Previous Page Next Page 
ఔనంటే కాదంటా పేజి 5

అనుకోకుండా ఒక మధ్యాహ్నసమయంలో కమల్ మా ఇంటి కొచ్చాడు.
అప్పుడే నేను నేలమీద, ముందుకు వంగి కూర్చుని బోటనీ రికార్డులో బొమ్మలేసుకుంటున్నాను.
చిన్నక్క రేడియోలో చిత్రసీమ వింటూ ముగ్గులపుస్తకం చూస్తోంది.
పెద్దక్క మాత్రం నాన్నగారి గదిలో బూజు దులుపుతోంది.
అతను మొహామతంగా తలుపుదగ్గర ఆగి "శక్తీ..." అని నన్ను పిలిచాడు. అతనికి నాపేరుమాత్రమే తెలుసుంటుంది. ఎందుకంటే నాకోసం సాయంత్రం అయ్యేసరికి ఓ డజనుమంది అమ్మాయిలు "శక్తీ! ఆడుకోడానికి రా..." అని పిలుస్తూ అరుగుమీద చేరేవారు.
నేను అతణ్ణి చూసి "ఏమిటీ?" అన్నాను.
చిన్నక్క గబుక్కున లేచి లోపలికి పరిగెత్తింది. ఈ వార్త పెద్దక్కకి చెప్పడాని కేమో!
అతను తడబడుతూ "బాబీ... తాళం యిచ్చిందా మా మమ్మీ?" అన్నాడు.
"ఏమో? మా అక్కని అడుగు" అన్నాను.
ఇంతలో పెద్దక్క లోపల్నుంచి పరుగులాంటి నడకతో వచ్చింది. దాని తలనిండా బూజూ, మొహంనిండా చెమటా.... కళ్ళల్లోమాత్రం చెప్పలేనంత మెరుపు!
"తాళం చెవి కోసం" అన్నాడు కమల్.
మా పెద్దక్క చిన్నక్కచెవిలో ఏదో చెప్పి హడావుడిగా లోపలికి వెళ్ళింది.
చిన్నక్క నాన్నగారి ఫేముకుర్చీ తెచ్చి వేసి అందులో మెత్తవేసి "కూర్చోండి" అంది.
అతను మొహమాటంగానూ, ఇబ్బందిగానూ చూశాడు.
జరుగుతున్న డ్రామాలో అతని వేషం ఏమిటో నిజంగా అతనికి తెలీదు పాపం! ముగ్గురు ఆడపిల్లలు ఒక్కసారిగా ఎదురుపడేసరికి చాలా కంగారు పడిపోయినట్లున్నాడు.
చిన్నక్కనాతో "వెళ్ళి టీ తీసుకురా!" అని పురమాయించింది.
"నే వెళ్ళను" అన్నాను. ఇంకా వేసుకోవలసిన బొమ్మలు నాకు చాలా వున్నాయి.
అది కళ్ళతో మందలిస్తూ "అక్క పిలుస్తోంది. వెళ్ళు" అంది.
విధిలేక లేచి వెళ్ళాను.
కమల్ కి ఏం చెయ్యాలో తోచక టీపాయ్ మీదున్న బట్టను వేళ్ళతో సవరించసాగాడు.
నేను లోపలికి వెళ్ళేసరికి పెద్దక్క జరీ బుటా వున్న చందేరిచీర కట్టుకుని తల దువ్వుకుంటూ కనిపించింది. నాకు చిర్రెత్తుకొచ్చింది.
"ఇప్పుడీ ముస్తాబెందుకూ? టీ పెట్టానన్నావు... ఏదీ?" అని అరిచాను.
అది నా నోటిమీద తన చేతిని వేసి గట్టిగా మూసి "పద....యిస్తాను" అంది.
"నువ్వే తీసుకెళ్ళి ఇయ్యి" అని నేను వెళ్ళిపోయాను.
అది టీ తీసుకుని ముందుగదిలోకి వచ్చేసరికి "కమల్... కమల్" అని పిలుస్తూ వాళ్ళమ్మ వాకిట్లోకి వచ్చింది.
అతను ఒక్క వుదుటున కుర్చీలోంచి లేచి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళాడు. సింగారించుకుని వచ్చిన అక్కవైపు చూడనేలేదు. అంతలోనే వెనక్కి తిరిగి చేతిలోని లేసుకుట్టిన బట్ట తీసుకొచ్చి అక్కడ పెట్టెయ్యబోయాడు.
పెద్దక్క ముందుకెళ్ళి "అది మీరే వుంచుకోండి... ప్లీజ్" అని మళ్ళీ అతనిచేతికి అందించేసింది.
అతను విచిత్రంగా చూసి దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోతున్న అతడ్ని అక్క కన్నీళ్ళతో చూస్తూ నిలబడిపోయింది.
చిన్నక్క దాన్ని దగ్గరకు తీసుకుని ఓదారుస్తూంటే నేను టీ తాగుతూ వాళ్ళ పిచ్చితనానికి నవ్వుకున్నాను.
కానీ ఆ సంఘటన పెద్దక్క మనసులో చాలా అపురూపంగా ముద్రించుకు పోతుందని అస్సలు అనుకోలేదు.
కమల్ కూర్చున్న కుర్చీ, అంటుకున్న టీపాయీ రోజూ నీట్ గా తుడిచేది. మమ్మల్ని ఎవర్నీ కూర్చోనిచ్చేది కాదు! అది అప్పుడప్పుడూ కుర్చీలో కూర్చుని కలల్లోకి వెళ్ళేది.
అలాంటి అలౌకికమైన ప్రేమస్థితిలో అది వుండగా మా సుందరం మావయ్య దానికో సంబంధం తెచ్చాడు. నాన్నగారితో ఆయన వరుడి వివరాలు చెబుతుంటే మేం అందరం చాటునుంచి చెవులు రిక్కించి విన్నాం.
ఆ రాత్రి పెద్దక్క పెరట్లో కూర్చుని వెక్కివెక్కి ఏడుస్తుంటే చిన్నక్క "పోనీ కమల్ ని ప్రేమించావని నాన్నతో చెప్పేద్దాం" అంది.
"ముందు అతనికి చెప్పాలిగా?" అంది అక్క.
అదీ పాయింటేగా మరి! అసలు ప్రేమ అనేది ఇప్పటివరకూ ఏకపక్షం గానే జరిగింది. ఇద్దరూ మంతనాలాడుకుని మరునాడు అది కమల్ ని కలిసి ప్రేమలేఖ ఇచ్చేవిధంగా నిర్ణయించుకున్నారు.
నాకిదంతా గొప్ప తమాషాగా అనిపించి మర్నాటికోసం ఎదురుచూస్తూ గడిపాను.
మర్నాడు మేం నిద్ర లేచేసరికి నాన్న ఎవరితోనో మాట్లాడుతూ వుండటం వినిపించింది. నేను లేచి చిన్నక్కవైపు 'ఎవరు' అన్నట్లుగా చూశాను. అదీ తెలీదని సైగ చేసింది.
ఇద్దరం కలిసి ముందు గదిలోకి వెళ్లాం. అక్కడ కమల్ వాళ్ళ నాన్న కనిపించాడు.
'ఇది అప్పుడే ఎప్పుడువెళ్ళి వాళ్ళతో సంగతి చెప్పేసిందబ్బా!' అనుకున్నాను.
నాన్నగారు ఆయనతో "చాలా సంతోషం.... మీ అబ్బాయికూడా ఈ కాలం కుర్రాళ్ళలా కాదు. ఎన్నడూ ఆడపిల్లలున్న ఇల్లని కన్నెత్తి చూసిన పాపాన పోలేదు..." అంటున్నారు.
అప్పుడే సంబంధం నిశ్చయం అయిపోయిందా? అనుకుంటూ పెద్దక్క కోసం వెతికాను. అది వంటింట్లో కూర్చుని వెక్కివెక్కి ఏడుస్తోంది.
"ఎందుకే ఆ ఏడుపూ? ఏమైంది? నాన్నగారు కూడా వాళ్ళతో మంచిగా మాట్లాడుతున్నారు. కమల్ ని పొగిడారు కూడా!" అన్నాను.
అది వెక్కిళ్ళమధ్య "వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి కలకత్తా వెళ్ళిపోతున్నారుట" అంది.

 Previous Page Next Page