Previous Page Next Page 
గోడచాటు ముద్దు పేజి 3

    కాలేజీలకు ఆఫీసులకు వెళ్ళే జనాలతో బస్టాపు కలకళ్ళాడి పోతోంది.
   
    రోడ్ ని క్రాస్ చేసే యూనివర్సిటీవేపు వెళ్ళే బస్టాపులో నిలబడింది మయూష.
   
    అయిదు నిమిషాల తర్వాత వచ్చిన బస్సెక్కి కూర్చుంది. బస్ శంకర మఠ్ మీదుగా వెళుతోంది.
   
    కిటికీలోంచి రోడ్డుమీద కన్పిస్తున్న దృశ్యాల్ని చూస్తోందామె.
   
    సరిగ్గా అదే సమయంలో.
   
    యూనివర్సిటీ బ్రిడ్జీ దగ్గర స్లో అయింది. అప్పుడే ఆమెచూపులు అకస్మాత్తుగా వంతెన కింద రైలు పట్టాల పక్కనున్న యిళ్ళ మీద పడ్డాయి.
   
    అన్నీ చిన్న చిన్న గుడిసెలు__ఒక గుడిసె ముందర రిక్షా__రిక్షా నడిపే వ్యక్తి దగ్గరికి గుడిసెలోంచి వచ్చిన ఒక యువతి ఏదో వస్తువును చేతిలో పెట్టింది అదే సమయంలో ఆ వ్యక్తి అటూ యిటూ చూసి గబుక్కున ఆమె బుగ్గల్ని చేత్తో పట్టుకుని గిల్లాడు.
   
    ఆమె ఉత్తుత్తి కోపాన్ని నటిస్తూ చేయి విసిరికొట్టి దూరంగా జరిగింది. అతనేదో నవ్వుథొఇఒ చెప్తూ రిక్షాను ముందుకు లాగాడు.
   
    ఆ దృశ్యం చాలా ముచ్చటగా వుంది మయూషకు.
   
    ఆ గుడిసెముందు వాళ్ళిద్దరే వున్నారు. కాని వంతెన పైనుంచి తను వాళ్ళిద్దర్నీ చూస్తున్నట్లు తెలీదు.
   
    బహిరంగ దొంగ సరసం!
   
    అతను ఆమె భర్తే! ఆమె అతనిభార్యే అయ్యుంటుందా. ఏమిటా దొంగ సరసంలోని తియ్యదానం! గుడిసెలో కెళ్ళి ఆ పని చెయ్యొచ్చుగా? సభ్యసమాజం అంగీకరించే ఆ ముద్దుని అంత ఆదరా బాదరాగా, అదీ దొంగచాటుగా పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి? అంత ఆగత్యం ఏముంది? ఎంత ఆలోచించినా మయూష కేమీ అర్ధం కాలేదు.
   
    బస్సు ముందుకు వెళ్ళిపోతున్నా, తలతలతిప్పి వెనక్కి చూస్తూనే వుంది మయూష.
   
    "టిక్కెట్ ప్లీజ్" కండక్టర్ పిలుపుకి తలతిప్పి చూసిందామె తేరుకొని పర్సులోంచి రూపాయి కాయిన్ ని తీసి ఇచ్చింది.
   
    టికెట్ ను ఆమెకిస్తూ నవ్వాడతను.
   
    ఆ నవ్వులో కొంటెతనం వుంది ఆర్ట్స్ కాలేజీ జంక్షన్లో, బస్సు లోంచి దిగుతున్నప్పుడు మయూష కళ్ళవేపు చూసి చిలిపిగా నవ్వాడు ఆ కండక్టర్-ఆలా ఎందుకు నవ్వాడో అర్ధంగాక విస్తుపోతూ బస్సు దిగింది.
   
    ఈ మగవాళ్ళతో ఇంతే__ఆసక్తిగా చూస్తే ఏదో పెద్ద ఇదైపోతారని అనుకుంటూ రోడ్డుదిగి కాలేజీ వేపు అడుగులేస్తున్న మయూష.
   
    ఏదో పిలుపు వినబడటంతో ఆగిపోయి పక్కకు తిరిగి చూసింది క్లాస్ మేట్ రాజేశ్వరి!
   
    "మయూషా! నీకోసమే ఎదురు చూస్తున్నాను. మన భార్గవిని నర్సింగ్ హోమ్ లో జాయిన్ చేసారట. సిట్యువేషన్ చాలా క్రిటికల్ గా వుందట నీకోసం రెండుసార్లు అడిగిందట భార్గవి. హాస్టల వార్డెన్ కి మీ ఇల్లు తెలియదు. నువ్వు కలిస్తే నిన్ను తీసుకుని నర్సింగ్ హోమ్ కి అర్జంటుగా రమ్మని చెప్పి, పది నిమిషాల క్రితం వార్డెన్ వెళ్ళింది....." గబగబా చెప్పింది వగరుస్తూ రాజేశ్వరి.
   
    "భార్గవికి ఏమైంది?" తడారిపోయిన గొంతుతో ప్రశ్నించింది మయూష.
   
    "తర్వాత ప్రశ్నలు ముందు నర్సింగ్ హోమ్ కి వెళ్దాంపద" రోడ్డు పక్కన ఆగిన ఆటో వేపు పరుగెత్తుకుంటూ అంది రాజేశ్వరి.
   
    ఆమె వెనక కంగారు కంగారుగా ఆటో ఎక్కింది మయూష. ఆమె కంతా అయోమయంగా వుంది.
   
                                                                           *    *    *    *
   
    విద్యానగర్ లోని అర్చనా నర్సింగ్ హోమ్....
   
    రెండో ఫ్లోర్లో ఉన్న ఆ రూమ్ లోకి అడుగు పెట్టిన మయూష అదురుతున్న గుండెలతో బెడ్ మీద దాదాపుగా కోన ఊపిరితో పడున్న భార్గవిని చూడగానే గుండాగినంత పనయింది.
   
    "భా....ర్గ....వీ" గుండెల వరకూ కప్పిన బెడ్ షీట్ లో పాలిపోయిన భార్గవి ముఖంలోకి కన్నీళ్ళు నిండిన కళ్ళతో చూసింది మయూష.
   
    "మీరేనా మయూష" పక్కన వున్నా డాక్టర్ చటుక్కున తలతిప్పి మయూష వేపు చూసింది.
   
    "వన్ మినిట్. ఇలా రండి" హడావుడిగా పక్క రూమ్ లోకి నడిచింది ఆ లేడీ డాక్టర్.
   
    ఆమెను అనుసరించింది మయూష పాలిపోయిన మోముతో.
   
    "భార్గవి నాకు చాలా కాలంగా తెల్సు....అందుకే....పోలీసుల కింకా ఫోన్ చెయ్యలేదు" నుదుటిమీద చెమటను తుడుచుకుంటూ అంది లేడీ డాక్టర్.
   
    "ఇంతకీ...." మయూష నోట్లోంచి ఇంకా ప్రశ్న రాలేదు__మళ్ళీ చెప్పడం ప్రారంభించింది లేడీ డాక్టర్.
   
    "ఏమైందో తెలీదు. తెల్లవారుజామున లేచి వంటిమీద కిరోసిన్ పోసుకుని కాల్చుకుంది. వళ్ళంతా కాలిపోయింది. బతుకుతుందో లేదో చెప్పలేను ఉన్న ఒక్కగానొక్క తల్లికీ ఏం తెలియదు. ఇప్పటికి రెండు సార్లు స్పృహలోకి వచ్చింది అడిగాను. ఏం చెప్పలేదు రెండుసార్లూ నీపేరే చెప్పింది" బాధగా అంది డాక్టర్.
   
    "ఎందుకిలా చేసింది?" ప్రశ్నించింది మయూష షాక్ నుంచి మెల్లగా తేరుకుంది.
   
    "అది మీరు కనుక్కోవాల్సిన విషయం మరో పావుగంటలో ఆమెకు పూర్తిగా స్పృహ రావచ్చు అసలేం జరిగిందో కనుక్కోండి. ఈ లోపల ఉస్మానియా నుంచి స్పెషలిస్టుల్ని రప్పించడానికి ప్రయత్నిస్తాను ఎందుకయినా మంచిది. పోలీసులకు ఫోన్ చేస్తాను" అంటూ రూమ్ లోంచి బయటకు వెళ్ళింది లేడీ డాక్టర్.
   
    మరో పావుగంట తర్వాత__
   
    కళ్ళిప్పి చూసిన భార్గవి ఎదురుగా ఆప్త మిత్రురాలు మయూష కనబడగానే వెక్కి వెక్కి ఏడ్వడం ప్రారంభించింది.
   
    "భార్గవీ...అసలేమిటిదంతా.....నిన్న మధ్యాహ్నం వరకూ బాగానే వున్నావే?" దుఃఖభాజకమైన ఆ సంఘటనను వాస్తవంలోకి తీసుకునే ప్రయత్నంచేస్తూ అడిగింది మయూష.
   
    అటూ ఇటూ చూసి తలుపు లోన గడియ పెట్టమన్నట్టుగా సంజ్ఞ చేసింది భార్గవి.
   
    "చెప్పు ఏం జరిగింది?" కన్నీళ్ళను తుడుచుకుంటూ అడిగింది మయూష.
   
    భారంగా, బాధతో నిట్టూర్పు విడిచి చెప్పడం ప్రారంభించింది భార్గవి.
   
    "మయూషా.....ఈ క్షణం నా జీవితంలో వస్తుందని నేనూహించలేదు. ఈ ప్రపంచంలో సిన్సియర్ ఫ్రెండ్ గా నన్ను నువ్వు నమ్మినప్పటికీ నేను నీకు సిన్సియర్ ఫ్రెండ్ ను కాను ఎందుకో తెలుసా.....?
   
    నా జీవితానికి సంబంధించి చాలా రహస్యాలు ఎప్పటికప్పుడు నీకు తెలియకుండా జాగ్రత్త పడ్డాను. అందుకే నిన్న రాతఃరి నేను ఆత్మహత్యా చేసుకోవడానికి ముందు నీకు రెండు పేజీల ఉత్తరం రాసాను.
   
    నేను ఇంకా ఎన్ని నిమిషాలో బతకను. కానీ....నేను చనిపోతూ నిన్నొక కోరిక కోరుతున్నాను తీరుస్తావా?" గాజు కళ్ళను కదిలిస్తూ అర్ధిస్తున్నట్లుగా అడిగింది భార్గవి.
   
    అదంతా అయోమయంగా అనూహ్యంగా వుంది మయూషకు.
   
    మయూష అప్రయత్నంగా తన చేతిని భార్గవి చేతిలో పెట్టింది అభయం యిస్తున్నట్టుగా.
   
    "చెప్పు నీ కోరికేమిటో" అనునయంగా అడిగింది మయూష.

    "మయూషా.....నేనెప్పుడూ సీరియస్ గా నీకే విషయమూ చెప్పలేదుకదూ....కానీ ఈ విషయాన్ని సీరియస్ గా నీకే విషయమూ చెప్పలేదుకదూ....కానీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి....ఎందుకో తెలుసా....నేను మోసపోయాను దారుణంగా మోసపోయాను గనుక__
   
    ఇదే హైదరాబాదు లో కోటీశ్వరుడయిన ఒక వ్యక్తి నమ్మించిన నమ్మకానికి నేను దారుణంగా బలైపోయాను. నేను మొదట ఎంచుకున్న మార్గం తప్పే....ఆ తప్పులోంచి బయటకు రావటానికి ప్రయత్నించి..... నిప్పులపాలయ్యాను....అవును మయూషా....నిజం నిప్పు లాంటిది కధా....ఆ నిప్పులో నేనే కాలిపోయాను.....

 Previous Page Next Page