ఇప్పుడు...?
చప్పున ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఇదేమిటి.... ఇంత చిన్న విషయానికి? వయసు వచ్చిన కొద్దీ తానాలో పరిపక్వత రావాలిగానీ, బేలగా మారిపోకూడదు. అసలిప్పుడు ఏం జరిగిందని?
నొప్పి ఎక్కువవుతున్నట్లు తోచింది. ఓ అరగంట అలాగే ఓర్చుకుంటూ పడుకుంది. రాను రానూ నొప్పి భరించలేనంత స్థాయిలోకి వెళ్ళిపోయి, తట్టుకోలేక విలవిల్లాడిపోతుంది. ఇంట్లో పిల్లలు ముగ్గురూ లేరు.
డాక్టరుగారికి ఫోన్ చేద్దామని లేచి, అలాగే తూలుకుంటూ హాల్లోకి వచ్చి ఆయన నంబరు డయల్ చేసింది. అవతల్నుంచి ఎవరో ఎత్తారు. డాక్టరుగారు లేరని చెప్పారు. ఆదివారమని గుర్తు వచ్చింది.
ఈ సమయంలో కొత్త డాక్టర్లకు ఏమని ఫోన్ చేస్తుంది? ఒంటరిగా ఎక్కడికని వెళుతుంది?
అలాగే బాధతో చుట్టుకుపోతూ సోఫాలో కూలబడిపోయింది.
* * *
మొదట ఎవరిదో నాట్యప్రదర్సన, తరువాత మిమిక్రీ, ఏకపాత్రాభినయం వగైరాలన్నీ అయాక నాటిక మొదలయింది.
విజ్ఞత నడివయసులో ఉన్న గృహిణి వేషం వేసింది. సంసారం గురించి పట్టించుకోని భర్త, తల్లిదండ్రులకి ఎదురు తిరుగుతూ అనుక్షణం కల్లోలం సృష్టించే పిల్లలు- వీళ్ళ మధ్య నలిగిపోతూ విజ్ఞత పాత్ర.
రాజాచంద్ర కథని ఫాలో అవటంలేదు.....నడివయసు స్త్రీ వేషంలో నటిస్తోన్న విజ్ఞతనే చాలా పరిశీలనగా గమనిస్తున్నాడు.
విశారదే స్టేజిమీద అవతరించిందా అన్నట్లుగా భ్రమ.
ఈ మేకప్ లో విజ్ఞతకూ, విశారదకూ తేడానే లేదు.
అతని మనసులో ఉద్విగ్నత క్షణక్షణం అధికమైపోతుంది.
ఏదో ఉంది- అసలీ విజ్ఞత ఎవరు? ఉన్నట్లుండి ఈ ఊళ్లోకి ఎలా అవతరించింది? వాళ్ళ తల్లిదండ్రులు... ఇవన్నీ నిజమేనా?
ఒక మనిషికీ, ఇంకో మనిషికీ పోలికలుంటే ఉండవచ్చు. కాని కారణం లేకుండా...
ఆ కారణమేమయి ఉంటుంది?"
భయంకరమైన ఆలోచన అతని మనసులోనికి ప్రవేశించటానికి ప్రయత్నిస్తుంది- అతను బయటకు తోసెయ్యటానికి ప్రయత్నిస్తున్నాడు.
శక్తి చాలటం లేదు.
అలిసిపోతున్నాడు.
నుదుట స్వేదబిందువులు అలుముకుంటున్నాయి.
సుకుమారత్వానికీ, కఠిన సత్యానికీ మధ్య పోరాటం జరుగుతుంది.
ఎలాగైనా సరే, పర్యవసానాలు ఎంత తీవ్రమైనవన్నా సరే- పరిశోధించి సత్యాన్ని వెలికి తియ్యాలి.
ఒక వికృతమైన నిర్ణయం అతని హృదయంలో బాకులా దిగబడిపోయింది.
నాటిక అయిపోయాక రాజాచంద్ర విజ్ఞతను అభినందించడానికి గ్రీన్ రూమ్ లోకి వెళ్ళాడు.
గ్రీన్ రూమంతా కళాకారులతో నిండిపోయి హడావుడిగా వుంది. విజ్ఞత ఓ పక్కన నిలబడి జుట్టుముడి విప్పుకుంటూ ఎవరితోనో మాట్లాడుతుంది.
రాజాచంద్ర ఆమె దగ్గరకెళ్ళి "విజ్ఞత" అని పిలిచాడు.
ఆమె తలతిప్పి చూసి "మీరా?" అంది అతన్ని చూడగానే ఆమె మొహంలో, గొంతులో సంతోషం కనిపించింది.
అతను చొరవగా ఆమె భుజం మీద చెయ్యి వేసి "చాలా బాగా నటించారు" అన్నాడు.
ఆమె అతని కళ్ళలోకి చూస్తూ "థాంక్స్" అంది.
సరిగ్గా ఆ సమయానికి ఫోటోగ్రాఫర్ వాళ్ళిద్దరూ అలా ఉన్న భంగిమలో ఫోటో తీశాడు.
* * *
కారులో ఇంటికి తిరిగివస్తూ రాజాచంద్ర చాలా అన్యమనస్కంగా ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలపాటు ప్రపంచం ఈర్ష్యపడేటంత అన్యోన్యంగా సాగిన సంసారం తమది. మధ్యలో ఎదుర్కొన్న ఒడిదుడుకులూ, పిల్లలూ తమ అన్యోన్యతకడ్డు రాలేదు ఇప్పుడు...
తాను అవివేకంగా, కఠినంగా ఆలోచిస్తున్నాడా?
తప్పు దారిన పోతున్నాడా?
కాదు ఏదో జరిగింది. విశారద గత జీవితంలో ఏదో నిగూఢ రహస్య ముంది. దాన్ని బయటకు తియ్యాలి.
అతని సున్నితమైన మనసు అగ్ని కణికలు విరజిమ్ముతుంది.
* * *
బయట కారాగిన చప్పుడయింది. ఓ నిమిషం తర్వాత బజర్ నొక్కాడు.
వచ్చింది రాజాచంద్ర అని తెలుసు.
విశారద పడి ఉన్న చోటులోంచి లేవలేకపోతుంది.
బైటనుంచి మళ్ళీ జబర్ నొక్కాడు.
ఒళ్ళంతా తడిసి ముద్దయిపోయింది. కడుపులో భరించ శక్యంకాని బాధ. ఎలాగైనా లేవాలని విశ్వప్రయత్నం చేస్తుంది.
మెల్లగా కూచుంది. శరీరంలోని శక్తినంతా స్వాధీనం చేసుకుని, పక్కన సోఫా ఆధారంగా లేచి నిలబడింది. ఒక్కొక్క అడుగూ వేస్తుంది.
కళ్ళముందు ముసురుతున్న చీకటి.
రాజాచంద్ర అసహనంగా బజర్ నొక్కుతున్నాడు.
విశారద తలుపు దగ్గరకు చేరుకుంది. గడియ తీసింది.
"ఏమిటిది? ఎంత సేపు? ఇంట్లో మీరంతా...."
ఆమె ఏదో జవాబు చెబుదామని ప్రయత్నించింది. సాధ్యం కాలేదు. కాళ్ళలో బలం నశించినట్లయిపోయి, తెలివితప్పి కింద పడిపోయింది.