సింహాద్రికి అర్ధమయిపోయింది.
తన ప్రేమను వెల్లడి చేయడానికి ఇంతకంటే మంచి అవకాశం వచ్చేట్లు కనిపించలేదు. పరిస్థితులు ఎప్పుడెలా ప్రమదకరంగా మారతాయో ఊహించడం కష్టంగా ఉంది.
"ధనుంజయ్ గారూ! మీరు మరొక్క పావుగంట కూర్చోండి! నేనీలోగా నవల పూర్తి చేసి వస్తాను. మరో పాతిక పేజీలే ఉన్నాయ్" అంది శ్రీదేవి.
"నవల బావుందాండీ"
"అద్భుతంగా ఉంది" అంది శ్రీదేవి.
సింహాద్రి మొఖం చిన్నబోయింది.
"నా నవలకంటే నాండీ"
"నో నో నో మీ నవలలకంటే గొప్పవి ఇంకెవరూ రాయలేరు ధనుజంయ్ గారూ. అసలు మీరే స్వయంగా ఓ హిప్నాటిస్ట్ అన్న సంగతి నాకు ఇన్ని రోజులూ తెలీదు. తెలుస్తే..." ఆమె ఆపేసింది.
సింహాద్రి గుండెలు వేగంగా కొట్టుకున్నాయ్.
"తెలుస్తే ఏం చేసేవారండీ" ఆనందంగా అడిగాడు.
"ఏనాడో....మీకు దగ్గరయేదాన్ని" సిగ్గుపడుతూ అందామె.
"శ్రీదేవిగారూ.... నాకూ మీరంటే ఎంతో ఇష్టమండి! మీ ఫోటో చూసిన దగ్గర్నుంచీ నిద్ర పట్టటం లేదండీ నమ్మండి. నిద్రపడితే చాలు మీరు రామేశ్వర్ జఠానీ అనే వాడిని పెళ్ళి చేసుకున్నట్లు ఒకటే పీడకలండీ!"
శ్రీదేవి ఆశ్చర్యపోయింది.
"రామేశ్వర్ జఠానీ ఎవరు?"
"అదే నాకూ తెలీటం లేదండీ! మన కిష్టం లేని పేరేదయినా చదువుతే అది మనసులో అలాగే నిలిచిపోతుందని చిరంజీవి అన్నాడండీ! వాడికి సైకాలజీ బాగా తెలుసులెండి! ఎందుకంటే నూట ఆర్రోజుల రాత్రింబగళ్ళు ఒక లాయరు ఇంటి పక్కన ఉన్నాడు కదండీ!"
శ్రీదేవి నవ్వేసింది.
"శ్రీదేవిగారూ"
"ఏమిటండీ"
"నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండీ"
"ఓ!" సిగ్గుపడిపోయిందామె.
"అయ్ టూ లవ్ యూ" అంది ఓ క్షణం ఆగి.
సింహాద్రి ఆనందంతో ఉక్కిరి బిక్కిరయాడు.
ఈలోగా వంటవాడు ట్రేలో కాఫీ కప్పులతో వచ్చేశాడు.
"ఓకే మీరు కాఫీ తాగుతూండండీ! ఇప్పుడే ఈ పాతిక పేజీలూ చదివేసి వస్తాను. సస్పెన్స్ కంట్రోల్ చేసుకోలేక ఛస్తున్నాను" అనేసి లోపలికి పరుగెత్తింది శ్రీదేవి.
ఆమె అటు వెళ్ళగానే చిరంజీవి పరుగుతో లోపలికొచ్చేశాడు.
"కేస్ సక్సెసేనా?"
"సక్సెసున్నర" గర్వంగా అన్నాడు సింహాద్రి.
"పెళ్ళికి డేట్ ఫిక్స్ చేయడమే ఆలస్యం అన్నమాట"
"అదికూడా అట్టే ఆలస్యం ఉండదు"
"ష్యూర్"
"డామ్ ష్యూర్"
* * * * *
ఇద్దరూ కాఫీ కప్పులందుకుని రెండు గుక్కలు తాగేసరికి కర్నల్ డ్రస్ మార్చుకుని మేడదిగి వచ్చాడు. వస్తూనే వాళ్ళను చూసి అనుమానంగా దగ్గరకొచ్చాడు.
"ఎవరు మీరు?" అన్నాడు కఠినంగా.
సింహాద్రి చిరంజీవి మొఖం చూశాడు.
"మేము.... మేము... వీడి పేరు ధనుంజయ్ అండి. నాపేరు....."
"షటప్ పేర్లడటం లేదు. మీరెవరూ అనడుగుతున్నాను"
"మేము శ్రీదేవి గారి ఫ్రెండ్స్ అండీ! ఆమె బర్త్ డే పార్టీకొచ్చాం"
కర్నల్ కి ఠక్కున గుర్తుకొచ్చింది.
"ఓ! ఇందాక కలుసుకున్నాం కదూ! బేబీ చెప్పింది కూడానూ. అయామ్ సారీ" అన్నాడు నొచ్చుకుంటూ.
"అబ్బే అదేం ఫర్లేదులెండి? అందులో పెద్ద సారీ ఏముందని" అన్నాడు సింహాద్రి.
"అరె! అలా నిలబడ్డారెందుకు? కూర్చోండి"
ఇద్దరూ మళ్ళీ సోఫాలో కూర్చున్నారు.
కర్నల్ అభిమానంగా చూశాడు వాళ్ళవేపు.
"మా బేబీ ఫ్రెండ్సంటే నాకెంతో ఇష్టం" అన్నాడు తనూ వాళ్ళకెదురుగ్గా కూర్చుంటూ.
"అలాగండీ! దటీజ్ వెరీ నైస్" అన్నాడు చిరంజీవి.
"రియల్లీ ఒండర్ ఫుల్" అన్నాడు సింహాద్రి.
"అది మీ మానవత్వాన్ని చాటుతోంది" అన్నాడు చిరంజీవి.
"మానవసేవే మాధవ సేవ అనీ మా పాలసీ కూడా అదేనండి"
కర్నల్ ఇద్దరివంకా చిరాగ్గా చూశాడు. దాంతో ఇద్దరూ సైలెంటయిపోయారు.
"మా బేబీ అందరితోనూ స్నేహం చేయదు. సెలెక్టెడ్ పీపుల్ తోనే చేస్తుంది. అన్నట్లు మీ పరిచయ భాగ్యం అవలేదు" అన్నాడు కర్నల్ వివరాల కోసం.
చిరంజీవి ఉత్సాహంగా ప్రారంభించాడు.
"ఇతను ప్రఖ్యాత రచయిత ధనుంజయ్ అండీ! నాపేరు చిరంజీవి. ఇద్దరం ప్రెండ్స్"
"కాలేజ్ మేట్స్ అండీ!"
"ఇద్దరం ఇంటర్ లో 'డి' సెక్షన్ లో వుండేవాళ్ళం"
కర్నల్ అసహనంగా చూశాడు.
"రచయిత ధనుంజయ్ నువ్వా?" సింహాద్రి వంక చూస్తూ అడిగాడతను.
సింహాద్రి ఆనందంతో పొంగిపోయాడు.
"అవునండీ! నేనే!
"అవున్సార్! ఇతనే ఫేమస్ రైటర్ ధనుంజయ్"
"నా పేరు ఇంతకుముందే మీకు తెలుసాండీ?" అడిగాడు సింహాద్రి ఆనందంగా.
"తెలుసు!"
"అఫ్ కోర్స్ మావాడి పేరు తెలీనివారుండరులెండి" సగర్వంగా అన్నాడు చిరంజీవి.
"నా నవలలు మీరు చదివారాండీ?"
"ఓ! ఒకటేమిటి? చాలా చదివాను"
"మీరు చదివాక ఎలా ఫీలయ్యారండి?"
"చాలా ఫీలయ్యాను. అది చదివినప్పటినుంచీ నీ అడ్రస్ కోసం ఎంతో ట్రైచేస్తున్నాను"
చిరంజీవి ఆ మాటలు వినగానే విజయగర్వంతో సింహాద్రివేపు చూశాడు.
"నేను చెప్పలేదుట్రా!"
కర్నల్ అనుమానంగా చూశాడతనివేపు.
"ఏం చెప్పావ్?"
'మిలిటరీ ఆఫీసర్ల సంగతండి?"
"ఏమిటి వాళ్ళ సంగతి?"
"వాళ్ళు సాహిత్యమంటే ప్రాణం ఇస్తారండి"
"అలా అని నీకెవరు చెప్పారు?"
"మా శ్రీనివాసులండి"