Previous Page Next Page 
వసుంధర కధలు-8 పేజి 6

 

    "నేను కృతజ్ఞత లేని వాడినే అనుకో. కానీ ఆలోచన ఉన్నవాడిని. అందుకే నా చెల్లెలు తన దగ్గరుందని తెలిసినా పులిరాజు మీద ఆవేశం చెందలేదు. ఆవేశం చెంది ఏం ప్రయోజనం ? పులిరాజు చేతిలో చావాలి. లేదా వాడిని చంపాలి. వాడిని చంపితే పోలీసుల చేతిలో చావాలి. ఇదంతా ఆలోచించే నేను పులిరాజు జోలికి వెళ్ళకూడదనుకున్నాను. నా చెల్లెలి జీవితం రట్టు కాకూడదని నేనావేశాన్ని కూడా అణచుకుంటే -- ఇప్పుడు మళ్ళీ అది రట్టు చేయాలంటే -- ప్రభాకర్ వల్ల నాకు జరిగిన ఉపకార మేమిటి?" అన్నాడు విశ్వం.
    "అంటే ఎమిటంటావ్?" అంది పద్మ.
    "సుజాత పులిరాజు దగ్గర కాసేవుండి వచ్చిందనుకో అదేవరికీ తెలియనంత కాలం ఏ బాధ లేదు. మన చుట్టూ ఉన్నవారిలో ఎంతమంది తప్పు చేశారో మనకేం తెలుసు? సుజాతను కాపాడ్డానికి వెళ్ళిన ప్రభాకర్ పులిరాజును చంపడం ద్వారా ఏం సాధించాడు?" అన్నాడు విశ్వం.
    "ఛీ- నీతో మాట్లాడి ప్రయోజనం లేదు. నా ప్రయత్నాలు నేను చేసుకుంటాను ...." అంది పద్మ.
    "పద్మా! ఈరోజు సుజాతకు పెళ్ళి చూపులు. నీవింట్లో ఉండి అమ్మకు సహకరించాలి. ప్రభాకర్ గురించి మరిచిపో" అన్నాడు విశ్వం.
    'ఛీ -- " అంది పద్మ మళ్ళీ.
    ఆమె వెంటనే తనే లాయరు సీతారాం యింటికి వెళ్ళింది.
    "ప్రభాకర్ గురించి నీకెందుకాసక్తి ?" అన్నాడాయన.
    "పులిరాజు దుర్మార్గుడు. ప్రభాకర్ వాణ్ణి చంపాడు."
    "పులిరాజు దుర్మర్గుడే కావచ్చు, కానీ వాడికి కమలేశ్వర్ అండ వుంది. కమలేశ్వర్ చేతిలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు. పులిరాజు పోవడంతో ఆయనకు కుడి భుజం పోయినట్లయింది. మరో మనిషి నాయన చేరదీయాలి. కానీ చూసి చూసి సమర్దుడేవరూ అయన దగ్గరకు రాడు. పులిరాజును చంపిన ప్రభాకర్ జైలుపాలై ఉరిశిక్షకు గురికావాలి. అప్పుడే కమలేశ్వర్ విలువ పెరుగుతుంది. అందుకని అయన ప్రభాకర్ అంతం చూడాలనుకుంటున్నాడు...." అన్నాడు లాయరు సీతారాం.
    "మనకు కమలేశ్వర్ ప్రసక్తి ఎందుకు? ప్రభాకర్ కేసు టేకప్ చేస్తే - మీకు ఫీజు విషయంలో నాదీ హామీ ....' అంది పద్మ.
    "ప్రభాకర్ నీ కేమవుతాడు ?"
    "ఏమీ కాడు....' అంది పద్మ. "అతడు నన్ను రెండు సార్లు రౌడీల బారి నుండి కాపాడాడు..."
    'చూడమ్మా -- అలాంటి సెంటిమెంట్లు పెట్టుకోకు. రాజకీయాలు నీకు తెలియవు. ప్రభాకర్నీ రక్షించడం ఎవరి వల్లా కాదు. ఎందుకంటె కమలేశ్వర్ చెప్పగా నేను ప్రభాకర్ కి వ్యతిరేకంగా కేసు టేకప్ చేస్తున్నాను."
    "మీరా?" ప్రభాకర్ కి వ్యతిరేకంగా కేసు బలంగా ఉందిగా- ఇంకా మీవంటి లాయరు కూడా ఎందుకు?"
    సీతారాం నవ్వి -- 'చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నది కమలేశ్వర్ సిద్దాంతం. ఇది ప్రభాకర్ లాంటి వారికి హెచ్చరిక కావాలని అయన ఉద్దేశం. ఈ కేసును నేను టేకప్ చేస్తున్నానంటే పులిరాజుకు వ్యతిరేకంగా మరే లాయరు కేసు చేపట్ట కూడదని పరోక్షమైన హెచ్చరిక కూడా!" అన్నాడు.
    "మనం సభ్యసమాజంలో ఉంటున్నామా?" అంది పద్మ.
    "మన సమాజంలో అధిక సంఖ్యాకులు సామాన్యులు. సామాన్యుల కాలోచానశక్తి ఉండదు. ఆలోచించడానికి ప్రయత్నిస్తే సామాన్యుడి జీవితం దుర్భరమవుతుంది. నువ్వు ఆలోచించకు. దేశంలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. వాటిలో ఇదీ ఒకటి అనుకో- " అన్నాడు లాయరు సీతారాం.
    "పోనీ -- ఈకేసు టేకప్ చేయగల మరో లాయార్నీ మీరు నాకు సూచించగలరా?" అంది పద్మ.
    సీతారాం క్షణం అలోచించి "ఈ ఊళ్ళో నాకెదురు నిలవగలవారు లేరనే చెప్పవచ్చు. కానీ నా కెదురు నిలవాలని ప్రయత్నించే అయన ప్రసాదరావు. నువ్వాయన దగ్గరకు వెడితే కేసు తీసుకుంటాడు. కానీ ఫీజు దండగ" అన్నాడు.
    "అయన ఎడ్రసు చెప్పండి." అంది పద్మ వెంటనే.
    "ఎందుకు నీ కింత పట్టుదల?"
    "ప్రభాకర్ మాహమనిషి. అతడి ప్రాణాలు రక్షించడానికి ఏ ప్రయత్నమూ జరక్కపోతే అది సమాజానికే అపచారం. నా తృప్తి కోసం నేను చేతనైన పప్రయత్నం చేస్తాను...." అంది పద్మ.

                                     5
    సుజాతకు పెళ్ళి చూపులయ్యాయి. పెళ్ళి కూడా నిశ్చయమయింది.
    పెళ్ళి కింక మూడు వారాల టైముందనగా శుభలేఖలు కూడా అచ్చయ్యాయి.
    సుజాత స్నేహితురాండ్రకు శుభలేఖలు పంచి పెట్టడానికి తోడుగా పద్మను కూడా రమ్మంది.
    "రేపైతే వస్తాను...." అంది పద్మ.
    "ఈరోజేందుకు రావు?' అంది సుజాత.
    "ప్రభాకర్ కి కోర్టులో ఈరోజే జడ్జిమెంట్ !" అంది పద్మ.
    సుజాత మాట్లాడలేదు.
    "కోర్టుకి వెడదాం -- నువ్వూ రాకూడదూ !" అంది పద్మ.
    "నేను రాను ....' అంది సుజాత.
    "ఎందుకని ?"
    "నేను హంతకిని.... అతడి చావుకి నేనే కారణం ."
    "ఈ కబుర్లు కట్టి పెట్టు.. ఒక్కసారి కోర్టుకి రా --" అంది పద్మ.
    "వచ్చి...."
    "జడ్జిమెంట్ విను...."
    "విని...."
    పద్మ చిరాగ్గా ----"మీ అన్నా నువ్వూ ఒకేరకం --- ఫక్తు స్వార్ధపరురాలివి -" అంది.
    "సామాన్యుడి స్వార్ధం -- ఎవర్నీ బాధించదు. సామాన్యుడు తిరగబడితే కోర్టు బోనేక్కాలి!" అంది సుజాత.
    "మీ అన్నాచెల్లెళ్ళ నుండి నేను చాలా నేర్చుకోవాలి. గానీ ఒక్కమాట -- నువ్వు గనుక ఈరోజు కోర్టుకు రాకపోతే -- జీవితంలో నీతో మాట్లాడను సరిగదా -- నీ చరిత్ర పత్రికల్లో టాంటాం చేయిస్తాను ...." అంది పద్మ.
    ఏమనుకుందో సుజాత కోర్టుకు వెళ్ళడానికి ఒప్పుకుంది.
    కోర్టులో....
    లాయర్ సీతారాం గంభీరంగా - "పులిరాజు గూండాగా పేరుబడి ఉండవచ్చు. కానీ అతడు నగరంలో అరాచకం సూచించిన సాక్ష్యం లేదు. అతడికి ప్రభాకర్ కి పాత కక్షలేవో ఉన్నాయి. అవీ విధంగా తీర్చుకున్నాడు ప్రభాకర్. కానీ ప్రభాకర్ ఈ నిజం ఒప్పుకోలేదు. ఓ అమ్మాయిని రక్షించడానికి తను ప్రాణాలను తెగించి పులిరాజుతో తగువాడేనంటున్నాడు. అది నిజమే అయితే ప్రభాకర్ ని మహానీయుడని అందరం కొనియాడతాం. ప్రమాదవశాత్తు పులిరాజును చంపడం జరిగిందని నమ్మి అతణ్ణి నిర్దోషిగా తీర్మానించేవాళ్ళం.
    కానీ అ అమ్మాయెవరో ప్రభాకర్ చెప్పడం లేదు. ఆమె బ్రతుకు నడి బజారు పాలవడం తన కిష్టం లేదంటున్నాడు. ఈరోజుల్లో ఒక యువతి గుట్టు రట్టు కాకూడదని తన ప్రాణాలు త్యాగం చేసేటంత త్యాగశీలు లుంటారని నమ్మమని అతడూ, అతడి లాయరు ప్రసాదరావు తనకు చెబుతున్నారు. కానీ అసలు నిజమేమిటంటే ప్రభాకర్ ఏ త్యాగమూ చేయడం లడు. అతడు పులిరాజును పాత కక్షతో చంపాడు. పులిరాజుకు గూండా అన్న పేరుంది కదా అని కొత్త కధ అల్లాడు. అతడి కధలోని యువతి వాస్తవంలో లేదు. అంతా అతడి కల్పన. కాబట్టి...."
    ఆయనింకా ఏదో అనబోతుండగా సుజాత జనం లోంచి లేచి ముందుకెళ్ళి -- "ప్రభాకర్ మాటలు కల్పన కాదు. నేనే అందుకు సాక్షిని. నాపేరు సుజాత . అంది.
    కోర్టులో ఒక్కసారి కలకలం రేగింది.
    సుజాత బోనేక్కింది . తన కధ చెప్పింది.
    లాయరు సీతారాం ఆగ్రహాని కంతులేదు. అతని జీవితంలో ఇలాంటి పరాభవ మెరుగడు.
    'ఇంతకాలం ఏం చేస్తున్నావు?" అనడిగాడాయన కోపంగా.
    సుజాత అదోలా నవ్వి -- "ఓ క్షణం క్రితం వరకు నేను ప్రభకర్ గురించి పట్టించుకోలేదు. కానీ అతను కేవలం నా పేరు నలుగురులోకి రాకూడదన్న భావంతో తన జీవితాన్నకారణంగా త్యాగంచేస్తుంటే -- పంచిపెట్టాల్సిన శుభలేఖల్ని తగులబెట్టల్సోస్తుందని తెలిసీ నేను ముందుకు వచ్చాను. పులిరాజును చంపినవాడు దోషిగా నిర్ణయించబడకూడదు. పులిరాజును చంపినవాడికి శిక్ష పడకూడదు. సామాన్యులకు పీడ విరగడ చేసిన వాడికి సామాన్యుడి సాక్ష్యం కరువు కాకూడదు. ఆగిపోబోయే నా పెళ్ళినీ కోర్టు నిలబెట్టలేదు. నిలబెట్టాలనుకున్న ప్రభాకర్ కి మాత్రం ఉరిశిక్ష వేయగలదు.
    పులిరాజు తుచ్చుడు. నీచుడు. అదుపులేని మదగజం వాడి పీడ విరగడైనందుకు మనమంతా సంతోషించాం. ఈ విషయంలో ప్రభాకర్ చెప్పిందంతా నిజం. ఈ నిజం చెప్పినందుకు నేను జీవితాంతం పెళ్ళి కాకున్నా భయపడను. నా ధైర్యం మరిందరు ప్రభాకర్ లను సాహసికుల్ని చేసి మరెందరో అబలలను పెళ్ళికి భయపడకుండా చేయాలి."
    కేసు స్వరూపమే మారిపోయింది.
    పద్మ సుజాతను వీపు తట్టి మెచ్చుకుని -- "నీలో మానవత్వమున్నది" అంది.
    విశ్వం, జానకి కూడా సుజాతను మెచ్చుకున్నారు.
    సుజాత పెళ్ళి ఆగిపోయింది.
    ప్రభాకర్ కేసు నుంచి తప్పించుకున్నాడు.
    ఉళ్ళో పులిరాజు లిప్పుడతడంటే భయపడుతున్నారు.
    ఆడపిల్లలే సందుల్లోంచైనా భయం లేకుండా తిరగ్గల్గుతున్నారు.
    రవంత త్యాగం - ఒక్కమనిషి చేయగలిగితే సమాజంలో ఎంత మార్పు ?

                                     --------- 

 Previous Page Next Page