"అలాగే నండీ- ఈ బగారా బైగన్ కర్రీని పురానాఫూల్ జాఫర్ వండే పద్దతి కూడా ఓ కాగితం మీద రాయించి ఇవ్వండి" అంటూ ఆయనను అడుగుతున్నారు లేడీస్ అంతా కలిసి.
మా అందరికీ మా ఆడాళ్ళమీదే వళ్ళు మండిపోతోందిగానీ ఏం చేయగలం! మరికాసేపట్లో బగారా బైగన్ వాసనలు మరింత విజ్రుంభించినయ్. నిజం చెప్పొద్దూ? మాకే నోరూరుతుంది! ఆ వాసన షామియానా వేపు రాకుండా ఎదురుగ్గా ఫాన్ లు పెట్టాం మేము- అయినా "హా" అంటూ గాలి బాగా పీల్చాడు వెంకట్రావ్. "అది బగారా బైగన్! పూరానా ఫూల్ జాఫర్ వండుతున్నాడు" అన్నాడు తన్మయత్వం పొందుతున్నట్లు కళ్ళుమూసుకుని.
"నీకెలా తెలుసు?" ఆశ్చర్యంగా అడిగాము. లక్షమంది ఒకేసారి బగారాబైగన్ వండుతున్నా సరే! అందులో పూరానా ఫూల్ జాఫర్ వంటకం ఒక్కసారి వాసన చూస్తే చాలు గుర్తు పట్టేస్తాను. ఆహా! అబ్బ చూశారా! ఇంతమంచి వాసనలు ఇంకెవరివల్లాకాదు. ఆహా! ఆహా! బగారా బైగన్- పురానా ఫూల్ జాఫర్ బగారా బైగన్!".
మేము శాయీరామ్ వాళ్ళ టాక్సీకోసం ఆతృతగా ఎదురు చూడసాగాం! ఈ వెధవ ఇంక కొద్దిక్షణాలకంటే ఎక్కువ మా చేతుల్లో ఉండడని తెలిసిపోతోంది.
"ఆ? భోజనంరెడీ!" అంటూ అరిచారు కమీషనర్ గారు.
మరుక్షణం, సబిన్ స్పెక్టర్లు, కానిస్టేబుల్స్ అందరూ బఫెడిన్నర్ ప్రారంభించేశారు. "ఎవరయినా సరే భోజనం చేయవచ్చు! కన్సెషన్ రేట్ లొ ఇస్తున్నాం! ఈ కన్సెషన్ కేవలం ఈ కాలనీ వాళ్ళకు మాత్రమే!" స్పీకర్ లొ పోలీస్ వాన్ లో నుంచి వినబడింది, ఎనౌన్స్ మెంట్.
"కొంచెం అడ్డంలేవండి! బగారా బైగాన్ ఎలావుందో వూరికే చూస్తాను-" అన్నాడు వెంకట్రావ్ స్పృహలోలేనట్లు ఆవసనల్లో మునిగిపోయి-
"అక్కర్లేదులే! అలా కూర్చో! రేపు జాఫర్ కి ఎంత డబ్బయినా ఇచ్చి నీకు వండించి పెడతాం!" అన్నాడు రెడ్డి.
"ఒక్కసారి లేవండి! చాలు! దగ్గర్నుంచి ఆ ఘుమఘుమలు పీల్చివచ్చేస్తా!" బ్రతిమాలసాగాడు వెంకట్రావ్. ఈలోగా కమీషనర్ గారు స్వయంగా ఓ పెద్ద ప్లేటునిండా బగారాబైగన్ కూర పొగలు కక్కేవేడిది వడ్డించుకుని మరో ప్లేటులో చపాతీలు తీసుకొచ్చి వెంకట్రావ్ కి కనిపించేట్లు ఓ కుర్చీలో కూర్చుని తినడం ప్ర్రారంభించాడు. వెంకట్రావ్ నోరు వెళ్ళబెట్టేశాడు. గుడ్లు మిటకరించాడు, నాలుక తడుపుకుంటూ, పెద్ద ఎత్తున రొప్పుతున్నాడు "ఆహా- నా ప్రాణం- బగారా బైగన్- నా దేవుడు పురానా ఫూల్ జాఫర్" అంటూ సంధి వచ్చినట్లు గొణుగుతున్నాడు. నోట్లోనుంచి లాలాజలం చుక్కలుగా రాలుతోంది. నెమ్మదిగా ఆ ప్లేటువంకే చూస్తూకూర్చున్న చోటు నుంచి లేచాడు. పరిస్థితి విషమించి పోతోందని గమనించి యాదగిరి నినాదాలు ప్ర్రారంభించాడు.
"వెంకట్రావ్-వెంకట్రావ్" జిందాబాద్- జిందాబాద్"
"పోలీసుల నక్కజిత్తులకు-" "వెంకట్రావ్ లొంగడు- లొంగడు-"
"పోలీస్ కమీషనర్" "డౌన్ డౌన్"
"వర్ధిల్లాలి! వర్ధిల్లాలి- వెంకట్రావ్ మనోనిబ్బరం వర్దిల్లాలి-"
పోలీస్ కమీషనర్ వెంకట్రావ్ వేపు చిరునవ్వుతో చూశాడు. ఆయన చేతిలో నూనె కారుతున్నవంకాయ చూసేసరికి వెంకట్రావ్ కి ఏదో పూనకం వచ్చినట్లయింది. మా అందరి చేతులూ ఎక్కడలేని బలంతో విదిలించుకొని పోలీస్ షామియానా వేపు పరిగెత్తాడు. యాదగిరి ఇంకా ప్రయత్నాలు మానలేదు.
"వెంకట్రావ్ వెంకట్రావ్"
"జిందాబాద్ జిందాబాద్"
"పోలీస్ వాళ్ళ బగారా బైగాన్ కి"
"మహాత్మా వెంకట్రావ్ లొంగడు"
"వెంకట్రావ్ నిగ్రహం"
"వర్ధిల్లాలి- వర్ధిల్లాలి"
"పోలీస్ కమీషనర్ బగారా బైగాన్"
"డౌన్ డౌన్" వెంకట్రావ్ కి ఏమీ వినిపించటంలేదు. పిచ్చివాడిలా బఫేట్ బుల్ దగ్గరకు నడిచాడు. ఆ తరువాత అంతా క్షణాల్లో జరిగిపోయింది. వెంకట్రావ్ పెద్ద ప్లేట్లో బగారా బైగాన్ వేడిగా వడ్డించుకొని ఆవురావురుమని తినేస్తున్నాడు.
మరుక్షణం నినాదాలు మారిపోయాయి.
"వెంకట్రావ్" "డౌన్ డౌన్"
"వెంకట్రావ్ బగారా బైగాన్" "నశించాలి"
అప్పుడే శాయీరామ్ వాళ్ళు ఎమ్మెల్యేలతో సహాకార్లో వచ్చేశారు.
"నిమ్మకాయ నీళ్ళు సిద్దంగా ఉంచారా?" అడిగారాయన షామియానా దగ్గరకొచ్చి. ఈలోగా పోలీస్ కమీషనర్ గారు ఆయన క్కూడా బగారా బైగన్ కూర- చపాతీలు ప్లేట్లు తీసుకొచ్చి అందించేసరికి ఆయనకూడా మాట్లాడకుండా తినేసారు. మరి కాసేపటికి కాలనీలో పిల్లా పెద్దా అందరూ కన్సెషన్ టికెట్లు కొనుక్కుని క్యూలో నిలబడి భోజనం చేయటం కనిపించింది.
కేవలం మా కార్యనిర్వాహక వర్గం వాళ్ళు మాత్రం దూరంగా నిలబడ్డాం.
నిరాహారదీక్షలు మొదలుపెట్టడం- ఆ తరువాత రోజులు గడిచినకొద్దీ అది అల్లరికీ, దౌర్జన్యానికీ, ఆస్తినష్టానికీ దారితీయటం- ఇలా జరగకుండా మేము ఈ కొత్తపద్దతి ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాం! విజయవంతంగానే జరిగింది గనుక త్వరలో ఇది దేశమంతా ప్రవేశపెట్టాలని సిఫార్సుచేస్తాం!" అన్నారు కమీషనరుగారు.
మేము "ఇహిహి" అంటూ చిరునవ్వు నవ్వాము వెంకట్రావ్ వేపు కోపంగా చూస్తూ.