Previous Page Next Page 
రాంభరోసా అపార్ట్ మెంట్స్ పేజి 4


    అందరం భయపడ్డాం-
    "సాధారణంగా బాంబులు స్కూటర్ లోనే పెడుతుంటారు!" అన్నాడు  రెడ్డి మాతో రహస్యంగా. అందరూ కాసేపు డిస్కస్ చేసుకుని వెంటనే పోలీస్ కి ఫోన్ చేశాం-
    మరికాసేపట్లో ఒక పెద్ద వ్యాన్ వచ్చి ఆగింది.
    "పోలీసులు ఇంత ప్రాంప్ట్ గా వచ్చారంటే చాలా గ్రేటే" అన్నాడు చౌదరి.
    "అలా అనుకోకండి! పోలీస్ ఇప్పుడు అదివరకులాగా కాదు. చాలా ఎడ్వాన్స్ అయిపోయారు" అన్నాడు శంకరమూర్తి.
    అందరం వ్యాన్ దగ్గరికెళ్ళి మూగేసరికి ఓ లావుపాటి వ్యక్తి సఫారి సూట్ లో ముందు సీట్లోంచి దిగాడు.
    "పెద్ద సి.ఐ.డి. ఆఫీసరయివుంటాడు" అన్నాడు మొహిందర్.
    అందరం అతనికి నమస్కారం చేశాం.
    "ఇంత త్వరగా మీర్రావడం చాలా హ్యాపీగా ఉందిసార్" అన్నాడు హమీద్ మియా.
    "ఇంతకూ ఆ స్కూటర్ ఎక్కడ?" అడిగాడతను.
    అందరం అతనిని తీసుకెళ్ళి స్కూటర్ చూపించాం.
    "ఏయ్ రాందాస్! కెమెరా తీసుకురా!" అంటూ అరిచాడతను.
    వెంటనే తుగ్లక్ న్యూస్ చానెల్ పేర్రాసివున్న కెమెరా వ్యాన్ లో నుంచి తీసుకొచ్చాడు ఓ వ్యక్తి.
    అప్పుడు గానీ మాకర్ధం కాలా! వాళ్ళు పోలీసులు కాదు, ఆ చానెల్ కెమెరా మెన్, ఇతర సిబ్బందీ అని.
    "మీరెలా వచ్చారు? మేము ఫోన్ చేసింది పోలీసులకు కదా" అడిగాడు రెడ్డి.
    "పోలీసులు ముందు మమ్మల్ని పంపుతారండీ! వాళ్ళు ఇక్కడికి రావడం విచారణ మొదలెట్టడం ఇవన్నీ టీవీ చానల్స్ కవరేజీ లేకుండా ఎలా చేస్తారు వాళ్ళు?"
    అప్పుడే అతనికి ఫోన్ వచ్చింది.
    "ఏమోయ్ రాజా! ఆ మెంటల్ అపార్టుమెంట్ కి చేరుకున్నారా?"
    "ఎప్పుడో వచ్చాం సార్ ఇంతసేపా?"
    "సరే అయితే మేమూ స్టార్టవుతాం!"
    మా అపార్ట్ మెంట్ లో ఫ్యామిలీస్ అన్నీ టీవీ కెమెరా చుట్టూ మూగిపోయాయి.
    టీవీ ఛానల్లో కనబడతాం అన్న విషయం తెలిసేసరికి లేడీస్ అర్జంట్ గా మేకప్ చేసుకుని లేటెస్ట్ గా కొన్ని కాస్ట్ లీ శారీస్ కట్టుకు వచ్చేశారు.
    అలాంటి వ్యూయర్స్ చానల్స్ కి వరప్రసాదం గనుక వెంటనే కెమెరామెన్ షూటింగ్ స్టార్ట్ చేశాడు.
    "హలో వెంగమాంబా! ఇక్కడ ఈ రామ్ భరోసా అపార్టు మెంట్స్ లో ఒక స్కూటర్ అంటే ఎవరిదో తెలీని స్కూటర్- నిన్నటి నుంచీ పార్క్ చేసి ఉంది. ఇదెవరిదో ఎవరికీ తెలీడం లేదు! టెర్రిస్టులు ఇందులో బాంబ్ పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు వెంగమాంబా."
    "ఆ అపార్ట్ మెంట్స్ లో ఉన్నవాళ్ళు ఈ పరిస్థితి చూసి ఎలా ఫీలవుతున్నారు రాజూ?"
    "వెంగమాంబా! ఇప్పుడే అపార్ట్ మెంట్స్ లో వాళ్ళంతా ఇక్కడకు చేరుకున్నారు. వాళ్ళు చాలా భయపడుతున్నారు వెంగమాంబా! ఏ క్షణాన బాంబ్ పేలుతుందోనని- ఇప్పుడే వాళ్ళతో మాట్లాడధాం-"
    "మేడమ్- మీ పేరేంటి?"
    "అసలు పేరు వింధ్యగానీ మరీ పర్వతం పేరు బాగుండదని మావారు సంధ్య అంటారండీ"
    "చూడండి సంధ్యగారూ! ఇప్పుడు ఈ ఓనర్ షిప్ తెలీని ఈ స్కూటర్ మీ అపార్ట్ మెంట్స్ మధ్యలో- లోపల బాంబ్ అమర్చి ఉందేమో అని అనుమానం కలిగిస్తున్న నేపథ్యంలో మీకెలా అనిపిస్తోంది? అయ్ మీన్ మీఫీలింగ్స్ ఎలా ఉన్నయ్?"
    "చాలా హ్యాపీగా ఉందండీ!"
    "ఎందుకని హ్యాపీగా ఫీలవుతున్నారు?"
    "ఎప్పుడూ ఇలాంటి వార్తలు టీవీలో చూడ్డమేగానీ ఇలా మాకే అనుభవంలోకి రావటం చాలా హ్యాపీగా ఉంటుంది కదా!"
    చప్పున పక్కనున్నావిడ అందుకుంది.
    "అదీగాకుండా మా కెప్పటినుంచో టీవీలో కనబడాలని కోరికండి. ఈ చుట్టుపక్కల కాలనీల్లో ఉన్న రెండు లక్షల మంది ఏదొక టీవీ ప్రోగ్రామ్ లో కనబడ్డవారే గానీ మాకే ఆ ఛాన్స్ రాలేదు-"
    "నగరంలో పెరిగిపోతున్న ఈ బాంబ్ కల్చర్ గురించి మీరేమనుకుంటున్నారు?"
    "అమాయకులను ఇలా చంపటం అన్యాయం అని నేను ఆ బిన్ లాడెన్ కి చెప్పాలనుకుంటున్నాను. అంతేకాదు, ఆ బిన్ లాడెన్ ఏదొక రోజు నాకు కనబడకపోడు అప్పుడు నాలుగూ దులిపేస్తాను" కోపంగా అందామె. అందరూ నవ్వేసరికి ఆమెకు కోపం వచ్చి వెళ్ళిపోయింది.
    "రాజా! ఇప్పుడు ఆ స్కూటర్ ని ఏం చేయబోతున్నారు?"
    "ఇంకాసేపట్లో పోలీసులు వస్తున్నారు వెంగమాంబా- వచ్చాక యాంటీబాంబ్ స్క్వాడ్ వాళ్ళతో ఆ స్కూటర్ అంతా చెక్ చేయిస్తారు. ఒకవేళ అందులో నిజంగానే బాంబ్ ఉంటే దానిని డిఫ్యూజ్ చేస్తారు వెంగమాంబా!"
    "ఈ స్కూటర్ ని ఆ టెర్రరిస్ట్ లు ఇక్కడ పెట్టి వెళ్ళిపోవటం కాలనీ వాచ్ మెన్ చూశాడా?"
    "చూశాననే వాచ్ మెన్ చెప్తున్నాడు వెంగమాంబా!
    "అయితే అతన్ని అప్పుడే ఎందుకు పట్టుకోలేదు రాజూ? ఏ కారణంగా ఆ టెర్రరిస్ట్ ని చూసి కూడా వదిలేయాల్సి వచ్చింది?"
    "ఆ విషయం వాచ్ మెన్ నే అడుగుదాం వెంగమాంబా- హలో నీ పేరేంటి?"
    "సింగినాధం సార్"
    "సింగినాధం- నువ్ టెర్రరిస్ట్ లు స్కూటర్ తేవటం చూశానన్నావ్ కదా! మరి వాళ్ళని అప్పుడే ఎందుకు పట్టుకుని పోలీసులకు అప్పగించలేదు?"
    "మంచిగున్నారే సార్- ఆళ్ళు టెర్రరిస్ట్ లని నాకేం తెలుసు? 'సి' బ్లాక్ లో గీజర్ రిపైర్ ఉందని బుక్ లో రాశారు. అందుకని ఎలక్ట్రీషియన్ అనుకుని పంపించాను-"
    "ఇప్పుడు మళ్ళీ అతనిని చూస్తే గుర్తుపడతావా?"
    ఈ అపార్ట్ మెంట్స్ లోకి రోజుకి రెండువేల మంది విజిటర్స్ వచ్చి పోతూంటారండీ! అంతమందిలో మీరు గుర్తుపడతారా?" జర్నలిస్ట్ రాజుకేం చెప్పాలో తెలీలేదు.
    "ఇంతే వెంగమాంబా- సింగినాధం ఇంతకంటే ఎక్కువ. ఇన్ ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాడు-"
    వెంటనే వెంగమాంబా విజ్రుంభించింది.
    ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న మా ప్రేక్షకులందరూ వాచ్ మెన్ తను డ్యూటీని సక్రమంగా నిర్వర్తించాడనుకుంటున్నారా లేక నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా వ్యవహరించాడనుకుంటున్నారా? అనే విషయం వెంటనే నాలుగు జీరోలకు ఎస్సెమ్మెస్ చేయండి. ఎస్.ఎం.ఎస్ లో మీ పేరు, ఊరు రాయటం మరిచిపోకండి. ఎస్సెమ్మెస్ చేసినవారి పేరు, వాళ్ళ గాళ్ ఫ్రెండ్ లేక బాయ్ ఫ్రెండ్ పేరూ మా చానెల్లో చూపిస్తాం.
    ప్రస్తుతానికింతే రాజా! పోలీస్ వచ్చాక మళ్ళీ మాట్లాడతాను. అంతవరకూ నీ కెమెరాని ఆ స్కూటర్ దగ్గరే పాతేసి ఉంచు. ఎవరెవరొస్తున్నారు? ఆ స్కూటర్ గురించి ఏమనుకుంటున్నారు? అన్నీ మన ప్రేక్షకులకు ప్రత్యక్షంగా చూపించే అవకాశం కలిగిద్దాం-"

 Previous Page Next Page