"ఏమోయ్ మాగజైన్ ఎలా తీస్తారో నీకు తెలీదూ?"
చిరంజీవి ఈ అవకాశాన్ని వదలదల్చుకోలేదు. ఎన్.సి.సి. లో తను సంపాదించిన విజ్ఞానమంతా ఉపయోగించి కల్నల్ ని సంతోషపెట్టాలని నిర్ణయించుకున్నాడు.
"తెలుసండీ! అసలు గన్ లో మూడు భాగాలుంటాయండీ! అవి వరుస క్రమంలో బట్ గ్రూప్, బాడీగ్రూప్, బారెల్ గ్రూప్ గా వ్యవహరించబడును. మాగజైన్ బయటకు తీయాలంటే ట్రిగ్గర్ కి సమీపమున ఒక మీట ఉండును. అంటే ఉదాహరణకు డోర్ బెల్ కి మీ బిల్డింగ్ లో కింద మీట ఉన్నట్లు...."
కర్నల్ కి అతనిమీద సదభిప్రాయం కలగడం మొదలుపెట్టింది.
తను చాలామంది ఎన్సీసీ స్టూడెంట్స్ ని చూశాడు కానీ ఇలా ఇన్ని రోజులు పార్ట్స్ గుర్తుపెట్టుకున్నవాళ్ళు బహు కొద్దిమంది.
"నువ్వు ఎన్సీపీలో ఉన్నావా?" అడిగాడు కల్నల్.
"అవునండీ"
"ఆర్మీలో ఎందుకు జాయినవలేదు మరి?"
"వాళ్ళు రానీలేదండీ"
"ఎందుకని?"
"తెలీదండీ!"
"అయ్ విల్ రికమెండ్ యువర్ కేస్"
"థాంక్యూ సర్"
ఇంకాసేపు అలా మాట్లాడితే అతనిమీద పూర్తి సదభిప్రాయం కలిగేదేమోకాని ఇంతలోకి సింహాద్రి మాట్లాడాడు.
"అవునండీ! చిలకల పంజరం డోర్ కి ఆ వెనుకవేపు గోడకు మీట ఉన్నట్లు మాగజైన్ కి కింద మాట ఉంటుందండీ!"
"కల్నల్ అనుమానంగా సింహాద్రివేపు చూశాడు.
"వాట్..... పంజరానికి మీటా? మీట అక్కడ ఉన్నట్లు మీకెలా తెలుసు?"
చిరంజీవి సింహాద్రివేపు చూసి పళ్ళు పటపట కొరికాడు.
జరిగిన తప్పు తెలుసుకుని నాలిక్కరుచుకున్నాడు సింహాద్రి.
"అబ్బే! మాకు తెలీదండీ"
"తెలీదా?"
"పట్టండీ? తెలీదు"
"నిజం చెప్పండి! ఆ మీట నొక్కారా మీరు?"
"అబ్బే లేదండీ! అదసలు ఉందనే తెలీదు"
"తెలీందే గోడకి మీట ఉన్నట్లు ఎలా చెప్పావ్?"
"ఊహించానండీ"
"అయ్ డోంట్ బిలీవ్. నేను వెళ్ళి పంజరం చూసి వస్తాను" అంటూ రెండడుగులు వేసి మళ్ళీ అనుమానంగా ఇద్దరివేపూ చూశాడతను.
"ఒరే రంగా! వీళ్ళిద్దరూ పారిపోకుండా చూస్తూండు" అని చెప్పి బయటికెళ్ళాడు.
ఇదే అదననుకుని సింహాద్రి శ్రీదేవిని బతిమాలసాగాడు.
"శ్రీదేవిగారూ! మమ్మల్ని రక్షించండి ప్లీజ్"
శ్రీదేవి కోపంతో మండిపడింది.
"వీల్లేదు! మిమ్మల్ని కాల్చిపారెయ్యాల్సిందే"
"అదేంటండీ! మనిద్దరం ప్రేమించుకున్నాం కదా?"
"అది ఇందాక చదువుతున్న నవల పూర్తి కాకముందు సంగతి"
"మరిప్పుడండి?"
"ఇప్పుడు అయ్ హేట్ యూ అండ్ యువర్ హిప్నాటిజం"
"మరి సైకోపతి, టెలీపతి, విలోపతి సంగతి?"
"అయ్ హేట్ ఎవ్రిథింగ్"
"ఐసీ" అన్నాడు సింహాద్రి.
"యస్ యూ కెన్ గో టూ హెల్" అందామె ఇంకా కోపంగా.
"కానీ మీరు ఎందుకండీ వాటిని ఇంత సడెన్ గా హేట్ చేస్తున్నారు?"
"ఇప్పుడు నేను చదివిన నవల వల్ల"
"అలాగాండీ!"
"యస్!"
"ఏమయిందండి ఆ నవల్లో?"
"ఇంకేమవుతుంది? ఆ విలన్ గాడు తనకొచ్చిన హిప్నాటిజం, టేలీపతీ, సైకోపతి ద్వారా హీరోయిన్ నీ, ఆమె ఫామిలీ మెంబర్స్ నీ నానా అవస్థలూ పెట్టి చంపిపారేశాడు. వాటి వల్ల ఇంత చెడు జరగడానికి కూడా అవకాశం వుందని నాకింతవరకూ తెలీదు"
"తెలుస్తే ఏం చేసేవారండీ?"
"ఆ చెత్త ఏనాడో చదవడం మానేసేదాన్ని"
సింహాద్రికేం మాట్లాడాలో తెలీలేదు. దీనంగా చిరంజీవి వేపు చూశాడు. చిరంజీవికి అతనిని చూస్తే జాలేసింది. వెంటనే వాడిని రక్షించకపోతే తమ స్నేహానికి ఉపయోగం ఏముందీ అనిపించింది.
"శ్రీదేవిగారూ!" అన్నాడు గొంతు సవరించుకుని.
"యస్" ప్రశ్నార్ధకంగా అతనివేపు చూసిందామె.
"నిజం చెప్పాలంటే హిప్నాటిజం అంటే మీకెంత ద్వేషమో పాపం వాడికి కూడా అంతే ద్వేషం అండీ" అన్నాడు సీక్రెట్ బయటపెడుతున్నట్లు.
శ్రీదేవి నమ్మలేనట్లు చూసింది.
"ద్వేషమా?"
"అవునండీ!" తలూపాడు సింహాద్రి.
"నేన్నమ్మను"
"అలా అనకండి! మీమీద వట్టు"
"ఆ పుస్తకాలే రాస్తూ అవంటే అసహ్యం అంటారేమిటి? మీకేమయినా మెదడుందా అసలు?"
"మెదడుందండి! ఈ మధ్యే ఎక్స్ రే తీయించినప్పుడు క్లియర్ గా కనిపించింది" చెప్పాడు చిరంజీవి.
"అయితే మరి అలా పిచ్చిమాటలు ఎందుకు మాట్లాడుతున్నట్లు?"
"పిచ్చిమాటలు కాదండీ ఫాక్ట్స్! వీడు కేవలం కమర్షియల్ రైటర్! అంతే"
"అంటే?"
"అంటే కేవలం బిజినెస్ కోసం-అంటే అలాంటి పుస్తకాలు ఎక్కువ అమ్ముడవుతాయి కాబట్టి రాస్తున్నాడు"
"నేన్నమ్మను"
"ప్లీజ్! ఈ ఒక్కసారికీ నమ్మండి" బతిమాలాడు సింహాద్రి.
"నో"
"శ్రీదేవిగారూ!"
"మిస్ శ్రీదేవి అనండి"
"మిస్ శ్రీదేవి"
అప్పుడే కల్నల్ లోపలికొచ్చాడు మళ్ళీ.
"నిజం చెప్పండి. ఆ మీట నొక్కింది మీరా, కాదా?" సింహాద్రి దగ్గరకొచ్చి అడిగాడతను.
"అబ్బే - నిజంగానండీ! మాకేం తెలీదు" అన్నాడు సింహాద్రి.
"అవున్సార్! మాకేమాత్రం తెలీదు. మేము కేవలం డోర్ బెల్ కోసం వెతుకుతూంటే శ్రీదేవిగారే తలుపు తెరిచి డోర్ బెల్ మీట కాళ్ళకిందే వుందని చెప్పారు"