Previous Page Next Page 
డైమండ్ రాజా - ఆఠీన్ రాణీ పేజి 37

 

    "దీని ఖరీదెంతో తెలుసా?" అన్నాడు.


    తక్షణం మీనాక్షి పెదిమలు వణికాయి. - ఈసారి నిజం కోపంతోనే ! "నా ప్రేమకోసం ఇది లంచమా!" అంది తీవ్రంగా.


    "కాదు! నీ ప్రేమ అంటే నాకెంత విలువో చెప్పడానికి ఇదో పద్దతి! ఈ పచ్చ ఖరీదు అయిదు లక్షలు!"


    "సో!"


    "నువ్వు నా ప్రేమని అంగీకరించకపొతే ఈ పచ్చని ......." అంటూ ఆ పచ్చని గురిచూసి , తెరచి వున్న డ్రైనేజ్ హోల్లో పడేలా విసిరేశాడు రాజా!"


    ఒక్కసారిగా శ్వాస లోపలికి తీసుకుంది మీనాక్షి.


    ఈసారి ఇంకో విలువైన రాయి తీసుకున్నాడు రాజా. "పిచ్చివాడి చేతిలో రాయి అంటారే - అలాగే ఈ ప్రేమ పిచ్చివాడి చేతిలో ఎంత విలువైన రాయి అయినా సరే మాములు రాతికంటే తక్కువే! ఇది లాపిస్ లాజులీ! ఈజిప్టియన్ ఫెరోల నిధులలో దొరికింది - బట్ .......హూ కేర్స్!" అని, ఆ లాపిస్ లాజులీ ని బలంగా విసిరేశాడు. అది వెళ్ళి చెత్త కుప్పలో పడింది.


    "ఇకపోతే ఇదొక అపురూపమైన వజ్రం! కోహినూర్, జేకబ్ డైమండ్ ల తర్వాత అంత పెద్దది! గోల్కొండ గనుల్లో దొరికింది! అయితే మనకేమిటి?" అని వజ్రాన్ని విసిరేశాడు రాజా. అది వెళ్ళి ,అక్కడే జిలేబీలు చేస్తూ వున్న ఒక పొయ్యిలో పడింది/ వజ్రం అంటే కర్బనే కదా! పొయ్యిలో పడగానే , తక్షణం తగలబడిపోయింది వజ్రం!


    చలించిపోయింది మీనాక్షి. "గాడ్! ఈ వర్త్ లెస్ ఉమన్ మీద మీ కేందుకింత ఇది!" అంది కన్నీళ్ళతో.


    అది వినిపించుకోకుండా , ఇంకో రాయి తీశాడు రాజా. "ఇది ప్రపంచంలోకెల్లా పెద్ద పగడం! ఎంతలేదన్నా ఇరవై లక్షల ఖరీదు చేస్తుంది. బట్ - అని దాన్ని సరిగ్గా బగ్గీ తాలూకు చక్రం కింద పడేటట్లు పడేశాడు. మరుక్షణంలో బండి చక్రం దాన్ని నుగ్గు నుగ్గు చేసేసింది.


    "నా గుండె కూడా అలాగే పిండిపిండి అయిపోతుంది. నన్నెందుకిలా టార్చర్ చేస్తారూ!" అంది మీనాక్షి దుఃఖంగా.


    ఇంకో రాయి తీశాడు రాజా. "ఇది పుష్యరాగం! శ్రీకృష్ణదేవరాయుల జవహారీలోనిది.......


    చటుక్కున అతని చెయ్యి పట్టుకుని ఆపేసింది మీనాక్షి. "ప్లీజ్! ఇంక ఆపండి!" అంది దీనంగా.


    "దెన్ గివ్ మీ ఏ కిస్!" అన్నాడు రాజా.


    "ఏమిటి?" అంది మీనాక్షి నిటార్గా కూర్చుంటూ.


    "ఒక్క ముద్దివ్వు!" అంటూనే ఆమె మీదకి వంగి, ఆమెని దగ్గరగా లాక్కుని, ఆమె అధరాలని గట్టిగా చుంభిచాడు రాజా. అతని పట్టు వదిలించుకోవడానికి పెనుగులాడుతోంది మీనాక్షి.


    ఆమెని తన కౌగిట్లోనే బంధించి ఉంచే ప్రయత్నంలో రాజా చేతిలోని కళ్ళాలు జారిపోయాయి. మరుక్షణంలో - గుర్రాలు పెద్దగా సకిలిస్తూ - ముందు కాళ్ళు పైకి ఎత్తి వెనక కాళ్ళ మీద నిలబడ్డాయి. క్షణంలో సార్ట్ అదుపు తప్పి, పక్కనే ఉన్న పల్లంలోకి వెళ్ళిపోయి, తలక్రిందులైపోయింది!


    తక్షణం మెలకువ వచ్చేసింది మీనాక్షికి!


    అంతా కల! కేవలం కల!


    చెప్పలేనంత నిరాశ కలిగి , దుఃఖం వచ్చేసింది మీనాక్షికి. ఆమె అలా వివశురాలయి దుఃఖిస్తూ ఉండగానే - తలుపు చప్పుడయింది. కళ్ళు తుడుచుకుంటూ లేచి తలుపు తీసింది మీనాక్షి.


    అక్కడ రాజా నిలబడి ఉన్నాడు!!!


    తనని తానూ గిల్లుకుని చూసుకుంది మీనాక్షి.


    కాదు - ఇది కల కాదు - ఈసారి నిజంగానే వచ్చి, తన ఎదురుగా నిలబడి ఉన్నాడు రాజా!


    కానీ - ఎందుకు?

 

                                                                  * * *


    తను ట్రావెల్ చేస్తున్న జెట్ విమానం హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టులో లాండ్ అయీ అవగానే ఒక వార్త తెలిసింది మెగా ప్రొడ్యుసర్ నటరాజన్ కి.


    ఆ రోజున అతని కొత్త పిక్చరు తాలూకు పూజా కార్యక్రమం, ముహూర్తం షాటూ అయ్యాక - మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలయిపోవాలి.


    ఆ రోజు షూట్ చెయ్యాల్సిన సీను ఏమిటంటే -


    రోడ్డు మీద సీను-


    రోడ్డుమీద సీను అంటే పొలిసు బందోబస్తు లేకుండా జరగదు.


    అయితే -


    ఆ రోజునే నగరంలో ఒక చోటా నాయకుడి గారి కూతురి పెళ్ళిట! అతను పదేళ్ళ క్రితం హైదరాబాద్ సినిమా హాళ్ళలో బ్లాక్ మార్కెట్ లో సినిమా టిక్కెట్లు అమ్ముతుండేవాడు. అప్పట్లో సినిమాలు రెగ్యులర్ గా చూసేవాడు. ఆ సినిమాల్లో అతనికి చాలా బాగా నచ్చింది ఒక భారీ దొంగతనం సబ్జెక్టుగా గల సినిమా! దొంగతనం ఎలా పర్ ఫెక్టుగా చెయ్యవచ్చునో, అలా దొంగతనం చేసి ఎలా తప్పించుకో వచ్చునో, చెప్పే కధని ఒక నిర్మాతా, దర్శకుడు కలిసి చాలా బాధ్యతారహితంగా, గొప్ప టెక్నిక్ తో తీసిన సినిమా అది!


    ఆ సినిమాని ఇన్ స్పిరేషన్ గా పెట్టుకుని ఆ స్మాల్ టైం క్రూక్ ఒక భారీ దొంగతనం చేశాడు. చేసి తప్పించుకోగలిగాడు కూడా! అలా వచ్చిన డబ్బుని తెలివిగా రాజకీయాల్లో ఇన్ వెస్ట్ చేశాడు. దానిమీద ఇవాళ అతనికి మంచి రిటర్న్స్ వస్తున్నాయి. అతను మినిస్టర్ కూడా అయ్యాడు. మినిస్టరు అయీ అవగానే అన్నాళ్ళనుంచి నానా రకాల వ్యసనాలతో పుచ్చిపోయి వున్న తన బాడీకి ట్రీట్ మెంట్ కోసం అమెరికా వెళ్ళి వచ్చాడు ప్రజల ఖర్చుమీదే! ప్రజల ఖర్చు మీదే తన ఇంటికి వాస్తు లోపాలు అవీ ఉంటే అరకోటి ఖర్చు చేసి రిమోడలింగ్ చేయించుకున్నాడు. తన టర్మ్ అయిపోయేలోగా కూతురి పెళ్ళి కూడా చేసేయ్యలన్న తొందరలో ముహూర్తం పెట్టించేశాడు. అతనికి మొదటి నుంచి అండర్ వరల్డ్ కనెక్షన్స్ ఉన్నాయి గనక పెళ్ళికి అండర్ వరల్డ్ తాలూకు "పెద్దలు" ఇద్దరూ వస్తారు - వాళ్ళలో వాళ్ళకి రైవల్రీలు ఉంటాయి. అందుకని పెళ్ళిలో రౌడీ గొడవలెం జరగకుండా వుండడానికి గానూ కనివిని ఎరగని పోలీసు బందోబస్తు! ఉళ్ళోని పోలీసుల్లో సగం మందికి అక్కడే డ్యూటీ ఆ రోజున!


    దానికి తోడుగా - కుల మహాసభ ఒకటి జరుగుతుంది . లారీల్లో గోర్రెలని, ఎక్కించి తీసుకు వచ్చినట్లు మనుషుల్ని "తోలుకొచ్చాడు' . వాళ్ళకి ఆ రోజు జరిగే మహాసభలో ప్రభుత్వం కొన్ని వరాలు ప్రకటిస్తుంది (వరాల ప్రకటన ఎప్పుడూ ఎలెక్షన్ల ముందే వుంటుంది.)


    డానికి కూడా మహా పకడ్భందిగా పోలీసు బందోబస్తు జరుగుతుంది.


    అది చాలనట్లు -


    ఒక అల్లరి "నాయకుడు" తనకేదో అన్యాయం జరిగిందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుపుతూ, తన బఫూనరీలో భాగంగా ఆరోజు బురదలో దోర్లుతానని బెదిరించాడు.


     అతని అల్లరీ మరీ పెట్రేగిపోకుండా చూడడానికి గానూ అక్కడ భారీ బందోబస్తు!


    అదలా అఘోరిస్తుండగా-


    ఒక మేజర్ పార్టీలో పదవుల పంపకం గురించిన లుకలుకలూ , శిగపట్లూ సెట్ రైట్ చెయ్యడానికి గానూ న్యుడిల్లి నుంచి అబ్జర్వర్లు వచ్చారు.


    అక్కడ - వాళ్ళకోసం పొలిసు బందోబస్తు !


    ఓవర్ లోడ్ అయివున్న లారీని ఓవర్ స్పీడుతో డ్రయివ్ చేసున్న ఓ డ్రయివరు నగర శివార్లలో , సరిగ్గా రోడ్డు మధ్య కట్టి వున్న తులసి కోట సైజులో ఉన్న చిన్న మందిరాన్ని డాష్ కొట్టాడు. లారీ బోల్తా పడింది. డ్రయివర్ చచ్చిపోయాడు. ఈ యాక్సిడెంటులో ఇరుకున్న ఒక ఎద్దుబండి కూడా తునాతునకలయిపోయింది. బండీవాలా చనిపోయాడు. ఎద్దులు కూడా చనిపోయాయి.


    ఈ యాక్సిడెంట్ వల్ల ఒక రాజకీయ నాయకుడు ఒకడికి తన బ్రాండు అల్లరి చేసే అవకాశం దొరికింది. ఒక హిందూ మందిరాన్ని ఎవరో కావాలని ద్వంసం చేశారని ఆరోపిస్తూ లోకల్ గా ఆందోళన (అంటే అల్లరి) మొదలెట్టాడు ఆ నాయకుడు.


    కాకతాళీయంగానే అయినా , ఆ చనిపోయిన లారీ డ్రైవర్ ముస్లిం కావడం అతనికి కలిసి వచ్చింది.


    అంతే కాకతాలియంగా -


    అదే రోజున -


    పాతబస్తీలో ఒక పాలపేపర్లు అమ్మకం చేసే ఓ షాపులో -


    షాపు ఓనరు పాతపేపర్ల అమ్మకాలు సాగిస్తుంటే -


    పొరపాటున వాటిమధ్య ఒక పాత ఖురాన్ ప్రతి తాలూకు పేజీలు  కొన్ని కలిసిపోయి కనబడ్డాయి. ఆ షాపుకి పాత పేపర్లూ అవీ అనేకమైన ఇళ్ళలో నుంచి వస్తూ ఉంటాయి. ఇంట్లో ఎవరి పొరబాటు వల్ల అలా జరిగిందో తెలీదు గానీ, మతాన్ని మారణ హోమానికి ఎన్ని విధాలుగా వాడుకోవచ్చునో బాగా తెలిసిన ఒక నాయకుడు తక్షణం రంగంలోకి దూకి ఆ విషయంలో భీకరమైన దృశ్యాలు సృష్టించి, తన 'బ్రాండ్' అల్లరి మొదలెట్టాడు.


    ఇలా నగరంలో వేరు వేరు చోట్ల వేరు వేరు రాజకీయ నాయకులు సృష్టించిన అల్లర్లు, న్యుసేన్సు - వీటిని అదుపు చెయ్యడానికే పోలీసులకు సమయం చాలడం లేదు.


    తన యూనిట్ షూటింగ్ పొలిసు బందోబస్తు కావాలని వెళ్ళిన నటరాజన్ వాళ్ళ ప్రొడక్షన్ మేనేజరుతో ఈ విషయమే చెప్పాడు ఒక పోలీసు ఆఫీసరు.


    "అరె దేఖ్ భాయ్ దేఖ్! ఒక్క రోజునే నగరంలో ఒక లీడరు కూతురు పెళ్ళి. దానికి గ్యాంగ్ లీడర్లు హాజరు. ఒక కుల మహాసభ. ఒక పెద్దాయన చిన్నతనపు చేష్టలు, ఒక పార్టీ తాలూకు సెంట్రల్ అబ్జర్వర్లు, ఒక హిందూ మతకలహం , ఒక ముస్లిం మత కలహం - ఇవన్నీ ప్రజల పేరుతొ , ప్రజల కోసమేనని రాజకీయ నాయకలు సృష్టిస్తున్న అల్లరే!


    మా పొలిసు ఫోర్సు అంతా ఆ అల్లర్లని సెట్ రైట్ చెయ్యడానికే పని చేస్తోంది! ప్రజల సంగతి పట్టించుకోవడానికి టైం ఉండటల్లేదు.


    ఇప్పుడు అర్జెంటుగా మేం డీల్ చెయ్యాల్సిన కేసులు అరడజను ఉన్నాయి.


    లోకల్ ట్రయిన్ ఒకదానికి యాక్సిడెంటు అయింది. గాయపడ్డ పాసింజర్సుని హాస్పిటల్ కి చేర్చాలి. ఒకచోట పరిక్షలు జరుగుతున్నాయి. అక్కడేమీ గొడవలు జరక్కుండా బందోబస్తుకి వెళ్ళాలి. కాలనీలో డేకాయిటీలు ఎక్కువయిపోతున్నాయి. బందిపోట్లని పట్టుకోవాలి. ఒక పెద్ద చోరీ కేసు, ఒక సెన్సేషనల్ మర్డర్ కేసు జరిగాయి. ఆ నేరస్తులను పట్టుకోవాలి.


    "అయితే మిగిలిన పోలీసు బలగాన్నంతా ఈ కేసుల మీద పంపిస్తారా?" అన్నాడు నటరాజన్ వాళ్ళ ప్రొడక్షన్ మేనేజరు నిరాశగా. పెద్దగా నవ్వాడు అ పోలీసు ఆఫీసరు.


    "అదే భాయ్ చెపుతోంది! ఇంత అర్జెంట్ కేసులుండగా ఇంకో అర్జెంటుకేసు కూడా వచ్చింది. అక్కడికి పంపాలి మిగిలిన మా పోలీసులని!"


    "ఎక్కడికి?" అన్నాడు ప్రొడక్షన్ మేనేజరు పరమశివన్.


    "నగరానికి ఒక స్వామీజీ వస్తున్నారు . రామనామ సప్తాహం! మిగిలిన పోలీసులందరినీ అక్కడికి పంపాలి" అన్నాడు పొలిసు ఆఫీసరు.


    తిక్కరేగిపోయినట్టయింది ప్రొడక్షన్ మేనేజరు పరమశివన్ కి.


    "అయినా పెద్ద ఇబ్బందేం లేరు! ఎట్లాగో అట్లా ఒక అరడజను మంది పోలీసులని మీ షూటింగు బందోబస్తుకి పంపుతా! అయితే బాగా ఖర్చవుతుంది. పదివేలు యిస్తే పంపిస్తా!" అన్నాడు నిస్సగ్గుగా.


    ఈ వృత్తాంతం అంతా నటరాజన్ కి చెప్పాడు అర్ధనారీశ్వరన్ . ఇది వినగానే , మెగా ప్రొడ్యుసర్ నతరాజన్ నోట్లో వున్న తమలపాకుల కట్ట తుపుక్కున ఉమ్మేశాడు.


    తర్వాత అన్నాడు ప్రొడ్యుసర్ నటరాజన్. అర్ధా! మొన్ననే కదా మనం సింగపూర్ షూటింగ్ కి వెళ్ళొచ్చింది."


    "అవును సార్" అన్నాడు అర్ధనారీశ్వరన్. "మనం వెళ్ళినప్పుడు అక్కడొక కేసు జరుగుతోంది. ఒక అమెరికన్ అబ్బాయి - ఒక ధనిక యువక పిశాచం - అమెరికాలో తనకి అలవాతయిపోయిన స్వేచ్చ తాలూకు అవలక్షణాలని ఆ సింగపూర్ లో కూడా ప్రదర్శింపబోయి, అక్కడ గోడల మీద అంతా పిచ్చి పిచ్చి రాతలు రాశాడు. ఒక కారు మీద తన ఇష్టం వచ్చినట్లు పెయింట్ స్ప్రే చేసేశాడు. దానికి బదులుగా అతనికి వేసిన శిక్ష ఏమిటో తెలుసుగా?"


    "చెప్పండి సార్" అన్నాడు ప్రొడక్షన్ మేనేజరు చాలా ఆసక్తిగా.


    నటరాజన్ కసిగా చెప్పడం మొదలెట్టాడు. "అలాంటి చిన్న చిన్న అపరాధాలు చేసిన వాళ్ళకి కూడా కేనింగ్ - ఫైనూ, జైలు శిక్ష విధిస్తారు.


    సింగపూర్ లో కేనింగ్ అంటే కర్రతో కొట్టడం! ఈ శిక్ష అమలుచేసే పద్దతి, దాని తాలూకు రూల్సు కూడా ఖచ్చితంగా వుంటాయి. నేరస్తుడిని కర్రతో కొట్టి \శిక్ష అమలు చేయబోయే అధికారి చాలా ఆరోగ్యంగా దృడంగా వుండాలి. రత్తన్ కర్రనే శిక్షకి ఉపయోగించాలి. నేరస్తుడిని తోలు సంకెళ్ళతో చేతులు, కాళ్ళు బంధించేయ్యాలి. నాలుగు అడుగుల పొడుగు , ఐదు అంగుళాల వెడల్పు ఉన్న రాత్తన్ కర్రని బాగా నానబెట్టి , దానితో కొట్టాలి, ఖైదీ చర్మానికి యాంటీ సెప్టిక్ పూయాలి. కర్రతో కొట్టడం వల్ల నేరస్తుడి చర్మం చిట్లి , మాంసం ముక్కలు గాల్లోకి ఎగవచ్చును,  కర్రతో కొట్టకముందూ , కర్రతో కొట్టిన తర్వాత కూడా డాక్టరు నేరస్థుడిని పరీక్షించి చికిత్స చెయ్యాలి."


    "ఇదంతా ఇప్పుడెందుకు గుర్తొచ్చింది సార్!" అన్నాడు అర్ధనారీశ్వరన్.


    "మన అల్లరి రాజకీయవేత్తలకీ , మన అవినీతి అధికారులకి ఇక్కడ కూడా అలాంటి శిక్షలు విధిస్తే తప్ప వీళ్ళు పద్దులు మార్చుకోరు " అన్నాడు నటరాజన్ చిరాగ్గా. అలా అంటూనే "అర్ధా! డిల్లి నెంబరు కలుపు. దీని సంగతి నేను తేలుస్తా!" అన్నాడు . అతని డీలింగ్స్ ఎప్పుడూ టాప్ లెవెల్లోనే ఉంటాయి.


    
                                             * * *


    "ఎందుకొచ్చారు ఇక్కడికి?" అంది మీనాక్షి గుమ్మం దగ్గర నిలబడి వున్న రాజాతో. ఆమె గొంతులో కోపానికి బదులు సన్నటి దుఃఖం ధ్వనిస్తోంది.


    "ఒక్కమాట చెప్పడానికి వచ్చాను" అన్నాడు రాజా క్లుప్తంగా. అతను చెప్పబోయేదేమిటో తనకి బాగా తెలిసినట్లు మౌనంగా ఉండిపోయింది మీనాక్షి.


    "ఐ లవ్ యూ!" అన్నాడు రాజా అంతలోనే.

 Previous Page Next Page