రావి చెట్టు దగ్గరి రైల్వేగేటు దగ్గర పొగాకు దొరికేది. తాతయ్య అది కొనుక్కోవడానికి వెళ్లారు. రైలు కట్టమీద పడిపోయారు. ఎరిగినవారు ఇంటికి తీసుకొని వచ్చి వదిలారు. "నిన్ను ఎవరు పొమ్మన్నారు?" అని నాయన తాతయ్యమీద ఎగిరారు. మా నాయనమ్మ కూడ గలగలా అంది. మా అమ్మ దెబ్బలకు సున్నం రాసింది. నేను తాతయ్య దగ్గరే పడుకున్నాను.
మా తాతయ్య నిజంగా మంచివాడు.
ఫోటో సిత్రం:
ఆనాడు ఖమ్మంలో ఫోటోగ్రాఫరర్లు ఉండేవారు కారు. బెజవాడనుంచి వచ్చి ఫోటోలు తీసేవారు. అలా ఒకసారి ఫోటోగ్రాఫరు వచ్చినపుడు మా నాయన పిలిపించారు. తాతయ్య - నాయనమ్మల ఫోటో తీయించాలనుకున్నారు.
"వర్చస్సు తగ్గుతుంది. ఫోటో దిగను" అన్నారు తాతయ్య. అయినా, బలవంతం చేసి నాయన ఇద్దరినీ సిద్ధం చేయించారు. ఇంట్లో తీయరాదన్నారు. ఆ వింత చూడ్డానికి అందరం గుంటి మల్లన్న సత్రానికి వెళ్లాం.
మా తాతయ్యను, నాయనమ్మను లోపలి అరుగుమీద కూర్చోపెట్టారు. ఎదురుగా మూడు కర్రలమీద ఒక పెట్టె - కెమెరా పెట్టాడు ఫోటోగ్రాఫరు. నల్లని ముసుగు వేసుకున్నాడు. అందులోంచి చూస్తాడు. ముసుగు తీస్తాడు. కూర్చున్నవాళ్లను కదిలిస్తాడు. ఇటు అటూ అంటాడు. తుదకు కెమెరా మూత తీశాడు. అయిపోయింది అన్నాడు. అడావుడి పూర్తి అయింది. బొమ్మ చూపలేదు. అందరమూ ఇంటికి తిరిగి వచ్చాం.
ఆనాడు మా నాయన ఫోటో తీయించకుంటే మా తాతయ్య - నాయనమ్మల పటం మాకు దక్కేదికాదు.
1991నవంబరులో గుంటి మల్లన్న గుడిముందు - పోయిన మర్రి అరుగుమీద - సాహితీ హారతివారు - మా అన్నయ్య వర్ధంతి సానుతాప వాతావరణంలో నిర్వహించారు. అప్పుడు వచ్చిన మా పిల్లలు, పిల్లల పిల్లలకు గుంటి మల్లన్న సత్రంలో మా తాతయ్య - నాయనమ్మ ఫోటో దిగిన ప్రదేశం - విధం - చూపాను - వివరించాను.
ఒకనాడు తాతయ్యకు నిండు పండుగ అయింది. ఆనాడు చేతిలో నేతి తప్పేల - భుజం మీద బస్తాతో - చిన్న గూడూరు నుండి వడ్లకుంట సాయెబు దంపతులు వచ్చారు.
మా తాతయ్య వారిని చూచారు. వారిలో ఆనంద అవధులు దాటింది. పొంగింది. ఉప్పొంగింది. చంద్రుని అంటింది. వారు ఉక్కిరి బిక్కిరి అయినారు. ఎదురునకు ఉరికారు. చేతిలో తప్పేలా - భుజాలమీద బస్తా కూడా చూడలేదు. సాయెబును గట్టిగా కౌగలించుకున్నారు. రుద్ధకంఠంతో 'సాయెబూ!' అన్నారు.
కన్నీరు జలజలా రాలింది - రాలుతూనే ఉంది.
సాయెబు కన్నుల్లో జలపాతాలు.
తప్పేల కిందపడిందీ - బస్తా జారిందీ గమనించలేదు.
అది ఆనందానికి పరాకాష్ట!
అది అపూర్వ అనుభూతి!!
అది అనంత రసానుభూతి!!!
అది మైత్రి. అది స్నేహం. అది సహవాసం. అది ప్రేమ. అది అనుబంధం. అది ఆత్మీయత. అది అనురాగం.
ఎంతోసేపు అలా వారు అపూర్వ మధురానుభూతిలో మునిగారు. వారికి లోకం తెలియదు. నాకం తెలియదు. తెలుసుకొని చూస్తే చుట్టూ జనం!
"నన్ను మరిచావులే సాయబూ!"
"మరుస్తే ఇందాక వస్తానుండి?"
చేతులు పట్టుకొని ఇంట్లో ప్రవేశించారు. ఇహ వదల్దేదు! వారి ముచ్చట్లు వడిసిపోలేదు.
వారు ఏటికి వెళ్ళారు. స్నానాలు చేశారు. బట్టలు ఉతుక్కున్నారు. అరేసుకున్నారు . నేను వారివెంట.
మా తాతయ్య ముందు కూర్చొని కొసరి కొసరి వడ్డించి తినిపించారు. తాను వారి పంక్తిన తినలేదు. అంతేతప్ప వారు విడిచి ఉండలేదు.
స్నేహం మనసుకు సంబంధించింది. మనసుకు కుల మతాలవంటి సంకుచితత్వాలు లేవు. ఒకరు బ్రాహ్మలు. ఒకరు గౌండ్లు ఏమి విచిత్ర బంధం! విశిష్ట బంధం!!
ఈ అనుబందపు ప్రేరణతో "శరతల్పం" అనే నవల వ్రాశాను. అది ఒక శ్రీవైష్ణవునికి, ఒక హరిజనునికి స్నేహపు కథ. ఒక మర్రిని పెనవేసుకుని తాటి చెట్టు పెరుగుతుంది. ఈ రెంటినీ ఒక తీగ పెనవేసుకుని పాకుతుంది! ఈ బంధాన్ని ఎవరు విడదీయగలరు!
"రాళ్లది, ఏళ్ళది, లేళ్లది, జోళ్లదేకులమో ఆ కులమే మదీయము" అన్నాడు దాశరథి.
తాతయ్య, సాయెబులతో నేను ఏటికి వెళ్లాను. మర్రికిందికి వెళ్లాను. గుంటి మల్లన్న సత్రానికి వెళ్లాను. నరసింహస్వామి గుట్టకు వెళ్లాను. ఖిల్లా ఎక్కాను. బజారులు తిరిగాను.
మూడు రోజులు గాలిలో ఎగిరిపోయాయి!
నాలుగవనాడు సాయెబు దంపతుల ప్రయాణం! ఈ విరహాన్ని ఎవరూ వర్ణించలేదు - లేరు. వారి మనసుల్లో గుబగుబ ఆరాటం - ఆందోళన. వారి వదనాలు మ్లానములు. వారి గుండెల చప్పుళ్లు వినిపిస్తున్నాయి.
సాయెబు దంపతులు మూటలు అందుకున్నారు.
తాతయ్య కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నారు.
"ఒక్కసారి గూడూరు వెళ్ళొస్తారా!" నాయనతో తాతయ్య దేబరింపు.
"పోదువుగానిలే, సాయెబును సాగనంపిరా."
"సాయెబూ! వీడు నన్ను ప్రాణాలతో గూడూరు చూడనియ్యడు." తాతయ్య నిస్పృహ.
"అట్ల అనొద్దు లక్ష్మయ్యగారు! మీరేగద చెప్పిన్రు - ఎప్పుడు మంచి తలచాలె, మంచి చూడాలె, మంచి చెప్పాలని." రాండి పోదాం బస్సుకాడికి. అని కదిలాడు సాయెబు తాతయ్యను తీసుకొని - నేనూ వారివెంటనే.
అప్పుడు బస్సులు గుంటి మల్లన్న గుడి దగ్గర ఆగేవి. బస్సు వచ్చి ఆగింది. ఒకరిని ఒకరు వదలరు. సాయెబు బస్సెక్కాడు. జలజలా బాష్పధార రాల్చారు.
"సాయెబూ! మళ్ల నిన్ను చూస్తనా?" తాతయ్య ఎదపగిలి కన్నుల్లోంచి ప్రవహిస్తూంది.
డ్రైవరు, కండక్టరు సహితంగా బస్సులోనివారి కళ్లు చెమర్చాయి.
శకుంతలను సాగనంపడానికి కాళిదాసు వ్రాసిన నాలుగు శ్లోకాలూ చాలవనిపించాయి.
కాలం కదలక ఆగదు. బస్సు సాగిపోయింది!
తాతయ్య తలపట్టుకొని రాతిమీద కూలబడ్డారు.
ఆ బాధ వారి మనసులో గూడు కట్టుకున్నది. వదల్లేదు. తాతయ్య మళ్లీ కోలుకోలేదు.
ఆనాటి నుంచి తాతయ్య ఏదో మూలధనం పోగొట్టుకున్నట్లు వెతుకుతున్నారు తనువు మాత్రమే ఇక్కడుంది. తాను గూడూరులో విహరిస్తున్నాడు.
కాలం కర్పూరంలా కరుగుతున్నది. తాతయ్య నిలువలేకపోతున్నారు.
తాతయ్య ఒకనాటి పట్టపగలు ఒక మూట - గొడుగు తీసుకొని బయల్దేరారు. నాయన ఎదురుగా అడ్డు నిలుచున్నారు.
"ఎక్కడికి వెళ్తావు?"
"గూడూరు."
"ఎట్లా వెళ్తతావు?"
"కాలినడకన" అని నాయనను పక్కకు నెట్టారు. ఆ నెట్టడంలో గొడుగు కిందపడింది. నాయన తూలి నిలదొక్కుకున్నారు. తాతయ్య అడుగు ముందుకు వేశారు. నాయన గొడుగు అందుకొని, తాతయ్య భుజంమీద బలంగా కొట్టారు.
తాతయ్య కూలబడ్డారు. మూలిగారు. అంతే - ఆనాటినుంచి ప్రాయోపవేశం. అన్నం ముట్టలేదు. మందు వేసుకోలేదు. నాయన ముఖం చూడలేదు.
ఒకనాటి ఉదయం మా అమ్మ ఏటికి మంచినీళ్లకు బయల్దేరింది. నేనూ వెంట వెళ్లాను. తడిచీరతో, తలమీద బిందెతో ఇంట్లో అడుగుపెట్టాం.
తాతయ్య మంచం దిగారు. కండవా నేలమీద పరుచుకున్నారు. పడుకుంటూ "తీర్థం" అన్నట్లు చేతితో సంజ్ఞ చేశారు.
"మామగారు ఎట్లనో చేస్తున్నారు!" మా అమ్మ అరిచింది.
నేను యంత్రకంగా కదిలాను. నాయన తరుమస్కాపు చేసుకుంటున్నారు. వారిముందు "శ్రీపాద తీర్థం" ఉంది. అందుకున్నాను. పరిగెత్తి తాతయ్య నోట్లో మూడు సార్లు అర్పించాను. అంతే - అంపశయ్యమీద భీష్ముడు అంతరించాడు!