2. నిజాం క్రూరత్వాన్ని చూచి బ్రిటిషు ప్రభుత్వం తన అధికారులను పంపింది. ట్రెంచ్, టాస్కర్లు ఆంధ్రోద్యమానికి ఎంతో సాయపడ్డారని మాడపాటివారు వ్రాశారు.
3. న్యాయస్థానాలు నిజాం చెప్పుచేతల్లో ఉన్నాయి.
4. ప్రజలను ఎంత అణచిపెడ్తే అంత పెల్లుబుకుతారు.
5. ఆంధ్రోద్యమానికి నల్లగొండ జిల్లా తావరం అయింది.
6. తెలుగువారిని ఈసడించిన మహారాష్ట్రులు ఆంధ్రుల సభల్లో పాల్గొనడం.
ఇంతటితో నిజాం రాష్ట్ర ఆంధ్రోద్యమంలో తొలి దశ విజయవంతంగా ముగిసింది. ఈ కొద్ది కాలంలో ఆంధ్రులకు ఒక సంస్థ ఉన్నదని విశ్వాసం ఏర్పడింది. వర్తకులలో ముఖ్యంగా మంచి ప్రాబల్యం సంపాదించింది. వర్తకులకు సంఘం వల్ల కొన్ని ప్రయోజనాలు కలిగాయి. వారికి దొరల, అధికారుల బెడద కొంతలో కొంత తగ్గింది. వర్తకులు మనస్ఫూర్తిగా అన్ని విధాల సంఘానికి సాయం చేశారు.
ఈ దశలో కేంద్ర సంఘం వివిధ సంఘాల సంధాన కార్యం మాత్రం నిర్వహించింది. అందువల్ల తెలంగాణం అంతటికీ ప్రాతినిధ్యం వహించే సంస్థ అవసరం అయింది. ఈ అవసరాన్ని కార్యకర్తలు, ప్రజలు గుర్తించారు. బ్రిటిషాంధ్రం నుంచి సుసర్ల శ్రీ రామనరసింహగారు విస్తృత ఆంధ్ర సంస్థ అవసరాన్ని ఆంధ్ర సంఘానికి తెలియపరచారు. వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రమహాసభ అవతరించింది.
ఆంధ్రమహాసభ అవతరణ:
తొలి ఆంధ్ర మహాసభ మెతుకు జిల్లా - ఆందోలు తాలూకా జోగిపేటలో 3, 4,5 మార్చి 1930లో జరిగింది. దీనికి విద్వాంసులు, ప్రగతిగామి సురవరం ప్రతాపరెడ్డిగారు అధ్యక్షత వహించారు.
సభలు జరుపుకోవడానికి అనుమతికి 1929 డిసంబరులో అర్థిస్తే, 22-2-1980నాడు దిగువ షరతులతో అనుమతి లభించింది.
1. అధ్యక్షుడు గైర్ ముల్కీ - రాజ్యానికి చెందనివాడు - కాకూడదు.
2. ఇతర మతస్తులకు అనుమానముకాని, మనస్తాపంగాని కలిగించరాదు.
3. రాజకీయాల జోలికి పోమని మీరిచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి.
ఈ సభలో విశేషం ఏమంటే - బాబెహుకూమత్ కార్యదర్శి మెహిదీనవాజ్ జంగ్ వంటి ప్రభుత్వాధికారులు సందేశాలు పంపడం. వీరి పేరిటనే మెహిదీపట్నం ఏర్పడింది.
ఈ సభలో ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది. సంఘ సంస్కరణలకు సంబంధించిన తీర్మానాలు ఆమోదించడం జరిగింది. బాల్యవివాహాల నిషేధం. వితంతువివాహాలు వంటి తీర్మానాలు చేశారు. ఇవి ఆహ్వాన సంఘాధ్యక్షుని సహితంగా సనాతనులకు బాధ కలిగించాయి.
అంటరానితనం తొలగించడానికి, హరిజన విద్యాభివృద్ధికి సంబంధించిన తీర్మానాన్ని హరిజన నాయకుడు శ్రీ భాగ్యరెడ్డి వర్మగారు ప్రతిపాదించారు. ఒక హరిజనుడు అందరినీ అంటుకుంటూ సభావేదికపైకి పోవడం సనాతనులు సహించలేదు. సభనుంచి వెళ్ళిపోవడానికి సిద్ధం అయినారు. వామననాయక్ గారు వారిని సమాధానపరచి కూర్చోపెట్టారు.
ఈ తీర్మానాన్ని శేషాచార్యులు, అనంత వెంకటరామ వెంకటేశ్వర గుప్త, విఠల శాస్త్రి, భుజంగశాస్త్రిగారలు వ్యతిరేకించారు. అయినా, సమావేశం తీర్మానాలను ఆమోదించింది.
ఈ సభతోపాటు మహిళాసభ జరిగింది. ప్రభుత్వ పశుచికిత్స, వ్యవసాయ శాఖలు ప్రదర్శనలు ఏర్పాటు చేశాయి. కొంత అసమ్మతి - ఉన్నా జోగిపేట సభలు దిగ్విజయంగా సాగాయి.
జోగిపేట సభతో సనాతనుల ఘర్షణను ఎదుర్కొనే స్థితికి ఆంధ్రమహాసభ ఎదిగింది.
ఘర్షణనుంచే ప్రగతి ఉద్భవిస్తుంది.
రెండవ ఆంధ్రమహాసభలు - దేవరకొండ:
రెండవ ఆంధ్రమహాసభ 3, 4, 5, మార్చి 1931న నల్లగొండ జిల్లా దేవరకొండలో జరిగింది.
ఈ సభకు కూడా జోగిపేట సభవంటి షరతులు పెట్టారు. అనుమతి ఇస్తూ టాస్కరుగారు మాడపాటివారితో "మీ ఉద్యమముతో ఈ రాష్ట్రమున మేలు చేయదగిన యోగ్యతలు చాల కలవు. అయినను ముందు ముందు ఇది అపాయకరముగా పరిగణించగలదు" అన్నారట. అది అత్యంత వాస్తవమని నిరూపించబడింది!
ఈ సభకు బూర్గుల రామకృష్ణారావుగారు అధ్యక్షత వహించారు. మహారాష్ట్రులయిన పండిత కేశవరావు గారు అధ్యక్షులను తమ కారులో తీసికెళ్ళారు. కేశవ మెమోరియల్ స్కూలు వీరిపేరనే వెలసింది.
నగరంనుంచి బస్సులలో వచ్చిన ప్రతినిధులకు, అతిథులకు బాదేపల్లి ప్రజలు అపూర్వ సన్మానం చేశారు. వారికి భోజన ఫలహారాదులు పెట్టి, బాజాబజంత్రీలతో దేవరకొండ చేర్చారు.
రెడ్డిహాస్టలు - దీనిది మహత్తర చరిత్ర - విద్యార్థులు - నాలుగు రోజులముందే కాలినడకన బయల్దేరారు. గ్రామగ్రామాన ప్రచారం చేస్తూ, యువకులను ఉత్సాహ పరుస్తూ దేవరకొండ చేరుకున్నారు.
ఆంధ్రమహాసభతో ప్రత్యక్ష సంబంధం లేక సభకు విచ్చేసిన ప్రముఖులు, మహారాష్ట్రులు పండిత కేశవరరావుగారు, వామన నాయక్ గారు, వారి పుత్రులు శ్రీధర్ నాయక్ గారు, విద్యాశాఖాధికారి గాడేపల్లి ప్రకాశరావుగారు. హైదరాబాద్ బులిటిన్ సంపాదకులు బుక్కపట్నం రామానుజాచార్యులవారు, చారిత్రకులు మారేమండ రామారావుగారు, బ్రిటిషాంధ్రులు, ప్రజామిత్ర పత్రికా సంపాదకులు గూడవల్లి రామబ్రహ్మంగారు - బెజవాడ.
ప్రభుత్వాధికారులు పోలీసు శాఖామంత్రి భాస్కర్ గారు, విద్యాశాఖ నాజిమ్ - డైరెక్టర్ - మహమ్మద్ హుసేన్ గారు, కొత్వాల్ వెంకటరామారెడ్డిగారు, నిజాం కాలేజి ప్రిన్సిపల్ టర్నరుగారు, బళ్ళారి జేలులో దేశభక్తికిగాను శిక్ష అనుభవిస్తున్న సుసర్ల శ్రీరామ నరసింహగారు సభకు సందేశాలు పంపారు.
అధ్యక్షులను అశ్వారూఢులను చేసి, క్రిక్కిరిసిన పురవీధులనుంచి ఊరేగింపుగా సభాస్థలికి చేర్చారు. ఆహ్వాన సంఘాధ్యక్షులు గంభీరమైన ఉపన్యాసం చేశారు.
ఈ సభలో ప్రధాన విషయం గ్రస్తీనిషాన్ తిర్దన్ - సర్క్యులర్ నెం.53ను ఉపసంహరించవలసిందని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడం. ఇది చరిత్రాత్మక సంఘటన. అంతకుముందు నిజాం రాజ్యంలో ఇలాంటి తీర్మానం చేసే దమ్ములు ఎవరికీ లేకుండింది. ఇది సంఘసంస్కరణకన్న ముందడుగు.
మహిళాసభ జరిగింది. దానికి టి. వరలక్ష్మమ్మగారు అధ్యక్షత వహించారు. స్త్రీలలో విద్యావశ్యకత - మాతృభాషలో విద్య - ఆరోగ్యపరిజ్ఞానములను గురించి చర్చలు జరిగాయి.
ప్రత్యేకంగా హరిజన సభ జరగడం ఈ సభ విశిష్టత. హరిజనులు చుట్టుపట్ల గ్రామాలనుంచి వచ్చారు. చిత్తారయ్యగారు అధ్యక్షత వహించారు. విజ్ఞానదాయకమైన ఉపన్యాసాలు జరిగాయి.
నిమ్నజాతుల ఉద్ధరణను గురించి గురుకుల మల్లేశరావుగారు తీర్మానం ప్రతిపాదించారు. మహాసభ దాన్ని ఆమోదించింది.
జీవరక్షా సమితివారు - ప్రభుత్వశాఖలు ప్రదర్శనలు నిర్వహించారు.
ఈ విధంగా రెండవ ఆంధ్రమహాసభ సభలు అత్యంత వైభవంగా, చైతన్యపూర్వకంగా, దిగ్వివిజయంగా పరిసమాప్తి చెందాయి.
మూడవ ఆంధ్రమహాసభ - ఖమ్మంమెట్టు:
రెండో ఆంధ్రమహాసభలో గస్తీనిషాద్ తిర్దన్ విషయమయిన తీర్మానంతో నిజాం బెదిరిపోయాడు. సూర్యాపేటసభకువలెనే ఖమ్మంసభకు అనేక ఆటంకాలు కల్పించాడు.
1. మహబూబ్ నగర్ జిల్లాలోని జటప్రోలు సంస్థానంలో మూడో మహాసభలు జరగాలని నిర్ణయించబడింది. సభకు అనుమతించాలని సంస్థాన కార్యచర్చిని అర్థించారు. ఒక నెల తరువాత "ఇట్టి అధికారం మాకు లేదు. నిజాం ప్రభుత్వపు అనుమతి పొంది మాకు చూపవలసినది" అనే శ్రీముఖం అందింది.
మళ్లీ జిల్లా అవ్వల్ తాలుక్దారు - కలెక్టరును - అర్థించారు. వారు దానికి "జిల్లా అధికారులు సంస్థాన వ్యవహారాల్లో జోక్యం కలిగించుకోరు. దేవరకొండ సభవలెనే అనుమతి పొందగలరు" అనే ప్రత్యుత్తరం పంపి చేతులు దులుపుకున్నారు.
మహాసభ కార్యదర్శి హనుమంతరావుగారు ముందు తాలుక్దారుగారికి వ్రాశారు. ప్రయోజనం శూన్యం. అప్పుడు వారు హోం సెక్రటరీకి వ్రాశారు. దానికి ఒక నెల తరువాత సాక్షాత్తు ప్రధానమంత్రి మహారాజా కిషన్ షెర్షాద్ నుంచి ఉత్తరం అందింది-
"సంస్థానము లోపలనగుగాక, బయటనగునుగాక మహాసభ సమావేశపరచుటకు అనుమతి ఇవ్వబడదు."