల్లే మిమ్మల్ని సులువుగా గుర్తించగలిగాను."
    "బాగుందండీ, ఈ చిత్రకు నేను తెలుసునన్న మాట"
    "మీరేమిటి? ఈ ప్రపంచంలో ఆమెకు తెలియని వాళ్ళు లేరు."
    "బ్రతికించారు. అయితే ఆమె మనిషి కాదన్న మాట. ఊరి అమ్మవారండీ ఆవిడ" అంది రాజేశ్వరి వెటకారంగా.

 Previous Page Next Page