Previous Page Next Page 
ఏటి ఒడ్డున నీటిపూలు పేజి 4


    పుస్తకాలు చదవడంకూడా ఒక వ్యసనమే. 'వైతాళికులు' లోని రచనలు, శ్రీదేవి, పద్మ ఎన్నుకున్నవి చారుమతి భావయుక్తంగా తియ్యగా పాడేది. పద్మకి పెళ్ళి నిశ్చయం అయ్యాక ఏడిపించడానికి ప్రేమ పాటలు, ప్రేమకవిత్వం వినిపించేవారు స్నేహితురాళ్ళిద్దరు.
    "ఇంకేం ఉంది! పెళ్ళి అవగానే పద్మ మనల్ని మరిచిపోతుంది. ఆయన దగ్గిరికి ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఇప్పటినించే ప్రతి క్షణం ఎదురు చూస్తూ ఉంటే!" అంది శ్రీదేవి ఒక రోజు.
    "కృష్ణశాస్త్రిగారి రచనలోలా ఆయన 'పల్లకీ' పంపుతారేమో" అంది చారుమతి నవ్వుతూ.
    "ఏదీ 'పల్లకీ' పాడు, చారూ!" బలవంతం చేసింది శ్రీదేవి.
    ముగ్గురికి ఇష్టం ఆ రచన. పద్మకు ఇప్పుడు అందులో కొత్త అర్ధాలు స్ఫురించాయి.
    చారుమతి తీయటి గొంతుకతో పాడింది.
    "ప్రాణసఖుడేనా కోసమై పంపినాడు
    పల్లకీ అన హృదయమ్ము జల్లుమనియె    
    వీడని వియోగమున వేగు మ్రోడు మేను
    తలిరు తోరణమై సుమదామ మాయె!
    చెదరు చేతుల నెటో కయిసేసుకొంటి
    మొయిలు వసనంములో, ప్రొద్దు పొడుపు నగలో,
    ఏదో కాలుచు హాయియో, ఏదో తేల్చు
    భారమో ఏమొ - సైరింప నేరనైతి!
    కొసరు సడల దూగాడుచు కూరుచుంటి
    పూల పల్లకిలో పూలమాల నేను!"
    "పద్మా" అన్న తల్లి పిలుపుతో మళ్ళీ ఈ లోకంలో పడింది పద్మ.
    "ఎంతసేపు అలా కూచుంటావు? కిటికీలోంచి అలా బయటికి చూడకమ్మా నిప్పురవ్వలు కళ్ళలో పడగలవు! కాస్సేపు పడుకోకూడదూ?" అంది వరలక్ష్మి.
    "నిద్ర రావడం లేదమ్మా" అని పద్మ మళ్ళీ ఆలోచనల్లో పడింది.
    స్నేహితురాళ్ళ ఊహలకి, పద్మ అనుభవాలకి సాపత్యమే లే దిప్పుడు. పద్మ ఒక పెట్టెలోను, మాధవరావు వేరొక పెట్టెలోను కూర్చున్నారు. దారిలో మాధవ రావు ఒక్కసారి కూడా వచ్చి పద్మని చూసి వెళ్ళలేదు. 'సిగ్గేమో? మొహమాటమేమో!' అనుకుంది.
    మద్రాసులో కాంతమ్మగారి ఇంట్లో గృహప్రవేశం పెద్దఎత్తున జరిగింది. పేరంటాలు, భోజనాల హడావిడి అంతా అయ్యాక సాయంత్రం కాంతమ్మ గారు సావకాశంగా కూర్చున్నప్పుడు వరలక్ష్మి మళ్ళీ శోభనం గురించి ఎత్తింది.
    "వదినగారూ, ఆ శోభనం వేడుకకూడా ఈ రాత్రి అయిపోతే, మూడు నిద్రలు అయ్యాక మేము శనివారం వెళ్ళిపోవచ్చును. ఇవ్వాళ అదీ అయిందనిపించెయ్యండి."
    "ఇప్పటి పిల్లలకు మనం చెప్పలేమండీ. అమ్మాయి ఇంకా చదువుకోవాలని అంటున్నాడు అబ్బాయి. శోభనానికి మరీ అంత తొందర ఏముంది? ఇద్దరూ ఇంకా చిన్నవాళ్ళే కదా! అమ్మాయిని రెండేళ్ళు ఉంచుకుని చదివించండి." కాంతమ్మ గారు అసలు విషయం మెల్లిగా తేల్చారు.
    వరలక్ష్మికి అయోమయంగా ఉంది. శోభనం చేసుకోకుండా చదివించమనడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
    "ఇప్పుడు మరి కాపరానికి తెచ్చుకోరా?"
    "అమ్మాయి చదువు అవనీయండి ముందు. కాపరం మాట తరవాత చూద్దాం. ఆఁ, అన్నట్టు చెప్పడం మరిచిపోయాను. మేము మద్రాసులో అరవవాళ్ళ మధ్య ఉంటున్నామా! ఎవరిమధ్య ఉంటే వాళ్ళ ఆచారాలు పాటించక తప్పదు. చూడండి, కోడలు రవ్వల దుద్దులతో, తగినంత సారెతో రాకపోతే మాకు తల కొట్టేసినట్టు ఉంటుంది. ఏమి ఇచ్చినా, ఇవ్వకపోయినా, స్టీలుగిన్నెల సెట్టు, రవ్వల దుద్దులు పెట్టాలి అమ్మాయికి మీరు. మా గౌరవం కాపాడాలి." చావు కబురు చల్లగా చెప్పినట్టు చెప్పింది కాంతమ్మ.
    వరలక్ష్మికి గుండెల్లో రాయి పడింది. బోలెడు కట్నము, లాంఛనాలు, అతి వైభవంగా పెళ్ళి జరపడానికే ఉన్నదంతా ఖర్చు అయిపోయింది. రవ్వల దుద్దు లంటే మాటలా? మళ్ళీ ఎక్కడినించి తెస్తారు?
    పద్మ ఏ తీపి అనుభవము, ఏ మధురభావము లేకుండానే పుట్టింటికి వచ్చేసింది. 'కూతురికి పెళ్ళి చేశాం. పెళ్ళి బాగా జరిగింది' అన్న సంతోషం పోయి, వరలక్ష్మి మనస్సులో దిగులు ఆవరించింది.
    
                                                         5

    రేవతి భర్త గోపాలరావుకి యూనివర్శిటీ రిజిస్ట్రారు ఆఫీసులో పని. డాబా గార్డెన్స్ లో ఇల్లు తీసుకున్నాడు. పెద్ద జీతపరుడు కాకపోయినా, అప్పులు చెయ్యకుండా భార్యాబిడ్డలను పోషించుకు రాగలుగుతున్నాడు. చారు మతికి ఉద్యోగంకోసం ప్రయత్నాలు చేశాడు. టీచరు ఉద్యోగం దొరక్కపోయినా, ఏదో ఒకటి దొరికితే చాలని నలుగురు పెద్దల దగ్గిరికి ఆఫీసులకి తిరిగాడు. పది రోజులు గడిచినా ఏ ప్రయత్నమూ అనుకూలించలేదు. ఇంతలో కాకినాడనించి భానుమతి చెల్లెలు చారుమతికి ఉత్తరం వ్రాసింది. అందులో సూర్యారావుకి హార్టు అటాక్ వచ్చిందనీ, ఆసుపత్రిలో చేర్చారనీ, వెంటనే రేవతినీ, పిల్లలనీ వెంటబెట్టుకుని వచ్చెయ్యమనీ వ్రాసింది.
    ఉత్తరం చూసుకుని చారుమతి, రేవతి, పిల్లలు కాకినాడ బయలుదేరారు. దారిలో అక్కచెల్లెళ్ళు ఇద్దరూ ఇంటి విషయాలే మాట్లాడుకున్నారు.
    రేవతి అడిగింది: "నాన్నకి ఒంట్లో బాగులేదా? నువ్వు చెప్పనేలేదేం?"
    "నాన్నకి ఎప్పుడూ ఉన్న అనారోగ్యమే. నీకు తెలుసుగా. ఉబ్బసంతో రాత్రి నిద్రపట్టకుండా బాధ పడతారు. మందులు వేసుకుంటూంటే మధ్య తగ్గుతుంది. హార్టు అటాక్ ఎలా వచ్చిందో తెలీదు." దిగులుగా అన్నది చారుమతి.
    రేవతికి ఎదిగిన చెల్లెళ్ళ పెళ్ళిసమస్య మనస్సులో వేధించింది.
    "భానుకు ఏమైనా సంబంధాలు చూస్తున్నారా?"
    "ఏం చూస్తారక్కా? ఇంటివిషయం నీకు తెలియంది ఏముంది? నాన్న జీతమంతా తిండికి, చదువులకి సరిపోతుంది. కట్నాలకి డబ్బు ఎక్కడినించి తేగలరు?"    
    "నిజమేననుకో. కాని భానును ఎన్నాళ్ళు ఉంచుకుంటారు? మీరైతే అంతా ఏదో చదువుకుంటున్నారు. ఉద్యోగాలు చేసుకుని బ్రతకవచ్చు. భాను చదువు వానాకాలం చదువైపోయింది. థర్డుఫారంకూడా గట్టెక్కని దాని బ్రతుకేంగాను?"
    చారుమతి మాట్లాడలేదు. ఆలోచిస్తూ కూర్చుంది. భానక్కకూడా చదువుకుని ఉంటే బాగుండును. కాని ఇరవై మూడేళ్ళ భానుకి ఇప్పుడు చదువు బుర్రకేం ఎక్కుతుంది?
    ఇద్దరు ఇంటికి చేరేసరికి సూర్యారావును ఆసుపత్రి నించి ఇంటికి తీసుకువచ్చేశారు. మధ్యగదిలో కిటికీ పక్క వేశారు అతని మంచం. కూతుళ్ళిద్ధరినీ చూడగానే కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు ఆయన. "వచ్చారా, అమ్మా" అంటూ ఇద్దరినీ చెరో చేత్తోను దగ్గిరికి తీసుకుని కళ్ళనీళ్ళు నింపుకున్నారు. ఆయన కళ్ళలో ఏదో దిగులు, భయం. తండ్రి పరిస్థితి చూసిన కూతుళ్ళిద్దరూ నీరుగారిపోయారు. రేవతి దిగులు దిగమింగుకొని అనునయంగా తండ్రిని అడిగింది: "ఎలా ఉంది నాన్నా, ఒంట్లో?"
    కంటనీరు పెట్టుకొంటున్న చారుమతిని భాను పక్కగదిలోకి లాక్కువెళ్ళింది. "నాన్నతో ఎక్కువ మాట్లాడవద్ధనీ, పూర్తి విశ్రాంతి ఇవ్వాలనీ డాక్టరు గారు చెప్పారు. ఆయనకి బాధ కలిగించే పనులేవీ చెయ్యకూడదు మనం" అని చెప్పింది. అక్క ఒళ్లోనే తల పెట్టుకుని వెక్కివెక్కి ఏడ్చింది చారుమతి.
    సూర్యారావుగారి అనారోగ్యం గురించి విని తెలిసిన వాళ్ళంతా చూడడానికి వచ్చారు. సాయంత్రం శ్రీదేవి వచ్చింది. తను బి. ఎ.లో చేరింది. చారుమతి, శ్రీదేవి డాబామీదికి వెళ్ళి కూర్చున్నారు. చారుమతి తన ప్రయాణవిశేషాలు, రాధాకృష్టతో పరిచయం అతనితో జరిగిన భయంకరమైన అనుభవం, అన్ని చెప్పింది. అంతా విని నొచ్చుకుంది శ్రీదేవి.
    "విశాఖపట్నం వెళ్ళినందుకు ఈ అనుభవమే మిగిలింది. పనేమీ కాలేదు" అంది చారుమతి.
    "మగవాళ్ళు మంచిగా ఎందుకుండరో తెలీదు. పెళ్ళయినవాడు కదా, అతను ఎందుకు అలా ప్రవర్తించాడో?" అంది శ్రీదేవి.
    "అతనికి పెళ్ళి అయిందా?" ఆశ్చర్యంగా ప్రశ్నించింది చారుమతి.
    "బాగుందే, పదిహేనువేలు కట్నం తీసుకుని అమలాపురం అమ్మాయిని చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు. అతని భార్య ఎంతో బాగుంటుంది. రంభలా ఉంటుంది. ఇతనే దేభ్యంలా ఉంటాడు."
    "నీకు ఇతన్ని తెలుసా?"
    "తెలియకేం? మా మామయ్యకూడా లాయరు కదా! రాధాకృష్ణ నాన్నగారు, మామయ్య స్నేహితులు. ఇతను ప్రాక్టీసు విషయం పట్టించుకోడనీ, డబ్బు అల్లరిచిల్లరిగా తగలేస్తాడనీ వాళ్ళ నాన్న మామయ్య దగ్గిర ఎప్పుడూ గోలపెడతాడుట."
    చారుమతి వింటూ తెల్లబోయింది. 'శ్రీదేవి మామయ్యకు ఇన్ని విషయాలు తెలిసినప్పుడు, వాళ్ళ ఇంట్లోనే పనిచేస్తున్న నాన్నకి రాధాకృష్ణ విషయాలేవీ తెలియవా? తెలిసీ, పట్టించుకోడా? ఇంత అమాయకుడేమిటి నాన్న?' అనుకుంది చారుమతి.
    మౌనంగా కూర్చున్న చారుమతిని చూస్తూ శ్రీదేవి అంది:    
    "పద్మ కాలేజీలో చేరింది, తెలుసా? ఇంటర్ లో చేరింది. నిన్నటినించి కాలేజీకి వస్తూంది."
    "పద్మ మద్రాసునించి ఎప్పుడు వచ్చింది? మళ్ళీ చదువుతూందా?" ఆశ్చర్యంగా అడిగింది చారుమతి.
    మద్రాసునించి వచ్చి వారంరోజులయింది. వాళ్ళ అత్తగారూ వాళ్ళు పద్మని చదివించమన్నారుట."
    "ఎంత అదృష్టం పద్మది! చదువుయోగం ఉంటే ఎలాగో అలాగ చదువుకునే అవకాశం వస్తుంది" అంది చారుమతి తనకు కాలేజీలో చదివే భాగ్యం లేనందుకు చింతిస్తూ.
    చదువులోంచి మళ్ళీ ఇంటి పరిస్థితుల మీదికి మళ్ళింది ప్రసక్తి. తండ్రిమాట తలపోస్తూ, "శ్రీదేవీ, నా కేదేనా ఉద్యోగం దొరికితే బాగుండునే. నాన్నకి కొంచెం ఆసరాగా ఉండవచ్చు. ఆయన పని తగ్గించుకుని కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చు." బాధ పడుతూ అంది చారుమతి.
    "మనం గరల్స్ హై స్కూలుకు వెళదాం ఒకసారి. హెడ్ మిస్ట్రెస్ ఏమైనా సహాయం చెయ్యవచ్చు" అంది శ్రీదేవి.
    ఆ సూచన చారుమతికి కూడా నచ్చింది.
    "సరే. ఎల్లుండి మధ్యాహ్నం మనం ఆమెదగ్గిరికి వెళదాం. మీ ఇంటికి వస్తా. ఇద్దరం కలిసి వెళదాం" అంది.
    శ్రీదేవి ఇంట్లో అందరిదగ్గిరా సెలవు తీసుకుని, సూర్యారావుగారికి నమస్కరించి వెళ్ళిపోయింది.
    మరునాడు మధ్యాహ్నం భోజనాలయ్యాక, అందరు తలోమూల వాలారు ఇంట్లో చారుమతి వీథివైపు ఉన్న గదిలో కూర్చుని, కిటికీలోంచి అలా వీథిలోకి చూస్తూంది. శంకరం, మాలతి, భవవతి స్కూళ్ళకి వెళ్ళిపోయారు. అమ్మా, నాన్నమ్మా వెనక వరండాలో మేను వాల్చారు. భానక్క వరండాలో కూర్చుని జాకెట్టు కుడుతూంది.
    "అమ్మా, చారూ, ఇలా రా!" నాన్న గొంతుక సన్నగా వినిపించింది.
    "ఏం కావాలి, నాన్నా?" అంటూ లోపలికి పరిగెత్తింది చారుమతి.
    "చూడమ్మా, నా కోటుజేబులో పాతిక రూపాయలు, మనియార్డరు ఫారం ఉన్నాయి. ఇలా తీసుకురా."
    చారుమతి కోటుజేబులోనించి డబ్బు, మనియార్డరు ఫారం తీసింది. ఫారం తండ్రి వ్రాతలోనే పూర్తిచేసి ఉంది. "బి. శారదమ్మ, కోటవీథి, విజయనగరం" అన్న అడ్రసు. కొత్తగా ఉన్న ఆ పేరు చూసి చారుమతి ఆశ్చర్యపోయింది.    
    సూర్యారావు ఫారం తీసుకుని సరిగ్గా ఉందో లేదో చూశాడు.
    "పోస్టాఫీసు కి వెళ్ళి మనిఆర్డరు చేసి వస్తావా, తల్లీ" అన్నాడు, మని ఆర్డరు ఫారం, డబ్బు చారుమతి చేతిలో ఉంచుతూ.
    చారుమతి కుతూహలం నిగ్రహించుకోలేక పోయింది.
    "ఎవరు, నాన్నా, ఈమె? ఎప్పుడూ ఈ పేరు వినలేదు. ఎందుకు డబ్బు పంపుతున్నావు?"
    "ఈమె నీకు మేనత్త వరస అవుతుంది. నాకు పినతల్లి కూతురు. భర్త లేడు. బొత్తిగా బీదరికంలో ఉంది. అందుకే ఈ డబ్బు పంపుతున్నాను. ఎంతలే, తల్లీ! ఈ డబ్బు ఏం సరిపోతుంది ఆమెకు? నా చేత నైనది పంపుతున్నానన్న సంతృప్తి కోసం పంపడం." సగం పైకి, సగం స్వగతంగా మాట్లాడాడు సూర్యారావు.
    'ఎన్నాళ్ళనించి పంపుతున్నావు? అమ్మకు తెలుసా?' ఎన్నో ప్రశ్నలు చారుమతి లోపలే అణిచివేసుకుంది. ఎక్కువగా మాట్లాడితే తండ్రికి ఆయాసం రావచ్చు.
    చారుమతి మాట్లాడకుండా పోస్టాఫీసుకు వెళ్ళి డబ్బు పంపించింది. మనసులో మాత్రం మథనపడుతూనే ఉంది. ఇంట్లో అంతా డబ్బుకు ఇబ్బంది పడుతూంటే, ఈయన పాతిక రూపాయలు ఎవరికో ఎత్తి పంపడమేమిటి?

 Previous Page Next Page