Previous Page
పాఠకులున్నారు జాగ్రత్త! పేజి 39


    "అవును డాడీ! పాపం అతను నన్ను ఎంతగానో ప్రేమించబట్టేగదా ఇంత రిస్క్ తీసుకుని యిన్ని వేషాలేశాడు?" అందామె కారణం చెప్పేస్తూ.
    "అఫ్ కోర్స్- అందులో పాయింటుంది!" వప్పుకున్నాడు కల్నల్.
    "అయితే ఇంక లైన్ క్లియరే కదండీ?" అడిగాడు చిరంజీవి.
    "కానీ....." డౌటుగా అన్నాడు కల్నల్.
    "అబ్బా- ఇంకేమిటి డాడీ మళ్ళీ-" గారంగా అంది శ్రీదేవి.
    "ఆఫ్టరాల్- మూడొందల యాభయ్ రూపాయలు తెచ్చుకునే ఎకౌంటెంట్ నీకేం సుఖం యివ్వగలడమ్మా? ఒకపూటే తింది, ఒక కాలికే చెప్పు కొంటాడు-"
    "నా జీతం మూడొందల యాభయ్ కాదు- మూడొందల అరవై-" ఉక్రోషంగా అరచాడు సింహాద్రి.
    సరిగ్గా అప్పుడే చిరంజీవి "అహ్హహ్హహ్హహ్హ" అంటూ విలన్లా నవ్వాడు. కల్నల్ కి వళ్ళు మండిపోయింది.
    "ఎందుకలా నవ్వావ్?" అడిగాడు కోపంగా.
    "మీరు సింహాద్రిని అండర్ ఎస్టిమేట్ చేశారు-"
    "అంటే?"
    "అసలు వాడెవరనుకుంటున్నారు మీరు?" ఫోజుతో అడిగాడు.
    "అంటే వీడి అసలు పేరు సింహాద్రి కూడా కాదా?" పిస్టల్ మళ్ళీ చేతిలోకి తీసుకుంటూ అడిగాడు కల్నల్.
    "అబ్బే పేరు సింహాద్రేలెండి! అందులో మార్పేమీలేదు. కానీ వీడి ఫైనాన్షియల్ స్టేటస్ మీకు తెలీదింకా! వీడు లక్షాధికారండీ! వీడి పేర లక్షల ఆస్తి వుంది..."
    "ట్రాష్" అరచాడు కల్నల్.
    "ట్రాష్ కాదండీ! వీడికి పాతికేళ్ళు వచ్చేవరకూ వీడి ఆస్తికి వీళ్ళ మావయ్య ట్రస్టీ అండీ. వీడి ఆస్తి వీడికి రావటానికి ఇంకొక్క సంవత్సరం గడవాలండీ!"
    "ఇది మరీ ట్రాష్ నేనస్సలు నమ్మను...."
    "తప్పకుండా నమ్మి తీరతారు సార్! ఇంతకుముందు మీరు పోలీసులకు పట్టిచ్చిన వాళ్ళల్లో ఒకతను "నేను సింహాద్రి మావయ్యను" అన్నాడు చూడండి. అతను నిజంగా సింహాద్రి మావయ్యే సార్!"
    కల్నల్ కి వాళ్ళిద్దరూ తనెదురుగ్గా మాట్లాడిన మాటలన్నీ గుర్తుకొచ్చాయ్.
    "మరి అతనిని సింహాద్రి యింతవరకూ ఎప్పుడూ చూడలేదన్నాడుగా?"
    "అలా అనకపోతే వీళ్ళ మావయ్య ఆ మేజిస్ట్రేట్ తో సింహాద్రి పిచ్చివాడని సర్టిఫికెట్ రాయిస్తాడండీ-"
    "ఎందుకా సర్టిఫికెట్టు?"
    "ఎందుకంటేనండీ! వాడసలు వీడికి ఒరిజినల్ మామయ్య కాదన్నమాటండీ! కజిన్ మావయ్య. అందుకని వీడికి పిచ్చి అని సర్టిఫికెట్ రాయించి ఆస్తంతా తను కొట్టెయ్యాలని ప్లాన్ వేశాడండీ"
    "అయ్ సీ" అన్నాడు కల్నల్.
    "మరింక ఓకే కదండీ?" అడిగాడు సింహాద్రి. కల్నల్ సింహాద్రివేపు చూశాడు. సింహాద్రి శ్రీదేవి వేపు చూశాడు. శ్రీదేవి కల్నల్ వేపు చూసింది.
    "ప్లీజ్ డాడీ! కాదనకండి"
    "ఆల్ రైట్!" అన్నాడు కల్నల్.
    అందరి మొఖాలు వెలిగిపోయాయ్!
    "అలాగయితే బర్త్ డేతోపాటు దండలు మార్చుకునే కార్యక్రమం కూడా సాయంత్రమే కానిచ్చేస్తే సరిపోతుంది. ఏమంటావోయ్ చిరంజీవి?"
    "చాలా సూపర్బ్ ఆలోచనండీ! వాళ్ళిద్దరూ ఈడూ జోడూ చాలా బాగుంటారు" అన్నాడు చిరంజీవి.
    తనూ ఏదొకటి కల్పించుకుని మాట్లాడితే తనను షూట్ చేసే విషయం మర్చిపోతాడేమో అని ఆశ పుట్టింది ధనుంజయ్ కి.
    "అవునండీ! చిలకా గోరింకల్లా ఉంటారు" అన్నాడు మధ్యలో జొరబడి.
    కల్నల్ కి ఠక్కున పంజరం, అందులో మాయమయిన చిలుకలు గుర్తు కొచ్చినయ్.
    "అయితే అది నీ పనేనన్నమాట" పిస్టల్ ధనుంజయ్ కి గురిపెడుతూ అన్నాడు.
    "ఏ పనండీ?" భయంగా అడిగాడు ధనుంజయ్.
    "అదే! పంజరం తలుపు తీసి నా చిలకలను వదిలేసింది నువ్వే కదూ?"
    "నాకదేం తెలీదండీ" అన్నాడు గాబరాగా.
    "తెలీందే చిలకాగోరింకా" అంటూ ఎందుకన్నావ్?"
    "మామూలుగా అన్నానండీ"
    "ఐ డోంట్ బిలీవ్"
    "డాడీ!" గారంగా అంది శ్రీదేవి.
    "యస్ బేబీ!"
    "పార్టీకి టైమవుతోంది"
    కల్నల్ టైమ్ చూసుకున్నాడు.
    "మైగాడ్! అర్జంట్ గా నేను మార్కెట్ కెళ్ళాలి. ఎలా?"
    "వెంటనే జీప్ లో వెళ్దామండీ" అన్నాడు చిరంజీవి.
    "మరి ఈ ధనుంజయ్ ని షూట్ చేయడం?"
    "అది ప్రస్తుతానికి పోస్ట్ పోన్ చేద్దాం సార్"
    కల్నల్ ఓ క్షణం ఆలోచించాడు.
    "ఓకే! ఎగ్రీడ్! చూడవోయ్ చిరంజీవీ! బర్త్ డే ఎరేంజ్ మెంట్స్ అన్నీ నువ్వే చేసెయ్. పెళ్లి ఎరేంజ్ మెంట్స్ నేను చూస్తాను. నీకు హెల్ప ర్ గా ఇదిగో ఈ ధనుంజయ్ ను తీసుకో! అండర్ స్టాండ్?"
    "అండర్ స్టాండ్ సార్"
    "అదీగాక ఆ పంజరంలో నుంచి వదిలేసిన నా చిలకలన్నీ తిరిగి తెచ్చిచ్చే వరకూ వీడిని కాల్చగూడదు మనం"
    "అవున్సార్"
    "ఆ పని కూడా నువ్వే దగ్గరుండి చేయించు"
    "ఆల్ రైట్ సర్"
    కర్నల్ సంతృప్తిగా చిరంజీవి భుజం మీద చరచి బయటకు నడిచాడు.    
        
            

                       * * * * *
             -----సమాప్తం------

 Previous Page