గుట్టు - రట్టు
వసుంధర
సుజాత , పద్మ మాట్నీ సినిమా చూసేక హోటల్లో టిఫిను చేసి కాలినడకన ఇంటికి బయలుదేరారు. ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఓ సందు దాకా వచ్చేక - 'బాగా చీకటి పడింది. ఈ సందులోంచి పోదామా?" అంది పద్మ.
ఆ సందులోంచి వెళ్ళకపోతే ఓ కిలోమీటరు దూరం చుట్టి వెళ్ళాలి వాళ్ళు. అయితే ఆ సందు ప్రమాదకరమైనది.
ఆ సందులోనే ఉంటున్నాడు పులిరాజు.
పులిరాజా ఉళ్ళో పేరు మోసిన గూండా!
"ఇది పులిరాజు సందు" అంది సుజాత.
"ఎవరి సందయితే మనకెందుకు? కళ్ళు మూసి తెరిచే సరికి దాటిపోదాం" అంది పద్మ. సుజాత యింకా తటాపతయిస్తుంటే -- 'అయినా యిప్పుడు టైము ఏడు దాటలేదు. మనం సభ్యసమాజం లో ఉంటున్నామా -- అడవిలో ఉంటున్నామా?" అంది పద్మ కాస్త చిరాగ్గా.
'సరే - పద !" అంది సుజాత.
ఇద్దరూ సందులో ప్రవేశించారు.
ఆ సందులో వీధి దీపాలు వెలగడం లేదు. మనుషులు మసలడం లేదు.
ఆడపిల్లలిద్దరికీ గుండెలు కాస్త చెదిరాయి. అయినా మొండిగా ముందడుగు వేశారు.
సందు సగంలోకి వెళ్ళేసరికి వాళ్ళ మీద బ్యాటరీ లైటు కాంతి పడింది.
ఇద్దరూ ఉలిక్కిపడ్డారు.
అరుగు మీంచి ఉరికాడు పులిరాజు -- పులి లేడి మీదకు దూకినట్లే!
పద్మ అతణ్ణి చూసింది.
మనిషి సన్నగా నాజుగ్గా పొడవుగా ఉన్నాడు. రంగు నలుపు. అయినా నల్లటి మీసాల అతడి ముఖంలో విశిష్టత ఉంది.
"మనిషి పులి అంత సొగసుగానూ ఉన్నాడు. పులిరాజే అయుంటాడు" అనుకుంది పద్మ.
సుజాత బెదురూ కళ్ళతో అతణ్ణి చూస్తోంది.
"ఎవరు మీరు?" అన్నాడు పులిరాజు.
పులి గాడ్రించినట్లే ఉంది అతడి మాట.
"నాపేరు పద్మ. ఈమె నా స్నేహితురాలు సుజాత. ఇద్దరం సినిమా చూసి ఇంటికి వెడుతున్నాం. ఇది కాస్త దగ్గర దారి ....' అంది పద్మ.
పులిరాజిద్దర్నీ చూశాడు మరోసారి. అప్పుడు చటుక్కున చేయి జాపి సుజాత చేయి పట్టుకుని -- పద్మ నువ్వెళ్ళిపో -- సుజాత కాసేప్పాయ్యాక వస్తుంది " అన్నాడు.
అప్పుడే సుజాత కళ్ళలోకి నీళ్ళు వచ్చేశాయి.
"మేమిద్దరం కలిసే వెడతాం" అంది పద్మ.
పులిరాజు కళ్ళెర్ర బడ్డాయి -- "నా పేరు పులురాజు తెలుసా?"
"తెలియదు , నీ పేరు పులి రాజయితే నాకేం?"
"ఈ ఊళ్ళో గొప్ప గొప్ప వాళ్ళే నా పేరుకు బెదురుతారు. ఈ సందులో అయితే నా కెదురు లేదు ...." అన్నాడు పులిరాజు.
"నీ ప్రతాపం ఆడపిల్లల మీదేనా?" అంది పద్మ.
పులిరాజు కోపంగా -- 'అట్టే వాగకు" అన్నాడు.
"సందులోకి వచ్చిన ఆడపిల్లల చేయి పట్టుకోవడం ప్రతాపం కాదు. చేతనయితే సాటి మగాడ్ని ఎదిరించు" అంది పద్మ.
సుజాత పులిరాజు పట్టుకున్న చేయి విడిపించుకోకుండా రెండో చేత్తో కళ్ళనీళ్ళు తుడుచుకుంటోంది.
"నాకు సాటివచ్చే మగాడీ ఊళ్ళో లేడు...." అన్నాడు పులిరాజు.
"ఉంటే ఏం చేస్తావు ."
"ఏదో చేయాల్సిన అవసరం నాకేమిటి? నాకుండాల్సిన పేరు నాకుండనే ఉంది...." అన్నాడు పులిరాజు.
"నా స్నేహితురాలి చేయి వదిలిపెట్టు" అంది పద్మ.
పులిరాజు తన రెండో చేత్తో మీసం మెలేసి, "నువ్వు ఇంటికి వెళ్ళు. నీకు అరగంట టైమిస్తున్నాను. ఈలోగా నన్నేదిరించే మగాణ్ణి తీసుకురా. అంతవరకూ నీ సుజాతను నేనేమీ చేయను. అరగంట లోగ నువ్వేవరినీ తీసుకుని రాకపోతే ఈ పిల్లను నేనో గంట సేపుంచుకుని పంపెస్తాను...." అన్నాడు.
అప్పటికి సుజాత తమాయించుకుని -- "ప్లీజ్ నన్ను వదిలిపెట్టు " అంది.
"ఎలా వదిలిపెడతాను ! రసగుల్లాలా ఎంతో బాగున్నావు ...." అన్నాడు పులిరాజు.
"పులిరాజా! మమ్మల్ని వెళ్ళిపోనియ్ ...." అంది పద్మ.
"నీకు అరగంట గడువిచ్చాను. అప్పుడే ఒక నిముషం అయిపొయింది. " అన్నాడు పులిరాజు.
పద్మ యింకా ఏదో అనబోగా అతడామె నొక్క తోపు తోసి సుజాతను చరచరా తనింట్లోకి లాక్కుని వెళ్ళి తలుపు వేసుకున్నాడు.
పద్మ తమాయించుకుని తలుపు దగ్గరకు పరుగెత్తింది. దబదబా బాదింది.
లోపల్నుంచి -- "టైము వృధా చేసుకోకు. అరగంటకు ఒక్క నిమిషం కూడా యివ్వలేను నేను...." అన్నాడు పులిరాజు.
ఆ గొంతు పులిగాండ్రీంపు లా ఉంది.
పద్మ యిక జాప్యం చేయలేదు. ఆమె పరుగు లంకించుకుంది.
2
రంగనాధం ఆరోగ్యం బాగా లేదు. జ్వరం, దగ్గు, ఆయాసం.
అప్పుడే డాక్టరు చూసి వెళ్ళాడు. ఫరవాలేదన్నాడు.
"రేపే అమ్మాయికి పెళ్ళి వారోస్తున్నారు. ఈయన వరస చూస్తె యిలాగుంది" అని నిట్టూర్చింది రంగానాధం భార్య జానకి.
"ఖంగారు పడకమ్మా -- అన్నింటికీ నేనున్నాగా" అన్నాడు విశ్వం.
జానకి కొడుకు వంక చూసి -- "టైమప్పుడే ఏడు దాటింది . సుజాత యింకా యింటికి రాలేదు" అంది.
'వస్తుందమ్మా - పద్మతో కలిసి వెళ్ళిందిగా -- ఇద్దరూ హోటల్లో టిఫిను చేస్తే కానీ రారు ...." అన్నాడు విశ్వం.
'అయినా ఈపాటికి రావాలి ...."
"ఏ బజార్లో తిరుగుతున్నారో ఏమో...." అన్నాడు విశ్వం.
"నీ నిదానం బంగారం కానూ -- నువ్వు దేనికీ కంగారు పడకు" అంది జానకి విసుగ్గా.
"నీ చేతుల్లో పెరిగినవాణ్ణి. నీకు నేను చెప్పగలనా! దేనికయినా కంగారు పడి మనం చేయగలిగేదేమీ ఉండదు. నిదానమే ప్రధానం . కాసేపట్లో చెల్లాయి వచ్చేస్తుంది చూడు ...." అని అతడింకా ఏదో అంటుండగా అక్కడ పద్మ ప్రవేశించింది.
'అదిగో - పద్మ వచ్చింది " అన్నాడు విశ్వం. కానీ ఆమె ఆయాసంతో వగర్చుతుండటం చూసి ఆశ్చర్యపడి "అదేంటి పద్మా! ఏం జరిగింది?" అన్నాడు.
పద్మ క్లుప్తంగా జరిగింది చెప్పి -" ఇప్పుడు మనమేదో ఒకటి చేయాలి" అంది.
జానకి కంగారు పడి శోకాలు మొదలిపెట్టింది.
"ఏం జరిగిందే?' అంటూ పక్క గదిలోంచి రంగనాధం కేక పెట్టాడు.
'అమ్మా! నాన్నకారోగ్యం బాగాలేదు. నువ్వు గొడవ చేయకు. అసలు సంగతాయనకు తెలియనివ్వకు...." అన్నాడు విశ్వం.
"ఇప్పుడెం జరుగుతుంది " అంది జానకి.
"ఏం జరిగిందే ?" అన్నాడు రంగనాధం పక్క గదిలోంచి.
"ఏమి లేదు నాన్నా. మీరు పడుకోండి" అన్నాడు విశ్వం.
"రేపే పెళ్ళి చూపులు. పిల్లదాని బ్రతుకన్యాయమై పోతుంది" అంది జానకి.
"ఏమీ అన్యాయం కాదు ...." అన్నాడు విశ్వం.
"పులిరాజు నాకు అరగంట టైమిచ్చాడు. అప్పుడే పదినిమిషాలు దాటింది " అంది పద్మ కంగారుగా.
"పులిరాజును మనమేమీ చేయలేం. నువ్వు కూడా ఈ విషయ మేవ్వరికీ చెప్పి రగడ చేయకు. కాసేపట్లో సుజాత యింటికి వస్తుంది. ఎవ్వరూ ఏమీ జరగనట్లే ఊరుకుందాం. రేపు పెళ్ళి చూపుల్లో వరుడి కది నచ్చితే పెళ్ళి కూడా అయిపోతుంది" అన్నాడు విశ్వం.
'ఛీ....' అంది పద్మ.
'ఛీ అనకు, ఇలాంటి విషయాల్లో రొష్టు పడి ప్రయోజన ముండదు" అన్నాడు విశ్వం.
"నీ నిదానం మండిపోనూ ...." అంది జానకి.
పద్మ అక్కడ ఒక్క క్షణం కూడా ఆగకుండా పరుగెత్తింది.
3
'అరగంట కింక ఒక్క నిముషముంది...." అన్నాడు పులిరాజు.
"ప్లీజ్ - నన్ను వదిలిపెట్టు" అంది సుజాత.
"అరిగిపోయిన రికార్డులా అస్తమానూ ఒకే డైలాగు చెప్పకు. నా సందులో అడుగు పెట్టెక నాకు నచ్చిన ఆడది నాకు వశం కాక తప్పదు. అయినా ఇప్పుడిక్కడ నీకు ప్రమాదమేం జరగదు. మనం కాసేపు సరదాగా ఇక్కడ గడుపుదాం."
"ప్లీజ్ - నన్ను వదిలిపెట్టు " అంది సుజాత మళ్ళీ.
"నిన్ను నేనెలా వదిలిపెడతాను! నిన్ను వదిలిపించుకునే వాళ్ళు రావాలి" అన్నాడు పులిరాజు నవ్వుతూ.
సరిగ్గా అప్పుడే తలుపులు దబదబ మ్రోగాయి.
"ఎవరు?" అన్నాడు పులిరాజు.
"సుజాతను వదిలించుకుందుకు వచ్చాను" అన్నదో గొంతు.
పులిరాజు చటుక్కున లేచి నిలబడి తలుపు తీశాడు.
ఓ యువకుడక్కడ నిలబడి ఉన్నాడు. అతడు దృడంగా ఉన్నాడు.
"ఎవరు నువ్వు?" అన్నాడు పులిరాజు.
"పద్మ నన్ను పిలిచింది" అన్నాడతడు.
"ఎవరు నువ్వు?" అన్నాడు పులిరాజు మళ్ళీ.
"నా పేరు ప్రభాకర్" అన్నాడా యువకుడు.
అతడి వెనుక నుంచీ పద్మ ముందుకు వచ్చి "నిన్నేదిరించే మగాడోచ్చాడు. సుజాతను వదిలిపెట్టు" అంది.