పరిమితమైన మార్కెట్ ఉన్న చిత్రాలని అపరిమితమైన వ్యయంతో నిర్మించి లాభాలు ఆశిస్తే ఎలా వస్తాయి?
రావచ్చు! అప్పుడప్పుడూ! రేసుల్లో జాక్ పాట్ తగిలినట్టు.
"కానీ అంత లాభాలు గడిస్తున్న చిత్రాల శాతం ఎంత? ఎన్ని ఉన్నాయి? అంత భారీగా నష్టపోతున్న చిత్రాలు కూడా ఎన్ని వున్నాయి?"
"ఎప్పుడయితే నిర్మాత కోటిరూపాయలు చిత్రం మీద ఖర్చు పెడతాడో, అప్పటి నుంచీ అతని తాపత్రయం అంతా ఆ కోటిరూపాయలను ఎలా తిరిగి రాబట్టుకోవాలా అని వుంటుంది. అంతేగానీ, కొత్త పుంతలు తొక్కి రిస్కు తీసుకోవాలని వుండదు. అందుకనే ఫార్ములని కదలకుండా తీసిందే తీస్తున్నారు."
"నేను అలా చెయ్యను కరుణా! సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో సాధ్యమైనంత మంచి సినిమా తీస్తాను. తీసి చూపిస్తాను" అని లేచి, "ఇప్పుడే వస్తాను" అని చెప్పి అంతరాత్రప్పుడు మధుమతి ఇంటికి వెళ్ళాడు హరీన్.
అప్పుడే షూటింగ్ నుంచి తిరిగివచ్చి సొమ్మసిల్లి నిద్రలోకి జారిపోయిన మధుమతి, హరీన్ వచ్చాడని తెలియగానే, తక్షణం లేచి కిందికి వచ్చింది. అతన్ని చూడగానే వికసించింది ఆమె మొహం.
"రా హరీన్! హార్లిక్స్ కలిపి తేనా?" అంది ఆప్యాయంగా.
వద్దన్నట్లు తలపంకించి కూర్చున్నాడు హరీన్.
కొద్ది క్షణాలు ఆగి, "నాకు చాలా బాధగా వుంది" అంది మధుమతి.
"ఎందుకు?"
"జరుగుతున్న చిత్రాలన్ని నాకు తెలుస్తూనే వున్నాయి. ఈ మనుషులు .....హు........ఏం చెప్పాలి!"
"ఐ డోంట్ కేర్! మధూ! నేనే ఓ సినిమా తియ్యదలుచుకున్నాను."
"ఓహ్! మై! మై!" అంది మధుమతి సంతోషంగా.
"వెంటనే మొదలెడుతున్నాను. అంటే మంచి కధ ఎప్పుడూ దొరికితే అప్పుడు. కధ విషయంలో రాజీ లేదు. మధూ! నీ డేట్స్ పొజిషన్ ఏమిటి?"
చాలా తేలిగ్గా అంది మధుమతి. "నీ సొంత పిక్చరుకి, నువ్వు నన్ను డేట్స్ అడగాలా. వాట్ నాన్సెన్స్! నా డైరీలో ఒక్కరోజు ఖాళీ లేకపోయినా సరే, నీకోసం ధర్డ్ షిఫ్టు చేసి పిక్చరు కంప్లీట్ చేస్తాను. నిజంగానే! నీకోసం నిద్రాహారాలు మానేసి పనిచేస్తాను. ఇప్పుడు ఇమ్మిడియెట్ గా కిశోర్ తో కలిసి చేస్తున్న పిక్చర్లు మూడు వున్నాయి. ప్రస్తుతం అన్నీ మెడ్రాసులోనే. హరీన్! నువ్వు ఫలాని తారీఖున షూటింగని చెప్పు! కాకిచేత కబురంపినా వచ్చి వాలతాను - ఏం!"
తదేకంగా ఆమెవైపు చూశాడు హరీన్.
"థాంక్స్ మధూ! థాంక్స్ ఫర్ ఎవ్విరిథింగ్! కధ సెటిల్ కాగానే నీతో చెబుతాను. బై బై"
అక్కడినుంచి రైటరు వనమాలీ ఇంటికి వెళ్ళాడు హరీన్.
అంతరాత్రి అయినా ఇంకా పడుకోలేదు వనమాలీ. ఇంటిముందు వున్న గార్డెన్ లో పచార్లు చేస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు.
"రండి! రండి!" అన్నాడు హరీన్ చూడగానే. కుశలప్రశ్నలు ముగియగానే చెప్పాడు హరీన్ -
"నాకు మంచి కధ కావాలి వనమాలిగారు! నిజంగా మంచికధ!"
"ఓ యస్! నేను వున్నదే అందుకూ!" అన్నాడు వనమాలీ నవ్వుతూ. "ఒక్కరోజు టైం ఇవ్వండి. ఒకటికాదు - వంద కధలు చెబుతాను మీకు. రేపురాత్రి కూర్చుందాం. ఆలోగా ముగ్గురికి కధలు ఇవ్వాలి నేను."
హరీన్ సెలవు తీసుకుని ఇంటికి రాగానే మధుమతి దగ్గరనుంచి ఫోన్ వచ్చింది. చెప్పలేనంత ఆశ్చర్యం కనబడుతోంది ఆమె గొంతులో.
"హరీన్! నిన్నెవరన్నా గూడచారులు ఫాలో అవుతున్నారా ఏమిటి?"
"ఏం?"
"నువ్వు ఇక్కడికి వచ్చి వెళ్ళగానే ఫోన్ వచ్చింది నాకు. మా షూటింగ్ ఈ ఉళ్ళో కాదుట. ఊటీలో చేస్తారుట. హరీన్! నువ్వు కూడా ఊటీ వచ్చేయ్! అక్కడే షూట్ చేద్దాం పిక్చర్! ఖర్చు విషయం సందేహించకు. నేను చూసుకుంటాను. లేకపోతే - ఆ పిక్చర్లన్నీ వదులుకొని నీ ఫిక్చరే చేస్తాను నేను. ఏం జరిగితే అదే జరగనీ!"
కొద్ది క్షణాలు మౌనంగా వుండి అన్నాడు హరీన్.
"వద్దు మధూ! ఇంక ఆ విషయం మర్చిపో! నువ్వు దీనిలో ఇన్ వాల్వ్ కావద్దు. అది నీకు చాలా నష్టం. వద్దు మధూ!"
మధుమతి ఇంకా ఏదో నచ్చచెప్పాలని చూసింది. ఆమెకి ఆ అవకాశం ఇవ్వకుండా ఫోన్ కింద పెట్టేశాడు హరీన్.
వెంటనే కరునవైపు తిరిగాడు హరీన్.
"కరుణా.........నా పిక్చరులో నువ్వే హీరోయిన్ వి!" అన్నాడు ఉపోద్ఘాతం లేకుండా.
తెల్లబోయింది కరుణ.
"నేనా?"
"అవును......నువ్వే! ఇప్పుడనిపిస్తోంది నాకు. మంచి సినిమా కావాలంటే పెద్ద స్టార్సే అక్కర్లేదు. పిక్చర్ లో పెద్ద స్టార్స్ ఉండటం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. కొన్ని నష్టాలు ఉన్నాయి. పెద్ద స్టార్స్ ఉంటే డేట్స్ ప్రాబ్లెం! ఇమేజ్ ప్రాబ్లెం!
"పెద్ద స్టార్స్ కి ఒక ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ కి వ్యతిరేకంగా మరో విధమైన పాత్రని పోషిస్తే హరించుకోలేరు అభిమానులు. ఉదాహరణకి తాము ఆరాధ్యదైవంగా చూసుకుంటున్న హీరో హటాత్తుగా ఒక పిక్చరులో విలన్ గా నటిస్తే భరించలేరు.
"అందుకని, పాత్రలే తప్ప పాత్రధారులు గుర్తురాకుండా ఉండాలంటే, పూర్తీ ఎఫెక్ట్ రావాలంటే ఏ ఇమేజ్ లేని కొత్త నటీనటులు బాగుంటారు."
"కానీ నేను నటినే కానుకదా?" అంది కరుణ.
"అది నాకు వదిలేయ్! నీకు మంచి కనుముక్కు తీరు ఉంది. వీణ మీద రాగాలని పలికించినట్లు భావాలని పలకించగల కళ్ళు ఉన్నాయి. నువ్వు తలుచుకుంటే మంచి నటివి కాగలవు కరుణా!"
చాలా ఆవేశంగా చెబుతున్న అతని మాటలకు అడ్డుతగిలే సాహసం లేక మౌనంగా ఉండిపోయింది కరుణ. అప్పటికే తూరుపు తెలతెలవారటం మొదలెట్టింది. ఆరోజంతా ఏవేవో పనులతో హడావుడిగా ఉన్నాడు హరీన్.
రాత్రయ్యేసరికి రైటరు వనమాలీ వచ్చాడు.
"కరుణా........నువ్వు కూడా రా! స్టోరీ డిస్కషన్ మొదలెడుతున్నాం!" అన్నాడు హరీన్.
ముగ్గురూ సెటిలయ్యాక, కధ చెప్పడం మొదలెట్టాడు వనమాలీ.
మామూలు బాక్సాఫీసు మసాలా కధ. చాలా రొటీన్ గా ఉంది. ఎక్కడ ఫైట్లు ఉండాలి. ఎక్కడ సాంగ్సు ఉండాలి. ఎక్కడ సెంటిమెంటు, ఎక్కడ హాస్యం అని ముందే ఒక చట్రంలో బిగించిన కధ అది.
మరోవిధంగా చెప్పాలంటే అది కధ కాదు - కేవలం సన్నివేశాల సమూహం.
అంతే!
పగ, పతీకారం సబ్జెక్టు.
కొద్దిసేపు విని, అవలించాడు హరీన్.
కానీ -
కరుణ మాత్రం.
పత్రీకారం అన్నమాట చెవినపడగానే, తన తండ్రికి అపకారం చేసిన అజ్ఞాత శత్రువు గుర్తువచ్చాడు.
కోపంతో ఆమె పెదిమలు బిగుసుకుపోయాయి.
33
హాస్పిటల్లో డాక్టరు చిరచిరలాడిపోతున్నాడు. అతని ముందు నిలబడి వుంది ప్రియంవద. ఆమె మొహం జేవురించింది.
"నువ్వుత్త అప్రయోజకుడివి!" అంది డాక్టరు తో పెడసరంగా.
"నువ్వేమన్నా అనుకో! కానీ ఇంక ఈ ముసలిపీనుగ ఈ హాస్పిటల్లో వుండటానికి వీల్లేదు. ఇక్కడేదో గూడుపుటాణీ జరుగుతోందనీ కనిపెట్టాడు హరీన్. అతను దేవాంతకుడు. ఇప్పుడీ ముసలాడు ఇక్కడే గుటుక్కుమన్నాడంటే హరీన్ వచ్చి నా ప్రాణాలు తోడేస్తాడు. బతికుంటే బలుసాకు తినొచ్చు. వెంటనే నీ ముసలిమొగుణ్ని ఇక్కడ నుంచి తీసుకుపో!" అన్నాడు డాక్టరు.......అతని కంఠంలో భయం ధ్వనిస్తోంది.
కోపాన్ని అణుచుకుంటూ అంది ప్రియంవద. "నీలాగా ప్రతిదానికి బెదిరిపోయే రకాన్ని నేను కాదు. ఆయన్ని ఇంటికి తీసుకెళ్ళిపోతాను. కానీ గుర్తుంచుకో.......ఇంక నీకూ, నాకూ రాం రాం! ముసలాడు ప్రాణాలోదిలేసి, ఆస్తంతా నా గుప్పెట్లోకి వచ్చేశాక, అప్పుడింక నువ్వొచ్చి నా కాళ్ళచుట్టూ కుక్కపిల్లలా తిరిగినా లాభం వుండదు - తెలిసిందా?"
"ఆ ఆస్థి అంతా నీ చేతికి వచ్చినప్పటి మాట కదా" అని అదోలా నవ్వాడు డాక్టర్. "చూడబోతే ఈ ముసలాడు వెయ్యి చావులు చావడానికి సిద్దంగా వున్నాడు గానీ ఆస్తి మాత్రం నీపేర రాసేట్లులేడు."
"నా సంగతి నీకు తెలీదు!" అని విసురుగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ప్రియంవద.
బయట వెయింటింగ్ రూంలో బిక్కుబిక్కుమంటూ నిలబడి వుంది వరలక్ష్మి చాలా సేపటిక్రితమే.
ఆమెని మెడపట్టుకు గెంటేసినంత మోటుగా బయటికి పంపించేశాడు డాక్టరు.
ప్రియంవదని చూడగానే ఆత్రంగా అడిగింది వరలక్ష్మి "ఏమయింది? ఆయన్ని డిస్ చార్జ్ చేస్తున్నారా?" అంది వణుకుతున్న కంఠంతో.
సమాధానం చెప్పకుండా , నిరసనగా ఒక్క చూపు చూసి డ్రైవర్ ని కేకేసింది ప్రియంవద.
మగతలో వున్న విశ్వనాధాన్ని తీసుకొచ్చి కార్లో ఎక్కించారు. వరలక్ష్మి వచ్చేలోపలే కారు కదిలిపోయింది.
దుఃఖాన్ని ఆపుకుంటూ, వడివడిగా ఇంటివైపు నడవడం మొదలెట్టింది వరలక్ష్మి.
* * *
ఇంటికి తిరిగిరాగానే తన అక్కసునంతా నౌకర్లమీద చూపిస్తూ పెద్దగా అరిచింది ప్రియంవద.
"ఎక్కడివాళ్ళక్కడ సొంబెరుల్లాగా కూర్చుండిపోతారేం! ఎవరో ఒకరు లేచి ఆ పాత నులక మంచం తెచ్చి గెరేజ్ లో వెయ్యండి. రోగిష్టి మనుషుల్ని ఇంట్లోకి తీసుకువస్తే అందరికీ రోగాలు అంటుకుంటాయ్!"
ఇద్దరూ నౌకర్లు గబగబా మంచం తెచ్చి గెరేజ్ లో వేశారు. దానిమీద పడుకోబెట్టారు చిక్కిశల్యమైపోయివున్న విశ్వనాధాన్ని , ఇదంతా చూస్తున్న వంటవాడు పనిమనిషితో గుసగుసగా అన్నాడు.
"అమ్మగారి అఘాయిత్యం రోజురోజుకీ పెరిగిపోతాంది" అని.
"అమ్మగారనకు..........అమ్మతల్లి అను. టక్కున సరిపోద్ది!" అంది పనిమనిషి మెటికలు విరుస్తూ.
అచ్చం అమ్మ తల్లిలాగే విశ్వనాధం ముందు నిలబడి వుంది ప్రియంవద. నౌకర్లందరూ దూరంగా వెళ్ళిపోయారు .
అప్పుడే కళ్ళు తెరుస్తున్నాడు విశ్వానాధం.
అప్పుడే కఠినంగా అంది ప్రియంవద.
"ఇదిగో! మర్యాదగా కొత్త వీలునామా రాశారా సరేసరి. లేకపోతే ఈ కుక్కిమంచంలోనే పడి, కుక్కచావు చావవలసి వస్తుంది - జాగ్రత్త! వింటున్నారా? అయినా మీకంత కపీనం ఏమిటీ? ఎవ్వరికీ ఇవ్వకుండా పోయేటప్పుడు కట్టుకుపోతారా డబ్బంతా! ఉన్నమాట చెబుతున్నా - ఇంక మీకు మందులు కొనడానికి నా దగ్గర చిల్లిగవ్వ లేదు. ఆ తర్వాత మీ ఇష్టం. ఇంకా సేపట్లో వకీలు వస్తారు. ఆలోగా అటో ఇటో తేల్చుకోండి .......ఆ!" అని విశాసర్పంలా విసవిస వెళ్ళిపోయింది ప్రియంవద.
తన మొహమీద తనే ఉమ్మేసుకోవాలన్నంత అసహ్యం కలిగింది విశ్వనాధానికి.