Previous Page Next Page 
ఆఖరి ఘడియలు పేజి 35

 

    "సెంట్ పర్సెంట్ కామ్రేడ్! అందులో అనుమానమేమీ లేదు . హటాత్తుగా శ్యాం సైకిల్ ని బ్రేక్ వేసి నిలబెట్టి మిర్రర్ లో చూస్తూ మాట్లాడసాగాడు.
    "భవానీ! మననేవరో ఆ ఎర్ర మారుతీకార్లో వెంబడిస్తూన్నరనీ అనుమానంగా వుంది నాకు. మన సైకిల్ ఎటు తిరిగితే ఆ కారూ అటు తిరుగుతూ చాలా స్లో గా వస్తోంది. నువ్వు ఆ కిల్లి కొట్లో సిగరెట్టూ కొనుక్కోస్తున్నట్లు నటించు! వాళ్ళెం చేస్తారో చూద్దాం!" భవానీ పక్కనే ఉన్న సిగరెట్ షాప్ కెళ్ళి సిగరెట్లు కొంటూ తల పక్కకు తిప్పి చూశాడు.
    ఎర్ర మారుతీ కూడా చాలా స్లో అయిపోయింది. అసలది కదులుతుందో , లేదో కూడా తెలీటం లేదు.
    ఓ పాకెట్టు సిగరెట్లు, అగ్గిపెట్టె కనుక్కొని శ్యాం దగ్గర కొచ్చాడతను. ఇద్దరూ చెరో సిగరెట్టు వెలిగించుకున్నారు. కారు బాగా దగ్గర కొచ్చేసింది.
    "పిస్టల్ తీయడానికి సిద్దంగా వుండు" అన్నాడతను శ్యాంతో.
    "రెడీ" అన్నాడు శ్యాం చేతిని పాంటు పాకెట్ దగ్గరికి పోనిస్తూ.
    హటాత్తుగా కారు వేగం పెరిగింది. మరుక్షణంలో వాళ్ళను దాటి ముందుకు వెళ్ళిపోయింది శ్యామ్ నవ్వేశాడు.
    "మనం అనవసరంగా అపోహపడ్డామనుకుంటాను"అన్నాడు.
    భవానీశంకర్ కి అతని మాటలు వినిపించటం లేదు. ఆ కార్లో వెనుక సీట్లో కూర్చున్న ఆ ఇద్దరు వ్యక్తుల గురించి ఆలోచిస్తున్నాడు. అందులో ఒక వ్యక్తీ మొఖం అంతకు ముందేక్కడో చూసిన గుర్తు. ఎంత ఆలోచించినా ఎక్కడ చూసింది జ్ఞాపకం రావడం లేదు.
    సైకిల్ మళ్ళీ బయలుదేరింది. ఆ తరువాత జంక్షన్ దాటేసరికి రోడ్డు పక్కనే ఉన్న చెట్టు కింద ఆగి వుందా కారు.
    శ్యామ్ మళ్ళీ కలవరపాటుతో "భవానీశంకర్ "వేపు చూశాడు.
    "మన కోసమే అగారేమో" రహస్యంగా అన్నాడతను.
    భవానీ శంకర్ సైకిల్ బ్రేకులు నొక్కేశాడు తనే.
    "ముసుగులో గుద్దులాటెందుకు కామ్రేడ్! మనమే వారితో స్నేహంచేసుకుందాం. అప్పుడిక ఈ అపోహలు, అపార్ధాలు ఉండవు కదా" అన్నాడతను.
    శ్యామ్ సైకిల్ ని కారు ప్రక్కనే ఆపాడు. భవానీశంకర్, వెళ్ళి కారు కిటికీ దగ్గర తలపెట్టి లోపలకు జాగ్రత్తగా చూశాడు.
    ఇద్దరూ వ్యక్తులూ ఒకరి మోహలోకరు చూసుకున్నారు మళ్ళీ.
    "గుడ్ మాణింగ్ కామ్రేడ్స్! మీకిలాంటి చీకటి వాతావరణమంటే ఇంత ఇష్టమని నాకు తెలీదు. ఎనీవే ఈ చీకటి చాలా బావుంది కదూ? అయ్ మీన్ చిక్కగా ఉంది కదూ?"
    ఓ వ్యక్తీ కారు దిగి నిలబడ్డాడు.
    "ఊ!" అన్నాడు తీవ్రంగా.
    భవానీ శంకర్ చప్పున అందుకున్నాడు.
    "చూడండి కామ్రేడ్స్! మిమ్మల్ని చూస్తుంటే జాలితో ఏడుపొచ్చేస్తోంది నాకు. పాపం ఇంకా పాత సినిమాల్లో సీన్లను కాఫే కొట్టి చేజింగ్ సీన్లు ప్రాక్టీస్ చేస్తున్నట్లున్నారు. ఇప్పుడు సినేరియా మారిపోయింది బ్రదర్స్! అంతా డయిరేక్ట్  ఎటాక్! ఏం కావాలో అడగండి చెప్పేస్తాం! అంతేగానీ ఇలా మైళ్ళకొద్ది వెంబడించడం చాలా తెలివితక్కువ పని!"
    ఆ ఇద్దరూ వ్యక్తులూ మళ్ళీ మొహాలు చూసుకున్నారు.
    "త్వరగా మాట్లాడండి కామ్రేడ్స్! మేము నిద్రపోయే టైమయిపోయిందిందాకే! రాత్రి పదకొండు తర్వాత నిద్ర మేలుకోవటానికి కామ్రేడ్ శ్యామ్ ఏమాత్రం ఇష్టపడడు" అన్నాడు భవానీశంకర్. శ్యామ్ అప్పుడే పెద్దగా అవులించాడు.
    ఇద్దరిలోనూ ఓ వ్యక్తీ డోర్ తెరచుకుని కారు దిగాడు. శ్యామ్ చెయి అప్రయత్నంగా పిస్టల్ మీద కెళ్ళింది.
    "మీరూ మీ కుటుంబాలూ క్షేమంగా ఉండాలంటే మర్యాదగా ఆ అడ్రస్ బుక్ ఇచ్చేయండి! ఆ పుస్తకం మీకేమీ ఉపయోగపడదు" బెదిరింపుగా అన్నాడతను.
    భవానీశంకర్ గట్టిగా నవ్వేశాడు.
    "ఉపయోగపడడా? యూ ఆర్ మిస్టేకన్ కామ్రేడ్! "తైలంబు తీయవచ్చు" అనేది మా లేటెస్టు పాలేసీ! తైలం అంటే తెలుసు కదా! క్యాష్!"
    ఆ వ్యక్తీ ఆశ్చర్యపోయాడు.
    "అయితే మీకు ఆ పుస్తకం సంగతి తెలిసిపోయిందన్న మాట అన్నాడు ఆశ్చర్యంగా.
    "పూర్తిగా తెలిసిపోయింది కామ్రేడ్స్! ఆ పుస్తకం ఆ అడ్రసు తాలూకు ఫ్లాష్ బాక్ లూ అన్నీ తెలిసిపోయినాయ్-" అబద్దమాడేశాడు భవానీశంకర్.
    ఆ ఇద్దరూ వ్యక్తులూ కొంచెం దూరం నడిచి రహస్యంగా మాట్లాడుకున్నారు. మొదటి వ్యక్తీ మళ్ళీ భవానీశంకర్ దగ్గరకొచ్చాడు.
    "నువు మా బాస్ దగ్గర కొచ్చి మాట్లాడటం మంచిదనుకుంటాను. అనవసరంగా రక్తం చిందించటం మా కిష్టం లేదు" అన్నాడు గంబీరంగా.
    "మోస్ట్ సెన్సిబుల్ అయిడియా కామ్రేడ్! మీ బాస్ ఎక్కడుంటాడో చెప్తే ఇప్పుడే కలుసుకుందాం."
    "హోటల్ నైటింగేల్!"
    భవానీశంకర్ ఆశ్చర్యపోయాడు.
    "ఓహో! ఇప్పుడు మేము పరిశోధన జరిపి వచ్చిన బార్ అన్నమాట. బైదిబై మీ బాస్ పేరేమిటి?"
    "సిద్దార్ధరావు"
    భవానీ శంకర్ తను కూడా మారుతీ కార్లో కూర్చున్నాడు.
    "కామ్రేడ్ శ్యాం! నువ్వు సైకిల్ మీద వచ్చేసేయ్ హోటల్ దగ్గరకు చెప్పాడతను.
    "ఒకే" అన్నాడు శ్యాం సైకిల్ వెనక్కు తిప్పేస్తూ.
    పదినిముషాల్లో నైటింగేల్ బార్ చేరుకుంది కారు. తలుపు తీసుకుని బార్ లోకి నడిచారిద్దరూ.

 Previous Page Next Page