తాగినవాళ్ళు తనలో ఏదేదో మాట్లాడుకుంటారన్న సంగతి గుర్తుకొచ్చింది సీతకి. అల ఏదో ఒకటి గుర్తుకు రావటం కాదు గాని రెట్టింపు దుఃఖం వస్తున్నది సీతకి.
"నా తప్పు నాకు తెలుసు సీతా! అసలేం జరిగిందంటే.....!"
సీత లయగా ఎక్కెళ్ళు పెట్టింది.
"లాభం లేదు ఈ స్థితిలో సీతతో నిజం చెప్పి లాభం లేదు. వినదు. మెల్లగా బెడ్ రూమ్ దాకా తీసుకువెళితే.....
"సీతూ! ఇంట్లోకి వెళదాం రా!"
"నేను రాను పొండి."
"ఇక్కడే రాత్రంతా కూర్చుంటావా!"
"దొంగలు వస్తారు."
"పిచాచాలు దెయ్యాలు తిరుగుతుంటాయి."
"సరే నీ ఇష్టం. నీకెలా ఇష్టం అయితే నాకలాగే ఇష్టం. నేను యిక్కడే కూర్చుంటాను."
సీత గబుక్కున లేచి యింట్లోకి వెళ్ళింది.
రామకృష్ణ తలుపువేసి తనూ లోపలికి పరుగున వచ్చాడు.
ఈ తఫా సీత బెడ్ రూమ్ లోకి వెళ్ళి మంచానికడ్డంగా బోర్లా పడుకుని దిండులో ముఖం దాచుకుంది.
రామకృష్ణ నెమ్మదిగా వెళ్ళి మంచంమీద ఓ పక్కగా కూర్చున్నాడు. "సీతా!" అన్నాడు నెమ్మదిగా.
"నేను బతికివుండటం మీకిష్టం లేదా?" సీత అరిచింది.
రామకృష్ణ ఆ దెబ్బతో నోరు మూసుకున్నాడు. కోపం తగ్గిం తరువాత మాట్లాడటం మంచిది అనుకున్నాడు. లేచి వెళ్ళి డ్రెస్ విప్పేసి లుంగీ కట్టుకున్నాడు. కాసిని మంచినీళ్ళు తాగి కుర్చీలో కూర్చున్నాడు సీతనే చూస్తూ.
అరగంట తర్వాత-
సీత దుఃఖం ఆగింది.
నోరు మూసుకుని తెల్లారిందాకా రామకృష్ణ వుండొచ్చు కదా!
ఉంటే కధే లేదు.
సీతని ప్రసన్నురాలిని చేసుకుందామనే తొందరలో.
సీతకి నిజం వినిపిద్దామనే తొందరలో.
రామకృష్ణ కుర్చీలోంచి లేచి సీత పక్కనే మంచంమీద కూర్చున్నాడు. "సీతా! నే చెప్పేది నమ్మితే నమ్ము లేకపోతే లేదు. కనీసం విను" అన్నాడు.
సీత మాట్లాడలేదు. "ఇది నేను సమర్ధించుకోవడానికి ఏం జరిగింది నీకు తెలియటానికి చెపుతున్నాను. విని అర్ధం చేసుకుంటావో అపార్ధం చేసుకుంటావో ఆపై నీ ఇష్టం. ఇంక చెప్పనా సీతా!" రామకృష్ణ అడిగాడు.
సీత మాట్లాడలేదు. షరా మామూలే.
రామకృష్ణ ఓ నిట్టూర్పు విడిచాడు.
సీత నిద్రపోవటం లేదు. ఇంకా కోపంగానే వుంది. భర్త చెప్పేది విని దానిలోని అబద్ధం ఏకు ఏకు పీక్కు పీకు లాగి జాడిద్దామనుకుంది.