Previous Page Next Page 
ప్రేమించండి ప్లీజ్ పేజి 37


    లోపల్నుంచి మరో అమ్మాయి వచ్చింది. తెల్లటి చీరలో మల్లెపూవులా వుంది ఆంజనేయులు కళ్ళు మెరవడాన్ని. బుజ్జి గమనించి-"రజనీ! పార్టీ వచ్చాడు. వెళ్ళు" అంది.
    మళ్ళి ఆమాటలు పట్టించుకోనట్టు వచ్చి ఆమె అక్కడే కూర్చుంది "ఓ ఫైవ్ మినిట్స్ రెస్టు అక్కా. మరీ అలసటగా వుంది" అని పైట తీసి విసురుకోవడం ప్రారంభించింది.
    ఏమీ ఎదురు చెప్పలేదు బుజ్జి. రజని అందంగా వుంటుంది అందుకే ఆమెకు కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు వున్నాయి. ఆమె చెప్పినట్టు బుజ్జి వింటుంది. అలా అని రజని కూడా డామినేట్ చేయదు. సమయమూ సందర్భమూ తెలుసుకు ఇద్దరూ నడుచుకుంటారు.
    రజని సేద తీర్చుకున్నాక" ఎవరక్కా పార్టీ?" అని అడిగింది.
    "అతనే" అని ఆమె ఆంజనేయులు వైపు చూపించింది.
    అతని గుండె వేగంగా కొట్టుకుంది. స్వయంవరంలో చక్రవర్తుల పక్కన కూర్చున్న సామంతరాజులా బితుకుబితుకుమంటూ చూస్తున్నాడు.
    రజని అతని వైపు పరిశీలనగా చూసి "నేవెళ్ళనక్కా" అంది.
    "అదేమిటే?"
    ఆమె బుజ్జితో ఏదో చిన్నగా చెప్పింది. ఆంజనేయులు పాతాళంలోకి కూరుకు పోయినట్టు ఫీలైపోయాడు.
    తను ఆమెకు నచ్చలేదని తన ఆకారాన్ని చూసి తనతో గడపడానికి విముఖత చూపిందని అతను గ్రహించాడు.
    తన పర్సనాలిటీ అంత ఛండాలంగా వుంటుంది. ఒళ్ళమ్ముకునే స్త్రీకి కూడా తనతో గడపడం ఇష్టం ఉండదు. తన ముఖాన్ని చూస్తే ఆడపిల్లలకు ఏమనిపిస్తుంది? మంజుల- బోర్డులో రాసినట్టు పెద్దన్నయ్యలా కనిపిస్తానా? ఏమో?
    "నేనే వస్తాను. ఆ పిల్ల నీకు రానంటోంది." అని బుజ్జి లేచింది.
    ఒళ్ళు అమ్ముకునే స్త్రీకి కొన్ని ఇష్టాలుంటాయి. ఆమె కోణంలోంచి ఆలోచిస్తే వాటికీ అర్ధముంటుంది. తనతో గడపడం ఆమెకు ఇష్టంలేదు. ఎందుకు ఇష్టంలేదో విశ్లేషించడం వల్ల వచ్చిన ఉపయోగం లేదు. ఇప్పుడు బుజ్జి తనతో గడపడానికి ఇష్టపడుతుంది అది ఇష్టంవల్లకాదు- జాలి వల్ల తల్లిని కోల్పోయిన చిన్న పిల్లాడ్ని దగ్గరకు తీసుకున్నట్టు- సానుభూతితో తనను లాలించడానికి ముందుకొచ్చింది అంతే తప్ప తనమీద మోహంతో కాదు- ప్రేమతో కాదు.
    ఆంజనేయులు అలానే నిలబడి వుండడాన్ని చూసి "ఏమిటలా నిల్చుండిపోయావ్. రా! వెళదాం" అని ఆమె లోపలికి దారితీసింది.
    మౌనంగా ఆమెను అనుసరించారు.
    పెంకుటింట్లోకి వెళ్ళారు. ఓ చిన్న గది అది. దాన్ని రెండు భాగాలు చేస్తూ తడికె వేలాడుతూ వుంది. గది మధ్యలో వైరునుపట్టుకుని వున్న ఇరవై క్యాండిల్స్ బల్బు మబ్బు కమ్మేసిన చందమామలా వెలుగుతూనే వుంది.
    దుమ్ముతో వేచినట్టున్న చాప మధ్యలో అతుక్కుపోయినట్టు కనిపిస్తోంది. దానిమీద ఒలికిన శృంగారపు మరకలు శరీరంమీద సిఫిలిస్ మచ్చల్లావున్నాయి. పడకమీదనుంచి నిద్రలో పడిపోయిన పసిపాపలా ఓమూల అల్యూమినియం గ్లాసు చాపకు అడ్డంగా మూలగా విసిరేసిన నిరోధ్ లు ప్రాణంపోయిన పట్టుపురుగుల్లా వున్నాయి. గోడకు వేలాడదీసిన క్యాలెండర్ లోని ఆడపిల్ల కన్పిస్తోంది.
    ఆంజనేయులు ఇబ్బందిగా కదిలాడు.    
    ద్వారం దగ్గర బుజ్జి డబ్బు లెక్క పెట్టుకుంటోంది.
    ఆమెలో ఏ టెన్షనూ లేదు. చాలా సాధారణంగా బావికి నీళ్ళ కోసం వచ్చినట్టుంది.
    తనలా ఆమె ఎందుకు ఉద్వేగపడడంలేదో అర్ధంకాలేదు అతనికి. తన కళ్ళలా ఆమె కళ్ళు తెలియని భావావేశంతో ఎందుకు అదరడంలేదు. బోధపడడం లేదు. తన గుండెలా ఆమె గుండె ఎందుకు ఎగిసిపడడం లేదో తెలియడం లేదు.
    బుజ్జి డబ్బును జాకెట్లో లోపలికి తోసుకుని బానమీదకు వచ్చి కూర్చుంది. అతనివైపు చూసి రమ్మన్నట్టు కళ్ళతోనే పిలిచింది.
    అతను వెళ్ళి ఆమె ముందు కూర్చున్నాడు.
    'బంతి భోజనానికి కూర్చున్నట్టు కూర్చున్నావ్' అని నవ్వింది.
    అతను ఆ మాటలను వినడం లేదు. స్త్రీని అంత దగ్గరగా చూడటం అదే మొదటిసారి ఏవేవో భావనలు అతని కుదిపేస్తున్నాయి. స్త్రీమీద గౌరవంతో ప్రేమతో, ఆత్మీయతతో అతని గుండె బరువెక్కిపోయింది. మిగిలిన మోహావేశాలకు అంధుడై పోయాడు.
    'నీ పేరు' ఎంతో అభిమానంతో అడిగాడు.
    కానీ ఇలాంటివి అక్కడ మామూలే, వచ్చిన ప్రతి ఒక్కడూ ఏదేదో వాగడం దాన్నంత మౌనంగా భరించడం అలవాటైపోయిన విషయం. ఒకరు ఆవేశంలో, మరొకరు ఆవేశరహితంగా వుండడంవల్ల వచ్చిన చిక్కు అది. అందువల్లే ఆమె సమాధానం చెప్పలేదు.
    "నీ పేరు" మళ్ళీ అడిగాడు.
    అతను ఆ పరిసరాలను కొత్త అని గ్రహించడం వల్ల అతన్ని నిరాశపరచడం ఇష్టంలేక ఆమె జవాబు చెప్పింది.
    "మంచి పేరు" అతను మనస్పూర్తిగా అన్నాడు.
    "మరేమిటనుకున్నావ్ మా అమ్మ ముచ్చటపడి పెట్టుకున్న పేరు"
    ఈ మాటలకు అతనికి అమ్మ గుర్తుకొచ్చింది. అమ్మ ఎలా వుండేదో తెలియదు. తనకు అమ్మ ఎలా వుంటుందో తెలియదు. అమ్మ ప్రేమ ఎంత మధురంగా వుంటుందో తెలియదు. అమ్మే బతికుంటే తన మనసు ఇలా బీటలు వారి పోయి వుండేది కాదు. అతనికి అమ్మ జ్ఞాపకానికి వచ్చి మనసు అదోలా అయిపోయింది.
    "సరేగాని మొదలుపెట్టు అవతల నాకు బోలెడు పనులున్నాయి. ఏదో పాపం అని వచ్చాను" అంది.
    ఏదైతే అసహ్యించుకుంటామో అదే మనల్ని కౌగిలించికుంటే ఎలా అయిపోతామో అతనూ అలా అయిపోయాడు. అతనికి కావలసింది సానుభూతి జాలీ కాదు. కాస్తంత ప్రేమ. చిటికెడు అనురాగం. కానీ అవి దొరకని దగ్గరకు అతను వచ్చాడు. కానీ అతనికి ఆ విషయం తెలియదు. అందుకే అతను మౌనంగా రోదిస్తున్నాడు.
    నిజానికి అతనికి కావలసింది సెక్స్ కాదు. ప్రేమ- నేనున్నానంటూ దగ్గరకు తీసుకొనే వ్యక్తికానీ అయిదు నిమిషాలకో, పది నిముషాలకో కొనుక్కున్న వ్యక్తి అంత భరోసా ఇవ్వదు.
    ఎంతసేపటికి అతను కదలక పోయేసరికి ఆమె మొదలుపెట్టింది తన చేతులను అతని ఒడిలో వేసింది.
    ఆ స్పర్శ అతన్ని రెచ్చగొట్టలేదు. పైపెచ్చు బాగా ఏడుస్తున్న వ్యక్తిని ఓదార్చడానికి తాకినట్టుంది. ఆచేతులు ఎక్కడ మాయమౌతాయేమోనన్న భయంతో వాటిని గట్టిగా పట్టుకున్నాడు.
    "కానీ" అంది ఆమె విసుగ్గా.
    అతను తల పైకెత్తాడు. ఆమె కళ్ళల్లో ఏభావమూ లేదు. చాలా ఫ్లాట్ గా చూస్తోంది. ప్లేటులో డిష్ లన్నీ సర్ది వినయ్ ను శకుంతల చూసిన చూపు అతనికి గుర్తుకొచ్చింది. ఆ కళ్ళల్లో అప్పుడు భావో ద్రేకపు కెరటాలు వువ్వెత్తున లేచాయి. ఆమె ముఖంలో ఎంత సంచలనం  అప్పుడు కాని ఈమెలో ఏ ఆవేశమూ లేదు. ఎందువల్ల ఈ భేదం? అతను ఆలోచనల్లోపడ్డాడు.
    "మొదలుపెట్టు. టైమ్ అవుతోంది." ఆమె కోపాన్ని ప్రదర్శించకపోయినా దాని తాలూకు జీర మాటల్లో ప్రతిఫలించింది.
    అతను దాన్ని గమనించలేదు.
    "చాలా అందంగా వున్నావు" అన్నాడు. తల్లి వూరికి బయల్దేరుతూ కొత్త చీర కట్టుకున్నప్పుడు చిన్న పిల్లాడు ముద్దుగా అన్నట్టు అన్నాడు - అందులో కాంప్లిమెంటుకన్నా ఆత్మీయత ఎక్కువ వుంది.

 Previous Page Next Page