"నేను ప్రశ్నలు అడిగేపని లేదు. అనుమానం తగిలిన చోట అడుగుతాను...అందువల్ల నీవు ఏం జరిగిందీ మొదటి నుంచీ వరసగా చెప్పు. అబద్దం చెపితే మాత్రం ఒళ్ళు చీరేస్తాను అది గుర్తుంచుకుని చెప్పు."
"అలాగేనండీ! ఆ రోజు పాపన్న అనేవాడు జైలుకి వచ్చాడు కదండీ, అంతా వాడే చేశాడు. అంతకు క్రితం వరకూ కోళ్ళని దొంగతనం చేసి పట్టు పడ్డాను. అని రాత్రింబవాళ్ళు విచారించటం తప్పించి పారిపోదామన్న ఆలోచన నాకు పిసరంత కూడా రాలేదండి. పాపన్న వచ్చి కిరికిరి పెట్టాడు నా బుర్ర తిరిగిపోయింది అదండీ జరిగింది.
పాపన్న రాంగానే ఏం దొంగతనం చేసి యిక్కడికి వచ్చావు తమ్ముడూ! అని అడిగానంది. వాడేమో సరీగా సమాధానం ఇవ్వలేదు. మీ పోలీసాయన అటు వెళ్ళంగానే గోపన్న దగ్గరచేరి అదేపనిగా గుసగుస లాడాడు. కత్తెర దొంగా చీరాల దోమ్గాకూడా వాళ్ళ దగ్గరచేరటంతో నేను మంచిగా వాళ్ళదగ్గర కూర్చున్నానండి. అప్పుడు...."
"ఊ...అప్పుడు ఏమయింది?" ఆతృతగా అడిగాడు ఇన్ స్పెక్టర్.
అక్కడే వున్న ఇరువురు పోలీసులు మౌనంగా వింటూ చూస్తూ వుండిపోయారు.
"పాపన్న ముందు చెప్పిన విషయాలు నాకర్ధం కాలేదండి. పాపన్న గోపన్న కలిసి పొడి పొడి మాటలు వాడారండి...."
"ఆ పొడి పొడి మాటలు ఏమిటి?" ఇన్ స్పెక్టర్ అడిగాడు.
"ఠాకూర్ బాబు. పదివేలు ఉల్లూకాబచ్చా లల్లాక పిల్లా అవసరం అయితే టోపీలు ఎగరకొట్టేద్దాము ఏడిచాడు చచ్చు వెధవ. జైలులో పెట్టించినంత మాత్రాన మొనగాడు కాలేడు....వాడి పుచ్చతాగే వేడిని చూసి భయపడతామా?" ఇలా రకరకాలుగా అనుకున్నారండి" అంటూ వివరించాడు.
"అమ్మనా కొడుకులు....నేను ఏదో నవ్వుతూ అనుకున్నది నిజం అన్నమాట గాలిలో బాణం వేస్తే అదే తగిలిందే...ఊ....విషయం చాలానే వుంది. ఇంకేం మాట్లాడుకున్నారు?" ఇన్ స్పెక్టర్ కి తడిపొడి మాటలకి అర్ధం బాగానే తెలిసింది.
"మనకి గూల్ మహల్ వుంది కదా? కత్తి రాజుని రంగంలోకి దింపుతానన్నారు. కాని నేనే వద్దన్నాను. నేను సాధించలేక పోతే కదా...! సింహంగాడు వచ్చేశాడు....ఇలా మాట్లాడుకున్నారు. మా ఎవరికి అర్ధం కాలేదు అడిగినా చెప్పలేదు....చివరికి పాపన్న ఏ విషయం చెప్పాడు."
తను గోపన్నని విడిపించి తీసుకెళ్ళటానికి కావాలని జైలుకి వచ్చాడట. అర్దరాత్రి నుంచీ వకటికి రెండుసార్లు లేచి విరోచనాలు అవుతున్నాయి దొడ్డిదాకా తీసుకెళ్ళు అంటాడుట కాపలా పోలీసు తీసుకెళతాడుట__అప్పుడు మత్తు గోలీని కింద పడేస్తాడుట....ఆ వాసన పీల్చి పోలీసాయన పడిపోతాడు. అలాగే కారులో వున్న మరికొందరు పోలీసులని తెలివితప్పించి పారిపోతారుట.
ఈ విషయం మాతో చెప్పి మీరుకూడా వస్తానంటే మాతో తీసుకు వెళతాము అన్నాడు. ముందు మేము భయపడ్డాము.....మా భయం చూసి మేము చాలా పెడదాయన చేతికింద వున్నాము. ఆయన తలుచుకుంటే ఊరు మాడిస్మశానం అవుతుంది. పోలీసు స్టేషనుకి పట్టపగలు నిప్పు పెట్టగలరు. ఏదోలే అని చూసి చూడనట్లు పోతున్నారు. మనిషిని ఇన్ స్పెక్టర్ జైలులో తోస్తాడా....? అసలు యిది ఆయన తప్పుకాదు....బన్సీలాల్ ఆడిన నాటకం.... అంటూ చెప్పాడు.
మేమంతా పారిపోవటానికి సిద్దం అయ్యాము....మాతోపాటు వస్తే పనియిప్పిస్తాము__ఠాకూర్ కి కోపం తెప్పించినా సొంతగా దొంగతనం చేసినా పుచ్చఎగిరిపోతుందని ముందే గట్టిగా వార్నింగ్ యిచ్చాడు....అన్నింటికి సరే నన్నాము....మేము యిక్కడ నుంచి క్షేమంగా బయటపడటానికి అన్ని ఏర్పాట్లు పాపన్న చేశాడు. మత్తుమందు వగైరాలు అతనే చూసుకున్నాడు. లైన్ క్లియర్ రండి అన్న తర్వాత మేము బయటికి వచ్చాము.
వాళ్ళంతా ఒకటయ్యారు నాకు మాత్రం వాళ్ళతో వుండబుద్ది కాలేదు ఠాకూర్ లు మంచి వాళ్ళు కాదని నా అభిప్రాయం వాళ్ళకి కోపం వస్తే ముక్కలు ముక్కలుగా నరుకుతారు....స్వేచ్చవుండదు. ఎందుకొచ్చిన వెధవగోల అనుకున్నాను....చల్లగా వాళ్ళ దగ్గరనుంచి జారుకుందామా అని అనుకుంటున్న వేళ పాపన్న అడిగాడు. "మాతోపాటు వుంటారా మీ దోవన మీరు వెళతారా?"
నేను వుండవని చెప్పాను. వాళ్ళిద్దరూ మీతో వస్తామని చెప్పారు....అప్పుడు పాపన్న యిలా అన్నాడు.
"నీ దోవన నీవు వెళ్ళవచ్చు ఓ వేళ పోలీసులకి పట్టుబడితే మాత్రం నిజం చెప్పవద్దు...పాపన్న బందిపోటు దొంగ...పాపన్న పారిపోతుంటే మేము పారిపోయాము అని చెప్పండి...ఏ దడిగినా నా కేమీ తెలియదని చెప్పండి__అంతేగాని నేను జైలు కొచ్చింది గోపన్నని విడిపించటానికి కాదు. నేను ఠాకూర్ మనిషిని కాను...ఈ విషయం బయట పెట్టావంటే మాత్రం నీ ప్రాణాలు తోడేస్తాను."
నేను అన్నింటికి సరే నన్నాను....నన్ను వదిలి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఈ వూరి పొలిమేరలు దాటి చాలా దూరంగా వెళ్ళిపోయి మారు పేరు మారు వేషంతో తల దాచుకుందామనుకున్నాను. వెళుతుంటే ఎవరిదో కోడికొత్త పెళ్ళికూతురులా నా కాళ్ళ కడ్డం వచ్చింది....అంతే నా బుర్ర పనిచేయటం మానేసింది. లటుక్కున కోడిని పట్టేసి పరుగు తీశాను. నా బుద్దికి చెదలు పట్టి కోడిని కొట్టేశాను. ఆ కోడి నన్ను పట్టించింది. వరసగా జరిగిందంతా చెప్పానండీ....ఇదండీ జరిగింది..." అంటూ ముగించాడు కోడి దొంగ.