Previous Page Next Page 
సృష్టి పేజి 32

  

      టెలిఫోన్ వైర్లు ఎలా వుంటాయో అలా వెన్నెముకలో ఎన్నో నాళాలుంటాయి.

 

    ఆ వందల నాళాల్లో ఏ నాళానికి ఎక్కడ దెబ్బ తగిలిందో తెలుసుకోవడం చాలా కష్టం. నరాల్లోని కణాలు నెమ్మది నెమ్మదిగా చైతన్యరహితమై పోతుంటాయి. ఎప్పుడు అలా చైతన్యరహితమైపోతాయో, ఎప్పుడు అవి చైతన్యంగా పనిచేస్తాయో అదొక  మిస్టరీ.

 

    దీనికి సంబంధించి చాలా కాలం వరకూ రోగాన్ని నిర్ధారించడమే కష్టమైపోగా, ఆ రోగాన్ని నయం చేసే  శాశ్వతమైన  మందుల్ని కూడా  కనిపెట్టలేకపోతున్నారు.

 

    ఈ మేరకు అమెరికాలో విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి. అతి ప్రయత్నం మీద రెండు బలమైన  మందుల్ని సైంటిస్టులు కనుక్కొని ముందుగా పిల్లుల మీద ప్రయోగించారు. కొంత ఫలితం కనిపించినా రోగి బరువు, ఎత్తు, పొడవు, రోగి ఆరోగ్యం  ఆధారంగా  ఆ మందులు  వాడాల్సిన పరిస్థితి వున్నందుకు కొంతమేరకే ఆ మందులు పని చేశాయట.

 

    న్యూజి కేసుకి సంబంధించి కొన్ని నెలలు చాలా జాగ్రత్తగా ఆ మందుల్ని డోసేజ్ ప్రకారం యిస్తే ఆరు వారాల తరువాత కుడిచేతిలో చలనం  వచ్చింది. ఇంకొన్ని వారాల తరువాత ఎడం చేతిలో చలనం ప్రారంభమైంది. నెమ్మది నెమ్మదిగా  అతని అవయవాలు పని చెయ్యడానికి కొన్నేళ్ళు పట్టిందంటే మనం ఆశ్చర్యపోతాం.

 

    ప్రస్తుతం నీ సిస్టర్ నందిని డిసీజ్ దీనికి భిన్నమైనది - అకస్మాత్తుగా ఆమె  శరీరంలో కణాలు చచ్చుబడిపోతాయి. ఆ సమయానికి ముందు శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసుకోవాలి.

 

    అందుచేత రెండు నెలలు నందినిని ప్రతిక్షణం పరిశీలించాలి. ప్రతి అరగంటకోసారి ఆమె శేవ్వేంలో జరిగే మార్పులు కనుక్కుంటే ఆ తరువాత  ట్రీట్ మెంట్ ఎలా  ప్రారంభించాలో తెలుస్తుంది."

 

    "రెండు నెలలపాటు హాస్పిటల్లో వుంచాలంటే......" ఎంత బిల్లు అవుతుందోనన్న భయంతో ఆగిపోయాడు అభినవ్.

 

    "రెండు నెలలు హాస్పిటల్లో వుండడం నందిని విషయంలో మంచిది కాదు. ఎందుకంటే ఏ జబ్బూ లేనట్టు కనబడే  నందిని హాస్పిటల్  వాతావరణంలో వుండలేదు. సైకలాజికల్ గా ఆమె ఆరోగ్యానికి అది మంచిదికాదు, ఏమీ  లేకుండానే నువ్వు హాస్పిటల్ బిల్లును పే చెయ్యడం కూడా అనవసరం కనుక  నందినిని యింట్లోనే వుంచు. ఒక నర్స్ ని ఎంప్లాయ్ చెయ్యి. ప్రతి రెండు  రోజులకొకసారి నేనొచ్చి చూస్తుంటాను" అభినవ్ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్నట్లుగా అన్నాడాయన.

 

    ఆ ప్రపోజల్ వెంటనే వప్పుకున్నాడు అభినవ్.

 

    "నందినిని ఎప్పుడు  యింటికి తీసికెళ్ళమంటారు?" అడిగాడతను.

 

    "ముందు ప్రైవేట్ నర్స్ ని ఎంప్లాయ్ చెయ్యి. ఇలాంటి హాస్పిటల్లో నర్సుల్ని నువ్వు భరించలేవు. ఆర్టిస్టులకి నర్సుల గురించి తెలీదనుకుంటాను. రమణ  విల్ గైడ్ యూ" అని దూరంగా వున్న రమణని పిలిచాడు కుమరన్.

 

    రమణని అభినవ్ కి పరిచయం చేసి అతనేం చెయ్యాలో చెప్పాడు కుమరన్.

 

    "మెకు ట్వంటీఫోర్ అవర్స్ లో ప్రైవేట్ నర్స్ ని ఏర్పాటు చేస్తాను" ప్రామిస్ చేశాడు రమణ.

 

    సరిగ్గా అదే సమయంలో ఫోన్ మోగింది.

 

    "హల్లో రమణా హియర్!

 

    "హల్లో రమణా! నేను లిపిని" లిపి తనకు ఫోన్ చేసిందని తెలియగానే ఎందుకో రమణ మనసంతా ఆనందంతో నిండిపోయింది.

 

    "హల్లో వాటే సర్ ప్రయిజ్ చెప్పు?"

 

    "మన అర్జంటుగా కలుసుకోవాలి. మీ హాస్పిటల్ కి రమ్మంటావా?" అడిగింది లిపి ఫోనుకి ఆ వైపు నుంచి.

 

    "ఇక్కడికా వద్దులే. ఇంతదూరం నువ్వెలా వస్తావు. నేనే వస్తాను" అని ఒక క్షణం ఆగి-

 

    "నువ్వెక్కడున్నావు?" అడిగాడు రమణ.

 

    చెప్పింది లిపి.

 

    "టెన్ మినిట్స్ లో వస్తాను. అక్కడ ఆ టెలిఫోన్ బూత్ దగ్గర వుండు" ఫోన్ పెట్టేసి  అభినవ్ వైపు చూశాడు రమణ.

 

    "సీయూ" లేచి నిలబడ్డాడు రమణ.

 

    "మీకు గర్ల్ ఫ్రెండ్స్ వున్నారా?" హుషారుగా అడిగాడు రమణ.

 

    ఏం జవాబు చెప్పలేదు అతను.

 

    "మా గర్ల్ ఫ్రెండ్.... వెళ్ళాలి తప్పదు" అనేసి రూమ్ లోంచి బయటికెళ్ళి పోయాడు. అలా జాలీగా  వెళ్ళిపోతున్న రమణ వైపు ఆశ్చర్యంగా చూసి, నందిని ఉన్న రూమ్ వైపు అడుగు  వేశాడు అభినవ్.


    
    
                                           *    *    *

 

    మౌంట్ రోడ్ లో నున్న శాంతి హోటల్లో కూర్చున్నారిద్దరూ.

 

    ఆ పాత హోటల్ కి ఎక్కువమంది జనం రారని రమణకు తెలుసు.

 

    లిపితో ఏకాంతంగా మాట్లాడటానికి ఆ హోటల్ బాగుంటుందని అక్కడకు తీసుకొచ్చాడు.

 

    "నీతో యిలా  కూర్చోవడం, మళ్ళీ  మనం అనుకోకుండా కలుసుకోవడం....... అంతా గమ్మత్తుగా వుంది లిపీ" అలా అంటున్న  రమణ  ముఖంలోకి సూటిగా చూసింది లిపి.

 

    "అప్పటికీ  ఇప్పటికీ నీలో అదే హుషారు. ఏ మాత్రం  తగ్గలేదు" అంది ఆమె.

 

    "నువ్వు కనిపిస్తే నాలో ఏదో  హుషారు అంతే!"

 

    "మీ ఆవిడ ఎలా వుంది?" అడిగింది లిపి.

 

    "ఇలాంటి సమయంలో భార్యామణి గురించి ఎందుకు చెప్పు?"

 

    "పోనీలే! అప్పట్లో తెగ  జోకులు చెప్పేవాడివిగా. ఇప్పుడూ అలాంటి జోకులు పేలుస్తుంటావా?" నవ్వుతూ అంది ఆమె.

 

    "ఏం పేల్చమంటావా." టేబుల్ మీద  పెట్టిన కళ్ళజోడు  తీసుకుంటున్నట్టుగా చెయ్యి  ముందుకు చాపి ఆమె చేతికి తన చేతిని  తగిలించాడు.

 

    ఆ విషయం లిపి గమనించలేదు.

 

    అతను జోకులు చెప్పడం  ప్రారంభించాడు.

 

    "అనగనగా నీలాంటి అందమైన అమ్మాయి, నాలాంటి డాక్టర్  దగ్గరకు  వచ్చింది. వచ్చి సార్ తేలు కుట్టింది సార్ అని నవ్వుతూ చెప్పిందట.

 

    దానికి ఆ డాక్టర్ ఆశ్చర్యపోయి తేలుకుడితే బాధపడకుందా నవ్వుతూ చెప్తావేంటే తల్లీ అని అడిగాడు.

 Previous Page Next Page