Previous Page Next Page 
మనిషి - మిథ్య పేజి 4

   
    చచ్చి స్వర్గాన ఉన్న భార్య-తనని ఒంటరి చేసిన లగాయితూ యీ జీవితం మరింత 'ఇరుకు' గా తయారయ్యింది. అన్ని విషయాల్లోనూ చేదోడు వాదోడుగా ఉండి, జీవితంలో తీపిని ప్రసాదించిన భార్య లేని ఈ సంసారం ఏ లోటూ రాసికుండా, గుట్టుగా ఇంతవరకూ తీసుకురావడం 'ఘనత' కాదూ?
    పిచ్చాడి బారినుండి బయటపడటం చిన్నప్పటి ఎడ్వంచరైతే, మనిషిగా తన ధర్మాన్ని, విధినీ నిర్వర్తించడం సిసలైన ఎడ్వంచర్!
    జానకిరామయ్యగారి చెప్పుకి రాయి తగిలింది. తూలి పడబోయి తమాయించుకుని నిలబడ్డారు. అప్పటిగ్గాని తనెక్కడ ఉన్నదీ గుర్తుకురాలేదు. షావుకారి షాపు దాటి వంద గజాలు దూరం వొచ్చేశారు.
    నవ్వుకున్నా రాయన. మళ్ళా వెనక్కు నడిచారు.
    వయస్సు పెరుగుతున్నకొద్దీ మతిమరుపూ పెరుగుతోంది. బడిపంతులు ఉద్యోగం. బడిపంతు లైనవారికి జ్ఞాపకశక్తి ఖచ్చితంగా ఉండి ఉండాలి. అది చాలా ముఖ్యమైన అవసరం. లేక పోతే పిల్లల్తో, వాళ్ళ అతి తెలివి ప్రశ్నల్తో సర్దుకుపోడం చాలా కష్టం. అన్నేళ్ళ సర్వీసులోనూ లోనూ ఒక్కనాడు గూడా తాను చెడ్డపేరు తెచ్చుకోలేదు. 'జానకిరామయ్య మాస్టారే మాష్టారు. పాఠాలు చెబితే ఆయనే చెప్పాలి' అని అటు విద్యార్ధులూ, ఇటు తోటి మాస్టర్లూ అనేవారు. ఆ రోజుల్లో తన ప్రజ్ఞకి తనే గర్వపడేవారు.
    అలాంటి పేరెన్నికగన్న జానకిరామయ్య మాస్టారికి 'మతిమరుపు అనే జాడ్యం వొచ్చేసిందోయ్' అని ఎవరైనా అనుకుంటే ఎవరో ఎందుకు? యిప్పటి తనను చూస్తుంటే తనకే అనిపిస్తుందలా .....ఛ ..... ఎంత అవమానం.
    జానకిరామయ్య గారు సిగ్గుపడ్డారు. కాస్త బాధ కూడా అనిపించింది.
    ఈ సశేషంలో యింకా ఎన్ని బలహీనతలు, ఎన్ని జాడ్యాలూ అనుభవించాలో గదా? జీవిత పర్యంతం ఏరొస్టూ లేకుండా హాయిగా బ్రతికేందుకు అవసరమైన శక్తీ, ఆరోగ్యమూ దేవుడు ప్రసాదించకూడదూ?
    తన వెనకాల వొచ్చే కారు, హారను మోగించింది. ఉలిక్కిపడి పక్కకి తప్పుకున్నారు. కారులో కూర్చున్న ఆసామి తనవైపు హేళనగా చూశాడు. తన అజాగ్రత్తకి నొచ్చుకున్నా రాయన.
    తను వెళ్ళవలసిన షావుకారు కొట్టుకి మళ్ళా ఓ పది అడుగులు (అటువైపు) దూరంగా నిలబడి ఉన్నట్లు గ్రహించి - ఈమాటు కాస్త బిగ్గరగా నవ్వుకున్నా రాయన. ఇంకా ఏమీ ఆలోచించకుండానే గబగబా కొట్లోకి వెళ్ళి షావుకారిని పలుకరించేశారు. షావుకారు కొట్టు కుర్రాడిచేత, మాస్టారు కూర్చునేందుకు స్టూలు వేయించాడు.
    మాస్టారు జేబులోంచి డబ్బు తీసి యిస్తూ.
    "ప్రస్తుతాని కిది జమ వేసుకోండి. మిగతాది మల్లా ఓ వారం పది రోజుల్లో సర్దుతాను. సరేనా?"
    "బలేవారండీ! మీదగ్గర డబ్బెక్కడ పోతుందండీ-అలాగే కానివ్వండి."
    "ఇప్పుడు ఎంత తమాషా జరిగిందో చూశారా? ఇంటిదగ్గర్నుంచి తిన్నగా మీ షాపుకి బయలుదేరావా? ఏదో ఆలోచిస్తూ షాపు దాటి వెళ్ళి పోతాను. అక్కడ తెప్పరిల్లి మళ్ళీ మీ షాపుకి బయలుదేరి మళ్ళీ పప్పులో కాలు వేశాను" అన్నారు నిండుగా నవ్వుతో.
    షావుకారూ నవ్వేడు.
    "పెద్ద వాళ్ళయి పోతున్నారు గదండీ మరి."
    "ఇప్పుడు నన్నెవడైనా జాగ్రత్తగా గమనించి ఉంటే పాపం ..... యీ పెద్ధమనిషికి మొన్నీ మధ్యనే మతి చెదిరిపోయింది కావాల్నంటూ చింతించేవాడేను. ఏవంటారు?"    
    "అలా అని ఎవరనుకుంటార్లేండి?"
    "అహ ...... మాటవరసకి చెప్తూన్నాను. లేక పోతే మీ కొట్టుముందు తచ్చాడట మేమిటి చెప్పండి."
    షావుకారు మొహమాటంగా నవ్వేడు.
    కాసేపు ఏవో విషయాలు మాట్లాడుకున్నా రిద్దరూ. రాను రాను షాపులో రద్దీ ఎక్కువవడం గమనించి, "వొస్తానంటూ లేచీ నిలబడ్డారు జానకి రామయ్యగారు. అప్పటిగ్గాని షావుకారి మోహంలో ఆనందం మెరిసింది కాదు.
    జానకిరామయ్యగారు మెట్లుదిగుతూ "నా మాటల్తో అతని బేరం ఏమైనా పాడయ్యిందో ఏమో. మరి కాదూ - వ్యాపారమా! బాతాఖానీ క్లబ్బా?" అని నొచ్చుకున్నారు.
    ఈమధ్య కనిపించే ప్రతివాళ్ళతోనూ అధికంగా మాటాడేయటం ఒకటి అలవాటయింది. ఇది కొత్త అలంకారం కాబోలు.
    రోడ్డుమీది కొచ్చిన తరువాత కోటయ్య పంతులు గుర్తు కొచ్చేడు. అతన్ని కలుసుకుని నలుగు రోజు లవుతుంది. ఈరోజైనా వెళ్ళి పలుకరించి వస్తే బావుంటుందనుకుని పంతులింటి వైపు నడకని మళ్ళించారు.
    పంతులింటి కొచ్చేసరికి, ఆ యింట్లోనుండి చిన్నసైజు గలాటా బయటకు వినిపిస్తూంది. వీధిలోనే నిలబడిపోయారు జానకిరామయ్య.
    "అవున్నాన్నా! అది అన్నదాంట్లో తప్పేముంది?" ఇది కోటయ్య పంతులికొడుకు గొంతు.
    "ఏమిట్రా నీ ఉద్దేశ్యం?"
    "కాఫీ తాగాలనిపించినప్పుడు, కాఫీ కావాలని అడగటానికి నీకు అభిమానమైతే, నువ్వడగనిదే కాఫీ యివ్వడానికి దానికి మాత్రం అభిమానం కాదూ?"
    "దీన్లో అడిగే దేముందిరా ..... సాయంత్రం ఫలానా వేళకి కాఫీ కావలసి వొస్తుందని ఆపిల్లకి తెలీదా?" పంతులు అన్నారు.
    "ఇది మరీ బాగుంది. టైం ప్రకారం అన్నీ అమర్చిపెట్టేందుకు యీ ఇంట్లో పనిమనుషులెవ్వరూ లేరు. ఈ ఇంటిది చాకిరీ నా ఒక్కదాని నెత్తిమీద వేసుకుని సతమత మైపోతున్నాను బాబూ" అన్నది పంతులి కోడలు.
    "చాల్లే, నోరుమూసుకుని అవతలికెళ్ళు. అంతా నీవల్లే జరుగుతుందసలు." కొడుకు కసురుకున్నాడు.
    "అవును తప్పంతా నాదె. పాపిష్టిదాన్ని."
    "ఛీ ..... ఛీ ..... వెధవకొంప. క్షణం శాంతి లేదు...." అని అంటూ కోటయ్య కొడకు బయట కొచ్చేశాడు. జానకిరామయ్యగార్ని చూసి గతుక్కుమన్నాడు. ఏమీ మాటాడలేక, ఇంట్లోకి చూస్తో వాళ్ళ నాన్నని ఉద్దేశించి.
    "జానకిరామయ్యగా రొచ్చారు. వెళ్ళండి మాస్టారూ-మా నాన్న ఇంట్లోనే ఉన్నాను" అనేసి అరుగు పక్కనున్న సైకిలు తీసుకుని వెళ్ళిపోయాడు.
    పంతులే బయట కొచ్చేరు.
    "ఎంతసేపయింది నువ్వొచ్చి?"
    "ఇప్పుడే."
    "అలా పార్కుకి వెళ్ళొద్దాం. ఉండు. ఒక్క క్షణం. ఇప్పుడే వొస్తాను." అని పంతులు ఇంట్లోకివెళ్ళి చెప్పులు తొడుక్కుని వొచ్చారు.
    ఇద్దరూ పార్కువైపు బయలుదేరారు. పార్కులో ఓమూల కూర్చున్నారు. జానకి రామయ్యగారు బఠానీలు తెప్పించారు. ఇద్దరి ముందు పోయించారు. పంతులు ఒక్క బఠాణి గూడా ముట్టుకోలేదు. జానకిరామయ్యగారు అడుగుతే వొద్దని చెప్పారు.
    "నువ్వొచ్చేసరికి మా యింట్లో చిన్న యుద్ధం జరుగుతోంది" అన్నారు కోటయ్యపంతులు.
    "కొంత విన్నాను."
    "మరేంలేదు. నామాటంటే ఆ యిద్దరికీ లెక్కలేకుండా పోయిందోయ్" అన్నారు కోటయ్య పంతులు బాధగా.
    "ఛ ..... అవేం మాటలూ?"
    "ఉన్నమాటే అంటున్నాను."
    "అక్కడే పొరపడుతున్నావోయ్ పంతులూ! దీంట్లో తప్పంతా వాళ్ళదే నని నే చెప్పను. మనం పెద్దవాళ్ళమయ్యేకొద్దీ కొన్ని తలతిక్క పనులు చేస్తూంటాం. నీకు కాఫీ తాగాలని అనిపించిందే అనుకో. ఆ సంగతి అనేస్తే కాఫీ యిచ్చేదేగా నీ కోడలు. కానీ-నువ్వు కాఫీ అడగవు. అడక్కుండానే కాఫీ రావాలనే పంతం నీది. అసలే యింటెడు చాకిరీతో ఆపిల్ల పగలంతా అలసిపోయి ఉంటుంది. ఇలాంటప్పుడు విసుగూ చిరాకూ కలగడం సహజం. అన్నీ సర్దుకుపోయే సుగుణం నీలో ఉంటే అసలీ గలాటా జరగదనే నా ఉద్దేశ్యం."
    "నువ్వన్నీ యిలాగే చెప్తావ్. ఎంత విషయాన్నైనా అలా గోటితో తీసిపారేసి 'ఏముందీ-యింతేగా' అనడం నీకు అలవాటైపోయింది."
    జానకిరామయ్యగారు నవ్వేరు. పంతులి భుజం తట్టి.
    "జీవితానికి మరో అర్ధం ఏమిటో తెలుసా? -సహనం" అన్నాడు.
    "పోనిచ్చావ్ కాదు నీ పాఠాలు చెప్పుకునే బుద్ధి!" అన్నారు కోటయ్యపంతులు రుసరుస లాడుతూ.
    జానకిరామయ్యగారు పంతులి విషయం మార్చి తన విషయంలోకి వొచ్చారు. పెద్ద కొడుకు, పంపిన పైకమూ, అతను రాసిన విషయాలూ చిన్నకొడుకు ఉద్యోగ ప్రయత్నాలూ వివరించారు. అన్నింటికీ ఊఁ కొట్టడం పంతులి వంతయ్యింది అంతేగాని, రోజూ వాదించేలా యీనాడు వాదించలేదు.
    దీంతో జానకిరామయ్యగారు కూడా చప్పబడి పోయేడు. దాదాపు ఏడూ గంటలకి యిద్దరూ పార్కునుంచి కదిలారు. కొంత దూరం కలిసి నడిచి, అక్కడ్నుంచి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళి పోయారు.
    జానకిరామయ్యగారు యింటికి రాగానే సుశీల అడిగింది. "వెచ్చాలేవి నాన్నా" అని.
    జానకిరామయ్యగారు నాలుక్కరుచుకున్నారు. తన మతిమరుపుని మరోమాటు తిట్టుకున్నారు. సుశీల పకా పకా నవ్వింది.
    "నే నప్పుడే అనుకున్నాను యింతపనీ అవుతుందనీ."
    "పోనీలేమ్మా, రేపు ఉదయం జ్ఞాపకం పెట్టుకుని తప్పకుండా పట్టుకొస్తాను సరేనా?"
    "జ్ఞాపకం పెట్టుకున్నట్టు నేను మళ్ళీ రేపు ఉదయం జ్ఞాపకం చెయ్యాలి కాబోలు ఖర్మం" అన్నది సుశీల.
    జానకిరామయ్యగారు చిన్నగా నవ్వేరు.
    భోజనం ముగించి చదువుకునేందుకు 'గీత' తెహ్రిచారు జానకిరామయ్య. ఆ పుస్తకం మధ్యలో పెట్టి ఉంది-మధ్యాహ్నం నిరంజనానికి రాసిన ఉత్తరం.
    జానకిరామయ్యగార్కి సిగ్గు వేసింది. ఇది సుశీలకి తెలుస్తే మళ్ళా ఏదో ఒకటి అంటుందని ఆ ఉత్తరాన్ని గోడకు తగిలించిన కోటు జేబులో భద్రంగా దాచడానికి లేచారు.
    గుమ్మం దగ్గర నుంచున్న సుశీల మళ్ళా నవ్వింది.
    "ఏమిటి నాన్నా, మరీ యింత మతిమరుపైతే ఎలా?"
    "నిజమే సుమా!" అన్నా రాయన నవ్వు తెచ్చుకుంటూ.
    పది గంటలకి లైట్ ఆర్పి నిద్రపోడానికి కళ్ళు మూసుకున్నారు. నిద్ర పట్టడంలేదు. ఏవో ఆలోచనలు.
    పాపం..... పంతులు, కొడుకుని ఆశ్రయించి సుఖాన్ని దూరంచేసుకుంటున్నాడేవిటి? పంతులు అమాయకుడు. పట్టిన పట్టు ఒక పట్టాన వొదిలి పెట్టే రకం కాదు. ఈ వయస్సులో, ఒకళ్ళని ఆశ్రయించి యింకా యీ పట్టుదలలూ, పంతాలు ఏమటసలు?
    ఈ పంతులే అంటాడు. 'అంతస్థుతో కులుకుతూన్న కొడుక్కి తండ్రి కనిపించడ'ని.
    పంతులు కొడుకు లాటివాడేనా నిరంజనం? అనుకోకూడదు గాని, తనని తలమీద పెట్టుకు పూజిస్తాడు నిరంజనం. ఇప్పటివరకూ తనమాట కెదురు చెప్పి ఎరుగడు. తన అదృష్టం కొద్దీ రత్నల్లాటి కొడుకు లిద్దరు కలిగారు. చూస్తున్నారుగా-తండ్రులకీ, కొడుకులకీ మధ్య నెంత అఘాతాలుంటున్నాయో?
    అనివిధాలా తాను అదృష్టవంతుడే.
    శంకరానికి చక్కటి ఉద్యోగం దొరికి, సుశీలకు మంచి సంబంధమొచ్చి, ఓ యింటిదై పోతే- యిక తనకే సమస్యా ఉండ దసలు. ఎవళ్ళ దగ్గరో ఒకళ్ళ దగ్గర-లేదా-కొన్నాళ్ళు ఒకళ్ళ దగ్గరా మరికొన్నాళ్ళు మరొకళ్ళ దగ్గర, యిలా వంతులవారీగా ఉండి కృష్ణా రామా అంటూ కాలం గడిపేయవచ్చు.
    ఆ రాత్రి జానకిరామయ్యగారికి అలాటిదే ఒక చక్కటి కల వొచ్చింది.

                                       *    *    *

 Previous Page Next Page