Previous Page Next Page 
జీవాత్మ పేజి 6


    నిశ్శబ్దంగా ప్రేతాత్మలు అక్కడికి చేరుకుంటున్నట్టు చెట్లలో చిన్న కదలిక.
    
    అరవబోయిన తీతువు ఏదో అజ్ఞాతహస్తం నోరు నొక్కేసినట్లు మిన్నకుండి పోయింది. అతను తిరిగి శ్మశానపు నడిబొడ్డుకి నడిచి సంచీనీ, కోడినీ తీసుకొని మట్టినేలపై ఓ ముగ్గు మండలాన్ని గీశాడు. ఆ మండలంలో ఎనిమిది వృత్తాలున్నాయి.
    
    అతడు దానిలో కూర్చుని తనకెదురుగా మరో ముగ్గు వేశాడు. తోలు సంచిలోంచి అక్ష కంకాళము, స్త్రీ ముంజేతి ఎముక, కుంకుమ, నిమ్మకాయలు, గువ్వ సాంబ్రాణీ, పిల్లి, ఎలుక, పులి మొదలైన జంతువుల మలం బయటికి తీసి తనకెదురుగా ఉన్న ముగ్గు మధ్యలో పెట్టాడు.
    
    సంచీలోంచి చిన్న సీసా తీసి అందులోని నీటితో నోటిని శుభ్రంగా కడుక్కున్నాడు. క్రతువు చేసే ముందు సాధకుడి నోట్లో ఏ చిన్న పదార్ధము వుండకూడదు! అలా వుంటే మంత్రం పఠించేటప్పుడు స్వచ్చత లోపించి పట్టు వుండదు.
    
    ఒకసారి గురువుని స్మరించుకుని మనసుని నిశ్చలం చేసుకున్నాడు. దాంతో బుద్ది పూర్తిగా ఆత్మలో లగ్నం చేయబడుతుంది. దీన్నే 'లయ యోగం' అంటారు. ఇది 'సుషమ్ని'లో కుండలినిని జాగృతం చేయడంగా భావిస్తారు. తంత్రలో ఇదొక భాగం యోగపనిషత్ లో కూడ బుద్దిని ఆత్మలో లగ్నం చేయడం చెప్పబడింది. దీనిని యోగలో నాలుగు భాగాలుగా వర్గీకరించారు.
    
    అవి హఠయోగం, లయయోగం, మంత్రయోగం, రాజయోగం.
    
    క్షుద్రకర్మలు చేసేటప్పుడు సాధకుడి మనస్సు ఏమాత్రం చెదిరినా, ఎటువంటి అవకతవకలు జరిగినా, గణాధి దేవతలు సాధకున్ని ఆవహించి అతడిని పిచ్చివాడిని చేయడంకానీ, అతని రక్తాన్ని పీల్చి వేయడం కానీ చేస్తాయి. ఈ మరణాలు అతి బాధాకరమైనవి, వర్ణించలేనివి.
    
    అందుకే తాంత్రిక గురువులు శిష్యులకి చెప్పే మొట్టమొదటి పాఠం ఏకాగ్రతతో బుద్దిని ఆత్మలో లగ్నం చేసి చేయవలసిన కార్యం మీదే దృష్టిని నిలిపేట్టు మనో సంకల్ప బలం పెరిగేలా చేయటం.
    
    మనస్సు నిశ్చలమైనాక ఓ చిన్న చెక్కబొమ్మని తీశాడతను. ఆరంగుళాళ పొడవు వుందది. దాని నడుముకి తల వెంట్రుకలు చుట్టి వున్నాయి. ఆ బొమ్మకి ముందుగా ఏవో మంత్రాలు పఠిస్తూ కుంకుమ పూశాడతను. తరువాత జంతువుల మలం ఆ బొమ్మ మర్మావయం దగ్గర పులిమాడు.
    
    మనిషి శరీరంలో వుండే వాయువులను, ఉపవాయువులను తాంత్రికులు స్పష్టంగా చూడగలుగుతారు! గుండెలో వున్న ప్రాణవాయువు ఆకుపచ్చ రంగులోనూ, కడుపులో ఉండే ఆపాన వాయువు ఎరుపు రంగులోనూ, బొడ్డు దగ్గరుండే సమానవాయువు తెలుపు రంగులోనూ, చివరిదైన వ్యానవాయు దీపంలాగా అదే రంగులో వుంటుంది. ఇది శరీరమంతా వ్యాపించి వుంటుంది.
    
    మనిషిని కేవలం బాధ పెట్టదల్చుకుంటే ఉపవాయువుల మీద ప్రయోగం చేస్తే చాలు. ఈ ప్రయోగం వల్ల ప్రాణం పోదు- కొన్ని శారీరక రుగ్మతలు మాత్రమే కలుగుతాయి. ఆగకుండా వెక్కిళ్ళను కలిగించేది నాగవాయువు, దాహాన్ని కలిగించేది కృకుర, ఎడతెరిపి లేకుండా ఆవలింతలు కలుగజేసేది దేవదత్త, శరీరాన్ని రోగాలతో శిధిలం చేసేది ధనుంజయ, గుడ్డివాణ్ణి చేసేది కూద్య కానీ అతడు వాటికంటే పెద్ద ప్రయోగమే చేయ దలచాడిప్పుడు.
    
    సాధారణంగా తాంత్రికులు తమ శత్రువులపై ప్రయోగం చేయాలంటే స్త్రీలకైతే నాభిస్థానంలో వుండే 'శంఖీనీ' నాడిమీద, పురుషులకైతే నడుము దగ్గరుండే 'లకుహ' నాడిమీద చేస్తారు.
    
    అతడు స్త్రీ ముంజేతి ఎముకతో ఆ బొమ్మని తాకుతూ- "మహాశబ్దం ప్రకురుతె భీతిదం ద్యాతత్పరః నచిభేతి యధా మంత్రీ తదాదేవీ ప్రసీదతి బృహత్కక్షీ, ఊర్ధ్వకేశి, త్రిలోచన, ఖేచరి, చంచలాక్షీ, కాత్లూషా, శత్రునాశినీ" అంటూ మంత్రాలు చదివి ఆ బొమ్మ నడుము చుట్టూ శ్రద్దగా నూట ఎనిమిది తుమ్మముళ్ళు గుచ్చాడు. అంటే అతడి శత్రువు 'లకుహ' నాడిమీద ప్రయోగం జరిగిందన్న మాట.
    
    ఇంతలో ఆకాశం భయంకరంగా ఉరిమింది. అతడు పైకెత్తి చూశాడు. నల్లటి ఆకాశం తారు పులుముకున్నట్లుంది. అతడు తనతో తీసుకొచ్చిన కోడిని చేతిలోకి తీసుకున్నాడు. సంచీలోంచి చాకు తీసి నిర్దాక్షిణ్యంగా దాని మెడ నరికేశాడు.
    
    అంతే! బుసబుసా నెత్తురు చిమ్మింది. దాని శ్వాస ఆడక టపటపా రెక్కలు, కాళ్ళు కొట్టుకుందది.
    
    కీచురాళ్ళ రొద, కోడి ఆఖరిక్షణంలో ప్రాణవాయువు కోసం చేసిన పోరాటపు ధ్వని ఆ పరిసరాల్ని కంపింప చేశాయి. అతడు నిర్వికారంగా కోడి మొండెం నుంచి కారుతున్న రక్తాన్ని బొమ్మమీద వెదజల్లి దాని తలని ముగ్గు మధ్యలో నివేదన గావించాడు.
    
    తన సాధన ద్వారా శత్రువుని త్వరగా బాధించాలనుకున్న సాధకులు తమ మంత్రశక్తులతోపాటు ఆ మంత్రాలతోపాటు ఆ మంత్రాలలో మరింత శక్తి పుట్టించడానికి కొన్ని జీవులను ఛేదించడం ద్వారా మంత్రప్రేరణతో, ప్రకృతిలోని ఆ ప్రాణశక్తిని తమ మంత్రానికి ఆవహింపచేసి దాని ద్వారా అధికశక్తిని సంపాదిస్తారు.
    
    మామూలుగా చేసే పూజలలో కొబ్బరికాయలో అటువంటి శక్తి వుంటుంది. మంతరాన్ని ఉచ్చరిస్తూ, దేవతను స్మరిస్తూ దానిని పగులగొడితె ఆ కొబ్బరికాయలోని జీవశక్తి మంత్రానికి సంక్రమించి దాని ద్వారా సాధకునకు శీఘ్ర ఫలితాన్నిస్తుంది. నారికేళకం కంటే గుమ్మడికాయ ఎక్కువ జీవశక్తి కలది.
    
    ఇంక క్షుద్రకర్మలకయితే కోడి, పిల్లి, మేక, గొర్రె, దున్న, ఒంటె, మనిషి శ్రేష్టమని తంత్రశాస్త్రం ఘోషిస్తోంది!
    
    ఈ విధంగా సాధన చేస్తే కాళి, తార, చిన్నమస్త, భైరవి, కర్ణ పిశాచి, బేతాళుడు, భైరవుడు మొదలైన వారి అనుగ్రహం సిద్దిస్తుంది! అందుకే అతడు కోడిని తన క్రతువుకి వినియోగించుకున్నాడు.
    
    నివేదన తర్వాత ఎండుపుల్లలు తీసి అంటించి నిప్పు రాజేశాడు. అందులో కొన్ని బొగ్గులు వేశాడు. అవి రాజుకున్నాక అందులో సాంబ్రాణి వేసి ఆ ధూపం బొమ్మకి పట్టించి "ఓం ఐ క్లీం సాం- శం క్లీం ఐ శరవణ చల్" అంటూ మంత్రం పఠించి దాన్ని గొయ్యి తీసి పాతిపెట్టాడు.
    
    కాలిన చితినుంచి బూడిద తీసుకొచ్చి బొమ్మని పాతిన ప్రదేశంలో పుర్రె ఆకారాన్ని గీశాడు.
    
    ఎర్రని బొగ్గుల లేలేత కాంతిలో సైతం అగ్నిగోళాల్లా మండుతూ తన శత్రువు మీద పగని తెలియజేస్తున్నాయి అతని కళ్ళు. క్రతువు పూర్తవడంతో శిరస్సుని మూడుసార్లు కదిలించాడు.
    
    క్షుద్రశక్తులు దక్షిణం వైపు నుంచి మంత్రగాళ్ళని గమనిస్తాయి. అతడు తన సరంజామాని సర్దుకుని అక్కడినుంచి నిష్క్రమించడానికి ఉద్యుక్తుడయ్యాడు. అప్పుడు వినిపించింది దక్షిణం నుంచి గాలిహోరు- అంతవరకూ బంధింపబడి ఒక్కసారిగా విముక్తిగావించినట్లు మనిషిని విసిరేసేలా వీయసాగింది.

 Previous Page Next Page