Previous Page Next Page 
శృంగారపురం ఒక కిలోమీటరు పేజి 34

 

    ఓరోజు మా వారు ఆఫీసుకు బయలుదేరుతున్నారు. స్నానం చేసి లుంగీ మొలక చుట్టుకుని తయారవడం మొదలుపెట్టారు.

 

    కాఫీ తీసుకుని వెళ్ళి యిచ్చాను. ఆయన్ను చూస్తునే జయంత్ గుర్తుకు రావడంతో "పొట్ట చూడండీ ఎంత అసహ్యంగా వుందో! ఎప్పుడూ ఆ జయంత్ లా టక్ చేసుకోండి" అన్నాను.

 

    ఆయన ఏమనుకున్నారో తెలీదు. ఎప్పుడూ ఆయన అతిగా మాట్లాడరు. ఏ ఫీలింగ్ నీ  ఎప్పుడూ ఎక్స్ ప్రెస్ చేయరు. ఎప్పుడయినా పూలు ఇంటికి తెచ్చినా  దాన్ని అలా  సోఫా మీద పడవేస్తారే తప్ప "పూలు పెట్టుకో" అని అనరు.  చివరికి రొమాన్స్ లో కూడా అంతే. నిశ్శబ్దంగా వుంటారే తప్ప. నోరువిప్పి మాట్లాడరు.


    
    నిజానికి ఆయనను జయంత్ తో పోల్చిచూడడం తప్పు. నలభైఏళ్ళ వాడికి ఇరవై రెండేళ్ళ కుర్రాడితో పోల్చి అలా వుండమని అడగడం  ఎబ్బెట్టుగా వుండే విషయం. జయంత్ ఎప్పుడూ టక్ చేసుకుని వుంటాడన్న  భ్రమ నాకుంది. అతనూ ఇంట్లో మా ఆయనలానే పొట్ట కనబడటేట్టు లుంగీ లు వుంటాడన్న నిజం నాకు తట్టలేదు.

 

    ఇలా విశ్లేషించుకుంటూ పోతే దేన్నీ సరిగా అనుభవించలేమనుకుంటా. అందుకే చాలామంది హృదయం ఎలా  చెబితే అలా నడుచుకుంటారే తప్ప బుద్ధితో ఆలోచించరు. నేనూ అంతే.

 

    సాయంకాలమైతే నేనూ, పిల్లలూ నర్సరీ దగ్గరికి వెళ్లడానికి తయారైపోయే వాళ్ళం. ఎప్పుడైనా జయంత్ కనిపించకపోతే ఏదో  వెలితిగా వుండేది. అయితే ఆ వెలితి ఎందుకో, అతను నుంచి నేను ఏం కోరుకుంటున్నానో నాకే  తెలీదు.

 


                                                        *    *    *

 

    ఓరోజు సాయంకాలం యధాప్రకారం నర్సరీ దగ్గర వున్నాము. పిల్లలిద్దరూ దూరంగా ఆడుకుంటున్నారు. మా వారూ,  మధూ ఏదో  పని  వుందని బజారుకి వెళ్ళారు.

 

    అప్పుడొచ్చాడు జయంత్. నేను చిన్నగా  నవ్వాను.

 

    "మా మిత్రులెవరూ ఇంకా వచ్చినట్టు లేదు. వీడు- అదే మీ తమ్ముడు ఎక్కడికెళ్లాడు?" అని అడిగాడు.

 

    "బజారెళ్ళాడు" అని ముక్తసరిగా చెప్పాను. అతనితో  మామూలుగా మాట్లాడలేకపోతున్నాను. ఏదో డిఫరెన్స్ వుంది.

 

    అతను కొంచెంసేపు ఆగి "మీరు అద్భుతంగా వీణ వాయిస్తారని విన్నాను. నాకు వినాలని వుంది. అయితే అందరూ వున్నప్పుడు మీరు వాయిస్తానంటే కుదరదు. నాకు అలా ఇష్టం వుండదు. మనం యిద్దరమే వుండాలి. మీరు అలా కూర్చుని వాయిస్తుంటే వినాలి. అప్పుడు విధిగా వెన్నెల వుండాలి. ఆ  వెలుతురులో మీరు వీణ మీటుతుంటే నేను వినాలి" అన్నాడు. ఇదంతా చెబుతున్నప్పుడు ఏదో తెలియని ఫీలింగ్ తో అతని కంఠం బరువుగా వినబడింది.

 

    నేను చిన్న జర్క్  ఇచ్చాను. ఎప్పుడో పెళ్ళికి ముందు వీణ నేర్చుకున్నాను. పెళ్ళయిన తరువాత ఎప్పుడైనా ఒంటరిగా వున్నప్పుడు అలా రెండు మూడు రాగాలు వాయించేదాన్ని. మావారు ఎప్పుడూ వీణ వాయించమని అడగలేదు. నేను ఆయన ముందు నా విద్య ప్రదర్శించలేదు. ఆ తరువాత అప్పుడప్పుడూ కూడా వీణ జోలికి పోలేదు.

 

    ఇన్నేళ్ళ తరువాత ఇప్పుడు ఓ వ్యక్తి వీణ వాయించమని అడుగుతున్నాడు. అదీ వెన్నెల్లో ప్రత్యేకంగా అతని కోసమే వాయించాలాట. నా గుండె జల్లుమంది. నా చిన్నతనం, అప్పట్లో వీణ నేర్చుకోవడం కోసం మాస్టారు దగ్గరికి వెళ్లడం, నేర్చుకున్న విద్యను అమ్మమ్మ దగ్గర ప్రదర్శించడం గుర్తొచ్చాయి.

 

    వెన్నెల్లో తనకోసమే వీణ వాయించాలన్న కోరిక కోరడం వెనుక అతని కళాతృష్ణ, సౌందర్య భావన ఏదయినా అనుభవాన్ని గాఢంగా అనుభవించాలన్న తపన నాక్కనిపించాయి.

 

    నేను ఏమీ  జవాబు చెప్పలేదు. అదో రకమైన మైల్టు షాక్ తో అలా మౌనంగా వుండిపోయాను.

 

    అంతలో అతని మిత్రులు వచ్చారు. తిరిగి కాఫీలు, సిగరెట్లలో పడిపోయారు. ఏ  దురలవాట్లూ లేకుండా, ఎప్పుడూ ఏదో  మూడీగా, సౌమ్యంగా వున్న మా ఆయన్ను చూసీ చూసీ విసుగేయడంవల్ల అనుకుంటాను అతని విశృంఖలత అదో ఆకర్షణగా కనిపించింది.

 

    ఇలా అతను  అడిగిన వారం రోజులకనుకుంటాను. మావారు పనిమీద ఒంగోలు వెళ్ళారు. రెండు రోజులు రారు. ఆయన వెళ్ళిన సాయంకాలమే నేను పిల్లల్ని తీసుకుని చంద్రగిరి వెళ్ళాను.

 

    మా తమ్ముడ్ని చూస్తూనే పిల్లలు చాక్ లెట్ల కోసం అల్లరిచేశారు. అతను వాళ్ళను తీసుకుని బజారు వెళ్లాడు. నేను ఏదో దొరికిన పుస్తకం తీసుకుని చదవడం మొదలుపెట్టాను.

 

    "హలో" ఆ పిలుపు మరీ దగ్గరగా వినిపిస్తే గబుక్కున తలెత్తి చూశాను.

 

    ఎదురుగ్గా జయంత్.

 

    "ఎప్పుడొచ్చారు? ఇక్కడున్న పూలకుండీల్లో మీరూ ఓపూల మొక్కలా  కలిసిపోయారు" అన్నాడు. అతను గాఢంగా చెబుతున్నట్టు అనిపించడంవల్ల  అనుకుంటాను అతను చాలా అడ్వాన్స్ డ్  అయిపోతున్నాడని అనుకోకుండా గర్వంగా ఫీలయ్యాను. చప్పున సిగ్గు ముంచుకొచ్చింది.

 

    నిజానికి అతను అలా కాంప్లిమెంట్ చేయడం హద్దుమీరడమే. కానీ కొన్ని ఏళ్లుగా ఓ రొటీన్ జీవితానికి అలవాటు పడడంవల్ల ఏదో  మార్పును కోరుకుంటోంది మనసు. అందుకే అతనిమీద కోపం రాలేదు. పైపెచ్చు అదో విధమైన గర్వం నన్ను పోంగించింది.

 

    మావారు ఎప్పుడూ ఇలా మాట్లాడి ఎరుగరు. నేనెప్పుడయినా కొత్తచీర కట్టుకున్నా ఆయన కామెంట్ చేయరు  సరికదా పరిశీలించి కూడా చూడరు. మొదట్లో ఆయన ప్రవర్తనకి ఆశ్చర్యపోయినా ఆ తరువాత సర్దుకున్నాను. ఎప్పుడూ  ఆయన  నుంచి నేను ఎలాంటి కాంప్లిమెంట్లూ ఆశించలేదు.

 

    "మీవారు ఒంగోలు వెళ్ళారు కదా. మరి నా కోరిక తీరుస్తారా?వస్తాను."

 

    చప్పున తలెత్తాను. నా కళ్ళల్లో కోపం ప్రస్ఫుటం అయిందో లేదో  నేను  ఖచ్చితంగా చెప్పలేను. కానీ నా రక్తమంతా ఏదో హడావుడిగా పరుగులెత్తడం తెలుస్తూనే వుంది.

 

    విచిత్రమేమంటే అతను తడబడలేదు. ఈసారి మరింత స్పష్టంగా  అడిగాడు- "వీణారవళి వినే భాగ్యం కల్పిస్తారా?"

 

    అదీ సంగతి. అంతకుమించి ఆలోచించనందుకు నాకు నాకే  ఎబ్బెట్టుగా వుంది.

 

    ఏమీ  చెప్పకుండా తల వంచుకున్నాను.

 

    "రేపు సాయంకాలం ఆరుగంటలకు వస్తాను" మెల్లగా చెప్పాడు. నేను నోరు తెరవబోయేంతలో మధుసూదన్, పిల్లలు వస్తూ కనిపించారు.

 

    అతను వాళ్ళను చూసి 'హాయ్' అంటూ ఎదురెళ్లాడు. వాళ్ళు  మాట్లాడుకుంటూ వుండగానే మిగలిన మిత్రులు వచ్చారు. అందరూ కబుర్లలో పడ్డారు.

 

    నేను పిల్లల్ని తీరుకుని ఎనిమిది ప్రాంతాన తిరిగి ఇంటికొచ్చేశాను.

 

    ఆ రాత్రంతా నాకు నిద్రలేదు. ఏవేవో ఆలోచనలు. ఇలాంటి అవస్థ అంతా పెళ్ళికి ముందు అనుభవించాల్సింది. కానీ నాకు వీలు  కాలేదు. నాకు బాగా స్పృహ తెలిసేలోగా పెళ్ళి జరిగిపోయింది.

 Previous Page Next Page