భారతీయులంటే ప్రత్యేకమైన ఆసక్తి లేకపోయినా మార్గరెట్ మనిషిని మనిషిలా గౌరవించేది. విశ్వనాద్ ఎలాంటి వంటలు చేసుకున్నా అభ్యంతర పెట్టేది కాదు, సరికదా అప్పుడప్పుడు తను కూడా రుచి చూసి మెచ్చుకుంటుంటుంది. తన నాలికకు కారం పట్టదని లేకుంటే అతడి వంటలు మరింత ఎంజాయ్ చేసేదాన్ననీ ఆమె అనేది. ఒక స్థానికురాలిగా ఎన్నో విషయాల్లో విశ్వనాద్ కు సాయపడుతూండేది.
వేదాంతంతో కూడా ఆమె ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతుండేది. అతడుండబట్టలేక ఆమెను మెచ్చుకుని తన లాండ్ లేడీని తిట్టి పోసేవాడు.
ఈ విషయమై ఒకసారి విశ్వనాద్ అతణ్ణి హెచ్చరించాడు కూడా. "నువ్వు సైకాలజీ స్టూడెంటు వి. నీకు నేను వేరే చెప్పనవసరం లేదు. ఎదుటి మనిషి మనని బాధించే మాటలన్నప్పుడు ఆ మాటలకు చలించాకపోవడమే వారి కేడురుదెబ్బ కొట్టే పద్దతి! తర్వాత కాధరీనా మాటల్లో నిజం కూడా ఉంది. ఆ నిజాన్ని అబద్దం చేయడానికి భారతీయుడిగా నీ కృషి నీవు చేయాలి. నిండా వాక్యాల్ని కూడా స్వప్రయోజనాలకు వాడుకోవాలని నీకు తెలియదా?"
విశ్వనాద్ శాంతం, స్థైర్యం, వేదాంతాన్ని ఆశ్చర్య పరుస్తుండేవి" నేను క్లాసు రూంలో కంటే నీ దగ్గర నేర్చుకున్న సైకాలజీయే ఎక్కువ. నీకులా ఉండగలగాలని నా ఆశయం. అది సాధ్యపడుతుందో లేదో తెలియదు. నేను స్వతహాగా ఆవేశపరుణ్ణి. నీవు అవతార పురుషుడివి. నీవల్ల భారతజాతికో ఈ ప్రపంచానికో గొప్ప మేలు జరుగుతుంది." అనేవాడు వేదాంతం.
"పోనీ అలాగే అనుకో. అయినా నాకు నీ అవసరముంది. నీ ఆవేశం నన్ను ప్రోత్సహిస్తుంది. నా శాంతం నన్ను యోగిని చేస్తుంటే నీ ఆవేశం నన్ను మనిషిగా మారుస్తుంటుంది. సుగ్రీవుని చేత రామాకర్యం చేయించినది రాముడి శాంత స్తయిర్యాలు కాదు. లక్ష్మణుడిధనుష్టంకారం --" అన్నాడు విశ్వనాద్.
వేదాంతానికి ఆ కధ తెలుసు.
వాలి చనిపోయిన ఆనందంలో వానరులు, వానర ప్రభువు సుగ్రీవుడు సీతను వేదకాలన్న రామకార్యాన్ని కూడా మరిచి వినోద , విలాసాల్లో మునిగి తేలసాగారు. కొంతకాలం ఎదురు చూసేక లక్ష్మణుడిలో సహనం నశించి రాజధానిలో ప్రవేశించి ధనుష్టంకారం చేస్తాడు. ఆ ప్రళయ భీకర ధ్వని సుగ్రీవుడికి హెచ్చరిక అయింది.
స్వతంత్యం సంపాదించామన్న సంతోషంలో భారత ప్రజలు , నేతలు - ఒకనాటి సుగ్రీవుడి దశలో ఉన్నారు. వారికెవరో ఒకరు ధనుష్టంకారం వినిపించాలి.
ఉత్తర భారతం ఇంగ్లీషు వద్దంటుంది. దక్షిణ భారతం హిందీ వద్దంటుంది. పంజాబులో కొందరు ఖలిస్తాన్ కావాలంటారు. పవిత్ర దేవాలయాల్లో డుండగీడుల కాశ్రయమిచ్చి అందర్నీ కళ్ళు మూసుకో మంటారు. పార్టీ ప్రాతిపదిక మీద కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని అకారణంగా విమర్శిస్తాయి. కులమతాల పేరుతొ ప్రజలు విదిపోతుంటే నేతలందరూ ప్రోత్సహించి నేతృత్వాన్ని నిలబెట్టుకుంటారు. ఆకలికి మాడేవాడు మాడి చస్తుంటే జీతాలు పెంచమని కొందరు సమ్మెలు చేస్తుంటారు. రోగికి ప్రాణం పోసే డాక్టర్లు స్వార్ధంతో రోగి ప్రాణాలు తీసే పరిస్థితులు తరచుగా ఏర్పడుతున్నాయి.
"మీరంతా భారతీయులు. నేర్పాటువాదాలతో , కులమత భాషా భేదా భావాలతో స్వార్ధపరులై దేశాన్ని చిన్నాభిన్నం చేయకండి. అంతా ఒక్కటై సాటి సోదరుని బాగు కోసం సమిష్టి కృషి చేయండి. భారతజాతి నొక అపూర్వ శక్తిగా మలచండి ---" అని జాతిని హెచ్చరించడానికి అర్హతలున్న నేతలు కరువయ్యారు.
చివరకు భారతీయుల ప్రియతమ నాయకి, బడుగు దేశాల ఆరాధ్య దైవం అగ్రదేశాలకు సింహ స్వప్నం అయిన భారత ప్రధాని ఇందిరకే దేశంలో రక్షణ లభించలేదు.
"ధనుష్టంకారం వినిపించాలి, వినిపించాలి....' ఇది విశ్వనాద్ మాట. కానీ ప్రళయ బీకర ధ్వనిలో ప్రజలకు , ప్రభువులను - హెచ్చరించడం ఆ ధనువెక్కడుంది ?
వేదాంతం ఆలోచిస్తుండగానే విశ్వనాద్ వంట పూర్తీ చేశాడు.
మరుగుతున్న నీటిలో భియ్యమున్న ఒక పోలిధీన్ సంచీని పడేశాడు. అది నిండుగా ఉబ్బింది. రెండు నిముషాల్లో అన్నం అయిపొయింది.
వంకాయలు తరిగి నూనెలో వేయించి మసాల పొడి చల్లాడు. కూర ఘుమఘుమలాడింది.
నాలుగు రకాల కూరలు తరిగి డానికి కొబ్బరి పొడి జత చేసే నీళ్ళలో ఉడకబెట్టి సంబారు పొడి జల్లి నిమ్మ కాయ రసం పిండాడు. సాంబారు ఘుమఘుమలాడింది.
ఈ వంటకు ఎంతోసేపు పట్టలేదు.
అంతసేపూ వేదాంతం మౌనంగానే ఉన్నాడు.
"ఎమిటాలోశిస్తున్నావ్?" అన్నాడు విశ్వనాద్.
"ధనుష్టంకారం గురించి...."
"ఆలోచించకు .....ప్రయోజనముండదు...."
ఇద్దరూ భోం చేశారు.
"వండర్ పుల్ నీ చేతిలో అమృతముంది .." అన్నాడు వేదాంతం.
"నీ నోటిలో అభిమానముంది. అదే నీచేత ఆ మాటలనిపిస్తోంది.." అని నవ్వి "ప్రొఫెసర్ ఆర్నాల్డ్ నాకోసం పంపిన లెదర్ బ్యాగ్ లో ఏముందో చూడాలని లేదా నీకు!" అన్నాడు విశ్వనాద్.
'అందులోని సమాచారం మన మనసులు పాడు చేస్తుందని నా అనుమానం. అందుకే భోజనమయేదాకా ఆ విషయాన్ని మనసులోంచి తొలగించాను."
అప్పుడు వేదాంతం చూస్తుండగా విశ్వనాద్ ఆ లెదర్ బ్యాగ్ తీశాడు. అందులో రెండు ప్లేన్ టికెట్స్ ఉన్నాయి. ఒకటి వేదాంతం పేరు మీద, మరొకటి విశ్వనాద్ పేరు మీద.
'అంటే రేపే మన ప్రయాణం భారతదేశానికి!" ఉత్సాహంగా అన్నాడు వేదాంతం.
అతడు తిరుగు ప్రయాణం గురించి పది రోజులుగా కలలు కంటున్నాడు. విశ్వనాద్ ఆగమన్నాడని ఎదురు చూస్తున్నాడు.
లెదర్ బ్యాగ్ లోనే ఒక కవరుంది.
కవరు చించి అందులోని ఉత్తరం తీశాడు. విశ్వనాద్, అతడు చదువుతుండగానే వెనక నుంచి తనూ చదివాడు వేదాంతం.
"రష్యన్సు కింకా మీ ప్రయాణం గురించి తెలియదు. వారు నీ అపహరణ గురించి గట్టి ప్రయత్నంలో ఉన్నారు. ఇక్కడ కంటే నీ దేశంలోనే నీకు రక్షణ ఎక్కువ. అక్కడ నీ రీసెర్చీ కి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. వెంటనే బయల్దేరి వెళ్ళు. నీ మిత్రుడి టికెట్ కూడా బుక్ చేశాను నీవు కోరిన విధంగా రెండు టికెట్స్ ఒకే అయ్యాయి." అన్నదా లేఖలోని సారాంశం.
ఉత్తరం టైపు చేయబడలేదు. అది డాక్టర్ గ్రే చేతివ్రాత.
విశ్వనాద్ ఉత్తరం ముడుస్తుండగా "నీ దగ్గర గ్రే చేతి వ్రాతతో ఇంకేమైనా ఉత్తరాలున్నాయా ?" అనడిగాడు వేదాంతం.
"ఇది అతడి చేతి వ్రాతే - సందేహం లేదు " ---- అన్నాడు విశ్వనాధం.
"అందుక్కాదు ఒకసారి అతడి చేతి వ్రాత చూడాలి ..." రెట్టించాడు వేదాంతం.
"ఎందుకు?"
"ప్లీజ్ ...."
పుస్తకాల అలమారాలోంచి ఒక ఫైలు తెచ్చాడు విశ్వనాద్....." ఇందులో అతడు రాసిన నోట్సుంది చూడు ...."
"వేదాంతం ఫైలందుకుని త్వరగా కాగితాలు తిరగేశాడు.
చాలా కాగితాల్లో ఈక్వేషన్సు ఉన్నాయి. ఓ కాగితంలో నోట్సుంది. అక్కడ ఆగి "ఇది చూశావా ?" అన్నాడతను.
"ఏమిటి?" అన్నాడు విశ్వనాద్.
"దస్తూరిలో తేడా ...."
విశ్వనాద్ కాస్త చిరాగ్గా....."రెండు దస్తూరీలు ఒకటే నాకు సందేహం లేదు--' అన్నాడు.
"నాకూ సందేహం లేదు..." అన్నాడు వేదాంతం.
"మరైతే ఎమిటంటావ్?"
"రెండు సమయాల్లోనూ అతడి మనస్థితి వేర్వేరుగా ఉంది..."
'అంటే?" విశ్వనాద్ కుతూహలంగా అడిగాడు.
"ఈ నోట్సు రాసినప్పుడు డాక్టర్ గ్రే మనసు మాములుగా ఉంది. ప్రశాంతంగా ఉంది. కానీ ఇప్పుడు రాసిన ఉత్తరం వేరే విధంగా కనబడుతోంది...."
"ఊ" అన్నాడు విశ్వనాద్, ఇంకా చెప్పమన్నట్లు.
"ఈ వుత్తరం ఒక శత్రువు రాశాడు. ఈ ఉత్తరం ఎవరికి రాశాడో వారికి డాక్టర్ గ్రే అపకారం తల పెడుతున్నాడు. నాకు సందేహం లేదు...."
విశ్వనాద్ నవ్వి ...."ఏం చేస్తాడంటావ్?" అన్నాడు.
"ఏదో చేస్తాడు. నా కాలీగ్రఫీ అబద్దం చెప్పదు" అన్నాడు వేదాంతం గంభీరంగా.
విశ్వనాద్ హస్యాని కంటున్నట్లు లేదు.
ఎన్నోమార్లు చేతివ్రాత ను బట్టి వేదాంతం చెప్పిన జోస్యం నిజమయింది. విశ్వనాద్ మిత్రుడి విద్యను నమ్ముతాడు.