Previous Page Next Page 
ప్రేమకు పెట్టుబడి కావాలి పేజి 37


    అన్నపూర్ణమ్మ గార్కి, కృష్ణాజిల్లా నందిగామ నియోజక వర్గాన్ని, అద్భుతంగా అభివృద్ధి చేసిన, కీర్తిశేషులు శ్రీ దేవినేని వెంకట రమణ అంటే అపారమైన గౌరవం, ప్రేమాభిమానాలు వున్నాయి. పొరపాటున ఆయన్ని విమర్శించావనుకో, ప్రేమ సంగతి అలా వుంచితే - మీకామె దేహశుద్ధి చేయటానికి కూడా వెనకాడదు.

 

    నందిగామ నియోజక వర్గాన్ని, అన్ని రంగాలలో అభివృద్ధిపరచి, నందనవనంగా తీర్చిదిద్దాలని తన అన్న స్వర్గీయ దేవినేని వెంకటరమణ ఎన్నో పథకాలను రూపకల్పన చేసి అకాల మరణం చెందారని, వారి ఆశయాల సాధనే లక్ష్యంగా తాను పనిచేస్తానని ప్రమాణం చేస్తున్న దేవినేని ఉమామహేశ్వర్రావు అన్నా, అన్నపూర్ణమ్మగారికి చాలా గౌరవాభిమానాలు వున్నాయి.

 

    ఈ విషయాన్ని కూడా మీరు బాగా గుర్తుంచుకోవాలి.

 

    అన్న వెంకటరమణ కార్యదీక్ష, పట్టుదల, పౌరుషం, నిరంతరం శ్రమించే గుణం, రైతుల పట్ల, దళితులపట్ల, మైనార్టీ వర్గాల పట్ల, ఆయనకున్న ప్రేమాభిమానాలు ఉమామహేశ్వరరావుకు కూడా ఉన్నాయి.

 

    ఈ విషయాన్ని అన్నపూర్ణమ్మగారు కూడా నందిగామ వెళ్ళి, విచారించి తెలుసుకున్నారు.

 

    అన్నపూర్ణమ్మగారిని ఆకట్టుకోవడానికి మీకు చాలా విషయాలు తెలియజేశాను. ఇక ఆమె దగ్గర మార్కులెలా కొట్టెయ్యాలో మీకు ఈపాటికి అర్థమయి వుంటుందనుకుంటున్నాను.

 

    అన్విత ప్రేమను పొందటానికి అన్నపూర్ణమ్మగారిని ఎందుకు ప్రసన్నం చేసుకోవాలి? అనే పిచ్చి ఆలోచనలకు వెళ్ళకండి" సీరియస్ గా చెప్పాడు డిటెక్టివ్.

 

    "అలాగే గుర్తుపెట్టుకుంటాను. ఇంతకీ అన్నపూర్ణమ్మగారు ఈ విషయాలన్నీ ఎవరితో మాట్లాడారు?" అడిగాడు మధు.

 

    "అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ఆమె ఒక క్లబ్ మీటింగ్ కి వెళ్ళబోతున్నారు. ఆ క్లబ్ వాళ్ళు అన్నపూర్ణమ్మగార్ని నేటి రాజకీయాల గురించి మాట్లాడమని అడిగారట..... అందుకే యిదంతా" నవ్వుతూ అన్నాడు డిటెక్టివ్.

 

    "మంచి వివరాలే అందించారు" అన్నాడు మధు ఆనందంగా.

 

    "ఇక అన్విత విషయానికొద్దాం.

 

    ఇప్పటివరకూ అన్విత మూడుసార్లు, పదేసి నిమిషాల చొప్పున ఫోన్లో మాట్లాడింది. ఆ ఫోన్లు విమల, కల్యాణి, రవి...... అనే వ్యక్తుల నుంచి వచ్చాయి."

 

    రవి పేరు వినగానే వులిక్కిపడ్డాడు మధు.

 

    "ఏలూరు  నుంచా?" అడిగాడు మధు.

 

    "కాదనుకుంటా- వాళ్ళందరూ ఆవిడ ఫ్రెండ్సా?"

 

    "మా క్లాస్ మేట్స్."

 

    "వాళ్ళు విశాఖ వచ్చినట్టున్నారు. ఏదో హోటల్ నుంచి అనుకుంటా..... బహుశా వారందరూ అన్విత ఇంటికి గంటలోనో, అరగంటలోనో రావచ్చు" చెప్పాడు మధు.

 

    మధు మనసంతా కకావికలమయిపోయింది.

 

    సమయానికి సుల్తాన్ లేకపోవడం ఇబ్బందిగా వుంది.

 

    "వాళ్ళ వివరాలు నాకెప్పటికప్పుడు తెలియాలి" చెప్పాడు మధు.

 

    "అలాగే!" మెసేజ్ కట్ అయింది.

 

    దాదాపు అయిదారుగంటలసేపు మెసేజ్ ఏమీలేదు.

 

    కాలుగాలిన పిల్లిలా ఫ్లాట్లో తిరుగుతున్నాడు మధు.

 

    సాయంత్రం ఆరుగంటల పదిహేను నిమిషాలు.....

.

    ఫోన్ మోగింది.

 

    "తేజా! ఇప్పుడే వైట్ కలర్ మారుతీ వచ్చింది..... అందులోంచి ముగ్గురమ్మాయిలు దిగి లోనికి వెళ్ళారు...... ముగ్గుర్నీ అన్విత రిసీవ్ చేసుకుంది. డ్రాయింగ్ రూమ్ లో మాట్లాడుతున్నారు..... ఎక్కడికో రమ్మంటే అన్విత వస్తానని ఒప్పుకుని, ఇప్పుడే డ్రెస్సింగ్ రూంలోకెళ్ళింది..... ఓవర్!"

 

    ముగ్గురమ్మాయిలు అంటే?

 

    కళ్యాణి, విమల, సుష్మా ఫ్రాంక్లిన్ అయి వుంటారు.

 

    వాళ్ళందరూ ఎక్కడికి వెళతారు?

 

    హోటల్లో రవి వాళ్ళు వున్నారా? పార్టీకా?

 

    అంటే రవి ప్లాన్డ్ గా పార్టీ ఎరేంజ్ చేశాడన్న మాట.

 

    తనొక్కడూ వస్తే అన్విత రాదని, కళ్యాణి వాళ్ళని తీసుకొచ్చాడన్న మాట.

 

    రవి నుంచి అన్వితకు ఏదో ప్రమాదాన్ని శంకిస్తున్నాడు మధు.

 

    ఆ ప్రమాదం నుంచి ఎలాగైనా అన్వితను రక్షించాలి.

 

    నిర్ణయించుకున్నాడు మధు.

 

    రవితేజ నుంచి ఫోన్ రాగానే బయల్దేరడానికి ప్రిపేరయ్యాడతను. పిచ్చివాడు రాయి వేపే చూస్తున్నట్లుగా- అథనుఇ టెలిఫోన్ వైపే చూస్తున్నాడు.

 

    అంతలోనే టెలిఫోన్ మోగింది.

 

    వెంటనే రిసీవరు అందుకున్నాడు.

 

    "చెప్పండి...."

 

    "ఇప్పుడే  వాళ్ళందరూ బయల్దేరారు..... కారు కైలాసగిరివైపు వెళుతోంది. నేనూ ఫాలో అవుతున్నాను."

 

    "మగవాళ్ళెవరూ లేరా?"

 

    "లేరు."

 

    తన అంచనా తప్పా? ఏం జరుగుతోంది? ఎనీ హౌ - తనూ బయల్దేరితేనే మంచిది."

 

    "నేనూ వస్తున్నాను....... మిమ్మల్ని కలుస్తాను" చెప్పి, రిసీవరు పెట్టేసి గబగబా ఫ్లాట్ కి తాళం వేసేసి కిందకొచ్చి హీరో హోండా స్టార్ట్ చేశాడు.

 


                                       *    *    *

 

    హీరోహోండా మువ్వలవానిపాలెం పార్కు దగ్గర మలుపు తిరిగి, కైలాసగిరి కొండదారి పట్టింది. విశాలక్షినగర్, సాగర్ నగర్ మీదుగా వెళుతోంది.

 

    అప్పటికి బాగా చీకటి పడింది.

 

    అతనికెక్కడా రవితేజ బ్లాక్ అంబాసిడర్ గానీ ,వైట్ మారుతీగానీ కనిపించలేదు.

 

    భీమిలీకి వెళ్ళే తగరపువల్స క్రాస్ రోడ్డు వరకూ వెళ్ళి, మళ్ళీ వెనక్కొచ్చాడు.

 

    రాత్రి ఎనిమిది గంటలు దాటితే సముద్రానికి ఆనుకుని వున్న ఆ రోడ్డు దాదాపు నిర్మానుష్యంగా వుంటుంది.

 

    రాత్రి తొమ్మిదిగంటలకు భీమిలి వెళ్ళి, సిటీబస్సులో వెళ్ళిపొతే.... అసలావేపు ఒక్క వాహనం కూడా వెళ్ళదు.

 

    పాముల మెలికలు.... ఐదు కిలోమీటర్ల పొడవాటి చీకటి రోడ్డుమీద రెండుసార్లు తిరిగి తిరిగి అలిసిపోయి-  

 

    రోడ్డు పక్కనున్న సిమెంటు బెంచీ మీద కూర్చున్నాడు.

 

    దూరంగా సాగర్ నగర్.....

 

    ఫ్లాట్స్ లో లైట్లు ఒక్కొక్కటీ ఆరిపోతున్నాయి.

 

    అన్విత వాళ్ళు సరే- రవితేజ ఏమయ్యాడు?

 

    సిగరెట్ వెలిగించి సముద్రానికెదురుగా వున్న సరుగుడు చెట్లవేపు చూస్తున్నాడతను.

 

    ఆ చెట్ల మధ్య ఏదో నల్లటి ఆకారం.... రవితేజ కారు కాదుగదా? తన హీరోహోండాని రోడ్డుపక్కన పొదల్లో పెట్టి మట్టిదారి గుండా చెట్ల మధ్య నుంచి లోనికి నడవసాగాడు.

 

    పావుగంట గడిచింది.

 

    అతను ఊహించింది  నిజమే.

 

    చీకట్లో బ్లాక్ అంబాసిడర్, ఆ పక్కన రవితేజ చేతిలో బైనాక్యులర్స్.....

 

    "మీరిక్కడేం చేస్తున్నారు? గంట నుంచి తిరుగుతున్నాను. నేను కన్పించలేదా?"

 

    "లేదు."

 

    "వాళ్ళెక్కడ?"

 

    "అటు చూడు" అన్నాడు దూరంగా చెట్ల మధ్య వున్న బిల్డింగ్ ను చూపిస్తూ.

 

    రోడ్డుమీద నుంచి చూస్తే ఆ బిల్డింగ్ కనబడదు.

 

    ఆ బిల్డింగ్ లో లైట్లు వెలుగుతున్నాయి.

 

    "ఏం జరుగుతోంది అక్కడ?"

 

    "డ్రింక్ పార్టీ."

 

    "ఆడపిల్లలు కూడా తాగుతున్నారా......?" ఆశ్చర్యంగా అడిగాడు మధు.

 

    "లేదు. వీళ్ళు అక్కడకొచ్చిన పావుగంటకు, ఇంకో రెడ్ మారుతీ కారులో ఓ నలుగురు కుర్రాళ్ళు, ఇంకో ఇద్దరమ్మాయిలు వచ్చారు."

 

    "ఈ రవిగాడొచ్చాడా?" కోపంగా అడిగాడు మధు.

 

    "వాడెవడో నాకు తెలియదు కదా? ఆ నలుగురిలో ఒకడా...... వాళ్ళని చూస్తావా?" అని తన చేతిలో వున్న బైనాక్యులస్ కున్న  లెన్స్ ఎడ్జెస్ట్ చేసి మధు చేతికిచ్చాడు డిటెక్టివ్ రవితేజ.

 

    మధు అందుకుని చూడసాగాడు.

 

    తన ఎదురుగా కూర్చున్నట్టుగా దృశ్యం కనబడుతోంది.

 

    లాన్ లో పెద్ద రౌండ్ టేబుల్.

 

    దాని చుట్టూ ఛైర్స్.... టేబుల్ మీద డ్రింక్ బాటిల్స్- డ్రింక్ నిండిన గ్లాసులు - మంచింగ్ ప్లేట్లు- సోడా బాటిల్స్.

 

    రవి, రవి పక్కన అన్విత. అన్విత పక్కన కళ్యాణి, విమలమ్ రమణ, పక్కన సుష్మా ఫ్రాంక్లిన్, నికితాకేడియా.... షాజహాన్, బుచ్చిబాబు.

 

    రవి సిగరెట్ వెలిగించుకుని ఏదో చెపుతున్నాడు.

 

    అన్విత పెద్దగా నవ్వుతోంది.

 

    రవి భుజాలు ఆమె భుజాలకు తగులుతున్నాయి.

 

    ఆ దృశ్యం చూడగానే వళ్లు మండిపోయింది మధుకు.

 

    'ఇడియట్' అనుకున్నాడతను.

 

    బైనాక్యులస్ రవితేజ కిచ్చేసి ముందుకడుగు వేశాడు.

 

    'వద్దు' అన్నట్టుగా భుజంమీద చెయ్యివేసి ఆపాడు రవితేజ.

 

    "చూడు..... మధూ.....ఫ్రాయిడ్ ను మీరు చదువుకున్నారా.......? ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని నువ్వు

తెల్సుకోవాలనుకుంటే, ఆ వ్యక్తి ప్రవర్తనను రహస్యంగా గమనించాలి, ఇఅలామ్తి సమయాల్లో అన్విత ప్రవర్తన ఎలా వుంటుందో తెలియాలంటే మీరక్కడకు వెళ్ళగూడదు" అన్నాడు రవితేజ.

 

    "వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు నాకు తెలియాలి....." అన్నాడు మధు.

 

    "అయితే ఓ పనిచేద్దాం. రండి" అంటూ ముందుకు నడిచాడు.

 

    అంతా చీకటి..... బిల్డింగ్ రెండోవైపున ఎత్తయిన గుట్ట. అక్కడ నుంచి వీళ్ళకి, వాళ్ళు స్పష్టంగా కనిపిస్తారు. వాళ్ళ మాటలు కూడా విన్పిస్తాయి. కానీ వీళ్ళు వాళ్ళకి కనిపించరు చుట్టూ వున్నపొదల కారణంగా.

 

    ఎంబ్రాయిడరీ చేసిన సెక్సీ డ్రస్ లో అన్విత దివినుంచి భువికొచ్చిన అప్సరసలా తళతళమని మెరిసిపోతోంది. ఆమెవేపే ఆరాధనగా చూస్తున్నాడు రవి.

 

    ఒక్క అన్విత తప్ప అక్కడున్న అందరూ బీర్, హాట్ డ్రింక్స్ తీసుకో సాగారు.

 Previous Page Next Page