Previous Page Next Page 
నీలికనుల నీడల్లో పేజి 36

    ఈ బాధలన్నీ ఒక ఎత్తు అసలు తలనెప్పి వేరే వుంది. బన్సీలాల్ మనిహ్సి గోపన్న పారిపోయిన అయిదుగురు ఖైదీలలో గోపన్నకూడా వున్నాడు.
   
    నెంబర్ వన్
   
    ఈ విషయం బయటికి పొక్కకూడదు.
   
    నెంబర్ టు   
   
    ఈ సాయంత్రం లోపల కొందరు ఖైదీలనన్నా పట్టుకుంటే విషయం బయటికి లాగవచ్చు.
   
    నాలుగు వైపులకీ తన చేతికింద మనుషులని తరిమి కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్నాడు ఇన్ స్పెక్టర్.
   
    బన్సీలాల్ కి ఈ విషయం తెలిస్తే!
   
    ఆ ఊహ రాంగానే బి.పి. పడిపోతున్నది. ముచ్చెమటలు దిగజారుతున్నాయి.
   
    ఖైదీలు పెళ్ళి వారింట్లో మూడు నిద్దర్లుచేసి వెళ్ళిన పెళ్ళి వారిలా సునాయాసంగా వెళ్ళారు.
   
    ఆ ఊహ రాంగానే బి.పి రైజవుతుంది.
   
    ఇదీ ప్రస్తుతం ఇన్ స్పెక్టర్ పరిస్థితి.
   
    ఈ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుండగా కొల్ల దొంగని పట్టుకువచ్చాడు ఓ కానిస్టేబుల్.
   
    ఇన్ స్పెక్టర్ ముఖం వికసించింది. "ఎక్కడ దొరికింది ఈ కోడి?" అన్నాడు. ఒకడు దొరికినా చాలు. వాడిచేత రక్తం కక్కించి అయినా సరే మిగతా ఖైదీల వివరాలు లాగొచ్చని ఆయన ధీమా.
   
    "డొంకదారిలో దాక్కున్నాడు. నేను అటు పక్కకే వెళ్ళాను వెతకడానికి. నాగజెముడు పొదల చాటున నక్కి వున్నాడు."
   
    కానిస్టేబుల్ నిదానంగా చెపుతుంటే ఆత్రుత పట్టలేక ఇన్ స్పెక్టర్ "వేడిని ఎలా చూశావు?" అన్నాడు.
   
    ఈ తఫా కానిస్టేబుల్ పెదవి కదిపేలోపల కోళ్ళదొంగ ఇకిలిస్తూ చెప్పాడు. "కోడిని నొక్కి పెట్టేసరికి కొక్కొరకో అంది. అంటే అర్ధం నన్ను పట్టుకున్నవాడు ఇక్కడ నక్కాడు అని. అర్ధం పరమార్ధం అయి నేను పట్టుబడ్డాను."
   
    "చెప్పుకోటానికి సిగ్గు లేదురా? ధూ...నీ బతుకు కోడి ఈకేలతో తగలెయ్య." ఇన్ స్పెక్టర్ అన్నాడు.
   
    ఓ వెర్రి నవ్వు నవ్వి వూరుకున్నాడు కోళ్ళదొంగ.
   
    "వీడు దొంగిలించిన కోడి ఏది?" ఇన్ స్పెక్టర్ అడిగాడు.
   
    ఈ తఫా కూడా కానిస్టేబుల్ మాట్లాడే ముందుగానే కోళ్ళదొంగ అందుకొని చెప్పాడు. "నేనండీ కోళ్ళు దొంగిలిస్తాను. కోడిని చూస్తే చాలు వెర్రెక్కిపోతుంది నాకు....హాయిగా యీ నరకం నుంచి బయటపడ్డాను. నా దోవన నేను పోక దారిలో ఎవరిదో కోడి కనిపించేసరికి నా కళ్ళు భైర్లు కమ్మాయి. అంతే కోడి చేతిలోకి వచ్చింది. బుర్ర పనిచేయటం మానేసింది. కోడి కొక్కిరింతలతో నేను పట్టుబడ్డాను. నేను మళ్ళీ జైలుకు వచ్చాను. నేను దొంగిలించిన కోడి తెల్లారి మీ ఇంట్లో కూరకి అటు వెళ్ళింది.
   
    ఇన్ స్పెక్టర్ కి మండింది....వీడు చెప్పే తీరు ఎలా వుందంటే నేను కోడిని దొంగిలించాను. కానుక కోళ్ళదొంగని అయ్యాను. మీరు అప్పనంగ కోడిని కూర చేసుకుతింటున్నారు. కనుక అప్పనంగ దొరికిన దొంగ కోడికూర మీది. అన్నట్లు తోచింది.
   
    ఒక ఖైదీ దొరికాడు. వీడిని చీల్చి చెండాడి అయినా సరే వీళ్ళు ఎలా పారిపోయింది విషయం మొత్తం లాగాలి. చాలా పెద్ద కథ తెలుస్తుంది. ముఖ్యంగా గోపన్న విషయం తెలుస్తుంది అనుకున్నాడు. "వీడిని లాక్కెళ్ళి ఆ మూల గదిలో పడెయ్యి వస్తాను__" అన్నాడు ఇన్ స్పెక్టర్.
   
    కానిస్టేబుల్ కోళ్ళదొంగని లాక్కెళ్ళాడు.
   
    "వీడిని చావకుండా కొట్టాలి. చచ్చేటట్లు కొడితే చచ్చివూరుకుంటాడు. దాంతో విషయం తెలిసిపోదూ! పైగా కొత్త కేసు అవుతుంది. వీడి నోట్లోంచి విషయం లాగకపోతే నా బ్రతుకెందుకు? నేను చేసే ఉద్యోగానికే తలవంపులు."
   
    కాసేపు తాపీగా ఆలోచించాడు. నిజం వాడి నోట తక్షణం కక్కించాలన్న ఆవేశము వుంది. నిజం వాడి నోట తక్షణం కక్కించాలన్న ఆవేశము వుంది. ఒకడయినా దొరికినందుకు మనసు చల్లగానూ వుంది. ఆ పరిస్థితి అలాంటిది.
   
    పది నిమిషాల తర్వాత...
   
    ఇన్ స్పెక్టర్ కన్నారావు హుషారుగా కుర్చీలోంచి లేచాడు. మిగతా కానిస్టేబుల్స్ కి చెప్పవలసిన జాగ్రత్తలు చెప్పాడు. మీసం దువ్వుకుంటూ కోళ్ళ దొంగని వుంచిన రూమ్ వేపు తాపీగా అడుగులువేస్తూ వెళ్ళాడు.
   
    అప్పుడు సమయం
   
    పదకొండు ముప్పావు...
   
                                                                                         23
   
    "ఇప్పుడు సమయం ఎంతో తెలుసా?"
   
    "అర్దరాత్రి అయుంటుందండి."
   
    "చాలా అలసిపోయినట్లున్నావ్?"
   
    "అవునండి."
   
    "బాగా నిద్రపోవాలని వుందా?"

 Previous Page Next Page