Previous Page Next Page 
రాంభరోసా అపార్ట్ మెంట్స్ పేజి 31

 
    "చట్టాన్నెవరు లెక్కచేస్తున్నారంకుల్? ప్రజాస్వామ్యంలో 'చట్టం' అనేది ఒక పెద్ద ఫార్స్! అయినా నేను చట్టాన్ని లెక్కచేయదల్చుకోలేదు. మా ఫాదరూ, మదరూ ఒప్పుకుంటే చాలు" చెప్పిందామె.
    "ఇగో తుగ్లక్ ఛానెల్...... ఇప్పుడేందంటావ్ నువ్వు? ఆ ముగ్గురికీ పెళ్ళి చేయటానికి ఒప్పుకోవట్లేదు గనుక నేను రాక్షసుడిని, దుర్మార్గుడిని, పాగల్ గాడినంటావా- బె దమాక్ సాలే" విరుచుకుపడ్డాడు సుధీ తండ్రి. రాజు మొఖం వాడిపోయింది. మరుక్షణం వెంగమాంబ విజ్రుంభణ మొదలైంది.
    "సుధీ అనే ఈమె మన సమాజానికి విప్లవాత్మకమయిన ప్రశ్న లేవనెత్తింది. ఆమె ప్రేమించిన ఇద్దరు యువకులకూ పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. ఈ పద్దతి మీరు కరెక్టనుకుంటున్నారా, తప్పనుకుంటున్నారా? ఏ విషయం వెంటనే ఎస్.ఎం.ఎస్. చేయండి" వెంటనే స్పీకర్ లో సర్కిల్ అరిచాడు.
    "దినేష్! నువ్ ప్రేమించినమ్మాయ్ రాజేష్ తోపాటు నిన్నూ కలిపి- కంబైండ్ గా పెళ్ళి చేసుకోవాలనుకుంటోంది. కనుక నువ్ దూకుడు కార్యక్రమం ఆపి ఆ అమ్మాయితోనే మాట్లాడి తేల్చుకో"
    వెంటనే దినేష్ స్పీకర్ లో రెస్పాన్స్ ఇచ్చాడు.
    "దానికి నేనొప్పుకోను. కేవలం సుధీ నన్నొక్కడినే పెళ్ళి చేసుకోవాలి! లేకపోతే దూకుతా"
    మళ్ళీ పోలీసులు, సుధి పేరెంట్స్- ఆ అమ్మాయితో చర్చలు జరిపారు. కాసేపటి తర్వాత సుధి రాజేష్ ని వదిలి దినేష్ ని పెళ్ళి చేసుకోడానికి ఒప్పుకున్నట్లు సర్కిల్ ప్రకటించాడు.
    ఆ ప్రకటన అలా ముగిసిందో లేదో ఆ పక్కనే ఉన్న బ్లాక్ వాటర్ టాంక్ మీద నుంచి ఇంకో గొంతు వినిపించింది.
    "నా సుధిని నాకు కాకుండా ఇంకెవరికిచ్చి పెళ్ళి చేయడానికి ప్రయత్నించినా నేను దూకుతా"
    అందరూ ఉలిక్కిపడి అటువేపు చూశారు. అతను సుధి శారీరక ప్రియుడు రాజేష్ అని అందరికీ అర్ధమయిపోయింది.
    సర్కిల్ కి పిచ్చెక్కిపోయింది.
    "ఇదిగో.....కొడకల్లారా! ఇద్దరూ కట్టకట్టుకు దూకండ్రా! దూకకపోతే నేనే మీ ఇద్దరినీ కాల్చిపారేసి ఈ ప్రాబ్లెం సాల్వ్ చేస్తా" అంటూ రివాల్వర్ తీశాడు. సబ్ ఇన్ స్పెక్టర్ అతనిని శాంతపరచాడు. అపార్ట్ మెంట్స్ వాళ్ళందరికీ పిచ్చెక్కిపోతోంది.
    "ఇలా అందరూ చూస్తుండగా ఎవర్నీ కాల్చకూడదు సార్! తర్వాత లేనిపోని హెడేకవుతుంది" అంటూ నచ్చజెప్పాడు.
    "ఈ చెత్త నాయాళ్ళందరికి మన అపార్ట్ మెంట్సే దొరికినయ్యా - ఇంకెక్కడయినా చావచ్చుగా" అన్నాడు శంకరమూర్తి.
    "ఏమంటావమ్మా! వాళ్ళిద్దరూ నువ్ దక్కకపోతే ఛస్తానంటున్నారు- మరి నీ స్టేట్ మెంటేమిటి?" కోపం అణచుకుంటూ అడిగాడు సర్కిల్.
    సుధి ఆలోచనలో పడింది.
    ఈలోగా తుగ్లక్ ఛానెల్ రాజు మరింత ఉత్సాహంగా కామెంటరీ ఇస్తున్నాడు.
    "ఇప్పుడో కొత్త యాంగిల్ మొదలయింది వెంగమాంబా. సుధి తనకు దక్కకపోతే ఛస్తానని ఇద్దరు ప్రియులూ వాటర్ టాంక్ లెక్కి నిలబడ్డారు వెంగమాంబా. ఆమె కాదంటే ఇద్దరూ ఏ క్షణాన్నయినా దూకే అవకాశముంది వెంగమాంబా"
    "వాళ్ళు సుమారు ఏ సమయంలో, అంటే ఇంకా ఎంత సేపట్లో దూకుతారో చెప్పగలవా రాజూ?"
    "అది ఖచ్చితంగా చెప్పటం ప్రస్తుతానికి సాధ్యంకాదు వెంగమాంబా- కానీ ఎవరో ఒకరు దూకటం ఖాయమనీ- ఇక్కడ నేను చేసిన సర్వేలో తేలింది వెంగమాంబా!"
    "ఇప్పుడో చిన్న బ్రేక్" వెంగమాంబ కంఠం ఖంగుమంది. వెంటనే వ్యాపార ప్రకటన స్టార్టయింది.
    "ఏ క్షణాన దూకుతారో తెలీని పరిస్థితుల్లో మీకు బాసటగా నిలిచేది మా నిశ్చింతా ఇన్సూరెన్స్ ఒక్కటే. ఈ క్షణమే మీ జీవితాన్ని భీమా చేసుకోండి. నిశ్చింతగా దూకి ఛావండి?
    "ప్రేమ దూకుళ్ళవల్ల మీ తలలు పగిలినా, కాళ్ళు విరిగినా, వెన్నుపూస మట్టి కొట్టుకుపోయినా 'మట్టి మల్టీస్పెషాలిటీ హాస్పిటల్' ఒక్కటే మీ ఆరోగ్యం కుదిరేట్లు చేస్తుంది. ఎల్లవేళలా, ఎలాంటి రోగానికయినా గుర్తుంచుకోండి. మట్టి మల్టిస్పెషాలిటీ హాస్పిటల్- పంజాగుట్ట- హైదరాబాద్."    
    సరిగ్గా అప్పుడే ఇంకో బ్లాక్ పై నుంచి స్పీకర్ లో లేడీ వాయిస్ వినిపించింది.
    "హలో..... నా పేరు రాధిక! ఆ దినేష్ అనే బాడుకవ్ కొద్ది దినాల ముంగట నన్ను పెళ్ళి చేసుకుంటానని తుగ్లక్ టీవీ ఛానెల్ ద్వారా ఎస్.ఎం.ఎస్. పంపాడు. ఆ ఛానెల్ యాంకర్ కూడా మా ఇద్దరికీ బ్రోకరత్వం నెరిపి, ఇద్దరినీ నెక్లెన్ రోడ్ లో కలుసుకునేందుకు ఏర్పాట్లు చేశాడు. ఆ ఛానెల్ ద్వారానే ఇద్దరం ఏ రోజు ఏ లాడ్జ్ లో కలుసుకోవలసిందీ ఎస్.ఎం.ఎస్ లతో తెలుసుకునేవాళ్ళం. వాడివల్ల నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి వాడు కనపడటం లేదు. తుగ్లక్ ఛానెల్ వాళ్ళు కూడా మాకేం సంబంధం లేదని చేతులెత్తేశారు. ఇప్పుడు ఆ దినేష్ గాడికీ, నాకూ పెళ్ళి జరిపించకపోతే నేను దూకి చావటం తప్ప ఇంకో దారిలేదు."
    ఒక్కసారిగా కథ కొత్త ట్విస్ట్ తీసుకునేసరికి ఈ వ్యవహారం ఏమిటో చూడాలని మా అపార్ట్ మెంట్స్ లో ఉన్న మొత్తం కుటుంబాలు బయటికొచ్చేశాయ్. ఇసుకవేస్తే రాలనంత జనం.
    సర్కిల్ మళ్ళీ తలబాదుకున్నాడు.
    "దినేష్ ఆ రాధిక అనే అమ్మాయి చెప్పిందంతా విన్నావా?" దినేష్ మొఖంలో ఎక్కడలేని ఆవేశం కనిపించింది.
    "అది చెప్పేదంతా అబద్దం! అదొక మోసగత్తె ఎవడితోనో కడుపు చేయించుకుని నన్ను బలిపశువుగా చేయాలనుకుంటుంది. దయచేసి దాని మాటలు నమ్మకండి. నేను సుధిని తప్ప ఇంకెవరినీ ప్రేమించలేదు అన్నాడతను.
    దాంతో రాధిక మండిపడింది.
    "వాడిలా చెప్తాడని నాకు ముందే తెలుసు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు 'డిఎన్ఎ' టెస్ట్ చేయిస్తే నిజం బయటకొస్తుంది" అందామె.
    వెంగమాంబ కు కడుపుబ్బరం పెరిగిపోతోంది.
    "రాజూ! అక్కడేం జరుగుతోంది. మన ఛానెల్ ప్రేక్షకులు- ఆ ముగ్గురిలో ఎవరో ఒక్కరైనా దూకి ఛస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం అంటూ కొన్నివేల ఎస్సెమ్మెస్ లు పంపుతున్నారు. ఫోన్ కాల్స్ తో మన ఆఫీస్ మోతెక్కిపోతోంది. త్వరగా వివరాలు చెప్పు రాజు"
    "వెంగమాంబా! ఇప్పుడిక్కడ దూకటానికి రాధిక అనే మూడో అభ్యర్ధి సిద్దంగా ఉంది వెంగమాంబా. తను దినేష్ వల్ల ప్రెగ్నెంట్ అయ్యాననీ, కానీ అతడు పెళ్ళిచేసుకోవడానికి నిరాకరిస్తున్నాడనీ రాధిక ఆరోపణలు చేసింది వెంగమాంబా తన బిడ్డకు దినేషే తండ్రి అనడానికి డిఎన్ ఎ టెస్ట్ చేయాలని కూడా పట్టుబడుతోంది వెంగమాంబా."
    "మరి పోలీసులేమంటున్నారు రాజూ?"
    "సర్కిల్ గారు ఈ దూకుళ్ళ పర్వాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు వెంగమాంబా- ప్రస్తుతం దూకి చావడానికి ముగ్గురూ సిద్దంగా ఉన్నారు వెంగమాంబా! అందులో ఏ ఒక్కరు చచ్చినా పోలీసులకు చాలా చెడ్డపేరు వస్తుంది వెంగమాంబా! అందుకే వాళ్ళు ఆచితూచి అడుగులేస్తున్నారు వెంగమాంబా"
    "ఇప్పుడీ ప్రేమ చతురస్రానికి పరిష్కారం ఏమయినా ఉందా రాజూ?"

 Previous Page Next Page