Previous Page Next Page 
జీవనయానం పేజి 28


    ఉస్మాన్ అమాయకుడు కాడు. తన ఏలికలు ఆంగ్లేయులు - తన రాజ్య రక్షణకు తోడ్పడుతున్నందుకు సంతోషించాడు. భారతదేశపు గుండెలమీద మతపుచిచ్చు రగిల్చాడు. ఉస్మాన్ అతి ప్రమాదకరమైన మతపు చిచ్చును కొంగున కట్టడానికి ప్రయత్నించాడు. అతనిది వినాశకరమార్గం - అది మార్గంకాదు - వినాశ విధానాన్ని అనుసరించాడు.

 

    ఒక జాతి జీవన విధానాన్ని రూపుమాప చూచిన పాలకుడు మానవ చరిత్రలో ఉస్మాన్ మాత్రమే!

 

    ఉస్మాన్ - భారత సంస్కృతికి భిన్నంగా - భారత దేశానికి దూరంగా - ఒక సర్వతంత్ర స్వతంత్ర కరకు తురక రాజ్యం ఏర్పరచాలని కలలు కన్నాడు.

 

    1. ఉస్మాన్ ఇస్లామును రాజకీయమతంగా ప్రకటించాడు. అంతేకాదు, "అనల్ మలిక్" అనే నినాదాన్ని ప్రభుత్వ నినాదం చేశాడు. అనల్ మలిక్ అంటే ముస్లిములందరు ప్రభువులే అని అర్థం. అంటే, ఒకమతం వారికి ఇతర మతాలవారు ఊడిగం చేయాలి.  

 

    'పూటకు గతిలేని ఫకీరు ప్రభువు ఎట్లా అవుతాడు!' అని మఖ్దూమ్ ప్రశ్నించాడు. నిజాం నవాబు పేద ముస్లిముతో దస్తర్ ఖాన్ పంచుకున్నాడా? వారి సరసన నిలిచి నమాజు చేశాడా? తన కొడుకులకు కనీసం తన రాజ్యపు ముస్లిం యువతులను చేసుకున్నాడా?

 

    మతపు ఉన్మాదంలో మెజారిటీ తురకలు ఈ విషయాలు గుర్తించలేదు. గమనించలేదు. ఇతర మతాల మీద పెత్తనమూ - దౌర్జన్యమూ చేశారు.

 

    2. ఉస్మాన్ "తబ్లీగ్" అంటే అనే ప్రమాదకరం అయిన ఉద్యమాన్ని ప్రభుత్వ పరంగా ప్రారంభించాడు. తబ్లీగ్ అంటే మతాంతరీకరణం. ప్రభుత్వ పరంగా బడ్జెటులో ఇందుకు ధనం కేటాయింపు జరిగింది. ప్రతి తాసీల్ కార్యాలయంలో ఇందుకోసం ఒక అధికారిని నియమించారు. ఇందుకుగాను ఏర్పడిన శాఖ "ఉమూర్ మజుహబీ."

 

    ఇత్తైహాదుల్ ముసల్మీన్ - ఉస్మాన్ యొక్క మానసిక సంతానం. మహెద్వి తెగకు చెందిన బహదూర్ ఖాన్ను ప్రోత్సహించి అతనిని బహదూర్ యార్ జంగ్ చేశాడు. మతం మార్పిడి చేయడానికి రాజ్యం మీదికి పిచ్చి కుక్కను వదిలాడు.

 

    ఆర్యసమాజ నాయకుడు, కీర్తిశేషులు నరేందర్ జీ నాతో ఒక వింత విషయం చెప్పారు. అసలు బహద్దుర్ ఖాన్ ముస్లింకాడు  ఇత్తైహాదుల్ ముసల్మీన్ నాయకుడు ఎలా అవుతాడని? వారి వాదం ఏమంటే "మహాద్వీలు" ముస్లిములు కారు. ముస్లిం అయినవాడు మహమ్మద్ నే చివరి ప్రవక్తగా విశ్వసించాలి. మెహద్వీలు మహమ్మద్ తరువాత వాడయిన "మెహద్వీ"వారు. కాబట్టి ముసల్మానులు కారు అని  వారి వాదం.

 

    ఉస్మాన్ కు ఈ విషయం తెలియకుండా ఉండదు. అతనికి బహుద్దుర్ ఖాన్ మంచి వక్త - కార్యకర్త - విశ్వాస పాత్రుడుగా కనిపించాడు. అతనికి కావలసింది మతం కాదు. తన రక్షణ. అదీ రాజకీయం!

 

    ప్రస్తుతం పాకిస్తాన్ లో మెహద్వీలను క్రూరంగా అణచివేయడం జరుగుతున్నది.   

 

    బహద్దుర్ ఖాన్ మతం మార్చిన విధానాన్ని నేను రచించిన "చిల్లర దేవుళ్లు" నవలలో సవివరంగా వర్ణించాను.

 

    "చిల్లర దేవుళ్లు" వ్రాతప్రతిగా ఉన్నపుడు మతాంతరీకరణ భాగాన్ని ఆంధ్రపితామహ మాడపాటి హనుమంతరావుగారికి వినిపిస్తున్నాను. మంగళసూత్రాలు త్రెంచిన ఘట్టం. ఆంద్ర పితామహులు ఎక్కెక్కి ఏడ్వడం ప్రారంభించారు. నావల్ల ఏమైనా తప్పు జరిగిందేమో అనుకున్నాను. నివ్వెరబోయాను. వారు దస్తీతో ముఖం కప్పుకొని చాలసేపు దుఃఖించారు. వారి గొంతునుంచి మాట పెకల్లేదు.

 

    హనుమంతరావుగారు లోనికి వెళ్ళారు. ముఖం కడుక్కున్నారు. తుడుచుకున్నారు. రెండు కప్పుల్లో చాయ్ తీసుకొని వచ్చారు. ఆ దశలో "ఈ శ్రమ మీకెందుకు?" అనే సాహసంకూడా లేకపోయింది నాకు. హనుమంతరావుగారు మా నాయనగారికి, మా అన్నయ్యకూ సన్నిహితులు, నామీద వారికి వాత్సల్యం.

 

    హనుమంతరావుగారు సగం టీ త్రాగి, కప్పు పక్కన పెట్టి అన్నారు -

 

    "రంగాచార్లూ! మతం మార్చిన సన్నివేశం నీవు వ్రాసిన తీరు నన్ను కదలించినది. ఇటువంటి దృశ్యములను ఎన్నింటినో ప్రేక్షకులంగా చూచినా దౌర్భాగ్యము మాది. ఆ దురదృష్టము నిజామాంధ్రులందరిది. ఒక్కసారి అటువంటి దృశ్యము లెన్నియో మనసులో మసలినవి. దుఃఖము పొంగినది. భేష్! మేము చేయలేని పని చేసినావు!" అని నా వీపు నిమిరినారు.

 

    ఉస్మాన్ రాజ్యము అంతటి పిశాచరాజ్యము

 

    ఉస్మాన్ ప్రారంభించి - బహద్దూర్ ఖాన్ చే నిర్వహింపచేసిన తబ్లీగ్ - మతాంతరీకరణ ఫలితంగా జనాభాలో హిందువుల సంఖ్య తగ్గిందనడానికి నిజాం ప్రభుత్వం నిర్వహించిన జనాభా లెక్కలే నిదర్శనం.

 

    మొత్తం జనాభాలో హిందువుల శాతం:-

    1901 88.6                          1911 88.9
    1921 85.4
    1931 84.0

 

    నిజాం ప్రభుత్వం చేపట్టిన ఈ పాశవిక విధానానికి - అసమ్మతి తెలిపే అవకాశం కూడా ఇవ్వలేదు. హైదరాబాదు రాజకీయ సంస్కరణల సంఘంవారు హైదరాబాదులో ఒక సభ జరపాలనుకున్నారు. పదేళ్లవరకూ ప్రభుత్వం అనుమతించలేదు. అప్పుడు వారు రాజ్యానికి ఆవల అకోలాలో సభలు జరుపుకున్నారు.

 

    3. నిజాం ప్రభుత్వపు పతాకం ఇస్లాం పతాకం. పసుపు పచ్చని పతాకంలో అర్ధచంద్రుడు నక్షత్రం. నిజాం ప్రజలు ఇస్లాం వ్యతిరేకులు గాని, ఇస్లాం పతాక వ్యతిరేకులుగాని కారు. ఒక మతానికి రాజ్యాధికారం వప్పగించినట్లు నటించే ప్రభుత్వ దుష్ట విధానానికి వ్యతిరేకులు.                    

                                         

    4. ముసల్మానులు జనాభాను పెంచి చూపడానికి ఉత్తర భారతంనుంచి అనేకానేక ముస్లిం కుటుంబాలను నిజాం రాజ్యంలోకి దిగుమతి చేసుకున్నారు. అందుకు విరుద్ధంగా స్థానిక ముస్లిములు అసమ్మతి ఉద్యమం నిర్వహించారు. తత్ఫలితంగానే ముల్కీ నిబంధనలు అమల్లోనికి వచ్చాయి.

 

    వాస్తవం ఏమిటంటే - నిజాం నవాబు తన ప్రజలను హిందువులను, ముస్లింలను ఎవరినీ విశ్వసించలేదు. ఉన్నతాధికారులంతా గైర్ ముల్కీ, ముస్లిములే.

 

    5. 1931 లెక్కల ప్రకారం ఉద్యోగులసంఖ్య ఇలా ఉంది: సైన్యంలో ముస్లిములు 51,149 కాగా, హిందువులు  6,495.ఉద్యోగాల్లో 58,188 మంది ముస్లిములు కాగా, హిందువులు 16,878 మంది మాత్రమే! వీరిలో వంశపారంపర్యంగా వచ్చే గ్రామాధికారులను కూడా చేర్చారు. వారిని మినహాయిస్తే హిందువుల సంఖ్య నామమాత్రం అవుతుంది. 

      

    6. ఏ మతమూ స్వంతభాషను సృష్టించుకోలేదు. వాస్తవంగా మతానికి భాష లేదు. ప్రజల భాషలనే తమ స్వంతం చేసుకున్నాయి. భారత ముస్లిములు, ముఖ్యంగా ఉత్తర భారత ముస్లిములు - హైదరాబాదు రాజ్య ముస్లిములు; ఉర్దూ ముస్లిముల భాష అనే భ్రమలో పడిపోయారు.

 

    నిజాం నవాబు హైదరాబాదు రాజ్యంలో ఉర్దూ ముస్లిముల భాషగా ప్రకటించాడు. మైనారిటీ ప్రజల మాతృభాష అయిన ఉర్దూను మెజారిటీ ప్రజలమీద రుద్దాడు. ఉర్దూ రాజకీయ భాషగా, బోధనా భాషగా - న్యాయాలయాల భాషగా చేశాడు. అంతవరకు ఫరావాలేదనుకుందాం. ఎంచాతంటే, ఆంగ్లేయులు ఇంగ్లీషును బ్రిటిషిండియన్ల మీద రుద్దారు. కాని, వారు దాన్ని మతభాషగా రుద్దలేదు.

 

    నిజాం చేసిన దుర్మార్గం ఏమంటే, ఇతర జాతీయ భాషలను ధ్వంసం చేయడానికి ఉర్దూను ఆయుధంగా ఉపయోగించాడు.

 

    ఉర్దూ ముస్లిముల భాష మాత్రం కాదనడం వాస్తవసత్యం. బెంగాల్ ముస్లిములకు ఉర్దూ రాదు. వారు బంగ్లా భాషను ప్రేమిస్తారు. ఆరాధిస్తారు. పాకిస్తాన్ ప్రభుత్వం వారిమీద ఉర్దూను రుద్దడానికి ప్రయత్నించింది. బెంగాల్ ముస్లిములు తిరుగుబాటు చేశారు. పాకిస్తాన్ నుండి విడిపోయారు. "బంగ్లాదేశ్" ఏర్పరచకున్నారు.   

 

    ఇతర దేశాల ముస్లిములకు ఉర్దూభాష ఉందని కూడా తెలియదు.

 

    ఉర్దూను ఇస్లాంకు అంటకట్టటం ఒక రాజకీయకుట్ర!

 

    7. నిజాం నవాబు ఇస్లాం సంవత్సరాన్ని - హిజ్రీని - రాజకీయ సంవత్సరం చేశాడు ఇస్లాం నెలలు అజూర్, దై, బహమన్, ఇస్బందార్, ఫర్వర్దీ, అర్హీబెహహ్త్, ఖుర్దావ్,తీర్, అమర్దాన్, షహరేహర్, మెహర్, అబూన్ గా ఉండాలని ఆదేశించాడు. వారాలపేర్లు కూడా ఏక్ షంబా, దోషంబూ అని ఉర్దూపేర్లే ఉండేవి.

 

    8. ముస్లిముల షేర్వానీ - టోపీ రాజకీయ వేషం. సంప్రదాయ హిందువుల రాజకీయ వేషధారణ వింతగా ఉంటుంది. వాళ్లు ధోవతి కడ్తారు. షేర్వానీ వేస్తారు. నొసట తిలకం దిద్దుతారు. తలమీద టోపీ పెట్టుకుంటారు.   

   

    ఇది బలవంతపు వేషం. చరిత్ర తెలియని కొందరు - చరిత్రను వక్రీకరించే ప్రయత్నంలో  కొందరు - ఇప్పుడు ఈ వేషాన్ని మత సామరస్యంగా ప్రచారం చేస్తున్నారు.

 

    9. ప్రధాన ముస్లిం దినాలను శలవులుగా ప్రకటించారు.

 

    ముస్లిముల నమాజు దినం శుక్రవారం వారపు శలవు.

 

    మొహర్రం సందర్భంగా సుదీర్ఘ శలవులు.

 

    రమ్జాన్ సందర్భంగా ఒక పూట ఆఫీసులు

 

    ముస్లిం పర్వదినాలన్ని తప్పని సరి శలవులు

 Previous Page Next Page