Previous Page Next Page 
ఆత్మజ్యోతి పేజి 30

   

     దబదబమని తలుపు బాదుతున్నాడు. గట్టిగా పిలుస్తున్నాడు.....తలుపులు తెరచుకున్నాయి. మోహన్ హరికేన్ లాంతరుతో నిలుచున్నాడు. "మోహన్, నన్ను గట్టిగా పట్టుకో" అని బిగ్గరగా అరిచాడు.
   
    మోహన్ అతన్ని పట్టుకుని లోపలకు లాక్కుపోయాడు. "ఏమిటిరా ఈ రక్తం?" అని అడిగాడు.
   
    శివనాథరావు కొంచెం తేరుకున్నాడు. "నాకేమీ తెలియదు, నన్నేమీ అడగకు" అన్నాడు.
       
    మోహన్ తడిగుడ్డ తెచ్చి అతని గాయాలన్నీ తుడిచాడు. ఓ పదినిముషాలు గడిచాక "నిద్ర వస్తోందా?" అనడిగాడు.
   
    "ఊ నా శరీరం కంపించడం ఆగిందా?"
   
    "శివాయ్, ఎందుకిలా అయిపోయావు?" అన్నాడు మోహన్ దీనంగా.
   
    అతనా ప్రశ్న వినిపించుకోలేదు. "నేను నిద్రపోయేవరకూ నువ్వు పోకు" అన్నాడు.
   
    "సరే."
   
    "మోహన్"
   
    "ఓయ్."
   
    "రేపు నేను పెళ్ళిచూపులకు వస్తాను."
   
    "చాలా థ్యాంక్స్."
   
                               10
   
    సుజాత కుర్చీలో కూర్చుని ఆలోచిస్తోంది. ఇవాళ ఆమెకు జానకిరాం దగ్గరనుంచి పిలుపురాలేదు. బట్టలు వేసుకుని సిద్దంగా వుంది. సాయంత్రం అయిదయింది.
   
    ఆమెకు ఏమీ తోచడంలేదు. పోర్షన్ బట్టీ పడదామనుకుంది. అనవసరం, జానకిరాం దగ్గర రిహార్సల్స్ వేసేసరికి వల్లె వేసినట్లు క్షుణ్ణంగా వచ్చేస్తోంది. మరి ఏం చేయాలి? లేచి బద్దకంగా అటూయిటూ తిరిగింది. ఆనాడు హైదరాబాద్ లో కలిసిన యువకుడు జ్ఞాపకం వచ్చాడు. ఏమిటతని కంత చొరవ? లేకపోతే తను నాటకాలలో వేసే స్త్రీ కదా అని చనువు తీసుకున్నాడేమో? ఆరోజు జానకిరాం ఎంత మోటుగా ప్రవర్తించాడు? ఆయన ఎప్పుడూ అంతే. ఆయన హృదయం ఎవరికీ అర్ధంకాదు. తనను ప్రాణప్రదంగా చూసుకుంటాడు. కానీ ప్రేమగా ఒక్కమాటా మాట్లాడడు. అవేం చూపులు? ఆ చూపులు చూస్తే మతిపోతుంది. నాళిక తన స్వాధీనంలో వుండదు.....తనలో ఏమయినా ఆకర్షణ వుందా? లేక తన నటనని చూసే యింతమంది ఆరాధిస్తున్నారా? రోజుకు రెండుమూడు ప్రేమలేఖలకు తక్కువగాకుండా వస్తున్నాయి. ఆమె నవ్వుకుంది. ఇంతమందికి పంచిపెట్టాలా తన ప్రేమను?
   
    "నువ్వు కళకోసం" అంటాడు జానకిరాం. అంటే అర్ధం? తను యితర విషయాలు పట్టించుకోకూడదా? ఈలోకంతో సంబంధం విడిచిపెట్టి అదేదో లోకంలో పూర్తిగా జీవించాలా? అంతటి కళాహృదయమా తనది?
   
    ఇంతలో తలుపు తట్టిన చప్పుడయింది. సుజాత ఆదుర్దాగా వెళ్ళి తలుపుతీసింది. గుమ్మంలో సుబ్బారావు నిలబడివున్నాడు. "లోపలకు రానా? అని అడిగాడు నవ్వుతూ.
   
    "వద్దు" అంది సుజాత నవ్వుతూ.
   
    అతను లోపలకు వచ్చి "అబ్బ! మమ్మల్నిలా బతకనివ్వవా ఏం?" అన్నాడు.
   
    "ఇప్పుడేమొచ్చిందీ?"
   
    "ఈ అందం..."
   
    "ఉష్...కొత్తమాటలేం దొరకలేదా?"
   
    "ఉహూ! నిన్ను చూస్తుంటే కొత్తమాటలు మాట్లాడటానికి మనసు పనిచేస్తే కదా?"
   
    ఆమె పెదవి విరుచుకుని "అబ్బాయిగారి బుద్దులేం బాగాలా, రిహార్సల్స్ కి వెళదామా?" అంది.
   
    సుబ్బారావు ఉత్సాహంగా "ఇవాళ రిహార్సల్స్ లేవు. జానకిరాంకి మూడ్ లేనట్లుంది ఈ వార్త చెబుదామనే వచ్చాను" అన్నాడు.
   
    "చెప్పావుగా..." అంది సుజాత అర్దోక్తిలో.
   
    "అదేమిటీ? వెళ్ళమంటున్నావా? ఉహూ, వెళ్ళను. నువ్వు ఇవాళ నాతో బీచ్ కి రావాలి. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పోదాం" అని సుబ్బారావు ఆశగా చూశాడు.
   
    ఆమె అతని ముఖంవంక సూటిగా చూసి "నేను రాను" అంది స్పష్టంగా.
   
    అతను నిరుత్సాహంతో "ఏం?" అన్నాడు.
   
    ఆమె జవాబు చెప్పలేదు. ఆలోచిస్తూ ఊరుకుంది.
   
    "నాతో రాకూడదా?" అన్నాడతను దీనంగా.
   
    అతన్ని ఓదార్చడానికి ఆమె "అబ్బే! అదికాదు, నాకు కొంచెం తలనొప్పిగా వుంది. రిహార్సల్స్ కైతే తప్పదనుకున్నాను. పనిలేదు కాబట్టి-విశ్రాంతి తీసుకోవాలని వుంది. ఏమీ అనుకోకు, ప్లీజ్ అంది.
   
    నువ్వెప్పుడూ అంతేలే సుజాతా నీకు వంట్లో బాగుండనప్పుడు నేనెందుకూ యిక్కడ? వస్తాను అంటూ అతను కదిలాడు.
   
    ఆమె వెనకనుంచి 'బీచ్ కేనా?' అని అడిగింది.
   
    "ఉహూ, ఒక్కడ్ని ఎలా పోయేది? ఎటో అటు" అంటూ వెళ్ళిపోయాడు.
   
    ఆమె ఆలోచిస్తూ నిలబడింది. ఎప్పుడూ యింతే యీ సుబ్బారావు తనని విడిచిపెట్టకుండా అంటిపెట్టుకు వుందామని చూస్తుంటాడు. ఆ మాటకొస్తే ఒక్క సుబ్బారావే ఏమిటి? ఇలా ప్రయత్నించేవాళ్ళు చాలామంది వున్నారు. వీళ్ళ అందరి ఉద్దేశమూ ఏమయివుంటుంది? వేరే ఏముంటుంది? ఒకటే తను స్త్రీ అంతే. ఒక్కోసారి వీళ్ళందర్నీ చూస్తే భయంగా వుంటుంది. ఆ విషపుచూపులు-ఆ ప్రవర్తన....బాబోయ్.
   
    ఆమెకు ఏమీ తోచడంలేదు. అక్క అనూరాధ ఎక్కడికో వెళ్ళింది. అక్క చాలా విచిత్రమైన వ్యక్తి. తనని పెంచింది అక్కే తన తల్లీతండ్రీ ఎలా వుంటారో తనకు సూచనప్రాయంగానైనా గుర్తులేదు. తనకేమీ ఆస్తిలేదు. ఈ నాటక సమాజంలో ప్రవేశించక పూర్వమైనా తిండికి ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. అక్క ఎక్కువగా చదువుకోలేదని తనకు తెలుసు. మరి ఏ ఒడిదుడుకులూ లేకుండా తమ జీవితాలు ఎట్లా గడిచినవో యిదివరకు ఆమెకు ఆశ్చర్యంగా వుండేది. అక్క ప్రవర్తనని గురించి నలుగురూ నాలుగురకాలుగా చెప్పుకుంటారు. ఈ విషయాలు స్పష్టంగా ఆమెకేమీ తెలియదు. అక్కమాత్రం తరచూ బయటెక్కడికో వెళ్ళివచ్చే మాట నిజం. ఎక్కడికెళుతున్నావని తనెప్పుడూ గట్టిగా అడగలేదు. ఎట్లా అడుగుతుంది? తననంత ప్రాణప్రదంగా, ప్రేమగా చూసుకునే వ్యక్తిని, తనకేం అధికారం వుంది? తను ఆమెను అత్యంతంగా ప్రేమిస్తుంది. ఆమె అంటే ప్రాణం విడుస్తుంది.
   
    సుజాత ఇలా ఆలోచిస్తూ నిలుచుని వుండగా ప్రభాకరం లోపలకు వచ్చాడు. ఆమె అతన్ని చూసి ఉత్సాహం తెచ్చుకుని, 'ఓ, రా ప్రభాకరం' అంది.
   
    "అబ్బ! ఈ సాయంత్రంవేళ యింట్లో ఏం కూర్చుంటావు? నువ్వే రాకూడదూ?" అన్నాడు ప్రభాకరం.
   
    "ఎక్కడికి?"
   
    అలా షికారుకు పోదాం. ఎక్కడకైనా సరే.
   
    ఆమె తటపాటాయించింది. ఇంతకుమునుపే సుబ్బారావు ఈ కోరిక కోరితే తిరస్కరించింది. కానీ ప్రభాకరానికి అట్లా కటువుగా సమాధానం చెప్పలేదు. అతనంటే ఓ సదభిప్రాయం వుంది. అంతేగాక అతను మహానటుడు. తను అతనితో కధానాయకిగా నటించింది.
   
    "పద ప్రభాకరం" అంటూ ఇవతలికి వచ్చి, తాళంపెట్టి బయల్దేరింది. ఇద్దరూ బీచ్ వైపు నడవసాగారు.
   
    "జానకిరాం ఇంటికి ఎపుడైనా వెడుతుంటావా సుజాతా?" అనడిగాడు ప్రభాకరం దారిలో.
   
    "అప్పుడప్పుడూ."
   
    "అతనంటే భయం వేయదూ?"
   
    "ఉహూ, వెయ్యదు. వేసినా ఆ భయంవేరు అందులో గురుభావం వుంది."
   
    "అతను చాలా కఠినుడు" అన్నాడు ప్రభాకరం.
   
    సుజాత జవాబు చెప్పలేదు. విననట్లు ఊరుకుంది.
   
    ఈ విషయం గ్రహించి ప్రభాకరం "కానీ అమిత మేధావంతుడు. నాటకాన్ని అలా నడపగలవాడు యింకెక్కడైనా వుంటాడనుకోను. అతనిది అపారమైన వ్యక్తిత్వం." అన్నాడు.

 Previous Page Next Page