Previous Page Next Page 
అరణ్యకాండ పేజి 31

    జీప్ ను వోరగా ఆపి సమీపింలోనే  వున్న  డాబా  ఇంటిలోకి  అడుగుపెట్టాడు.

    అర్చ్ వంటి ముఖద్వారానికి  ఆనుకుని విశాలమైన  ఆవరణమెట్లెక్కి  ముందు గదిలోకి  వెళుతుంటే  చూరుకు వేలాడగట్టిన బూడిద గుమ్మడికాయ  గదిలో  వెదుళ్ళతో  అల్లిన  కుర్చీలు, వాటి పై బూరుగు దూదితో  తయారు చేయబడిన  తలగడలు_చినబగతా  కంటే  కాస్త వున్న  కుటుంబం  అనిపించేట్టుగా వుంది.

    మౌనంగా  కూర్చున్న  చైతన్య  ఇల్లంతా  పరికించి చూష్టుమ్తే రాజ్య పడాలు అన్నాడు: "కోరి కోరి ఇక్కడి కొచ్చారు. కాస్త జాగర్తగా  ఉండకపోతే  ముందు  ఆఫీసర్లలాగే   ప్రాణాలు  మజ్జీలోనే పోయే   ప్రెమాదముంది...." అది హెచ్చరికో, సానుభూతో  అర్ధంకాలేదు.

    బదులు  చెప్పలేదు  చైతన్య.

    ఇంతలో  ఓ భారీ విగ్రహం  లోపలినుంచి  ఠీవిగా నడుచుకువచ్చింది. నుదుట తిలకం, చెవులకు  కుండలాలు ,మెడలో  పులిగోరు పతకం, లాల్చీ, ధోవతితో  అక్కడకు  రాగానే  ఆవరణలో  నిలబడ్డ వ్యక్తులు  వంగి నేలను  ముట్టుకున్నారు. బహుశా  వారు అభివాదం  చేసే పద్ధతి కావచ్చు.

    "నా పేరు కంఠం  రాజు...." ఎదురుగా వున్న  కుర్చీలో  కూర్చుంటూ  అన్నాడు. నడివయసు  దాటినా  చాలా బలిష్టంగా, ఆరోగ్యంగా వున్న  అతడిని  చూడగానే  తొలిచూపులోనే  ఓ సద్భావం లాంటి  దేర్పడింది. మనిషిలో  స్వాతిశయం  ఎబ్బెట్టుగా  లేదు. మొహంలో  ఉట్టిపడుతున్న  కళ రాచరిక వ్యవస్థలోని  క్షత్రియుల తేజస్సును  తలపింపజేసేట్టుగా  వుంది.

    "క్రూరమృగాలనుంచే  కాదు. అంతకు  మించిన  మనుషులూ  మీమీద దండెత్తబోతారు. మీ అంతట మీరే గ్రహిస్తారు తొందరలో, ఏ అవసరం  వచ్చినా  నేనున్నానని  మరవకండి."

    ప్రజాక్షేమాన్ని  తలపోసే  చక్రవర్తిలా  అభయమిస్తున్నట్టుగా  అన్నాడు.

    ఇంకా చాలా మాటాడేడు. చావన్నది  ఎన్నిరకాలుగా  ఏయే మార్గాలలో మీదపడేది అర్ధమయ్యీ  కాని రీతిలో  చాలా సేపటివరకూ ఉద్భోదించాడు.

    అయితే చైతన్య ఆయన మాటల్లో  స్పష్టంగా  అర్ధం చేసుకున్నదొకటి_

    బగతాలు, కొండరాజులు  గిరిజనుల్లో  చాలా ఉన్నవారి  కిందే లెక్క అయినా  చినబగతాకి  పెదబగతాకి  మధ్య సయోధ్యలేదు. ఒకరి గురించి  మరొకరు  పరోక్షంగా  తక్కువచేసి  మాట్లాడుకుంటున్నారు.

    తన ప్రయత్నాలలో  వారి సహాయం  అర్ధించే  అవసరం ఏర్పడొచ్చు  అయితే అక్రమ రవాణా గురించి  క్లుప్తంగానూ, మేనీటర్ గురించి  ఎక్కువగా  నూతన ఆలోచనల్ని వ్యక్తం  చేసిన  చైతన్య "ఎర"ను ఉపయోగించి  మేనీటర్ తాను ఎదుర్కోవాలనుకుంటున్న  విషయాన్ని  స్పష్టం చేశాడు.

    తానూ మనఃస్పూర్తిగా  సహకరిస్తానన్నాడు. కారణం అంతకు పూర్వం పెదబగతా చిన్న తమ్ముడు, మేనల్లుడు  కూడా పులివాత బడి  మరణించారు.

    హఠాత్తుగా వాల్మీకులు అన్న మాటలు  గుర్తుకొచ్చాయి. పరిస్థితులిని కూలంకషంగా  పరిశీలిస్తే  మేనీటర్ మూలంగా మరణించిన వ్యక్తుల సంఖ్య  ముప్పైకాదు_తమ రికార్డుల్ని  మించి  అనధికారికంగా ఓ వంద దాటి వుండొచ్చు.

    మాటాడుతూ  అలవోకగా  పక్కకి  చూసిన  చైతన్య రెప్పవేయకుండా ఉండిపోయాడు, సమాధిలోకి జారినట్టు.

    మరికొన్ని  సెకెండ్ల వ్యవధిలో  బయలుదేరాలనుకున్న  చైతన్య అసదృశ్యమైన పరవశంతో ఓ జీవితకాలం  అక్కడ  అలాగే కూర్చోవాలన్నంత  తమకంలోకి  జారేడు అతని వ్యక్తిత్వాన్ని  సైతం  మరిచి.

    అతనికి  సమీపంలో చాలా దగ్గరగా  తడికె  కంతలో నుంచి ఓ రెండు కళ్ళు హిప్నటైజ్  చేస్తున్నట్టు  తదేకంగా  రెప్పవాల్చకుండా చూస్తున్నాయి.

    ఎవరో....ఏమిటో  అతనికి  తెలీదు.

    అవి నేత్రాలు కాదు. అమేయాభిష్టుత కిసలయి జీవనౌషధాలను  జాలువారు రసరమ్య రాజీవాలు. నిమంత్రిత నిరూఢ భ్రాజిత మంజరీ మంజుల అమేయ జ్యోతిష్ముతీ లతలు....

    పరిసరాలను మరచిన  చైతన్య  పెదవులు  వ్యగ్రమనస్కుడి వ్యంజిత వ్యతికరాల్లా  కదులుతుంటే  హఠాత్తుగా అదృశ్యమయ్యాయి  మెరుపులా  మైమరపించిన  ఆ చూపులు, వాటిని  ప్రసరింపచేసిననేత్రాలు....

    తానెక్కడున్నదీ  తెలుసుకున్న చైతన్య భావుకతనుంచి  తేరుకుని  నిస్సత్తువగా  పైకిలేచాడు. మగతగా సెలవు తీసుకుని  బయటపడ్డాడు.

    చైతన్య అతని  జీవితకాలంలో  ఆ క్షణాన  పొందిన  స్పందనను  మరిచిపోలేడు. మంత్రముగ్దుడిలా  ద్వారం  దాటి కలలోలా  జీప్ ను చేరుకున్నాడు.

    "అంకుల్."

    ఆగిపోయాడు స్టీరింగ్ ముందు  కూర్చోబోతూ.

    అప్పటికే  అతని  సీటులో  కూచుని  చాలా వేగంగా  జీప్ నడుపుతున్నట్టు "జంయ్" మంటూ నోటితో శబ్దంచేస్తున్న  ఆరేళ్ళబాలుడు.

    అడవిలో  ఏ ఆకుమాటునో  పొందికగా  పెరుగుతున్న పిందెలా లేతగా  వున్న  ఆ పసికందు  ఆ ప్రాంతాల్లోని  పిల్లలకు  విభిన్నంగా  "అంకుల్" అంటూ  చైతన్యను  ఆశ్చర్యంలో  ముంచెత్తగానే "నీ పేరేంటమ్మా" అన్నాడు ప్రక్కనే కూర్చుంటూ.

    "నానీ...." అన్నాడు ఇంతపెద్ద  అంకుల్ ని  నీకీ మాత్రం తెలీదా అన్నట్టుగా  చూస్తూ.

    "ఎవరి బాబువి?" స్వతాహాగా  పిల్లలంటే  ఇష్టపడే చైతన్యఆప్యాయంగా తల నిమురుతూ అడిగాడు.

    "మా మమ్మీ కొడుకుని" నవొచ్చింది  చైతన్యకు.

    "ఏం__మీ డాడీ కొడుకువి  కాదా?"

    "లేడుగా...." కొద్దిపాటి  సీరియస్ నెస్ ని మొహానికి  అద్దుకున్నాడు నానీ.

    "ఎక్కడున్నాడు?"

    "దేవుడి దగ్గర. సెలవు ఇవ్వటం  లేదని  ఇంకా రాలేదో మరేటో"

    ఆ పసికందు నమ్మకంగా  చెబుతుంటే  "అలాగా" అన్నాడు అంతా అర్ధమయినట్టు.

    "సరే! మరి నేను వెళ్ళనా!" మృదువుగా  అడిగాడు.

    "అదేం టంకుల్....మా డాడీ ఎలాగూ నాతో  ఆడుకోడానికి రాడుగా నువ్వయినా  ఆడించకూడదూ!"

    తండ్రి ప్రేమకోసం  అంతర్లీనంగా  ఆ పసికందు  పడుతున్న వేదనకి చైతన్య కొద్దిగా కదిలాడు.

    "డెఫినెట్, నానీ" అన్నాడు ఒడిలో  కూర్చోబెట్టుకుని.

    "నానీ....ఎక్కడ్రా?"

    చేతిలో చిన్న స్టీలుగిన్నెతో  ఎదురింట్లోంచి  బయటకు వచ్చిన ఓ యువతి అటూ ఇటూ చూసి జీప్ లో వున్న  నానీతో  "ఇట్రా" అని కసురు కుంటున్నట్టుగా  పిలిచింది__అల్లరి చేస్తూ చైతన్యను ఇబ్బంది పెడుతున్నాడన్న  ఆలోచనతో....

    "నేన్రాను__అంకుల్ నాతో  ఆడుతున్నారూ" గట్టిగా అరిచాడు.

    జీప్ సమీపంలో  నిలబడ్డ  యువతిని చూడగానే  గ్రహించాడు, ఆమె వయసులోనే  విధివశాత్తూ  వితంతువుగా మారిన నిర్భాగ్యురాలని.

    "క్షమించండి. మావాడు మరీ గడుగ్గాయి. మీరు కొంచెం చనువిస్తే నెత్తినెక్కి కూచుంటాడు__" స,సంస్కారం ఉట్టిపడుతూ మాట్లాడిన ఆమెను చూస్తూ చదువున్న యువతిలా వున్న ఈమె ఈ పల్లెలో ఎందుకుందో  అర్ధంకానట్టుగా చూసి "ఇట్సాల్ రైట్...." నాకూ కాలక్షేపంగానే  ఉంది లెండి" అన్నాడు నానీ తలనిమురుతూ.
 
    కృతజ్ఞతగా చూసిన ఆ యువతి "సరే, నానీ, అంకుల్ తర్వాతొస్తారుగా. ఈలోగా నువ్వు అన్నం  తినేస్తే నిన్ను ఆడిస్తారు" అంది నానీని మభ్యపెట్టి  తీసుకు వెళ్ళాలని.

    చైతన్య మొహంలోకి  ఓ మారు చూసి నమ్మకం  కుదరనట్లు "అంతా అబద్ధం అంకుల్ రారు. మమ్మీ  అబద్దం  చెబుతుంది కదా, అంకుల్. ఎప్పుడూ అంతే  మరేటో" అనగానే నవ్వాపుకోలేకపోయాడు.   

 Previous Page Next Page