Previous Page Next Page 
హ్యూమరాలజీ-1 పేజి 32


    "ఆగండాగండి! నిజానికిది తెలుగుకాదండీ?"
    "మరే భాష?"
    "అసలే భాషాకాదండీ! అర్ధంలేని మాట."
    "మరి ఈ సినిమాకు అవార్డు కూడా వచ్చిందన్నారు. సిల్వర్ జూబ్లీ ఫిలిం అన్నారు- ఇలాంటి సినిమాకు అర్ధంలేని పిచ్చిపేరు ఎలా పెట్టారు?
    "మా తెలుగు సినిమాలు అంతేనండీ! సాధారణంగా టైటిల్ కి అర్ధం ఉండదు" ఆమె వెంటనే పుస్తకంలో ఏదేదో రాసుకుంది.
    "ఇందాక సింహం రక్కింది" అనేది మరో అవార్డ్ పిక్చరన్నారుకదా! దానర్ధం ఏమిటి?"
    "అంటే హీరో సింహం అన్నమాటండీ! అతను అందరినీ రక్కేస్తూంటాడు?"
    "అంటే అడవిమనిషా?"
    "కాదనుకోండి! నాగరికుడేగానీ రక్కేస్తుండటం వాడికిష్టం!"
    "కానీ చేతుల్తో మామూలుగా ఫైట్ చేయవచ్చు కదా! రక్కటం ఎందుకు?"
    "టైటిల్ ఎలా వుంటే అలా చేస్తారండీ మా తెలుగు హీరోలు! చెయ్యకపోతే జనం చూడరు!"
    "అవునండీ! వేటకుక్క అనే పిక్చర్లో మొదట్నుంచీ చివరివరకూ హీరో విలన్లు అందరినీ కుక్కలా కారుస్తూనే ఉన్నాడు. 'రాబందురాక్షసి' సినిమాలో హీరో నోటితో అందరినీ చీల్చితినేశాడు. 'భల్లూక భస్మం' సినిమాలో హీరో భల్లూకంలా నడిచి గోళ్ళతో రక్కుతుంటాడు."
    "వెరీ స్ట్రేంజ్" అందమె తన పుస్తకం తెరుస్తూ.
    "తప్పదండీ! అడవి మృగాల పేర్లకే ఎక్కువగిరాకి! వాటికోసమే జనం ఎగబడతారు గానీ మా హీరోలకోసం కాదు" సిగ్గుపడుతూ చెప్పాడు గోపాల్రావ్. ఆమె పుస్తకంలో ఏదో రాసేసింది.
    సినిమా మొదలయింది.
    హీరో విలన్లు ఫైటింగ్ మొదలు పెట్టారు.
    "ఏమిటి వాళ్ళెందుకలా కొట్టుకుంటున్నారు?" ఆత్రుతగా అడిగింది ఎల్వీరా.
    "సాధారణంగా ఫలానా కారణం అంటూ ఏమీ ఉండదు. ప్రతి పావుగంటకూ ఓ ఫైటింగు ఉండటం మామూలే! ఆ ఫైట్స్ లేకపోతే జనం చూడరు."
    ఆసీనయిపోయింది.
    హఠాత్తుగా హీరో హీరోయిన్ వెనుకబడి పాట మొదలెట్టాడు.
    "వంగతోటలో వంగమాకు- దొండతోటలో పడబోకు రెండూ జాగ్రత్త పిల్లా..."
    జనం కుర్చీల్లో నుంచి తప్పట్లు కొట్టారు.
    "వాటీజ్ దట్?" ఆశ్చర్యంగా అడిగింది ఎల్వీరా.
    "ఆపాట సాహిత్యం వాళ్ళకు నచ్చిందికాబోలు..." అన్నాడు శాయీరామ్.
    "దానర్ధం ఏమిటో?"
    మాకేం చెప్పాలో తెలీదు.
    "అది డబుల్ మీనింగ్ సాహిత్యం"
    "అంటే?"
    "అంటే రెండర్ధాల సాహిత్యం అన్నమాట! ఒకటి మంచిది రెండోది బూతు"
    "మైగుడ్ నెస్! అలాంటి సాహిత్యం మీ తెలుగు ప్రేక్షకులు విని ఆనందిస్తారా?"
    "అందరూ కాదండీ! చాలామంది...." ఆమెను సరిచేశాడు జనార్ధన్.
    "మరి అలాంటి చెత్తసాహిత్యం మీ గవర్నమెంట్ బాన్ చేయదా!"
    "గవర్నమెంట్ ఉందోలేదో ఖచ్చితంగా తెలీదుకదండి- రేపు మా ఆఫీసులో అడిగిచెప్తా"
    "అయినా అది సెన్సార్ వాళ్ళు చేయాల్సినపని కాదా" అన్నాడు రెడ్డి.
    "మరి చేయరే" అడిగింది ఎల్వీరా.
    "వాళ్ళకి పాపం సాహిత్యం తెలియదండీ! అసలు చాలామంది సెన్సార్ మెంబర్లకి తెలుగుకూడా రాదు! వచ్చిన కొద్దిమందీ కూడా బూతు యాక్షనే అభ్యంతరకరమయిన సాహిత్యం అనుకుంటారు."
    "అదేమిటి? అంత తెలివితక్కువ వాళ్ళను సెన్సార్ మెంబర్లుగా ఎలావేస్తారు?"
    "అది సరిగ్గా తెలీదుగానండీ, మొత్తానికి అలాగే మానేజ్ చేస్తారు."
    మరికొంత సినిమా అయింది.
    హఠాత్తుగా జనం పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు.
    "వాటిజ్ దట్! వాట్ హేపెన్డ్?" ఆశ్చర్యంగా అడిగింది ఎల్వీరా. "మరేం లేదు! కెమెరా హీరోయిన్ బొడ్డుమీద ఫోకస్ అయింది అందుకని."
    వాటే ఫోర్నో ట్రైబ్ యూ ఆర్..." అసహ్యంగా మొఖం పెట్టి అందామె. మరుక్షణంలొ హీరో గ్రూప్ డాన్స్.
    "జజ్జునకా జన్! జింగినక..." మళ్ళీ ప్రేక్షకులు తప్పట్లూ ఈలలు.
    "ఏమిటి ఈచరణానికి అర్ధం?" అడిగింది ఎల్వీరా.
    "దీనిక్కూడా అర్ధం ఏమీలేదండీ!
    "మరి వాళ్ళలా తప్పట్లూ, ఈలలు ఎందుకు వేస్తున్నట్లు?"
    "ఏమో తెలీదుగానీ ఎప్పుడూ ఇలాంటి పాటలకు వేస్తుంటారు."
    "అంటే మీ తెలుగు పాటలు సాహిత్యమంతా బూతుగానీ, అర్ధంలేని మాటలతో గానీ ఉంటుందన్నమాట! మరి నేను చదివిన పుస్తకాల్లో తెలుగు కవిత్వాన్ని గురించి అంతగొప్పగా రాశారేమిటి?" అంటూ పుస్తకం తెరచి "తెలుగు ప్రజల సాహిత్యమంతా అర్ధంలేనిదీ. ఒకవేళ అర్ధం ఉంటే అది బూతుది." అని రాసుకుంది.
    పాట అయిపోయింది.
    కామెడీ జంట వచ్చారు.
    హీరో ఆమె దగ్గరకెళ్ళి "నాకు అదిస్తావా?" అన్నాడు.
    జనమంతా ఘొల్లున నవ్వారు.
    "ఏమిటి మళ్ళీ నవ్వుతున్నారు?"
    "బూతు డైలాగండీ!" సర్ది చెప్తూ అన్నాడా శాయీరామ్.
    రెండు నిమిషాలపాటు బూతుమాటలు మాట్లాడాక పాట మొదలయింది.
    "మన తనువులు కలిసేదెక్కడ?" పాటలోనే ప్రశ్నించింది హాస్యనటి.
    "ఇక్కడా?" అంటూ పెదాలు చూపించాడు కమెడియన్.
    "కాదు!" అందామె.
    "ఇక్కడా?" అంటూ ఆమె గుండెలు చూపించాడతను. ప్రేక్షకులు మళ్ళీ అరుపులు ఈలలు.
    "ఇక్కడా?"
    "ఉహు! ఇక్కడ"
    అతను చూపించిన శరీరభాగం చూసి మొత్తం హర్షంతో కేకలువేసి డాన్స్ చేసినంతపనిచేశారు. తరువాత సీన్ లో హీరోయిన్ తాలూకూ చిన్న పాపాయిని చంపటానికి విలన్ అర్దరాత్రి కత్తి తీసుకుని గదిలోకొచ్చాడు. ఈ సంగతి తెలిసి ఊరి బయటపుట్టలో ఉన్న పాముగంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుకొచ్చి, కిటికీలోనుంచి దూరి, ఉయ్యాల మీదకెగిరి కత్తితో పొడవబోతున్న విలన్ చేతిని కసుక్కున కాటేసింది.
    విలన్ పెద్దగా అరుస్తూ కిందపడ్డాడు. హీరోయిన్ పరుగుతో వచ్చి, ఆదృశ్యం చూసి పాముతల ఆప్యాయంగా నిమిరి ముద్దు పెట్టుకుంది.
    "వాటీజ్ దిస్ నాన్సెన్స్?" అసహనంగా అడిగింది ఎల్వీరా.
    "ఈ సినిమా ఇంకా నయమండీ! గొర్రెపొటేళ్ళు ఎద్దులు, ఆవులు గాడిదలు పిల్లలు, బొద్దింకలు, ఎలుకలు ఇవన్నీ కూడా మా సినిమాల్లో హోరున యాక్షన్ చేస్తాయండీ! హీరోయిన్ కిగానీ, హీరోకిగాని సహాయం చేసి విలన్లను చంపిపారేస్తాయ్" చెప్పాడు గోపాల్రావ్.

 Previous Page Next Page