అతను వెళ్ళలేదు.
* * *
హరిణికి జ్వరం తగ్గిపోయింది. ఈలోగా చంద్రం వచ్చాడు. హరిణిని కలిసివచ్చి "ఎందుకనో ఆమె చాలా కోపంగా వుంది. వీడియోలో నిన్ను చూడటానికి, నువ్వు చెప్పింది వినటానికి కూడా స్టూడియోకి రమ్మంటే రాలేదు. మీరేమైనా మాట్లాడతారా అంటే అఖ్కర్లేదన్నది" అన్నాడు.
తానేంచేసినా ఆమెకోసమే చేశాడు. అటువంటిది తననర్థంచేసుకునే శక్తి ఆమెలో ఎందుకు నశించిపోతున్నది?
రెండురోజులయ్యాక "ఇంకోసారి వెళ్ళి ప్రయత్నించు చంద్రం" అన్నాడు.
చంద్రం వెళ్ళివచ్చి "లాభంలేదు. ఆమె అభిప్రాయం మార్చుకోవటం లేదు. పైగా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. డిస్టర్బ్ చెయ్యవద్దన్నది" అన్నాడు.
మహేష్ హతాశుడై ఊరుకున్నాడు.
* * *
ఎగ్జామ్స్ కు హరిణి వెళ్ళేటప్పుడు మహేష్ కాంపౌండ్ వాల్ దగ్గర మెయిన్ గేటుకు దగ్గరగా నిలబడి ఆమె రాకకోసం నిరీక్షిస్తున్నాడు. పరీక్ష యింకో పదిహేను నిముషాలలో ప్రారంభమవుతుందనగా హరిణి ఫ్రెండ్స్ తో కాలేజీ బస్ దిగి లోపలకు వెళ్ళిపోయింది. బస్ దిగేటప్పుడే అతన్ని క్రీగంట చూసి తల తిప్పేసుకుంది.
"హరిణీ!" అని పిలుద్దామని మహేష్ తమాయించుకున్నాడు.
ఆమె తనని ఎందుకని అర్థం చేసుకోవటంలేదు. పరీక్షలయి పోనియ్! ఇప్పుడామెను డిస్టర్బ్ చెయ్యకూడదు.
హరిణి ఎగ్జామ్స్ అన్నీ పూర్తి చేసేసింది.
* * *
ఆఖరిరోజున అంటే ఓరల్స్, ప్రాక్టికల్స్ అన్నీ పూర్తయిపోయాక ఆమె దగ్గరకు ఎగిరి వాలిపోదామనుకున్నాడు. కాని అర్జునరావుగారి మాటలు గుర్తొచ్చి మంత్రించినట్లు ఆగిపోయాడు.
ఎగ్జామ్స్ పూర్తవడం ముఖ్యంకాదు. ప్యాస్ కావాలి.
శరీరంలోని అణువణువునూ కంట్రోల్ చేసుకోవాలంటే అతనికి సర్వశక్తులూ నశించిపోయినట్లయింది.
హరిణి ఫైనల్ ఎమ్.బి.బి.ఎస్. ప్యాసయిపోయింది.
అతనికి ఆనందంతో గట్టిగా కేకలు పెట్టాలనిపించింది. హరిణి ఇక్కడ లేదు. కాలేజీలో నోటీస్ బోర్డు మీద లిస్ట్ పెడితే మొదట అతనే చూశాడు.
ఇహ ప్రపంచంలో ఎవర్నీ లెక్కచెయ్యాల్సిన అవసరంలేదు. ఏ శక్తీ తమని దూరంచెయ్యలేదు. వున్నవాడు ఉన్నట్లు రాజమండ్రి బయల్దేరాడు.
* * *
అర్జునరావుగారిల్లు కనుక్కోవటం అతనికేం కష్టం కాలేదు. లోపలికి వెళ్ళటానికేమీ సంకోచించలేదు. సొంత యింట్లోకి పోతున్నంత చొరవగా లోపలకు వెళ్ళిపోయాడు.
అతను వరండా మెట్లెక్కి హాల్లోకి పోతూండగా లోపలిగదిలోంచి హరిణి బయటకు వచ్చింది. చీరకట్టుకొని, ఎంతో హుందాగా, అందంగా, గొప్పగా కనిపించింది.
"హు...." అనబోతూ ఆమెవంక చూసి ఆగిపోయాడు. ఆమె ముఖంలో ఎటువంటి భావమూ లేదు.
"ఇక్కడికి ఎందుకొచ్చావు?" అన్నట్లు చూసింది.
ఆమె ప్రవర్తనకు అప్రతిభుడై పోయినా ఎలాగో తేరుకున్నాడు. "హరిణీ! నువ్వు పాసయ్యావు" అన్నాడు మెల్లగా.
"ఏం అయితే?"
"మనం...."
"త్వరగా చెప్పు. అవతల చాలా పనుంది."
"మనం...." మాట పెగలటంలేదు. ఉత్సాహమంతా నశించిపోయి నీళ్ళుకారి పోతున్నాడు.
హరిణి అతనివంక విసుగ్గా చూసింది. "చెప్తావా చెప్పవా" అన్నట్లు.
...."పెళ్ళి...."
హరిణి నిరసనగా నవ్వింది. "నిన్ను పెళ్ళిచేసుకునేందుకు యిక్కడ సిద్ధంగా ఎవరు కూర్చున్నారు మహేష్" అంది.
నిర్ఘాంతపోయినట్లు ఆమెవైపు చూస్తూ వుండిపోయాడు. తన హరిణేనా ఇలా మారిపోయింది! అసలు ఎందుకిలా జరిగింది?
"హరిణీ! నువ్వు...."
"అవును నేను మారాను. నువ్వంటే నాకు ప్రేమ నశించి పోయింది."
"....ఎందుకు....?"
"ఎందుకనో చెప్పాలా మహేష్! మూడు నాలుగు సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఎన్ని పరిణామాలయినా సంభవించవచ్చు. కొత్త వ్యక్తులు తారసిల్లవచ్చు. కొత్త పరిచయాలు, స్నేహాలు, అదే_ప్రేమలు ఏర్పడవచ్చు. పాత వాళ్ళని మరిచిపోవచ్చు."
"అంటే_వేరే ఎవరినైనా...."
"పెళ్ళిచేసుకోనూ వచ్చు."
మాట ఇంకా పెదవుల మధ్యనుండి వెలువడి వుండదు. చెంప ఫెఢీమని పేలిపోయింది. అంతే ఒక్కమాట మాట్లాడలేదు! గిరుక్కుమని గుమ్మంకేసి తిరిగాడు.
రెండడుగులయినా వేసివుండడు. వెనకనుండి రెండు చేతులొచ్చి అతన్ని చుట్టుకున్నాయి.
"మహేష్! నువ్వు నమ్మావా?"
ఉలికిపడి ఆ చేతుల్లో అలా వుండే ఆమెకేసి తిరిగాడు. ఈసారి అతని వీపుచుట్టూ చేరి, అతన్ని తమకంగా తనవైపు లాక్కుంటున్నాయి.
"నిన్ను తప్ప.... వేరొకర్ని.... పిచ్చి నాన్నా! నీకంత కోపం తెప్పిస్తే ఇంత చిన్న దెబ్బా? ఊరికినే నిన్నేడిపించాలని ఓ పిచ్చి గేమ్ ఆడాను. కొంచెం పిచ్చిదాన్ని కదూ. మహేష్ నీనుంచి విడిపోగలనా? నీకోసమే? నిన్ను పొందడం కోసమే నేనసలీ కోర్సు చదివాను. క్షణమొక యుగంగా రోజులు లెక్కపెట్టుకుంటూ మళ్ళీ తప్పితే గడువెక్కడ పెరుగుతుందోనన్న భయంతో ఎలాగో, ఎంత శ్రమపడో చదివేశాను. మహేష్! నువ్వు నా ఊపిరివి. నా ప్రాణానివి. నాలో, నా శరీరంలో, నా మనస్సులో అణువణువూ నువ్వే. నేను వెయిట్ చెయ్యలేను మహేష్. ఇచ్చినమాట నిలుపుకొన్నాను? నన్ను ఇంక నీలో కలుపేసుకో_నీతో తీసుకెళ్ళిపో. ఒక్కక్షణం కూడా నన్ను విడిచివుండకు, ఈ ఒంటరితనం...యిహ భరించలేను. రా! నా ప్రియతమా! నన్ను నీలో కరిగిపోనియ్...."
సుతారంగా, వీనులవిందుగా, మధుర మధురంగా ఎంత సొగసైన గుసగుసలు!
గుండెకు గుండె, చూపులకు చూపులు, మనసుకు మనసు హత్తుకుపోతున్నాయి.