Previous Page Next Page 
హ్యూమరాలజీ-1 పేజి 29

                                 

   
                               దట్ వుమన్ ఫ్రమ్ రష్యా

 

      
    
    చాలా రోజుల తరువాత మా కాలనీలో మళ్ళీ సంచలనం కనిపించింది. శాయీరామ్ రెడ్డి, గోపాల్రావ్, జనార్ధన్ హడావుడిగా మా ఇంటికొచ్చేరు పొద్దున్నే....
    "ఏమిటి సంగతి?" భయంగా అడిగాను.
    అప్పటికప్పుడు కాలనీ మీటింగ్ అంటారేమో, బంగారం లాంటి ఆదివారం సర్వనాశనం అయిపోతుందేమో అన్న అనుమానం కలిగింది మరి.
    "త్వరగా రెడీ అవ్! మనందరం ఏరోడ్రోమ్ కెళ్ళి ఎల్వీరా ఓజోలినాని రిసీవ్ చేసుకోవాలి" అన్నాడు జనార్ధన్.
    ఎల్వీరా ఓజోలినా నా?"
    "అవును"
    "అంటే ఏమిటిది?"
    "గ్రామర్ మిస్టేక్! ఎవరు అనడగాలి"
    "సరే! ఎవరు?"
    "రష్యన్ యూనివర్శిటీ ప్రొఫెసర్."
    "అతన్ని మనం రిసీవ్ చేసుకోవటమెందుకు?" అయోమయంగా అడిగాను.
    "మళ్ళీగ్రామరు- ఆమె అనాలి అతనుకాదు"
    "సరే- ఆమెను మనం ఎందుకు రిసీవ్ చేసుకోవాలి?"
    "ముందు ఎయిర్ పోర్టుకి బయల్దేరు! తర్వాత చెప్తాను" అన్నాడు రంగారెడ్డి. ఇంక లాభం లేదని డ్రస్ చేసుకుని వాళ్ళతో బయలుదేరాను. తోవలో వివరాలు అందించాడు రెడ్డి.
    ఎల్వీరా ఒజోలీనా మనదేశంలోని తెలుగుజాతి గురించి రిసెర్చ్ చేసి ఓ పుస్తకం రాయాలని ఇండియా వచ్చిందట. ఢిల్లీలొ జాబ్ చేస్తోన్న జనార్ధన్ అన్నయ్యకు స్నేహితుడయిన జక్కన్ లాల్ మక్కన్ లాల్ ఆమెను తెలుగుదేశం రాజధానిలో గడపమని పంపుతూ, ఆమెను మాకాలనీ అతిథిగా భావించాల్సిందిగా జనార్ధన్ కు టెలిగ్రామిచ్చాడట! ఇదీ ఫ్లాష్ బాక్ కథ.
    విమానం రెండు గంటలు ఆలస్యంగా చేరుకుంది. ఎల్వీరా ఓ జోలినాను గుర్తుపట్టడం తేలిగ్గా జరిగింది. తనను తాను పరిచయం చేసుకున్నాక మా అందరినీ కూడా పరిచయం చేశాడు జనార్ధన్.
    "శాయీరామ్" అన్నాడు శాయీరాంని పరిచయం చేస్తూ.
    ఓ! శాయీరామోవ్! అందామె ఆప్యాయంగా కరచాలనం చేస్తూ.
    శాయీరాం ఖంగారుపడి అటూ ఇటూ చూశాడు.
    "మావో గీవో అనకండి పోలీసులు నన్ను కాల్చిపారేస్తారు" అన్నాడు గొంతు తగ్గించి రహస్యంగా.
    "వ్వాట్? పోలీసుల కాల్చివేయుదురా! ఎందులకు?" అడిగిందామె తను నేర్చుకున్న ఫ్యూర్ తెలుగు ప్రయోగిస్తూ.
    "ఏమోనండీ! ఎందుకో ఎవ్వరికీ తెలీదుగాని అలాంటి పేర్లు వినబడినా, పుస్తకాల మీద కనబడినా కాల్చిపారెయ్యడం మాత్రం ఖాయం!"
    "వెరీ బాడ్!" అందామె.
    "అలావాళ్ళను 'వెరీబాడ్' అని ఇంకో రెండుసార్లన్నారంటే మిమ్మల్ని కూడా కాల్చిపారేస్తారు" అన్నాడు రెడ్డి.
    ఆమె కొంచెం భయపడినట్లుంది. ఎందుకంటే ఆ తరువాత గోపాల్రావ్ పేరు పలికేప్పుడు "గోపాల్" అని ఊరుకుంది.
    జనార్ధన్ టాక్సీ పిలిచాడు.
    "మీటర్ మీద హండ్రెడ్ రూపీస్ ఎక్స్ ట్రా!" అన్నాడు టాక్సీవాడు, టాక్సీ మా దగ్గరకు లాక్కొచ్చి.
    "వ్వాట్, మీటర్ మీద హండ్రెడ్ రూపీస్ ఎక్స్ ట్రా! ఎందుకు? ఇక్కడ టాక్సీలకు కరువా?" అడిగింది ఎల్వీరా డ్రైవర్ ని.
    "టాక్సీలకు కరువు కాదుగానీ ఫాదర్ టూరిస్టులకు కరువు మేడం!" అన్నాడు వాడు.
    "వాటీజ్ దిస్ నాన్సెన్స్! వీళ్ళ ఇష్టమొచ్చినట్లు చార్జ్ చేస్తుంటే మీ గవర్నమెంట్ ఏమి చేయుచున్నది?" అంది ఆశ్చర్యంగా.
    "గవర్నమెంటా? వాట్ గవర్నమెంట్?" తనూ ఆశ్చర్యపోతూ అడిగాడు రెడ్డి. ఆ ప్రశ్నకు ఎల్వీరా ఉలిక్కిపడింది.
    "అంటే - ఇక్కడ గవర్నమెంట్ అనేదే లేదా?" అంది అందరివంకా చూస్తూ! రెడ్డి ప్రశ్నార్ధకంగా శాయీరామ్ వేపు చూశాడు. శాయీరామ్ గోపాల్రావు వంకచూశాడు. గోపాల్రావ్ నావంక చూశాడు. నిజానికి గవర్నమెంట్ అనేది ఉందో లేదో నాకూ తెలీదు. ఎందుకంటే ధరలు పెరిగాయని నేనీమధ్య న్యూస్ పేపర్ కొనటం మానేశాను.
    "ప్రస్తుతం ఉందో, లేదో తెలీదు మేడమ్! మా ఆఫీసులో కొలీగ్స్ ని అడిగిరేపు ఇన్ ఫర్మేషన్ ఇస్తాను" అన్నాను బిడియంగా.
    ఎల్వీరా నిర్ఘాంతపోయింది.
    "వ్వాటేపీపుల్ యూ ఆర్! గవర్నమెంటు ఉందో లేదో కూడా తెలీదా మీకు? మీరు ఎలక్షన్ లో ఓటు చేయటం లేదా!"
    "ఇంతవరకూ ఓటెలా ఉంటుందో మాకెవ్వరికీ తెలీదండీ! మమ్మల్నెవ్వరూ ఎప్పుడూ ఓటు వేయమని అడగరు. ఒకవేళ అడిగిన మేము వేసే లోగానే ఇంకెవరో వేసేస్తారు"
    "మరి ఇంకెవర్ని అడుగుతారు?"
    "బలహీనవర్గాల కాలనీవాళ్ళనూ, గూడెంలొ వాళ్ళనూ, ఇంకా ఇతర బీదా బిక్కీలనూ, చదువురానివాళ్ళనూ అడుగుతారండీ!"
    ఎల్వీరీ వెంటనే తన పుస్తకం తీసి "తెలుగు ప్రజలలో బడుగువర్గాల ప్రజలే ఎలక్షన్ లలో పాల్గొంటారు. మిగతా ప్రజలకు అసలు ప్రభుత్వం ఉందోలేదో కూడా తెలీదు" అని రాసుకుంది. అది చదివి మేము మొఖమొఖాలు చూసుకున్నాం.
    టాక్సీలో బయలుదేరాం అందరం.
    అబిడ్స్ కి చేరుకున్నాక "ఈ టాక్సీ మెయిన్ రోడ్ మీద నుంచి నడపకుండా ఇలా సందుల్లోంచి నడుపుతున్నాడేమిటి?" అనడిగింది ఎల్వీరా.
    "ఇది సందుకాదండీ! మెయిన్ రోడ్డే!" అన్నాడు రెడ్డి.

 Previous Page Next Page